Menu Close
Bulusu Sarojini Devi
గోపురం(ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

అనులేఖ ఇంత నిశ్శబ్దం గా ఉండడం ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు.

అత్తవారింటికి పోయేందుకు అన్నీ సద్దుకుంటోంది. మనోహర్ ఆమెనే పరిశీలనగా చూస్తున్నాడు.

ఉన్నట్టుండి ఆమె పరిగెత్తుకెళ్ళి వాంతి చేసుకుంది. అరగలేదేమో అనుకున్నారు అందరూ.

మళ్ళీ మళ్ళీ వాంతులు అవుతుంటే సావిత్రి అడిగి తెలుసుకుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాగానే అందరికి ఒక శుభవార్త అందింది. అనులేఖ అమ్మ కాబోతోందని.

మనోహర్ మొహం ఆనందంతో విప్పారింది.

★★★

ఆట విడుపు లా ఉంది ప్రాంజల్ కి.

"కాలా గూటే" బీచ్ దగ్గర ఉన్న "మంచోస్" నైట్ క్లబ్ లో చిందులు వేసాడు. బేచులర్ పబ్ ల వెంట తిరిగాడు. అక్కడి అమ్మాయిలతో డాన్సులు చేసాడు.

ఎక్కడ చూసినా తిని తాగి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు తిరిగి తిరిగి వాస్కోలో రూమ్ చేరినప్పుడు మాత్రం ఒళ్ళు తెలియని నిద్ర ముంచుకొచ్చేది. ఆలోచించేందుకు టైమ్ లేకుండా శ్యాం ఊరంతా తిప్పేవాడు.

పది రోజులు దాటాక ఇంటికి పోక తప్పదనే బెంగ వచ్చింది.

అప్పుడు పరిచయం అయింది "క్వీని". ఆ పిల్ల ఆంగ్లో ఇండియన్. మిలమిల మెరిసిపోతోంది. కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసేసుకున్నారు. చెయ్యి చెయ్యి కలుపుకున్నారు.

"దిల్ కారాజా" అయిపోయాడు ప్రాంజల్.

"మనసు మనసు పుచ్చేసుకుందామా?" మత్తుగా అడిగాడు.

"నీ మనసు నాకిచ్చెయ్. రెండూ నా దగ్గరే పడి ఉంటాయి!" అంది.

మనసూ, పర్సూ కూడా ఇచ్చేసాడు.

"నీ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి?" మరీ దగ్గరయిపోయి అడిగాడు.

"త్వరలో పోవాలని!" అని అరచేతిని వెనక్కి తిప్పి విమానం మీద పోతున్నట్టు శబ్దం చేసింది.

"మనిద్దరం పోదామా?" అన్నాడు. కళ్ళంట నీళ్ళు పెట్టేసుకుంటూ -

"డియర్! నాకు నీలాంటి వారే కావాలి. నువ్వే నన్ను చూసుకో. మనం హాయిగా పారిపోయి విదేశాల్లో కొత్త జీవితం గడుపుదాం!" అంది. దగ్గరగా రమ్మంటే ఒళ్ళంతా కదిల్చి కదిల్చి నవ్వింది.

శృంగార దేవత ఇలా ప్రత్యక్షం అవుతుందని ఊహించనైనా ఊహించని ప్రాంజల్ తామిద్దరూ ఫారిన్ వెళ్ళెందుకు ఏర్పాట్లు చేస్తానన్నాడు.

'క్వీని' ఆనందం తో అతడి ముందు వీరావేశంతో కుప్పిగంతులు వేసింది. మోహం కుమ్మి పారేస్తుంటే 'దగ్గరకు రమ్మని' ముద్దుగా అడిగాడు.

సడన్ గా అతడి పాదాల ముందు కూలబడి-

"నా వైపు చూడు. నేను అందరిలా ఫాషన్బుల్ గా ఉన్నానా? పోనీ నిన్ను కవ్వించానా? నేను ఫామిలీ టైప్.

మా నాన్న ఇక్కడికొచ్చిన ఒక టూరిస్ట్. పేరు, ఊరు చెప్పకుండా మోసం చేసి పోయాడు.

అప్పటి నుంచి మా అమ్మ పద్దతిగా పెంచింది.

నేను నిన్ను కలుస్తున్నట్టు చెప్తే తోలు ఒలిచేస్తుంది. నాకో మంచి మొగుడు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.

ఆడదాని శీలం కాపాడుకోవడం గొప్పతనం. పెళ్లయితే తప్ప నేను నీ దాన్ని కాలేను. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్న. నమ్ము!” అంది దీనంగా.

ప్రాంజల్ కి మతి పోయింది. అతడిలో ఉన్న అనుమానాలు అన్నీ పటాపంచలు అయిపోయి కళ్ళల్లో మెరుపులు జిగేల్ మన్నాయి.

శ్యాం ప్రాంజల్ ని అంత పిచ్చిగా చూసి మొత్తుకున్నాడు. తన మిగిలిన జీవితం క్వీని కి ధారపోసేయ్యడానికి రెడీ అయిపోయిన అతడ్ని చూసి బిత్తరపోయాడు. పగలబడి నవ్వాడు.

"నవ్వకు. నువ్ ప్రేమలో పడినా ఇలాగే ఉంటుంది!" అన్నాడు సీరియస్ గా మొహం పెట్టి ప్రాంజల్. బాగా డ్రింక్ లో ఉన్నాడు. నాలుగు రోజుల్లో ప్రాంజల్ తెచ్చిన డబ్బంతా లాగి పారేసింది క్వీని. అడిగిందల్లా కొంటూ పోయాడు.

"క్రెడిట్ కార్డు వాడాలి ఇంక. తన 'క్వీని' కోసమే కదా?" అనుకున్నాడు.

నాలుగు రోజులు గడిచాక ఒకరోజు పొద్దున్నే ఫోన్ చేసి ఎయిర్ పోర్ట్ కి రమ్మంటే మొహం కూడా కడుక్కోకుండా పరిగెత్తాడు.

'క్వీని' దుబాయ్ పోతోందిట. అక్కడే జాబ్ దొరికిందిట.

"ఇదుగో మొనార్క్. ఇతడే నాకు వాళ్ళ దేశంలో జాబ్ ఇప్పించాడు.

నిన్ను మోసం చేసి పోవడం లేదు. వీడ్కోలు చెప్పే పోతున్న!" అంది.

ప్రాంజల్ పక్కనే ఉన్న శ్యామ్ పడీ పడీ నవ్వాడు.

'ప్రాంజల్ కి మతి పోయింది' అని కేథరిన్ కి చెప్పి చెప్పి నవ్వాడు.

ప్రాంజల్ కి కసి పుట్టి ఇంకా జోరుగా తిరగడం మొదలెట్టాడు. కొన్ని చోట్లకి పాల్, కేథరిన్ వచ్చేవాళ్ళు. కేథరిన్ ఒక్కోసారి సరదాగా మాట్లాడినా ఒక్కోసారి మూడీగా మౌనంగా ఉండేది.

ఒకరోజు వాస్కో లో ఉన్న 'దామోదర్ గుడికి పోతున్నాం వస్తారా?' అని అడిగింది.

శ్యాం 'పద పోదాం' అని లాక్కుపోయాడు.

వాళ్ళు అక్కడ ఉన్న కుంకుమ పెట్టుకుని, విభూది రాసుకుని ప్రదక్షిణాలు చేస్తుంటే నోరెళ్ళబెట్టి చూసాడు.

ఏ మాత్రం నచ్చలేదు అతడికి.

కేథరిన్ ఫుల్ జాకెట్, మోకాలు దాటిన స్కర్ట్ వాస్కో మార్కెట్ లో కొనుక్కుని మురిసిపోయింది.

చీర కనుక్కోవాలని ఉందని చెప్పింది. పాల్ నవ్వాడు.

'చీర కట్టుకోవడం, అలా చీరతో తిరగడం కష్టం' అని అన్నాడు. 'అయినా నేర్చుకుంటాను' అంది కేథరిన్.

★★★

"మన బ్యాచ్ మొత్తం ఇక్కడి సాంప్రదాయక గుడిసె లు బుక్ చేశారట. పోదాం పద!” అన్నాడు శ్యాం.

వాస్కోలో పక్క రూమే పాల్, కేథరిన్ లది.

'వాళ్ళకి చెబుదాం' అంటే జబ్బ పెట్టుకుని ఒక్క గుంజు గుంజాడు ప్రాంజల్.

"ఇదుగో... ఈ అటాచ్మెంట్లే నాకొద్దు. హాయిగా జంజాటన లేకుండా ఉందామనుకుంటే వాళ్ళెందుకు? పద పోదాం!" అన్నాడు.

"నువ్ చాలా మారిపోయావురా!" అన్నాడు శ్యాం.

రెండు రోజులు హట్స్ లో తాగి తందనాలాడాకా ఒళ్ళు నొప్పులతో జ్వరం కమ్ముకొచ్చింది.

డాక్టర్లు, మందుల తో నాలుగు రోజులు 'సఫర్' అయ్యాక - ఒక రోజు హోటల్ రూమ్ ముందు చిన్న బాల్కనీ లో రోడ్డు వంక చూస్తూ కూర్చున్నాడు. మోడ్రన్ డ్రెస్సుల్లో జనం హడావిడిగా తిరుగుతున్నారు.

"ఎలా ఉందిప్పుడు? మంచి ఫిల్టర్ కాఫీ తాగుతారా? తీసుకురానా?" అని వినిపించింది. తుళ్ళిపడ్డాడు. అది ధృతి గొంతు.

చుట్టూ చూసాడు. తన ఆలోచనల్లోకి చిరుగాలిలా ఆమె స్వరం. కళ్ళు మూసుకున్నాడు.

శ్యాం ఆ రోజు పొద్దున్నే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళిపోయాడు. ఐదునిముషాలు గడిచాక పాల్, కేథరిన్ వచ్చారు. కేథరిన్ తనకి బాగా జ్వరంగా ఉన్నప్పుడు చేసిన సేవలు గుర్తొచ్చాయి.

'ఇప్పుడెలా ఉందని' అడిగింది.

"ఇంటికి పోతున్నారా?" అడిగాడు పాల్.

'తాను మోడ్రన్ కల్చర్ ని మిస్ కానని, అందుకే విదేశాలకి పోయే ప్లాన్ లో ఉన్నానని' అన్నాడు ప్రాంజల్.

"దూరపు కొండలు నునుపు!" అన్నాడు పాల్. అదిరిపడ్డాడు ప్రాంజల్.

"ఏంటీ?" అడిగాడు తను సరిగా వినలేదేమోనని.

"మీరు సరిగ్గానే విన్నారు. దూరపు కొండలు నునుపు గా ఉంటాయి. మా దగ్గర మీలా బాండింగ్ ఉండదు. ఎవరి లైఫ్ వారిది. ఒకర్ని ఒకరు పట్టించుకోరు.

మీ లైఫ్ కి, మా లైఫ్ కి డిఫరెన్సు ఒక్క ఉదాహరణ ఇస్తా. వినండి.

"హోటల్ లో మీరు కాఫీ ఆర్డర్ చేస్తారు. వెయిటర్ నమ్రత గా తెచ్చి ఇస్తాడు. మీరు తాగేస్తారు. డబ్బు ఇస్తారు. అక్కడితో అది సరి.

అదే మీ ఇంటిలో భార్యని కాఫీ అడుగుతారు. ఆమె ఆదరంగా తెచ్చి ఇస్తుంది.

"మీ భార్య మీకిచ్చే కాఫీలో ప్రేమ, వాత్సల్యం ఉంటాయి. ఆమె మీకోసమే మీ దగ్గర ఉంటుంది.

రెండింటికి ఎంత తేడా?" అన్నాడు.

కేథరిన్, నేను ప్రేమికులం. పెళ్ళి చేసుకుందామని అడిగాను.

ఆమె చాలా రోజులు ఏమి మాట్లాడలేదు. నేను ఆమెని మరువలేకపోయాను. ఒకరోజు ఆమె చెప్పింది.

భారత దేశం వెళ్ళి వారిలా అగ్ని సాక్షిగా వివాహం చేసుకుని అక్కడే బతుకుదామని. నేను మొదట నవ్వాను. పుట్టి పెరిగిన దేశంలో ఇంత స్వేచ్ఛ ఉండగా ఒకర్ని ఒకరు జీవితాంతం బంధించుకునేలా ఒక బంధంలో ఇరుక్కుపోతాననడం ఏమిటీ?" అని. కేథరిన్ తాను చదివింది, తెలుసుకుంది, నమ్మింది అయిన కొన్ని విషయాల్ని నాతో డిస్కస్ చేసింది.

"నేను లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలని అనుకుంటున్నాను. లైంగిక స్వేచ్ఛ కోసం పరుగులు తీస్తూ విచ్చలవిడిగా ఉండడం నాకు సరిపడదు. వ్యక్తి జీవితం, సమాజ జీవితం, ప్రకృతి శక్తులు, పరి రక్షణ, ఆత్మ, పరమాత్మ ని గురించి భరతఖండం లో జరిగినంత పరిశోధన, తపస్సు, సాధన ఇంకెక్కడా జరగలేదు!" అంది.

