Menu Close
RSharma-Danthurthi
భిక్ష (కథ)
ఆర్. శర్మ దంతుర్తి

మధ్యాహ్నం భిక్షకి బయల్దేరాడు భగవానుడు. దారిలో ఓ ఇంటి దగ్గిర కలకలం. యజమాని ఎవరిమీదో అరుస్తున్నట్టున్నాడు. ఆ ఇంటికెదురుగా తమకి పరిచయం ఉన్న ఇంటికి వెళ్ళబోతూంటే మొదటి ఇంట్లోంచి మరో సారి కేకలు; ధడేల్ మంటూ తలుపు మూసుకున్న చప్పుడు. కూడా ఉన్న శిష్యులని వేరే చోటకి వెళ్ళమని చెప్పి భగవానుడు ఆనందుడితో మొదటి ఇంటికి బయల్దేరేడు.

“ఈ పరిస్థితుల్లో ఆ ఇంటికి భిక్షకి వెళ్తే ఏమంటారో?” ఆనందుడు అన్నాడు, “కోపంతో మనమీద చేయి చేసుకోవచ్చు కదా? మరో చోటికి వెళితే మంచిదేమో?”

“నువ్వే చూద్దువుగాని రా,” ముందుకు దారితీసాడు తధాగతుడు.

“భవతి భిక్షాం దేహీ!” తలుపు తట్టాడు ఆనందుడు.

ఒక్కసారిగా విసురుగా తెలుచుకున్న తలుపులోంచి యజమాని కాబోలు బయటకొచ్చేడు, “ఎవర్రా నా ఇంటి తలుపు తట్టినది?” కోపం ఉట్టిపటుతూంది ఇంకా.

“మేమే,” ఆనందుడు చెప్పాడు.

“బుధ్ధిలేని పనికిమాలిన జనం అంతా ఇలా సన్నాసుల్లా తయారవడం, ఇంటి కొచ్చి ప్రతీ రోజూ దేబిరించడం. ఏమయ్యా మీకు పనీ పాటా లేదా? ఊరికే అలా ఊళ్ళమీద పడి తిని ఏడవకపోతే ఏదో ఒక పని చేసుకోరాదా?”

ఆనందుడేదో అనబోతూంటే భగవానుడు వారించాడు చిరునవ్వుతో.

“చేతగాని వెధవలందరూ ఇలా ఆ బుద్ధుడనే ఆయన దగ్గిర చేరడం, ఆయనేదో ఉద్ధరిస్తున్నట్టూ ఎక్కడికీ కదలడులా ఉంది, మీరేమో భిక్ష అంటూ ఇలా ఊరిమీద పడి జనాలని దేబిరించి పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వడం. తిండి కావాలంటే పని చేయాలి. అప్పుడు డబ్బో దస్కమో దొరుకుతుంది. దానితో అయిందా? ఆ డబ్బులు తీసుకెళ్ళి పచారీలు కొని వంట చేయాలి. అప్పుడు తినడానికేదో దొరుకుతుంది. నువ్వూ నీ కూడా నించున్న ఈ పెద్ద మనిషీ ఉత్త సన్నాసులు. సన్న్యాసి కూడా కాదు. అర్ధం అయిందా? పనీ పాటా చేసుకోకుండా మేము కష్టపడుతుంటే అవి తినేసి బొజ్జ పెంఛడం కాదు, వెళ్ళండి ముష్ఠి వెధవల్లారా. పోయి పని చేసుకోండి. పోయి ఆ భగవానుడనే బుద్దిలేని బుద్ధుడికి కూడా నేను ఇలా తిట్టాననీ అసలు బుద్ది అనేది ఉంటే బయటకొచ్చి పనిచేసి డబ్బు సంపాదన మీద దృష్ఠి పెట్టమనీ చెప్పండి. కుక్కల్లా ఊరిమీద పడి తినడం కాదు. మీరిద్దరూ, మీ బుద్ధుడూ ఎప్పుడైనా అసలు ఒక్క నాణెం చేత్తో పట్టుకోవడం మాట సరే, కళ్ళ చూసారా? లేకపోతే ఇలా తిరిపెంలాగా తిరగడమేనా? వెళ్ళండి, సన్నాసుల్లారా”

“భిక్ష వేసేది ఉందా?” ఈ సారి భగవానుడే నోరు తెరిచాడు; ఆనందుడు ఆశ్చర్యంగా చూస్తూంటే.

“ఓరి దరిద్రుడా, ఇంతసేపు గొంతు చించుకుంటూ అరిచింది చాలదా? నువ్వో సన్నాసివి. నీ గురువుగా చెప్పబడే ఆ బుద్ధుడికీ, మీకూ పనేమీ లేదు. ఊరిమీద తిరిగి అడుక్కోవడం తప్ప. దానికేం సమాధానం చెప్తావు?” ఈ సారి గొంతు చించుకు అరిచేడు యజమాని, “ఇంత అరుస్తూంటే ఏమీ మాట్లాడవేం?”

“సరే మాట్లాడమన్నారు కదా, ఓ ప్రశ్న అడగొచ్చా?”

“సరే ఏడు త్వరగా!”

“మీరు చూడబోతే ధనవంతుల్లాగా ఉన్నారు, మీ ఇంటికి అతిథులు వస్తూ ఉంటారా?”

“ఎందుకు రారు? నీలాగా నేను సన్నాసిననుకుంటున్నావా?”

“వచ్చినవాళ్ళకి మీరు బహుమతులు ఇస్తూ ఉంటారు కదా?”

“ఇంటికొచ్చిన అతిధులకి ఏ మూర్ఖుడు బహుమతి ఇవ్వడు?”

“సరే, మీరిచ్చిన బహుమతులు వాళ్ళు తీసుకోకపోతే అవి ఏమౌతాయి?”

“ఏం వెధవ, సన్నాసి ప్రశ్న ఇది? వాళ్ళు తీసుకోకపోతే ఆ బహుమతులు నా దగ్గిరే ఉంటాయని తెలియదా!”

“అవును కదా? నీ ఇంటికి మేము వచ్చి భిక్ష అర్ధించాము. మీరేమో తిట్ల వర్షం కురిపించారు మా మీద మీ అతిధులకి బహుమతులు ఇచ్చినట్టూ. మేము అవి స్వీకరించలేదు. అంటే అవి ఎక్కడున్నాయో అర్ధం అయిందా?” భగవానుడి మొహంలో చెరగని చిరునవ్వు.

ఆనందుడు నవ్వు ఆపుకోవడానికి అవస్థ పడుతూంటే, కోపం హరించుకుపోయిన యజమాని నేల మీద కూలబడిపోతూ విప్పారిన కళ్ళతో అడిగేడు, “ఇంతకీ మీరెవరు?”

ఈ సారి ఆనందుడు చెప్పాడు సమాధానం.

యే ధర్మా హేతుప్రభవా హేతుం తేషాం తథాగతోహ్యవదత్
తేషాం చ యో నిరోధో ఏవంవాదీ మహాశ్రమణః
[ఏ కారణాల వల్లైతే ధర్మం అనేది పుట్టి ప్రభవిస్తోందో, ఆ ధర్మాలకి కారణం ఇదీ అని చూపించినవాడు, ఆ కారణాలకి నివారణ తెలిపినవాడూ, మహా శ్రమణుడు ఈ తథాగతుడు.]

సంఘంలో అప్పుడే జేరిన కొత్త శిష్యుడితో, ఆనందుడు అనుసరిస్తూండగా ముందుకి కదిలాడు భగవానుడు.

********

Posted in April 2026, కథలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *