Menu Close
Ayyagari-Suryanarayana-Moorthy

సింహాచలేశుని చందనోత్సవము (వైశాఖశుద్ధతదియ)

అయ్యగారి సూర్యనారాయణమూర్తి

చం.
కలియుగదైవమై జనులఁ గావఁగ నిల్చిన స్వామి వేంకటా
చలపతి కగ్రజుండ వయి చందనచర్చితదివ్యరూపివై
నిలిచితివయ్య సింహగిరి నీవె వరాహనృసింహమూర్తివై
కొలిచినవారి కోరికలఁ గూరిమిఁ దీర్చు పరాత్పరుండవై
కం.
అప్పన్న యన్న లేదా
యప్పఁడ వన్నను శ్రితాళి కండవు నీవై
తిప్పలు తప్పింతువయా
చెప్పఁగ నీ మహిమ తరమె శేషున కైనన్?
కం.
తల తోకయు సింహముగాఁ
గలిగియు నాసనము దంష్ట్రి(1)గాఁ దదితరపు
ద్గలము(2) మనుష్యుని రూపము
విలసిల్లు త్రిభంగముద్ర వెలసితి వయ్యా!
………..(1) వరాహము (2)శరీరము
తే.గీ.
కడుసువాసన గలిగిన గంధవృక్ష
ఖండముల సానపై నఱుగంగఁ జేసి
నాల్గు నెలవిడతల(1) చందనంపుపూఁత
మూఁడు మణుగులు పట్టించ మోహన మగు
………..(1) మొదటిది – వైశాఖశుద్ధతదియరాత్రి
…………….రెండవది – వైశాఖపూర్ణిమ
…………….మూడవది – జ్యేష్ఠపూర్ణిమ
…………….నాల్గవది – ఆషాఢపూర్ణిమ
ఉ.
వేడి హరించు చందనము వెంటనె యుండెడు లేపనంబుగా
పోఁడిమి గూర్ప లింగమను పోలిక గన్పడిఁ, వత్సరంబులో
వేడుక సేయు నీదు నిజవిభ్రమరూపము(1) నొక్కరోజు(2) మా
తోడుగ నుంచు భాగ్యమును దొడ్డమనాన నొసంగు నప్పఁడా!
………..(1) చందనలేపనము లేని రూపము
………..(2) వైశాఖశుద్ధ తదియ నాడు పగటిపూట
కం.
పడమటిదిక్కును జూచుట
కడువిజయప్రదము నీదు కమ్రాకృతి, మా
కిడు నదె సత్ఫలితంబుల
యెడమన్నది లేక నీవ యెద నుండ ప్రభో!
Posted in April 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *