Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
కవిత
కం. అందమగు భావలలనలు
      పొందుగఁ బలుచందములను(1) పూబంతులతో
      డెందముల దొంగిలించుచు
      స్పందనరంగమున నాడఁ జక్కని కవితౌ
            (1) రకరకముల ఛందస్సులు అనే 271

ముగురమ్మలు
ఉ. హేమకిరీటధారిణులు నిందుముఖుల్ ఘనకేశపాశినుల్
     కోమలకంబుకంఠకుచకుంభలసన్మణిహారభూషితల్
     సామజగామినుల్ దివిజసన్నుతపాదసరోజ లంబికా
     శ్రీముఖవాసినీత్రయ(1) మశేషశుభమ్ముల నందఁజేయుతన్
            (1) పార్వతీలక్ష్మీసరస్వతీత్రయము 272

కవిత్వసేవ
పం. చతుర్విధంబులౌ కవిత్వసాధనన్ భజించితిన్
       చతుర్ముఖాదిదేవతాగణంబులన్, దరించితిన్
       బ్రతిప్రయోగమందు వాణి వాక్కునన్ మనంబునన్
       బ్రతిక్షణంబు నిల్చి పల్క, నాది లేదు లేశమున్ 273

సీతమ్మ
ఉ. పట్టెద రామభూవరునిభామిని సీతమ పాదముల్, మదిన్
     గట్టెద భక్తిపాశముల గట్టిగ నా యమ కాలివ్రేళ్ళకున్,
     జుట్టెద రామనామమును ఝుమ్మను తుమ్మెద నౌచు నంఘ్రులన్,
     బెట్టెద జోతపూవు(1) లట, విశ్వమయీప్రియనందనుండనై
            (1) నమస్సుమములు 274

శ్రీరాముఁడు
ఉ. దాఁచఁగ శక్యమా కరుణ? దాసజనావనపాలనవ్రతా!
     మేచకనీలగాత్ర! మము మీరలుగాక మఱెవ్వ రెప్పుడేన్
     బ్రోచెదరయ్య? రామ! రఘుపుంగవ! సత్యవచస్క! ధర్మమే
     మోచకసుందరాకృతిని ముచ్చట గొల్ప భవత్స్వరూపమౌ 275

మ.కో. ప్రావృడంబుదగాత్రరంజితభక్తమానసనర్తకా!
         పావకార్యమచంద్రబీజసువర్ణయుక్తధరాత్మజా
         పావనీశ్వరతారణాసమభవ్యలక్షణలక్ష్మణా!
         రావె కావఁగ, నీవ కావె శరణ్య మంబుధివందితా! 
భావము-
       వర్షాకాలపుమేఘమువలె నీలమైన శరీరముచేత రంజింపబడిన
       భక్తుల మనస్సులలో నర్తించువాడా! అగ్నిబీజమైన రకారము,
       సూర్యబీజమైన ఆకారము, చంద్రబీజమైన మకారములు అను
       మంచి అక్షరములతో కూడి (ర+ఆ+మ), సీతాదేవి, మారుతి,
       శివులను తరింపజేసే, సాటిలేని శుభలక్షణములు కలిగిన పేరు
       (రామ)కలవాడా! మమ్ము కాపాడడానికి రమ్ము. మమ్ములను
       రక్షించేవాడవు నీవే కదా, సాగరముచేత నమస్కరింపబడిన రామా! 276

రామనామము
అష్టదళపద్మబంధసుదర్శనవృత్తగర్భమత్తకోకిల
         మానవోత్తమనామమా! శివమానితాక్షరయుగ్మమా!
         మానదానిలి(1)సత్త్వమా! సురమానవాళిశరణ్యమా!
         మానసాద్భుతదీపమా! విని మానఁ గీర్తన సాధ్యమా?
         మానమస్సుమగమ్యమా! నిలుమా నివేశనిధానమా!
                  (1) గౌరవించుచున్న ఆంజనేయుని
Posted in April 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *