Menu Close

కదంబం - సాహిత్యకుసుమం

చేజారిన కలం
– రాఘవ మాస్టారు కేదారి –

తాను మానవ భూతాలపై
మది దానవ బాగోతాలపై
కవిత్వం వ్రాయలని
నిజత్వం తెలపాలని

ఇటు మలి సంధ్యా సమయంలో
అటు నీలి సముద్ర కెరటాలలో
కవి చెలియలికట్టపై కూర్చోని
అలా నిర్మలాకాశం వైపు చూస్తూ

కలానికి పదును పెడుతున్నాడు
జనాన్ని చూసి ఆలోచిస్తున్నాడు
తనలోతానే ఆవేశిస్తున్నాడు

అతని మనసు నీటి అలల గాలి స్వరాల
నీతి అవినీతి గీతాలతో
జీవన కెరటాల నురగల మీద తేలుతూ
నాట్యమాడుతుంది

అతని తర్కం కనిపిస్తున్న
భూమ్యాకాశాల అంచున
భౌతిక అభౌతిక భావ అభావ వాదాల
సరళరేఖా తీరపు దృశ్యాల బాట చూస్తుంది

సూర్యుడిక అస్తమిస్తున్నాడు
చీకటి రాకాసి ఆకసాన నల్లని ఆశల
తెరను కళ్ళ పైకి లాగుతూ ఉంది
సముద్రం నిరాశల ఆవులింతలు పడుతుంది


లేచీకటిలో
ఆలోచనలో
కవిగారి కలం చేజారింది
కవి గారి బలం చేజారింది

అతని ఆలోచనలు
అతని ఆరాధనలు

నిశ్శబ్ద సముద్ర గర్భంలో
నిరంతర సత్యాన్వేషణలో
సమసమాజ రహస్యాల కోసం
అగాధ వలయంలో శోధిస్తున్నాయి

********

Posted in April 2026, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *