Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

రామానుజాచార్యుల సిద్ధాంతం

ఉపనిషత్తులు బోధించేది అద్వైతమే. ప్రపంచంలోని ఆస్తిక మతాలన్నిటిలోనూ ఉన్నది ద్వైతమే, అయితే సనాతన ధర్మంలోనే అద్వైతం ఒక ప్రత్యేక శాఖలా ఉన్నది. అద్వైతం చెప్పే నిర్గుణ నిరాకార బ్రహ్మాన్ని అనుభంలోకి తెచ్చుకోవడం అత్యంత కష్టమైన పని. అనుభవం మాటటుంచితే కనీసం ఆరాధించడం కూడా కష్టమే. అందుకే రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని, మధ్వాచార్యులు ద్వైతాన్నీ బోధించారు. రామానుజాచార్యులు ఆధ్యాత్మికంగా విశిష్టాద్వైతాన్ని, శరణాగతిని ప్రచారం చేయడమే కాకుండా సర్వమానవ సమానత్వం కోసం పాటుబడ్డారు.

వేదాలకు తప్పుడు అర్ధాలను కల్పించి యజ్ఞయాగాదులను భ్రష్టు పట్టించిన స్థితిలో బుద్ధభగవానుడు అవతరించి అహింసయే పరమ ధర్మమని చెబుతూ అష్టాంగమార్గమనే ప్రజ్ఞ, శీల, సమాధులను బోధించి మానవాళికి దుఃఖ నివారణ మార్గమును చూపించారు. తరువాతి కాలంలో బౌద్ధంలో కర్మకాండ పెరిగి నైతికత కరువైపోయిన కాలంలో అవతరించిన ఆది శంకరాచార్యులు అద్వైత ప్రభోధమును గావించి ఉపనిషద్ ధర్మాన్ని పునరుజ్జీవింపజేశారు. "అహం బ్రహ్మాస్మి" అనే శ్రుతివాక్యముకు అపార్థములను కల్పించి అద్వైతాన్ని భ్రష్టు పట్టిస్తున్న కాలంలో శ్రీ రామానుజాచార్యులు మానవజాతి ఉద్ధరణకు క్రీ.శ 1017లో శ్రీ పెరంబదూరులో ఉదయించారు. శ్రీ రామానుజాచార్యులకు పెక్కు శతాబ్దాలకు పూర్వం తమిళదేశాన ద్వాదశాళ్వారులు అవతరించి , వేదాంత సారమును తమిళ పాశురములు, కీర్తనల ద్వారా గానము చేసి భక్తి, శరణాగతి మార్గమును మానవాళికి చూపెట్టారు. పదవ శతాబ్దములో శ్రీనాథమునులు, యమునాచార్యులు ఆళ్వారుల రచనలను క్రోడీకరించి భక్తి, శరణాగతి మార్గమును పునరుద్ధరించుటకు పూనుకున్నారు. ఈ వైష్ణవ సంప్రదాయముకు శాశ్వత రూపము ఒసంగినవాడు శ్రీ రామానుజుడు. వీరు మునిత్రయములో మూడవవారు.

రామానుజాచార్యులు రచించిన శ్రీ భాష్యము విశిష్టాద్వైత తత్వాన్ని వివరిస్తుంది. సనాతన ధర్మానికి ప్రమాణం శ్రుతులు అనగా వేదాలు. పండితులు వేదాలకు అనుగుణంగానే మాట్లాడుతారు. అది కుదరనప్పుడు వేదాలను సమన్వయం చేసుకుంటూ మాట్లాడుతారు. ఆదిశంకరాచార్యులు వేదాలకనుగుణంగా అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. రామానుజాచార్యులు వేదాలకు తమ సిద్ధాంతాన్ని సమన్వయపరిచారు.

విశిష్టాద్వైత సిద్ధాంతాలలో భక్తి, శరణాగతికి ప్రాధాన్యతనిచ్చారు. నిరాకార, నిర్గుణ బ్రహ్మం భక్తికి అనుకూలమైన దైవ స్వరూపం కాదని రామానుజుల సిద్ధాంతం. పురాణేతిహాసాలన్నిటిలోనూ పరమాత్మను సగుణ సాకార తత్త్వం అన్నపుడు పరమాత్మకు రూపంగానీ, గుణంగానీ లేవంటం అసంగతం. శంకరుల నిరాకార బ్రహ్మం ఒక శూన్యం లాంటిదని, అది బౌద్ధుల శూన్యవాదానికి చేరువగా ఉందని, అది ఆమోదయోగ్యం కాదని రామానుజుల అభిప్రాయం. పరమాత్మ నిరాకార, నిర్గుణుడైనపుడు ఆయన ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణాలకు అందని తత్వమే అవుతాడు. ఏ ప్రమాణానికి అందని తత్వాన్ని ఉందని నమ్మడం, పూజించడం సాధ్యం కాదు.

అవ్యక్త బ్రహ్మం మీద ఆసక్తితో చేసే సాధన కష్టతరమైనది. దేహాభిమానులకు అవ్యక్త బ్రహ్మ ప్రాప్తి కష్టమే అని భగవద్గీతలో భగవానుడు కూడా అన్నాడు.

"ఏకమేవాద్వితీయం" అనే శృతి వాక్యం ఉన్నది బ్రహ్మం ఒక్కటే అంటుంది. విశిష్టాద్వైతం శృతి సమన్వయంగా ఈ విధంగా చెబుతుంది :- పరమాత్మ, జగత్తు, జీవుడు అనే మూడు తత్వాలున్నాయి. ప్రళయకాలంలో విశ్వం, జీవుడు అనేవి రెండూ పరమాత్మలోనే కలుస్తాయి. ఈ విధంగా చూసినపుడు ఇది అద్వైతమే. అయితే దీనికో విశిష్టత ఉంది. జగత్తు, జీవము పరమాత్మ శరీరములు. జగత్తు, జీవము బ్రహ్మానికి భిన్నములేగానీ బ్రహ్మాధీనములై ఉంటాయి. బ్రహ్మానికి వేరుగా వీటికి అస్తిత్వము లేదు. ఈ విధంగా రామానుజాచార్యుల సిద్దాంతం అద్వైతమే గానీ అది యొక విశేషముతో కూడి ఉన్నది.

శ్రీ రామానుజాచార్యులు తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన సందేశాలు చాలా గొప్పవి :-

ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రథమ కర్తవ్యం.

దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.

మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.

ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

శ్రీ రామానుజాచార్యులు శ్రీరంగంలో తిరుమంత్రం గురించి చేసిన ఉపన్యాసం చరిత్రాత్మకమైనది. ఈ ఉపన్యాసంలో రామానుజాచార్యులు ఈ విధంగా అన్నారు :-

తిరుమంత్రోచ్చారణకు సర్వులకు సమానహక్కు గలదు. దీనికి జాతి, కుల, వృత్తి, భాషలు అడ్డంకులు కానేరవు. భగవచ్ఛక్తి సర్వాంతర్యామి, సర్వవ్యాపకము... అని విశ్వసించు వారెల్లరు వైష్ణవులే.

తిరుమంత్రము వినండి, ఉచ్ఛరించండి, ఎల్లవేళలా జపించండి. కానీ తిరుమంత్రార్థమును గమనించండి. అర్థము తెలియని మంత్రము వల్ల ప్రయోజనము లేదు.

తిరుమంత్రములో ఎనిమిది అక్షరములు, మూడు పదములు ఉన్నవి. 'అ' కార, 'ఉ' కార, 'మ' కారములతో కూడినది 'ఓం' ... 'అ' కారము సర్వాంతర్యామియగు ఈశ్వర శక్తిని సూచిస్తుంది, 'మ' కారము జీవాత్మను సూచిస్తుంది, 'ఉ' కారము అచిత్ ను సూచిస్తుంది.

ఈ తత్వత్రయ జ్ఞానమును అర్థము చేసుకున్నప్పుడు మానవుడు తన్ను తానెరుగుతాడు. తన్ను తానెరుగుట యనగా స్వార్ధరాహిత్య భావమున లవరచుకొనుటయే. "నారాయణ" అను పదము సర్వాంతర్యామి అను భావముగలది. సర్వమును, సర్వమునందుండు ఈశ్వర శక్తిని ఈ పదము తెలుపుతుంది. విశ్వము, ఈశ్వరుడు ఈ రెండిటి సమ్మేళమును "నారాయణ" అను పదం తెలుపుతుంది. ఇట్టి విశ్వ విశ్వేశ్వర సమ్మేళమునకు ప్రణమిల్లుచున్నాను అని "నమో " అను పదము తెలుపుచున్నది.

శ్రీ రామానుజాచార్యులు ప్రచారం చేసిన శ్రీ వైష్ణవం అంటే ఏంటంటే సర్వాంతర్యామి యగు వైష్ణవ శక్తి శరీరమునందు ఉన్నదని జ్ఞానముతో జీవుడు శరణాగతియై ఆనందమయుడై లోకకళ్యాణార్థమై జీవించుట. శ్రీ రామానుజాచార్యులు స్థాపించిన మతము సుళువుగా ఆచరించదగినది.

*ఓం నమో నారాయణాయ*

Posted in April 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *