Menu Close
veeranjaneyulu-sivaratri
సీతా స్వయంవరం: ఓ రామాయణ కథ
- వీరాంజనేయులు శివరాత్రి -

ముగింపు భాగం

అడవి దేవత:

విశ్వామిత్రుని కుమారులు, వారి భార్యలు కూడా ఆశ్రమంలోనే ఉన్నారు. అందరూ కలిసి యజ్ఞం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. యజ్ఞానికి ముందు, అడవి రూపంలో ఉన్న శక్తి దేవతకు పూజ చేయాలని నిర్ణయించారు.

అది చూసిన సీత ప్రశ్నించింది—

“అడవిని దేవత అంటున్నారేమిటి, గురువుగారు?”

ప్రతీ విషయాన్ని ప్రశ్నించి, ఏది ఎందుకు చేస్తున్నామో తెలుసుకునే తత్వం సీతకు ఉపనిషత్తు చర్చల నాటి నుండే అలవడింది.

విశ్వామిత్రుడు చిరునవ్వుతో సమాధానం చెప్పాడు—

“అడవితో సహా ప్రకృతిని దేవతగా పూజించడం వల్ల మనలో వినమ్రత కలుగుతుంది తల్లీ.

ఆ వినమ్రత నుంచే ప్రకృతి పట్ల గౌరవం పుడుతుంది. గౌరవంతో చూస్తే, ప్రకృతిని మనం హక్కుగా కాదు—ప్రసాదంలా వాడుకుంటాము.

అలా కాక, ‘ప్రకృతి మనదే’ అని వస్తువులా భావిస్తే, దానిని విచక్షణలేకుండా దోచుకుంటాము, నాశనం చేస్తాము. సమతుల్యత కోల్పోయిన ప్రకృతి చివరికి మనని నాశనం చేస్తుంది. అందుకే ప్రకృతిని దేవతగా గౌరవించి పూజించాలి.”

ఆ తరువాత తమ వ్యవసాయానికి ఎంత భూమి అవసరమో విశ్వామిత్రుడు స్పష్టంగా నిర్ణయించాడు. ఆ పరిమితి దాటి అడవిని తాకవద్దని ఆదేశించాడు. అవసరమైనంత వరకు మాత్రమే అడవిని దహనం చేసి, పొలాలుగా మార్చే ఏర్పాట్లు చేయించాడు.

అడవి దేవత అనుమతిని కోరుతూ పూజ చేసి యజ్ఞాన్ని ప్రారంభించారు.

***

రాక్షసుల ఆగ్రహం - మానవుల యుద్ధం:

అడవి కాలుతున్న వాసనను పసిగట్టారు రాక్షసులు. మానవులు మళ్ళీ దురాగతానికి పాల్పడుతున్నారని వారికి స్పష్టమైంది. తమ జీవన విధానానికి ముప్పు మళ్ళీ దాపురించిందని గ్రహించగానే, వారిలో కోపం కట్టలు తెంచుకుంది. చేతికి దొరికిన కర్రలు, రాళ్లు, జంతువుల ఎముకలను ఆయుధాలుగా మార్చుకుని, మంటలు ఎగిసిపడుతున్న దిశగా పరుగులు తీశారు. యజ్ఞాన్ని ఆపడానికి, తమ ఉనికిని కాపాడుకోవడానికి, తమకు ప్రమాదం తెచ్చిన క్రూర మానవులని శిక్షించాలనే ఆవేశంతో. ముని ఆశ్రమాన్ని చుట్టుముట్టి, అడవి దద్దరిల్లేలా అరుస్తూ ఆయుధాలతో దాడి ప్రారంభించారు.

రాక్షసుల అరుపులు విని రాముడు, లక్ష్మణుడు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు గురువుల వద్ద నేర్చుకున్న యుద్ధవిద్యలను ప్రయోగించాల్సిన సమయం ఆసన్నమైందని వారికి అర్థమైంది.

తమ ధనుస్సులను సంధించి, రాక్షసులపై బాణాల వర్షం కురిపించారు. ఆ బాణాల తాకిడికి కొందరి అవయవాలు ఛిద్రమయ్యాయి. కొందరు నేలకూలి ప్రాణాలు విడిచారు.

ఆ ప్రాంతంలోని రాక్షసుల నాయకురాలు తాటకి (తాడక) — అందరికన్నా ఎత్తు, అపార బలంకలది. తమ వారి ఆర్తనాదాలను విని, ఆగ్రహంతో బాణాలు సంధిస్తున్న రామలక్ష్మణుల వైపు ఆమె దూసుకెళ్లింది.

అంతలోనే రాముడి ధనుస్సు నుండి విడిచిన ఒక బాణం, ఆమె హృదయాన్ని చీల్చివేసింది. అడవి అంతా ప్రతిధ్వనించేలా ఒక ఘోరమైన ఆర్తనాదం చేస్తూ, తాటకి ధడేలున నేలమీద కూలి మరణించింది.

ఆమె వెనకగా వచ్చిన సుబాహు అనే రాక్షసుడు రాముని మీదకు లంఘించాడు. రాముడి మరో బాణం అతనినీ అదే విధంగా నేలకూల్చింది.

తాటకి, సుబాహులతో సహా తమ వారి మరణ దృశ్యాలని చుసిన మారీచుడు అనే రాక్షసుడు భీతిల్లి వెనుతిరిగి అడవిలోకి పరుగు తీసాడు. అతని వెంటే మిగిలిన రాక్షసులూ చెదిరిపోయారు.

***

హింస - సీత ప్రశ్న - రాముడి మనసులో సీత:

అక్కడ చోటు చేసుకున్న భీబత్సం, నిర్దాక్షిణ్యమైన హింసను చూసి సీత గుండె కలవరపడింది. ఆమె కళ్లలో ఆవేదనతో —

“ఇంత హింస నిజంగా అవసరమా గురువుగారు? ముందుగానే వారిని పిలిచి, యజ్ఞం అవసరాన్ని వివరించి, ఒక పరస్పర అంగీకారానికి రావచ్చుకదా? అలా జరిగి ఉంటే ఈ రక్తపాతం ఉండేది కాదేమో…” అని బాధతో అడిగింది.

విశ్వామిత్రుడు క్షణం మౌనంగా నిలిచాడు. ఆ మౌనంలోనే ఆలోచన, ఆవేదన రెండూ కలిసిపోయాయి. ఆ తరువాత నెమ్మదిగా చెప్పాడు—

“నిజమే తల్లీ. అలా సాధ్యమైతే అంతకన్నా గొప్ప మార్గం ఇంకేముంటుంది? కానీ అడవిలో జంతువులతో కలిసి జీవించే వారి జీవన విధానం వేరు. బలప్రయోగం, హింసే వారికి తెలిసిన భాష. చర్చల ద్వారా, పరస్పర ప్రయోజనాల ద్వారా జీవించడం వారికి ఇప్పటికీ అర్థం కాలేదు. వారు కూడా మన సంస్కృతిలోని ఉపయోగకరమైన అంశాలను గ్రహించి, మనతో సంప్రదింపులు జరిపి, కలిసి జీవించడం నేర్చుకునే దాకా…ఈ హింస తప్పదేమో తల్లీ.”

హింసని చూసి ఆవేదనతో సీత అడిగిన ప్రశ్నలు, గురువు గారితో నిర్భయంగా సంభాషిస్తున్న తీరు — గమనిస్తున్న రాముడి మదిలో… సీత ఉన్నత స్థానానికి ఎదిగింది.

***

ఒక జీవశ్చవం:

యజ్ఞం విజయవంతంగా ముగిసిన తరువాత, ఒక రోజు విశ్వామిత్రుడు చెప్పాడు—

“మనం గౌతమ ముని ఆశ్రమానికి వెళదాము.”

సీత తన సహజమైన ఆసక్తి ఆపుకోలేకపోయింది.

“ఎవరు ఈ గౌతమ ముని? అక్కడికి మనం ఎందుకు వెళ్లాలి?” అని అడిగింది.

విశ్వామిత్రుడు చిరునవ్వుతో, “మార్గంలో చెప్తాను తల్లీ. పదండి,” అన్నాడు.

కోసల రాకుమారులు, విదేహ రాకుమార్తెలు, కుషధ్వజుడు గురువును అనుసరించారు. గౌతముని ఆశ్రమం ఇంకా కొంత దూరంలో ఉందనగా, దారిమధ్యలో— చిక్కి, శల్యమై, ప్రాణం ఉన్నా జీవశ్చవంలా నేలపై పడిఉన్న ఒక స్త్రీ కనిపించింది వారికి.

ఆ దృశ్యం చూసిన క్షణంలోనే రాముడు ముందుకు వెళ్లాడు. ఆమె చేయి పట్టుకుని మెల్లగా లేవదీసి, కూర్చుండబెట్టి, నీళ్లు అందించాడు.

ఆమె స్థితి చూసి సీత హృదయం కరిగిపోయింది. ఆ స్త్రీ వైపు జాలిగా చూస్తూ—

“హృదయ విదారకంగా ఉంది గురువుగారు…ఈమె ఎవరు? ఇక్కడ ఇలా ఎందుకు పడిఉంది?” అని అడిగింది.

విశ్వామిత్రుడు క్షణం ఆమెను చూశాడు. ఆ తరువాత గంభీరంగా—

“చెప్తాను. వినండి,” అని చెప్పసాగాడు.

***

అహల్య - రాతి జీవనం:

నిత్య పూజలు, దీర్ఘ తపస్సులతో గౌతమునికి మధ్య వయసు దాటింది. అహల్య అనే యుక్త వయసు రాకుమారితో అతని వివాహం జరిగింది.

అహల్యకు భర్త పట్ల అత్యంత గౌరవం, ప్రేమానురాగం.

కానీ గౌతముడు ఆమెని వివాహం అయితే చేసుకున్నాడు గానీ, ఆమెతో జీవితం పంచుకోవడం విస్మరించాడు. ప్రతి రోజు పూజలు, తపస్సులు— అవే అతని ప్రపంచం. భార్య యొక్క భావాలు, సుఖదుఃఖాలు అతని దృష్టికి రాలేదు.

యుక్త వయసులో ఉన్న అహల్య, భర్త స్పర్శ కోసం, ఒక మాట కోసం, ఒక చూపు కోసం తపించింది.

అలాంటి సమయంలో ఇంద్రుడు— యౌవనంతో, ఆకర్షణతో నిండిన యువకుడు— ఆమెకు తారసపడ్డాడు. భర్త ఆదరణకు నోచుకోని అహల్య ఆకర్షితురాలయింది. గౌతముడు ఆశ్రమంలో లేని వేళ, ఇంద్రుడు లోనికి ప్రవేశించాడు. క్షణిక మోహావేశంలో ఇద్దరూ సుఖించారు.

ఇంతలో గౌతముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అక్కడ జరిగింది తెలుసుకుని విపరీతమైన దుఃఖానికి లోనయ్యాడు. ఆ ద్రోహం అతని మనసును చీల్చేసింది. దుఃఖం కోపంగా మారింది. ఆ కోపంలో ఇంద్రుడి మగతనాన్ని తుంచేశాడు. అహల్యను ఆశ్రమం నుండి వెలివేశాడు.

భర్త పట్ల అహల్యకి గౌరవం ప్రేమ ఉన్నాయి. కానీ క్షణిక మోహావేశంతో పొరపాటు చేశానని అపరాధ భావంతో కృంగిపోయింది. ఆమె హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. భర్తను విడిచి వెళ్లలేకపోయింది. ఎప్పటికైనా గౌతముడు తన తప్పును క్షమించి తనను మళ్లీ స్వీకరిస్తాడేమో అన్న ఆశతో జీవశ్చవంలా, ఛిద్రమైన మనసుతో ఒక రాయిలా ఆ ఆశ్రమం చుట్టూనే తిరుగుతూ జీవించసాగింది.

***

పశ్చాత్తాపం - క్షమ - ప్రేమ

“ఈమే ఆ అహల్య,” రాముడి ఒడిలో సేద తీరుతున్న ఆ దీనురాలి వైపు చూస్తూ చెప్పాడు విశ్వామిత్రుడు.

సీత ఒక్క క్షణం ఆమెని గమనించింది. క్షీణించిన శరీరం, చలించిపోయిన చూపు, జీవితం చేతులార జారిపోయిన మనిషి చూపు.

“ఇది అన్యాయం గురువు గారు. ఆ పొరపాటులో ఇద్దరికీ భాగస్వామ్యం ఉంది. ఆమెను మాత్రమే దోషిని చేసి వెళ్లగొట్టడం న్యాయం కాదు. ఒక పొరపాటు వల్ల ఇద్దరి జీవితాలని దుర్భరం చేసుకోవడం తెలివైనపని కాదు కదా” ఆవేదన ఆపుకోలేక చెప్పింది సీత.

సీత మాటలు వింటూ రాముని ముఖంలో ఒక చిన్న ఆనందపు రేఖ మెరసింది. ఆమె వైపు ఆప్యాయంగా చూసాడు.

“మనుషుల తప్పులని కాక, వారి బాధలని చూసి అవగాహన చేసుకునే హృదయం! ఎంత పరిపక్వత! ఎంత మహనీయతత్వం!” మనసులోనే మెచ్చుకున్నాడు.

ఆపై రాముడు అహల్యను మెల్లగా లేపాడు. తన భుజం పట్టుకుని నిలబెట్టాడు.

“గురువు గారు… ఆశ్రమం లోపలికి వెళ్దాం. పదండి,” అహల్యను తనతో నడిపిస్తూ అన్నాడు రాముడు.

***

“మునివర్యా, పొరపాటు చేయని మనుషులు ఉండరు. పొరపాటు చేసిన ప్రతి ఒక్కరినీ వెలివేస్తే ఈ లోకంలో చివరికి మిగిలేది ఒంటరితనమే. అప్పుడు సమాజం నిలబడదు. బ్రాహ్మణుడు అనగా మనసు వికసించిన వాడు. క్షమించడం, మనుషుల్ని వారి తప్పులతో సహా అంగీకరించి వారితో కలిసి జీవించగలగడం ఆ మానసిక వికాసానికి నిజమైన నిదర్శనం.

తప్పు జరిగిందని గ్రహించి దానికి హృదయపూర్వకంగా ప్రచ్ఛాతాపం చెందిన తరువాత ఆ తప్పును మరిచిపోవడం తపస్వుల లక్షణం.

మీరు పెద్దలు. మాకు వివేకం బోధించవలసినవారు మీరు ఇలా మీ జీవితాలని, మీ హృదయాలని శిక్షించుకోవడం సమంజసమా?”

రాముడు చెప్తూ ఉండగా గౌతముని మనసుపై కప్పుకున్న అవివేకపు పొరలు ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. కఠినత్వం కరిగిపోయింది. అహంకారం జారిపోయింది. మిగిలింది పశ్చాత్తాపం, ప్రేమ.

రాముడు అహల్య చేయిని తీసుకుని గౌతముని చేయిలో మెల్లగా ఉంచాడు. ఆ దంపతులిద్దరూ ఏమి మాట్లాడకుండా కన్నీళ్లతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అది కేవలం కలయిక కాదు, విడిపోయిన రెండు ఆత్మల పునఃసంగమం.

మనసు వికసించి బ్రాహ్మణులుగా మారిన ఆ దంపతుల పాదాలకు రాముడు వినమ్రంగా పాదాభివందనం చేశాడు.

ఒకరినొకరు క్షమించి ప్రేమను గెలిపించిన ఆ దంపతుల పాదాలకు సీత కూడా నమస్కరించి ఆశీర్వాదం స్వీకరించింది.

***

సీత మనసు - మిథిలా నగరానికి ఆహ్వానం:

విశ్వామిత్రుని ఆశ్రమానికి తిరిగి వచ్చిన తరువాత సీత తన మనసులో దాగిన మాటను మెల్లగా తన చినతండ్రి కుషధ్వజునికి చెప్పింది.

ఏమీ మాట్లాడకుండా చిరునవ్వుతో సీత తలపై చేయి ఉంచి ఆ చినతండ్రి ప్రేమగా నిమిరాడు. ఆ స్పర్శలోనే సీతకు ధైర్యం దొరికింది, తన భావానికి అంగీకారం దొరికింది.

తన కుమార్తె కోరికని విశ్వామిత్రునికి నివేదించాడు కుషధ్వజుడు.

విశ్వామిత్రుడు క్షణం ఆలోచించి అర్థం చేసుకున్న చిరునవ్వుతోనే తల ఊపాడు.

తరువాత రామలక్ష్మణులని పిలిపించి —

“మిథిలా నగరానికి రావలసిందిగా జనక మహారాజు ఆహ్వానిస్తున్నారు. వెళదామా?” అని అడిగారు గురువుగారు.

రాముని ముఖం ఒక్కసారిగా వికసించింది. ఆ ఆహ్వానం వెనుక ఉన్న కారణం తనకు సులభంగా అర్థమైపోయింది. లక్ష్మణుని వైపు చూసి చిన్నగా తల ఊపి తమ అంగీకారాన్ని తెలియజేశాడు.

అలా విశ్వామిత్రుడు, కుషధ్వజుడు, విదేహ రాకుమార్తెలు, కోసల రాకుమారులు— అందరూ కలిసి మిథిలా నగరానికి ప్రయాణమయ్యారు.

***

నాలుగు జంటలు:

మిథిలా నగరంలో వారికి జనక మహారాజు ఘనస్వాగతం పలికాడు. తమ్ముడి ద్వారా తెలిసిన విషయాన్నిసీతాదేవితో స్వయంగా ప్రస్తావించి ఆమె మనోగతాన్ని తెలుసుకున్నాడు. అలాగే రామునితో కూడా మాట్లాడి అతని మనసులోని భావాన్ని గ్రహించాడు. ఇద్దరి హృదయాలు ఒకే దిశగా ఉన్నాయని తెలుసుకుని జనకుడు మిక్కిలి సంతోషించాడు.

అంతలో అతని మనసులో మరో ఆలోచన మెదిలింది. దశరధునికి నలుగురు కుమారులు. తమ కుటుంబంలోనూ నలుగురు కుమార్తెలు. ఆ ఆలోచనని ముందుగా తన కుమార్తెలతో పంచుకుని వారి అంగీకారం తీసుకున్నాడు. తరువాత దశరధునికి సందేశం పంపించాడు.

దశరధుడు ఆ వార్త విని ఆనందంతో ఉబ్బితబ్బిబై తాము స్వయంగా మిథిలకు వస్తున్నామని కబురు పంపించాడు.

అలా సీతా–రాముల వివాహంతో పాటు మాండవి–భరతుడు, ఊర్మిళ–లక్ష్మణుడు, శ్రుతకీర్తి–శత్రుజ్ఞుల వివాహాలు కూడా ఒకేసారి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

***

గొడ్డలి సభలోకి ప్రవేశించింది:

విశ్వామిత్రుడు చేసిన యజ్ఞం గురించి, ఆ ఆశ్రమంలో జరిగిన హింసాకాండ గురించి పరశురామునికి తెలిసింది. ప్రకృతి–సంస్కృతుల మధ్య ఉన్న సమతుల్యత మళ్ళీ భగ్నమైందని భావించి అతని హృదయం ఆవేదనతో నిండిపోయింది.

పవిత్రమైన శివధనుస్సుని విరిచిన విశ్వామిత్రుడి మీద, ఆ కార్యానికి ఆయుధాలైన రామలక్ష్మణుల మీద పరశురామునికి తీవ్ర ఆగ్రహం కలిగింది.

వారు ఇప్పుడు మిథిలలో ఉన్నారని తెలిసి, వారిని సంహరించి మళ్ళీ సమతుల్యతను స్థాపించాలనే సంకల్పంతో పరశురాముడు మిథిల దిశగా బయలుదేరాడు.

***

పరశురాముడు ఆగ్రహంతో తన గొడ్డలిని భుజాన వేసుకుని జనకుని సభలోకి ఉగ్రంగా ప్రవేశించాడు.

“పవిత్రమైన శివధనుస్సుని విరిచిన వారు ఎక్కడ? చెట్లను నరికినట్లే వాళ్ళను కూడా నరికి పడేస్తాను!” అని గర్జించాడు.

సభలో ఉన్నవారందరూ ఏం జరుగుతుందోనన్న భయంతో మౌనంగా వణికిపోతున్నారు.

పరశురాముడిని శాంతపరచడానికి జనక మహారాజు లేవబోయాడు. కానీ విశ్వామిత్రుడు ఆయనను ఆపి నిశ్శబ్దంగా రాముడి వైపు చేయి చూపించాడు.

రక్తంతో నాటిన బీజాలు - జారిన అహం:

రాముడు నెమ్మదిగా లేచాడు.

“నీ కోపాన్ని అదుపుచేయలేక నువ్వే సమతుల్యం తప్పావు పరశురామా. అదుపులేని నీ ఆగ్రహంతో ఎందరో రాజులను చంపావు. వారి శరీరాలు నేలలో కలిసిపోయాయి. కానీ వారి కుటుంబాల హృదయాల్లో నువ్వు ఆక్రోశాన్ని, పగని బీజాలుగా నాటావు.

ఏ సమాజంలోనైనా తప్పులు జరుగుతాయి. వాటిని క్షమించినప్పుడే మనుషులు కోపావేశాల నుండి విముక్తి పొందగలరు. సమాజం శాంతిగా ముందుకు సాగుతుంది. ప్రేమ, సంతోషం, పరస్పర నమ్మకం ఉంటేనే సంస్కృతి పరిఢవిల్లుతుంది.

అలా కాక పొరపాటు చేసిన ప్రతివాడిని ‘న్యాయం’ పేరుతో సంహరిస్తూ పోతే సమాజం శాశ్వతంగా ఆక్రోశం, ఆవేశం, పగతోనే మండుతూ ఉంటుంది.

నువ్వు కోరుకున్న సమతుల్యం ఇదేనా పరశురామా? భయంతో నడిచే సమాజమా? రక్తపాతంతో నిలిచే ధర్మమా?

ఆగ్రహానికి వశమైన నువ్వు బ్రాహ్మణుడివి ఎలా అవుతావు?”

పరశురాముడి కళ్ళలోకి నేరుగా చూస్తూ గంభీరంగా ప్రశ్నించాడు రాముడు.

పరశురాముడు ఖంగుతిన్నాడు— అంతవరకు తన కోపాన్ని చూసి భయపడి పారిపోయిన రాజులనే చూశాడు. కానీ ఈ యువకుడు ఇసుమంతైనా తొణకకుండా ఆత్మవిశ్వాసంతో పరశురాముడి తప్పుని అతడికి అర్హమయ్యేలా చెప్పాడు.

సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యం, సంభ్రమంతో ఏమి జరుగుతుందా అని ఉత్కంఠతతో చూస్తూ నిలబడ్డారు.

రాముడి బోధ పరశురాముడి మనసుని తాకింది. అతని మనసుని కప్పిన క్రోధం అనే నల్లని మేఘాలు తొలగి వివేకం నెమ్మదిగా ప్రకాశించింది. అతని చేతిలో ఉన్న గొడ్డలి జారి నేలమీద పడింది. దానితోపాటే అతని అహం కూడా జారిపోయింది.

అప్పటివరకు క్రోదాంధకారంలో ఉన్న తన మనసులో వెలుగు నింపిన రాముడు– శ్రీరాముడై, అవతార పురుషుడై గోచరించాడు పరశురాముడికి.

తన భుజానికి వేలాడుతున్న సారంగం అనే ధనుస్సు తీసి రాముడికి ఇస్తూ –

“నా అవివేకాన్ని క్షమించు రామా. అత్యంత శక్తివంతమైన ఈ ధనుస్సుతో ఇక నాకు పనిలేదు. వివేకమూర్తివైన నీ వద్ద ఉండటమే దీనికి సార్ధకత” అని చెప్పి తపస్సు చేసుకోవడానికి అక్కడి నుండి నిష్క్రమించాడు.

***

పరస్పరం కోరి వరించిన సీతా రాములు:

Sitarama-kalyanam

అయోధ్య నుండి దశరధుడు తన కుమారులు భరతుడు, శత్రుజ్ఞులతో సహా మిథిలా నగరానికి చేరుకున్నాడు.

కోసల రాకుమారులు నలుగురు, విదేహ రాకుమార్తెలు నలుగురి వివాహాలు రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

పెళ్లి కుమారులుకు మరియూ పెళ్లి కుమార్తెలకూ పసుపు నీళ్లతో మంగళ స్నానాలు చేయించారు. పెళ్లికుమారులకు తెల్ల వస్త్రాలు, పెళ్లికుమార్తెలకు ఎర్ర వస్త్రాలు కట్టబెట్టారు.

పెద్దల సాక్షిగా ప్రతి జంట ఏడు అడుగులు వేస్తూ ఏడు అంశాలు పంచుకుంటామని ప్రమాణం చేసింది — ఇల్లు, అగ్ని, నీరు, సంపద, సుఖం, పిల్లలు, సంభాషణ.

భక్తితో చేసిన నైవేద్యాలను ఆవులకు, కుక్కలకు, కాకులకు, పాములకు సమర్పించారు — అవి కూడా తమ జీవనంలో భాగమే అని గౌరవంగా గుర్తుచేసుకుంటూ.

వివాహంలో జరిగే ప్రతి ఆచారాన్ని “ఇది ఎందుకు చేస్తున్నారు?” అని అడిగి తెలుసుకుంటూ, అర్థం చేసుకుని అత్యంత శ్రద్ధతో ఆచరించింది సీత.

***

“ఆ విధంగా సీతాదేవి తనకి నచ్చిన, తాను మెచ్చిన శ్రీరాముడిని తానే స్వయంగా వరించింది. అందుకే సీతా స్వయంవరం అన్నారు.” అని సీతారాముల కల్యాణ కథని ముగించాడు వెంకయ్య.

నెమ్మదిగా మనవరాలి వైపు చూసాడు — ‘ఎలా ఉంది?’ అన్నట్లు. మనవరాలి కళ్లలో మెరిసిన ఆనందమే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పింది.

***

నిజమైన రామాయణం — అసలు ప్రశ్న

కథ అంతా పిల్లలతో పాటు అల్లుడు గారు కూడా ఆసక్తిగా విన్నారు. పిల్లలు నిద్రపోయిన తరువాత అల్లుడు నెమ్మదిగా అడిగాడు —

“మామ గారు, మీరు చెప్పిన రామాయణ కథ బాగుంది. కానీ నిజమైన రామాయణంలో అలా లేదు కదా. మరి పిల్లలకి ఎందుకు అలా చెప్పారు?”

వెంకయ్య చిరునవ్వుతో అడిగాడు —

“నిజమైన రామాయణం అంటే నీ ఉద్దేశ్యంలో ఏది అల్లుడు? వాల్మీకి రామాయణమా, ఆధ్యాత్మ రామాయణమా, రామచరిత మానసా, కంబ రామాయణమా, జైన రామాయణమా, బౌద్ధ రామాయణమా, థాయ్ రామాయణమా, ఇండోనేషియా రామాయణమా, రంగనాథ రామాయణమా, మొల్ల రామాయణమా, మహాభారతంలోని రామోపాఖ్యానమా? ఇలా సుమారు మూడు వందల రామాయణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిల్లో కథలన్నీ ఒకేలా లేవు.”

ఆశ్చర్యపోయాడు అల్లుడు.

“ఇన్ని రకాల రామాయణాలున్నాయా! అయితే వాటిలో ఏది నిజమైన రామాయణం మామగారు?”

వెంకయ్య కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పాడు —

“మన సంప్రదాయ కాలగణన ప్రకారం రామాయణం త్రేతా యుగంలో జరిగింది — అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. కొందరు కట్టిన ఆధునిక లెక్కల ప్రకారం చూసినా ఈ కథ కనీసం కొన్ని వేల సంవత్సరాల నాటిది.

ఒక మాట ఒకరి నుండి ఒకరికి, వారి నుండి మరొకరికీ అలా పదిమందిని దాటే సరికి ఆ మాట స్వరూపం స్వభావం మారిపోవడం మనకి తెలుసు. అలాంటప్పుడు వందల తరాలు దాటి మనవరకు వచ్చిన రామాయణం ఎన్నో మార్పులకి గురై, ఎన్నో రూపాలు సంతరించుకుని ఉండాలి. అన్ని రూపాల్లో ఏది పూర్తిగా నిజమైనదో చెప్పడం సాధ్యమా అల్లుడు?”

కొంచెం ఆగి, నెమ్మదిగా కొనసాగించాడు —

“రామాయణం నిజంగా జరిగిందా? జరిగితే ఏ కాలంలో జరిగింది? ఇన్ని వందల రామాయణాల్లో ఏ కథ నిజమైనది?... ఇటువంటి ప్రశ్నల వల్ల మనకి ప్రయోజనం లేదు.

మనం వేసుకోవలసిన ప్రశ్నలు ఏవంటే…

‘రామాయణ కథ నుండి మనమేమి నేర్చుకున్నాం? నేర్చుకున్న విలువలను మన జీవితాల్లో ఆచరిస్తున్నామా? మన మనసు కొంచెమైనా వికసించిందా?’

ఇవి నిజంగా మనకి ఉపయోగపడే ప్రశ్నలు.” అని చిరునవ్వుతో చెప్పి ముగించాడు.

****శుభం భూయాత్****

Posted in April 2026, కథలు

3 Comments

  1. మహేష్ బాబు ఉండవల్లి

    ఎన్ని కష్టాలు వచ్చినా సత్యవాక్ పాలన అనే ధర్మాన్ని పాటించిన రాజా హరిశ్చంద్ర వంశం లో పుట్టిన శ్రీరాముడు ధర్మాచరణాన్ని పాటించాడు. వాళ్ల వారసులమే మనం. వీరాంజనేయులు గారు మన అందరి వారసత్వ సంపదని మరొకసారి మనకి అందంగా అలకరించి గుర్తు చేసి నందుకు ధన్యవాదములు. మరిన్ని ముత్యాలు మాకోసం అందిస్తారని ఆశిస్తూ…

  2. Srujana

    A different point of view from what I’ve known Babai. మునివర్యా, పొరపాటు చేయని మనుషులు ఉండరు. పొరపాటు చేసిన ప్రతి ఒక్కరినీ వెలివేస్తే ఈ లోకంలో చివరికి మిగిలేది ఒంటరితనమే. Felt so good to read many good points like above.

  3. డా. కె. శివబాబు, జహీరాబాద్

    జరిగిన కాలం, వాస్తవ కధలా, కల్పనలా ఆనే చర్చ కంటే, ఆ సారాంశం మానవ వికాసానికి దోహదం చేస్తుందా లేదా అన్న అంశం ప్రధానమంటూ ముగింపులో చెప్పిన తీరు ప్రశంసనీయం. వీరాంజనేయులు గారికి ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *