Menu Close
Garimella Venkata Lakshmi Narasimham
ఇది కథ కాదు (కథ)
గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం

కథలు అనేవి మన జీవన విధానంలో జరిగిన, జరుగుతున్న అంశాల ఆధారంగానే సృష్టింప బడతాయి. కనుక, మన జీవితంలో జరిగిన అనుభావాల జ్ఞాపకాలను కథకాని కథలుగానే చెప్పుకోవచ్చు. నా జీవనక్రమంలో ఎన్నో మధురస్మృతులు, అనుభవాన్ని సంపాదించి పెట్టిన సంఘటనలు ఎన్నో జరిగాయి. ప్రస్తుతం నేను వ్రాస్తున్న ఈ కథ కాని కథ ద్వారా, నా వృత్తిలో నేను చేసిన ఒక చిన్న సహాయం, తద్వారా సాధించిన ఆత్మానుభూతిని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.

నేను పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఏరియా మేనేజరుగా 1982 లో భుబనేశ్వరులో పనిచేస్తున్న రోజులవి. ఒడిశాలోని మా బ్యాంకు శాఖల పర్యవేక్షణ నా ప్రధాన బాధ్యతగా ఉండేది. నేను ఒడిసాలో (ఆ రోజుల్లో ఒరిస్సాగా పేరుండేది) పుట్టి పెరిగినందువలన ఒడియా భాషలో నాకు బాగా అవగాహన ఉంది. బ్యాంకు ఏరియా మేనేజరుగా నేను తీసుకున్న ఒక నిర్ణయం ఏ విధంగా ఫలించిందో వివరాలతో ఈ దిగువ పొందుపరుస్తున్నాను.

ఆ రోజు యధావిధిగా నా ఆఫీసు పనిలో నిమగ్నమయి ఉన్నాను. నా ఆఫీసులో పనిచేస్తున్న ఎగ్రికల్చర్ ఆఫీసరు త్రిపాఠీతో చర్చలో ఉన్నాను. ఆ సమయంలో ప్యూన్ వచ్చి నన్ను కలియడానికి ఒక తల్లి, కూతురు వచ్చేరని తెలియజేసేడు. నేను వెంటనే వారిద్దరిని లోపలికి పిలిపించేను. వారు ప్రవేశించి, నేను కూర్చోమని చెప్పేక కొద్దిగా వెనకాడుతూ కుర్చీలలో ఆసీనులయ్యారు. నాకు ఒడియా భాష తెలిసిననూ, వారి బెరుకు తీర్చడానికి ఒడియా వ్యక్తి త్రిపాఠీగారిని వారి రాకకు కారణం అడిగి తెలుసుకోమన్నాను. వారిద్వారా తెలుసుకొన్న వివరాల్లోకి వెళితే –

వచ్చినవారిలో పెద్దావిడ స్నేహ బిస్వాల్. ఆవిడ భర్త జగన్నాథ్ బిస్వాల్ ఆ ఊళ్లోనే ఒక గవర్నమెంటు ఆఫీసులో ప్యూన్ గా పనిచేస్తున్నాడు. తల్లితోబాటు వచ్చిన అమ్మాయి సావిత్రి, ఆ దంపతుల ఏకైక సంతానం. ఆ అమ్మాయి కటక్ లో గల గవర్నమెంటు మెడికల్ కాలేజీలో సీటు పొందింది. కటక్ పట్టణం భుబనేశ్వరుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. సావిత్రి బాగా తెలివయినది. అన్నింటిలోను మంచి మార్కులు సంపాదించింది. కూతురును మెడికల్ కాలేజీలో చదివించడానికి జగన్నాథ్ కు ఆర్థిక స్తోమత్తు లేదు. జగన్నాథ్ ను సంఘంలో తోటివారు అమ్మాయికి సాంప్రదాయప్రకారం తొందరగా పెళ్లి చేయమని ఒత్తిడి చేయనారంభించేరు.

సావిత్రికి ఎలాగయినా మెడికల్ చదివి డాక్టరు కావాలని ధృఢమయిన కోరిక. స్నేహకు కూడా కూతురుకు కాలేజీ చదువులు చెప్పించాలని ఉండేది. ఆ ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలనుండి కొద్దో గొప్పో వీలయినంత డబ్బు పొదుపు చేస్తూ ఉండేది. మెడికల్ కాలేజీలో చేరడానికి ఆ చిన్న మొత్తం కొంతవరకు సహాయపడుతుంది. సావిత్రి మంచి మార్కులతో పరీక్షలు పాసయినందువలన మెడికల్ చదువుకు ప్రభుత్వం తరఫున అప్పు పొందే అవకాశముండేది. కానీ అది చేతికందడానికి సుమారు సంవత్సరం పట్టవచ్చు. ఆ వివరాలు తెలిసేక జగన్నాథ్ కూతురుకు మెడికల్ చదివించడానికి సుముఖత చూపించేడు. హాస్టలు, తదితర ఖర్చులకు సావిత్రికి ప్రతినెలా కనీసం 300 రూపాయల వరకు కావాలి. బ్యాంకులో అప్పు పొందే అవకాశముండవచ్చని తోటివారు చెప్పడంతో జగన్నాథ్ భార్యను ప్రయత్నించమన్నాడు. స్నేహ తన అమ్మాయి సావిత్రితో బాటు భుబనేశ్వరులోని మా బ్యాంకు బ్రాంచికు వెళ్లి మేనేజరుని కలసింది. అమ్మాయి చదువు నిమిత్తం రుణం కావాలని కోరింది. ఆ రోజుల్లో మా బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్స్ స్కీము లేదు. ఆ పరిస్థితులలో స్నేహ కోరినట్లు సావిత్రి చదువుకు రుణం మంజూరు చెయ్యడంలో తన అసమర్థతను బ్రాంచ్ మేనేజరు తెలియజేసేడు. బ్రాంచిలో ఒక ఉద్యోగస్తుని సలహాతో ఆ రోజు తల్లి, కూతురు, అదే బిల్డింగులో నున్న నా ఆఫీసుకు వచ్చేరు.

పై వివరాలు జాగ్రత్తగా విన్నాక, అమ్మాయికి ఏ విధంగా సహాయపడగలమా అని ఆలోచనలో పడ్డాను. రెండు రోజులు సమయమిస్తే ఆలోచించి నిర్ణయం చెబుతానని స్నేహ కు చెప్పేను. వారు నిష్క్రమించిన తరువాత ఇండస్ట్రీస్ ఆఫీసరు త్రిపాఠీని పిలిపించి ఆయనతో విషయం చర్చించేను. స్నేహకు కుట్టు మెషీను, తత్సంబంధిత పరికరాలు కొనడానికి రుణం ఇస్తే, సావిత్రి మెడికల్ చదువుకు సహాయపడుతుందని ఆలోచించేము. రెండు రోజుల తరువాత స్నేహ, జగన్నాథ్, అమ్మాయి సావిత్రితోబాటు నన్ను కలిసేరు. త్రిపాఠీ వారికి మా ప్రతిపాదన తెలియబరిచేరు. స్నేహ కుట్టుపని వ్యాపారం చెయ్యడానికి తను శిక్షణ పొందాలని, దానికి సమయం పడుతుందని, అప్పటివరకు పెట్టవలసిన ఖర్చులకు, తనవద్ద తగినంత సొమ్ము లేదని, అదీకాక రెడీమేడు దుస్తుల వ్యాపారస్తులతో పోటీ కష్టమని, తన అసమర్థతను తెలియజేసింది. మేమది అర్థం చేసుకున్నాం. కథ మళ్ళీ ముందుకొచ్చింది. నాలుగు రోజుల తరువాత మళ్ళీ కలియమని నేను చెప్పడంతో వారు నిష్క్రమించేరు. నేను, త్రిపాఠీ ఆలోచనలో పడ్డాం.

సావిత్రి మెడికల్ కాలేజీలో చేరడానికి సత్వరం క్రమం తప్పకుండా వచ్చే ఆదాయం కావాలి. అన్ని విధాల ఆలోచించేక, స్నేహకు పిండిమిల్లు నిమిత్తం రుణం మంజూరు చేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డాం. త్రిపాఠీని ఆ విషయంలో సాధక బాధకాలు సేకరించమన్నాను. ఆయన పిండిమిల్లు వ్యాపారి వద్ద వివరాలు తెలుసుకున్నారు. పిండిమిల్లు ఖరీదు సుమారు 15000రూపాయిలు. ఆ మిల్లులమ్ముతున్న వ్యాపారి, పిండిమిల్లు విక్రయించడంతో బాటు అది సమర్థవంతంగా నడపగలిగే అనుభవమున్న వ్యక్తిని, నెలకు 250 రూపాయిల జీతం మీద ఏర్పాటు చేస్తానన్నాడు. స్నేహ కేవలం దుకాణంలో కూర్చొని, వస్తున్న చిన్న చిన్న మొత్తాలను జాగ్రత్తపరచడమే చేయాలి. పిండిమిల్లు స్థాపించుటకు ఒక రోజు పడుతుంది. ఆ మరునాటినుండి ఆదాయం చేకూరుతుంది. సగటున రోజుకు 70 నుండి 80 రూపాయిలవరకు ఆదాయం రావచ్చునని అంచనా వేసేం. అది మెడికల్ కాలేజీలో సావిత్రికి అవసరమయిన ఖర్చు, పిండిమిల్లు నడిపే వ్యక్తికి నెలసరి జీతం, ఎలక్ట్రిసిటీ మరియు పిండిమిల్లు మెయింటినెన్స్ ఖర్చులు కాగా, ప్రతినెలా బ్యాంకు అప్పు తీర్చుటకు కట్టవలసిన వాయిదా సొమ్ము చెల్లించడానికి ఇబ్బంది లేకుండా సరిపోతుందని అంచనా వేసేం. ఆమెకున్న పరిస్థితులలో స్నేహకు పిండిమిల్లు కొరకు రుణం మంజూరు చెయ్యడమే ఉచితమని అభిప్రాయపడ్డాం.

నాలుగు రోజుల తరువాత బిస్వాల్ దంపతులు, సావిత్రి, నన్ను కలిసేరు. మా ఇండస్ట్రీస్ ఆఫీసరు త్రిపాఠీ వారికి మా పిండిమిల్లు ప్రతిపాదన వివరంగా బోధపరిచేరు. స్నేహ సంతోషంతో తన సమ్మతిని తెలియజేసింది. వెంటనే దగ్గరలోనే ఉన్న మా బ్యాంకు బ్రాంచ్ మేనేజరును పిలిపించేను. ఆయన రాగానే స్నేహకు పిండిమిల్లు కొరకు రుణం మంజూరు చెయ్యడానికి ప్రతిపాదన ఆయనకు వివరించేము. ఆయన సంతృప్తి చెందేడు. స్నేహ అతని బ్రాంచి లో అప్లికేషను సమర్పించింది. బ్రాంచ్ మేనేజరు మంజూరు నిమిత్తం నా వద్దకు పంపేడు. పిండిమిల్లు ఖరీదులో తమ వంతు మదుపు సమకూర్చడానికి జగన్నాథ్ తగిన ఏర్పాటు చేస్తానన్నాడు. రుణం మంజూరు చెయ్యడం మూలాన్న ఆర్థికంగా వెనుకబడ్డ ఒక కుటుంబ పరిస్థితి ఎంతగా మెరుగుపడుతుందో ఆలోచించి, బ్యాంకు నియమాల్లో నా అధికార పరిధిలో కొన్ని సర్దుబాట్లు చేసి రుణం మంజూరు చేసేను.

పిండిమిల్లు ఆదాయంతో స్నేహ బ్యాంకు రుణం సకాలంలో తీర్చింది. సావిత్రి మెడికల్ చదువు నిరాటంకంగా పూర్తయింది.

సావిత్రి మెడికల్ డిగ్రీ పొందింది. అప్పటికి నేను ప్రమోషన్ మీద బదిలీ అయి పూణేలో పనిచేస్తూ ఉండేవాడిని. సావిత్రి నాకు ధన్యవాదాలు సమర్పిస్తూ తను ఎం.బి.బి.ఎస్. పాసయినానని హౌస్ సర్జన్ గా చేరేనని ఉత్తరం ద్వారా తెలియబరిచింది. నేను చాలా సంతోషించి ఆశీర్వచనాలు పంపేను.

సావిత్రి స్వదేశంలోనో విదేశాల్లోనో సమాజానికి తప్పక సేవలందిస్తూ ఉండి ఉంటుంది. ఖచ్చితంగా ఆ కుటుంబం ఆర్థికంగా బాగా బలపడి ఉంటుంది. అటువంటి జ్ఞాపకాలు నా మనసుకు సంతోషాన్నిస్తూ ఉంటాయి.

********

Posted in April 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *