ద్వాపర యుగాంతంలో భూదేవి వైకుంఠానికి వెళ్ళి, భూభారం పెరిగింది నాకు వచ్చి సహాయం చేయాలి అని అభ్యర్ధించినప్పుడు, విష్ణువు చెప్పాడుట, నేను మానవ జన్మ ఎత్తి వస్తాను అని. అయితే భగవంతుడు పుట్టాలంటే మంచి మనుషులూ, తల్లి తండ్రులు మంచి మనస్తత్వాలు కలిగినవాళ్ళు ఉండాలి. దానికోసం బ్రహ్మ వసువులు అనే దేవతలలో ఇద్దర్ని – ద్రోణుడు, ధర అనే వారిని – అడిగాడు, భూలోకంలో పుట్టమని. మానవ జన్మ అంటే తెల్సిందే కదా, రక్తం, చీము, అనేకానేక అశుద్ధాలతో, నిత్యం దెబ్బలాటలతో సుఖం అనేదే లేని కలగలసిన జీవితం. అది ఓర్చుకోగలగాలి. దానికి వీళ్ళు ఏమన్నారంటే, “విశ్వేశ్వరుడైన శ్రీహరిని సేవించే భాగ్యం ఇస్తే తప్పకుండా మానవ జన్మ ఎత్తడానికి సిద్ధం.” గమనించండి – విష్ణువు మా కడుపున పుట్టాలి అనికాదు అడిగినది, ‘సేవించే భాగ్యం’ మాత్రమే అడిగినది. అలా ద్రోణుడు, ధర అనే వసువులు నందుడూ, యశోద గా మానవ జన్మ ఎత్తారు. అయితే కృష్ణుణ్ణి సేవించారు గాని జన్మ ఇవ్వలేదు వీళ్ళు. విష్ణువు కూడా వీళ్ళని సంతోషంగా తల్లితండ్రులు గా ఒప్పుకున్నాడు.
విష్ణువు తమ కొడుకుగా పెరుగుతున్నాడని వీళ్ళకి తెలియదు. మాయ అంటే అదే కదా? అయితే ఇప్పుడో సారి అప్పుడోసారి కృష్ణుడు చేసే పనులు విని ఈ కుర్రాడు భగవంతుడి అవతారం అనుకోవడం, వెంఠనే మాయలో పడి అది మర్చిపోవడం జరగడం మొత్తం భాగవతంలో చూడవచ్చు. కృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు తల్లితో చెప్తే యశోద ‘ఏదీ నోరు తెరు’ అందిట. అప్పుడు ఆయన నోట్లో ‘పదునాల్గు భువన భాండంబులు’ చూపించాడు యశోదకి. అది చూసిన యశోద ఏమనుకుంటోందో చెప్తున్నాడు పోతన. అదే ఈ నెల పద్యం.
మ.
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్
[పోతన భాగవతం 10.1-342]
ఈ కుర్రాడి (బాలకుఁడెంత) నోట్లో ఏమిటి (యీతని ముఖస్థంబై), పధ్నాలుగు భువన భాండాలు వెలుగుతూ ఉండడం ఏమిటి (యజాండంబు ప్రజ్వలమై యుండుట)? దీనికేమిటి కారణం (ఏమి హేతువొ)?, ఇదంతా కలా? లేక విశ్వేశ్వరుడైన శ్రీహరి మాయా (వైష్ణవ మాయయో?), లేకపోతే మరొక కారణమో (యితర సంకల్పార్థమో)? అసలు ఇదంతా నిజమేనా (సత్యమో)? నాకు వళ్ళు తెలియకుండా పోతోందా (నేరక యున్నదాననొ)? అసలు నేను యశోదనేనా? లేకపోతే నేనెక్కడ ఉన్నానో (పర స్థలమో), ఈ కుర్రాడు ఎంత, వీడి నోట్లో అండపిండ బ్రహ్మాండాలన్నీ పట్టడం ఏమిటి అనుకుంటోంది యశోద. ఆవిడకి ఇలా ఆలోచన వచ్చేసరికి కృష్ణుడు మామూలు రూపంలో ‘అమ్మా, అమ్మా’ అని దగ్గిరకి వచ్చి కదిలించేసరికి మరోసారి మాయ కమ్ముకుని అన్నీ మర్చిపోయింది.
ఈ పద్యంలో భగవంతుడి నోటిలో భువన భాండాలు చూసిన యశోద కధలోకి వస్తే కృష్ణుడు పుట్టినప్పుడు ముందు దేవకి, వసుదేవులకి కనిపించి చెప్తాడు తాను ఇలా పుట్టబోతున్నాను అని. దీనికి కారణం కూడా చెప్తాడు. స్వయంభువ మన్వంతరంలో దేవకి పృశ్ని అనే పతివ్రత. వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి. వీళ్ళిద్దరూ తపస్సు చేసి శ్రీహరిని చూసేసరికి మాయ ఆవరించి, వారికి అప్పటికి పిల్లలు లేరు కనక ‘నీతో సమానమైన కొడుకుని ప్రసాదించు’ అని అడిగారు. భగవంతుడితో సమానమైనవారెవరూ లేరు కనక మొదటి జన్మలో విష్ణువే పృశ్నిగర్భుడుగా, రెండో జన్మలో వామనుడిగా (అదితి, కశ్యపులకి) ఇప్పుడు మూడో జన్మలో కృష్ణుడిగా (దేవకీ, వసుదేవులకి) పుడుతున్నాను, అని. ఇది దేవకీ వసుదేవుల కధ. అయితే వాళ్ళు కృష్ణుణ్ణి కన్న తల్లి తండ్రులు. సేవించే భాగ్యం మాత్రం నంద యశోదలకి. భగవంతుడు పుట్టాలంటే ఇన్ని విషయాలు కూలంకషంగా జరిగి అన్నీ కల్సి వచ్చినప్పుడు ఉత్తమమైన ముహుర్తంలో మంచి నక్షత్రంలో పుట్టాడని చెప్పడం చూడవచ్చు భాగవతంలో. ఇదే పోతన ప్రస్తావిస్తూ ఒక పద్యంలో పరీక్షిత్తు చేత అనిపిస్తాడు, “భగవంతుడి అవతారాలు కీర్తిస్తూ గ్రంధాలు రాస్తేనే మోక్షం వస్తుందంటారే (రాముడు పోతనకి ఇదే చెప్పాడు కదా, అది మర్చిపోలేదు ఇక్కడ), అటువంటప్పుడు ఆ భగవంతుణ్ణే కని పోషించినవారికి ఎటువంటి సద్గతులు కలుగుతాయో కదా?”
ఈ మాయ అనే సంగతి చూద్దాం. భలేవారండి, ఒకసారి ఇలా విశ్వరూపం కనిపించగానే ఎలా మర్చిపోతాం అనేవారికి ఒక ఉదాహరణ. మనం ఏదో పనిమీద బయటకి వెళ్తాం, ఏది కొనాలి అనేది కాయితం మీద రాసుకుని మరీ వెళ్తాం. అయినా సరే ఒక్కోసారి వెనక్కి వచ్చాక ‘అరే, ఇది మర్చిపోయాం’ అనుకోమూ? చిన్న చిన్న విషయాలకే ఇలా జరుగుతూంటే ఎదురుగా ఉన్న వైష్ణవ మాయలో పడ్డాక యశోదకి గుర్తు ఉంటుందా? అదీ గాక ఆ విశ్వరూపం కనిపిస్తూనే ఉండాలంటే, ఆత్మ సాక్షాత్కారం కలగాలి. అది కలగడానికి ఎన్ని వేల కోట్ల జన్మలు ఎత్తాలో ఎవరికెరుక? అహంకారం, పాపం, పుణ్యం అన్నీ నశించాలి. ‘నీవే తప్ప ఇతః పరంబెరుగను’ అనే స్థితికి జేరేవరకూ అది రాదు. అంతటి స్థితి కలిగినా భగవంతుడి కృప ఉండాలి అన్నింటికన్నా ముఖ్యంగా. అందుకే నారాయణీయంలో భట్టాత్తిరి గారు అంటారు ‘కో నామ కస్య సుకృతం కధ మిత్యేవేయాత్’ (స్వామీ లోకంలో ఏ జీవి ఎటువంటి పుణ్యం చేసుకుందో ఎవరు చెప్పగలరు?). అందుకే అజామీళుడంతటి పాపి అయినా పూర్వ జన్మ సుకృతం ఉంటే, ఆయన కృప ఉంటే భగవంతుణ్ణి అతి సులభంగా చేరుకోవచ్చు.