దూరపు కొండలు నునుపు
ఒక పల్లెటూరిలో రోహిత్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలసి నివసించేవాడు. అతడు వ్యవసాయపనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు.
అయితే, కొన్నాళ్ల తర్వాత అతడు సోషల్ మీడియా మాయలో పడ్డాడు. గల్ఫ్ దేశాల్లోని ఖరీదైన కార్లు, రంగురంగుల భవనాల ముందు ఇతరులు దిగిన ఫోటోలను చూసి ఆకర్షితుడయ్యాడు.
“ఇక్కడ ఎండలో కష్టపడితే వచ్చేది అరకొర ఆదాయమే. అదే విదేశాలకు వెళ్తే లక్షలు సంపాదించవచ్చు, రాజభోగం అనుభవించవచ్చు” అని కలలు కనేవాడు.
తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు ఎంత వారించినా వినలేదు. ఆఖరికి వారు చేసేది లేక, ప్రాణం కంటే మిన్నగా చూసుకునే పొలంలో కొంత భాగాన్ని అమ్మి, కొడుకు భవిష్యత్తు కోసం ఏజెంట్‌కు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారు.
గల్ఫ్ చేరుకున్న రోహిత్ ఎడారి ఎండలో, నిప్పుల కొలిమిని తలపించే భవన నిర్మాణ పనుల్లో చేరాల్సి వచ్చింది.
మరోవైపు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. సైరన్ మోగిన ప్రతిసారీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, చీకటి బంకర్లలో గంటల కొద్దీ బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చేది.
తన సొంత ఊరిలో ప్రశాంతంగా గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకునేవాడు.
ఒక రాత్రి భయంకరమైన బాంబు పేలుడు శబ్దానికి రోహిత్ వణికిపోయాడు. వెంటనే తండ్రికి ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చాడు.
“నాన్నా.. ఇక్కడ నరకం కనిపిస్తోంది. నేను ఊహించిన రంగుల లోకం ఇది కాదు. నేను పెద్ద పొరపాటు చేశాను నాన్నా!” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
తండ్రి భారమైన స్వరంతో “నేను అప్పుడే చెప్పాను కదా బాబూ! ‘దూరపు కొండలు నునుపు’ అని. నువ్వు ఆ ఫోటోలు చూసి మోసపోయావు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు, ధైర్యంగా అక్కడి నుండి బయటపడి ఇంటికి వచ్చే ప్రయత్నం చేయి. మనం మళ్ళీ మన పొలంలోనే మన కష్టాన్ని నమ్ముకుని బతుకుదాం.” అన్నాడు తండ్రి.
తండ్రి మాటలతో ధైర్యం తెచ్చుకున్న రోహిత్, అతికష్టం మీద కొన్ని నెలల తర్వాత స్వగ్రామం చేరుకున్నాడు. తిరిగి తన సొంత పొలంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసుకుంటూ, తనకున్న దానితోనే తృప్తిగా, హాయిగా జీవించడం మొదలుపెట్టాడు.
అంతేకాకుండా, తన అనుభవాలను ఊరిలోని యువకులకు వివరించి, పొరుగు దేశాల రంగుల లోకాన్ని చూసి మోసపోవద్దని హితవు పలికాడు.
“దూరపు కొండలు నునుపు” అనేది ఒక సామెత.
మనం దూరం నుండి కొండలను చూసినప్పుడు అవి ఎంతో సాఫీగా, పచ్చగా, అందంగా కనిపిస్తాయి. కానీ ఆ కొండ దగ్గరకు వెళ్లి చూస్తేనే తెలుస్తుంది.. అక్కడ అంతా రాళ్లు, రప్పలు, ముళ్ల పొదలు ఉంటాయని. అలాగే, బయటి వ్యక్తుల జీవితాలను దూరం నుండి చూసి వారు చాలా సుఖంగా ఉన్నారని భ్రమపడకూడదు. వాస్తవంలో ప్రతి చోటా కష్టనష్టాలు ఉంటాయని, ఉన్న దానిలోనే తృప్తి చెందాలని ఈ సామెత తెలియజేస్తుంది.
రచయిత పరిచయం
నా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి.
– కాశీ విశ్వనాథం.