మీకు తెలుసో లేదో మా దేశంలో తండ్రి ఎవరో తెలియని పిల్లలు ఉంటారు. కనిపించని అనాగరికత.

ఇక్కడి విలువలు, పద్ధతులు మీద నేను ఎన్నో పుస్తకాలను చదివాను. కేథరిన్ మీద ఉండే ప్రేమతో.

'మొత్తం ప్రపంచంలోని ప్రాణికోటి జీవితాల్ని సుఖమయం, సుసంపన్నం చేయడమే భరత ధ్యేయం. భరత అంటే ప్రాణం అని అర్ధం. అటువంటి భారతదేశం మీది.

ఒక సంస్కృతి ప్రపంచం యావత్తూ పాకిందంటే, అందరి మనసుల్ని తాకుతోంది అంటే... అందరి ఆమోదయోగ్యమైన ప్రశంసలతో అలరారుతోంది అంటే అది కదా పరమాత్మ తత్వం.

సమస్త ప్రపంచం ఈ రోజున శాంతి, సహనం కోసం భారత తాత్వికతనే ఆశ్రయిస్తున్నాయి.

భారతీయ సంస్కృతి ఖండాలను దాటి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంటే అది కదా ప్రఛండమైన కాంతి, వెలుగు. అది మీ దేశంలో ఉంది.

మీరు ఎంతో అదృష్టవంతులు. మేమిక్కడే ఉండాలని ఈ పురాతన సంస్కృతిని ఆచరిద్దామని త్రికరణ శుద్దితో వచ్చినవాళ్ళం.

ఆలోచించుకోండి ప్రాంజల్ ! మీరు కోరుకునే 'దూరపు కొండలు' మీకు అశాంతిని ఇస్తాయి. మేము వచ్చి ఇక్కడే స్థిరపడాలనుకుంటున్న ఈ భూమి శాంతియుతమైన పవిత్ర స్థలం. ఆరోగ్యం జాగ్రత్త!” అనిచెప్పి వెళ్తుంటే కేథరిన్ రెండు చేతులూ జోడించి నమస్కరించింది.

ఆ వీడియో టేప్ కూడా ధృతిని చేరింది. ప్రాంజల్ ఒకే ఒక్క ప్రశ్న వేసుకున్నాడు.

"అసలు తనేందుకు ప్రతి విషయాన్ని ధృతికి పంపిస్తున్నాడు? తను హాయిగా బలాదూర్ గా తిరుగుతున్నానని చెప్పడమా? కాదని మనసు తట్టి ఇంకేదో చెప్పింది. దీన్ని ఒడంబడిక అంటారా?

పెళ్ళినాటి ప్రమాణం పట్ల తను అంత అంకితభావం తో ఉన్నాడా? తల గట్టిగా విదిల్చాడు. తనే తన నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడా?

పిల్లల మాటలు చెవిలో.

"నాన్నా!" నేను నీ అంత పొడుగు అయిపోయాను!" సౌమిత్ సంబరం.

"నాన్నా... నన్ను ఎత్తుకో. అన్నయ్యకంటే పొడుగు అయిపోతా!" జాజి మారాము.

ఒక్క నవ్వు నవ్వింది ధృతి. అది జాజిపూల సౌరభం!!

ప్రాంజల్ కళ్ళు వాలి నేలని చూస్తున్నాయి. తలెత్తి నింగిని చూడాలి.

ఉరకాలేస్తున్న సముద్రం దగ్గర కూర్చున్నాడు. మోహాలు, మెరుపులు తనని కమ్ముకుని విడిపోయాయని అనుకున్నాడు ప్రాంజల్. కళ్ళు మూసుకున్నాడు. లోపలంతా శాంతి మంత్రం!!

★★★

మా గొప్ప పొంగిపోతున్నాడు సుందరమూర్తి. అతడి కళ్ళల్లో ఎనలేని సంతోషం.

తన చిన్నారి చెల్లెలు తల్లి కాబోతోంది. ఇంట్లో సందడే సందడి.

సుందరమూర్తి తొందరపాటు మనిషి కాదు. ప్రతి దాన్నీ పరీక్షించి, హేతుబద్ధంగా ఉందని అనిపిస్తే, అది అతడికీ, ఇతరులకి మేలు చేస్తుందని అనుకుంటేనే ముందడుగు వేస్తాడు. అతడి నమ్రత అతనికి పెట్టని ఆభరణం. ఆ నమ్రత వల్లే అతడు తన పరిమితులు అర్ధం చేసుకుంటూ ఎదుటివారిలో గొప్పదనాన్ని స్వీకరిస్తాడు. విశాల దృష్టి తో వాస్తవ పరిస్థితుల్ని గ్రహిస్తాడు. అతనికి చిన్న చెల్లి అమాయకత్వం చూస్తే నవ్వు వస్తుంది.

జీవితం ఇదీ అని గ్రహింపు లేని అనులేఖ తాను చెప్పిందే ఖరారని అనుకుంటూ ఉంటుంది. ఇంకా మెచ్యూరిటీ స్టేట్ రాలేదని అంటూ ఉంటాడు అపర్ణతో. అనులేఖకి మాత్రం ఏదో కొత్తగా ఉంది.

ధృతి ఎన్నో జాగ్రత్తలు చెప్తూ తియ్యగా నవ్వింది.

అపర్ణ మాట్లాడదు. చేతల్లో చూపిస్తూ అనులేఖ తిండి విషయం లో అమిత శ్రద్ధ కనపరుస్తోంది.

సింహాద్రి కొబ్బరి బొండం పట్టుకొస్తాడు.

సంపంగి ఆమె కి వాంతి వచ్చినా కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నదని అన్నా పక్కనే చేదోడు, వాదోడుగా ఉంటుంది.

సురేఖ 'తిన్నావా? ఇంకేమైనా కావాలా?' అని అడుగుతూ ఉంటుంది.

శంకరం చెల్లికి ఇష్టమైన పళ్ళు ఏమిటో కనుక్కోమంటున్నాడు. అనులేఖ కి ఇదంతా కొత్తగా ఆనందంగా ఉంది.

తన కుటుంబ సభ్యులకి తానంటే ఉండే 'కేర్' కి ఆమె ఉబ్బి తబ్బిబ్బవుతోంది.

అనులేఖ భర్త ఒక్క మనోహర్ మాత్రమే ఆమె దగ్గరగా రావడం లేదు.

అతడిలో తెలియని అనూహ్యమైన మార్పు వచ్చినా సిగ్గు పడుతున్నాడు. చేజేతులారా భార్యకి వచ్చే పుట్టింటి సంపదని తన సరదాలకి భార్య మాట వినడం లేదనే కసితో వృధా చేసి పారేశాడు.

ఈ రోజున తనకో అపురూపమైన కానుక ప్రసాదించబోతున్న భార్య ఎదుట నించునే సాహసం చేయలేకపోతున్నాడు.

అనులేఖ లో అనుకోని మార్పు వచ్చింది.

తనకి కొద్దిగా నలత గా ఉంటే ఇంతమంది తన వెంటే ఉంటే సురేఖ వదిన ఆత్మహత్య చేసుకుంటే కూడా ఒక్క చిన్న సానుభూతి కూడా ఎందుకు లేకపోయింది? తాను ఎంత కటువుగా బతికింది? తనకో న్యాయం? ఇతరులకి ఒక న్యాయమా?

జీవిత వాస్తవికత తో నిత్యం సహజీవనం చేయాల్సింది పోయి, సమస్యని మానవ దృష్టి తో చూడలేని సంకుచిత భావం, ఈ ఇరుకు తత్వం చదువుకున్న తనలో కూడా ఉండటానికి కారణం ఎదుటి మనుషుల్ని తనతో సమానంగా చూడలేని ఈర్ష్యా, అసూయలు చుట్టుముట్టడమే కారణమా?" ఆలోచనలతో సతమతమవుతూ ఉంది.

ఒకసారి పొట్ట వైపు చూసుకుంది.

"అమ్మా! నేను ఇక్కడ ఉన్నప్పుడే నీ ఆలోచనలతో నన్నుధీటైన వ్యక్తిత్వం గల మనిషిగా తీర్చిదిద్దు!" అని లోపలి జీవి అడుగుతున్నట్టుగా అనిపించింది.

మనోహర్ ఆమెని చక్కగా చదవగలడు. నెమ్మదిగా వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఆమె అతడి రాకని గమనించింది.

నెమ్మదిగా తన చేతిని ఆమె చేతిలో ఉంచాడు. ఆచేతిలో ఒక ఆప్యాయత, క్షమతో ప్రార్ధిస్తున్న సన్నని ప్రకంపనలు ఉన్నాయి. అతడు ఆమెకి అర్ధం అయ్యాడు. ఆ చేతిని తన పెదవికి ఆనించుకుంది అనులేఖ.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Bulusu Sarojini Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in April 2026, కథలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *