తీయలేని తెర

ఎన్నో ఆశలతో అల్లుకున్న మన పయనం
ఏదేదో ఊహించుకున్న మన గమ్యం
చేరగలమో లేదో అనే సంశయం
మన మధ్య ఏదో తెర
చీకటి నిండిన తెర
సమాజపు తెర
సనాతన తెర
ఎలుగెత్తి అరవని నా భావాలు
ఎవ్వరికీ అరువివ్వని నా తలపులు
అర్ధం చేసుకునే నీ మనసు
చేయిచాచి పిలుస్తోంది
మన మధ్య ఎదో తెర
నల్లటి తెర
నిరసన తెర
నినాదాల తెర
వెళ్ళిపో!
చీకట్లో కలిసిపో
తెరవెనక బొమ్మలా
చీకట్లో నీడలా
సంఘం నేసిన తెర
చినుగు లేని చింపలేని
మేకులతో దిగేసి
మనల్ని వేరుచేసే తెర.
జీవితం……

నీవంటే కోపం క్రోధం
ఏవం ఏహ్యం
సీదరం సెగ్గెం లేవు… జీవితం……!
కాని…నువ్వడిగే ఆ ప్రశ్నలకి
చేసే సవాళ్ళకి …
దిగాలుపడి దించిన తలెత్తలేకున్నా!
చేష్టలుడిగి చూస్తున్నా!
నీ అమాయకపు పోకడ తరచూ
నన్నుఆశ్చర్యచకితురాలిని చేస్తుంది
అయినా…నువ్వంటే నాకు
నిరసన.. నిరాకారం లేవు
బతకడానికి బాధవసరమని
దరహాసానికి ధర ఉంటుందని
నువ్వందించిన సమస్యలు
సంధించిన సందర్భాలు
కోరిన….. కోరని …..
మోజుపడిన…మది ఎంచని
ఆకర్షితమైన .. ఆసక్తి లేని
బంధాలలో నా ఉనికి మనికి
అల్లుతావని తెలియదు
అయినా… నీ వంటే
ఉదాసము ఉపేక్ష లేవు
ఈ రోజు నా చెక్కిళ్ళు
చెరువులయ్యాయని
అడలు ఆర్తి లేదు
రేపు ఇవే చెక్కిళ్ళు ఎడారులైతే
ఒక్క నీటి చుక్క కోసం
వేసారుతానేమో!
జీవితం! నీ మీద నింద కాని నెపము కాని లేవు
ఇది కేవలం నీతోనే
చెప్పుకునే గోడు! ఆర్పు!!
నీ కంటే నాకు
సన్నిహితులెవరున్నారు చెప్పు!!