Menu Close
వీక్షణం-163వ సాహితీ సమావేశం
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది కవిసమ్మేళనం
– ప్రసాదరావు రామాయణం –
vikshanam-163

వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 163 వ అంతర్జాల సమావేశం మార్చి 20, 2026 ఉగాది నాడు అత్యంత వైభవంగా జరిగింది. గత త్రయోదశవత్సరాల షణ్మాసాలుగా నిరంతరంగా, నిరాఘాటంగా ప్రతినెలా జరుగుతున్న సాహితీ సమావేశాలు ప్రపంచంలో బహుశా ఇవేనేమో!

ప్రపంచాన్ని అశాంతి ఆవరించి ఉన్నా, యుద్ధ భయాలు వెంటాడుతున్నా మొక్కవోని ధైర్యంతో సమావేశాలు జరిగి తీరవలసిందేనన్న వీక్షణం సాహితీ ప్రియత్వానికి జోహార్లు.

డా.గీతామాధవి గారి తొలి పలుకులలో ఈనాటి విశిష్ట అతిథి, కవిసమ్మేళనం అధ్యక్షులు శ్రీ మధు ప్రఖ్యా గారిని, సమావేశ ఉపాధ్యక్షులు శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు, తదితర కవులను, కవయిత్రులనూ స్వాగతించి వేదికపైకి ఆహ్వానించారు. శ్రీ మధు ప్రఖ్యా గారిని పరిచయం చేస్తూ వారు గొప్ప కవి, ఉద్దండ పండితులు, సంగీతంలోనూ మంచి ప్రవేశమున్నదని తెలిపారు.

శ్రీ మధు గారు మాట్లాడుతూ ప్రతి భార్య ఒక కవయిత్రి ఐతే సంసారం సంతోషంగా సాగుతుంది, విడాకుల ప్రశ్నే ఉత్పన్నం కాదని, ప్రతి ద్రష్టా ఒక కవి, ప్రతి కవి ఒక ద్రష్ట అని తెలిపారు. పి.వి. నరసింహారావుగారు కవి పండితుడు గనుకనే దేశాన్ని రక్షించగలిగారని, నేతలందరూ కవులైతే యుద్ధాలే ఉండవని వక్కాణించారు. తీయని తేనె త్రాగినట్టుగా ఉండినది వారి ఉపన్యాసం!

తరువాత శ్రీ మధు గారు, శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గార్ల సంయుక్త ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ప్రారంభమైనది.

తొలిగా నా కవితతోనే ప్రారంభం కావడం విశేషం ‘వ్రణాలతో రణం.,’ అనే యుద్ధ నేపధ్యంలో కవిత చదివాను. యుద్ధచిత్రాన్ని కళ్లకు చూపినట్టుందని ప్రఖ్యాగారు వ్యాఖ్యానించారు. శ్రీ లింగుట్ల వెంకటేశ్వర్లు గారు ‘ఓ మనిషీ గిరి గీచుకుని ఉండకోయ్’ అని చదివిన కవిత శ్లాఘనీయం. శ్రీ నాళేశ్వరం శంకరం గారు తన ‘సాగు’ అనే శీర్షికలో రైతు ప్రాధాన్యతను చక్కగా వివరించారు. శ్రీ కందుకూరి శ్రీరాములు గారు ‘ఉగాది వృక్షం’ అనే శీర్షికలో వృక్షాల ప్రాధాన్యతను రమణీయంగా తెలిపారు. చచ్చి మీ కడుపులో చెట్టునై మొలుస్తా అనడం అందరినీ ఆకర్షించింది. గణేష్ పత్రిక గుప్తా గారు వీక్షణం గురించి చదివిన కవిత బావుంది. శ్రీ వెంకట్ కొత్తూరు గారు పరాభవ గురించి పాడిన పద్యం అద్భుతం. శారద గారు ‘మహావధానం ‘ అనే శీర్షికలో ఆటోవాడు, ఇల్లాళ్ళు చేసే అవధానం కన్నా ఎక్కువా మీ పండితావధానం అని ప్రశ్నించారు.

ప్రశాంతి రామ్ గారు ఉగాదిపై పద్యాలు చదవగా. వంశీ ప్రఖ్యా గారు సాగర మధనం అనే కవిత చదివారు. శ్రీ ఆది (కమర) గారు ‘నాలోని అమ్మ అత్త ఎప్పుడైంది’ అనే శీర్షికలో స్త్రీ గర్భం ధరించిన ఆదిగా వివిధ దశలలో ఆమె భావాలను వ్యక్తం చేశారు. ఆదిగారిలో స్త్రీ పరకాయ ప్రవేశం చేసిందేమో!

పిదప గీతగారు ‘శాంతి విలువ’ అనే కవిత అందరినీ ఆకట్టుకుంది. జరుగుతున్న యుద్ధం సందర్భంగా రాసిన ఈ కవిత సమయోచితంగా, ప్రత్యేకంగా ఉంది. శ్రీ బాలకృష్ణారెడ్డిగారు ‘అద్దం’ అనే కవితలో తనలోని తనను చూసుకున్నారు. అద్భుతమైన కవిత.

శ్రీ మధు ప్రఖ్యా గారు ‘కట్టె’ అనే కవితలో లోతైన భావాన్ని చూపారు. శ్రీ ఘంటా మనోహర్ గారు తన అంతరంగ శుద్ధి అనే కవితలో మనకు మనం సింహావలోకనం చేసుకోవాలి అని ఉద్బోధించారు. సినీ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు ‘అటువైపు కూడా చూడు’ అనే కవితలోకుల, మత అసమానతలను, గర్హిస్తూ ప్రశ్నించినవారిని జైలుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఆలోచింపచేసే కవిత. నేటి రాజకీయ గమనం!

ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు పరాభవ సంవత్సరానికి హృద్యంగా స్వాగతం పలికారు. శ్రీమతి అరుణ కోదాటిగారుకూడా ఉగాదిని స్వాగతించారు. ఇదే అంశంపై భవాని గారూ కవిత చదివారు. చక్కని చిక్కని గొంతుతో శ్రావ్యమైన పాట. శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారు మార్పుకు సంకేతం ఉగాది అన్నారు. దేవులపల్లి పద్మజ గారు ఉగాదిపై పద్యాలు చదివారు.

దీపక్ న్యాతిగారు, ఉమామహేశ్వరరావు గార్లు కూడా ఇదే అంశాన్ని విభిన్నమైన రీతిలో చదివారు. చీదెళ్ళ సీతాలక్ష్మిగారు మత్తకోకిల పద్యాలు చదివారు. డా. నిశ్చల గారు కూడా ఉగాదిని రమణీయంగా వర్ణించారు.

ఆలపాటివారి అమ్మాయి గురువు ప్రాధాన్యతను తెలుపుతూ చక్కని భావ, పద బంధాలతోచదివిన కవిత రమ్యం. శ్రీమతిశోభా దేశ్ పాండే గారు కూడా ఉగాది పైనే కవిత చదివారు. లలితా చండి గారు యుద్ధం పై ఒక రుబాయి చదివారు. అవధానం అమృత వల్లి గారు ఉషోదయాల సమ్మేళనమని చదవగా, బుక్కపట్నం రమాదేవిగారు అందని ద్రాక్షలు అందించారు!

శ్రీబిటవరం శ్రీమన్నారాయణ గారు మానవ వైఖరిగురించి చెప్పినరీతి అద్భుతం. శ్రీ అరవ జైపాల్ గారు ‘కాలమా! అడగనా?’ అంటూ చదివిన కవిత హృద్యం. డా. బృంద వసంత లక్ష్మి పై గానించిన విధం అందరినీ ఆకట్టుకుంది. ముగ్ధమాధవి గారి శుభ ఉగాది శాంతి ఉగాది చాలా చాలా బావుంది. యుద్ధం ఇక ఉండదు అని గర్జించండి అని ఉరిమారు.

నెల్లూరి ఇందిర గారి శిశిరపల్లవం భాష, భావం అత్యద్భుతం. ఆనం ఆశ్రితారెడ్డి గారి వెలిగే దీపం కాంతివంతంగా వెలిగింది. మల్కని విజయలక్ష్మి, శ్రీ గుండ్ల పల్లి రాజేంద్ర ప్రసాద్ గార్లు ఉగాదిపై కవితలు చదివారు. ప్రసాద్ గారి కంఠం ఆవేశం అందరినీ ఆకర్షించింది.

చివరిగా కనపర్తి వెంకటేశ్వర్లు గారు తెలుగు వెలుగు కిరణాలతో దేదీప్యమానంగా రసరమ్యంగా కవి సమ్మేళనం ముగిసింది. గీతగారి వందన సమర్పణతో ఈ ఉగాది సభ దిగ్విజయంగా ముగిసింది. ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

********

Posted in April 2026, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *