Menu Close
Radhika Nori
రాధికారుచిరం
రాధిక నోరి

స్థితిస్థాపకత

ఈ యుగం చాలా అనిశ్చితి, అంటే uncertainity తో నిండివుంది. క్షణం క్షణం రంగులు మార్చే ఈ ప్రపంచంలో రకరకాలైన ఒత్తిడులు కూడా వున్నాయి. అలాంటప్పుడు ఏ నిముషంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం కోరుకున్నది జరగకపోవటానికి, అనుకోనిది జరిగి మనం కింద పడి కాళ్ళు విరగ్గొట్టుకోవటానికి కూడా చాలా అవకాశం వుంది. మరి అప్పుడు కింద పడ్డాము అని బాధపడాలా? ఆ బాధలో నా ఖర్మ ఇంతే అని అలాగే చతికిలపడిపోవాలా? లేక ప్రయత్నం చేసి పైకి లేచి, ఎలాగో అలాగ కష్టపడి ఆ పని పూర్తి చెయ్యాలా? ఊఁ ... దీనికి సరైన సమాధానం మీ అందరికి తెలుసు. అవునా? దీన్నే స్థితిస్థాపకత అంటారు.

పోనీ ఈ పదాన్ని ఇంగ్లీషులో చెప్తే మీకు తొందరగా అర్ధం అవుతుంది అంటే, అలాగే చెప్తాను. ఎందుకంటే, ధూమశకటం అనే బదులు train అంటే తొందరగా అర్ధం అయినట్లు దీన్ని కూడా మీ కోసం ఇంగ్లీషులో చెప్తే అప్పుడు తొందరగా అర్ధం అవుతుందేమో! దీన్ని Resilience అంటారు. ఇంకొంచెం విపులంగా చెప్పాలంటే ఏదన్నా ఓటమి లభించినప్పుడు కృంగిపోకుండా, రెట్టింపు పట్టుదలతో పరిశ్రమ చేస్తూ మళ్ళీ లేచి నిలబడి ఆ పనిని విజయవంతంగా సాధించటాన్ని Resilience, అంటే, తెలుగులో స్థితిస్థాపకత అంటారు. అంటే పడి లేవటం అన్నమాట. ఓడిపోయి గెలవటం అన్నమాట. అవునా? మరి జీవితం అన్న తర్వాత కింద పడకుండా, ఓడిపోకుండా ఎవరుంటారు చెప్పండి? కానీ కింద పడిన తర్వాత మళ్ళీ పైకి లేవడంలోనే గొప్పతనం వుంది కదా! మనిషి పెరుగుదలలో అసలు ఓటమి చాలా ప్రధాన పాత్రని వహిస్తుందని, స్థితిస్థాపకతని కూడా అదే మనిషిలో పెంచుతుందని అమెరికా మాజీ అధ్యక్షులు Obama గారి భార్య Michelle Obama అన్నారు. ఆవిడే కాదు, South Africa అధ్యక్షులు Nelson Mandela గారు కూడా అలాంటి మాటలే అన్నారు. నా విజయాలను చూసి నన్ను అంచనా వేయకండి, ఎన్నిసార్లు కింద పడ్డాను, మళ్ళీ ఎన్నిసార్లు పైకి లేచాను అన్న విషయాన్ని బట్టి మాత్రమే నన్ను అంచనా వేయండి అని ఆయన అన్నారు.

కొంతమంది స్థితిస్థాపకత అంటే శారీరక దృఢత్వం అని లేక మనోభావాల అణచివేత అని అనుకొంటారు. స్థితిస్థాపకత వున్నవాళ్ళకి అసలు నొప్పి అన్నదే తెలీదు, వాళ్ళు రాళ్ళలాంటి మనుషులు అని ఇంకొంతమంది అనుకుంటారు. కానీ అదేదీ నిజం కాదు. స్థితిస్థాపకత వున్నవాళ్ళు కూడా మాములు మనుషులే! వాళ్ళకి కూడా అందరిలాగే బాధలు, నొప్పులు, కన్నీళ్ళు, అన్ని వుంటాయి. కానీ మాములు మనుషులకి, వాళ్ళకి ఒక్క విషయంలో మాత్రం తేడా వుంది. అది ఏమిటంటే స్థితిస్థాపకత వున్నవాళ్ళు కష్టాలలో కృంగిపోకుండా, వాటిల్ని పరిష్కరించడానికి రెట్టింపు పట్టుదలతో ప్రయత్నిస్తారు. అలా ఆలోచిస్తే వారు మానసికంగా దృఢత్వం కలవారు అని చెప్పచ్చు. అందుకే ఎప్పుడూ పరాజయం పొందకపోవటం గొప్ప కాదు, పరాజయం పొందినప్పుడల్లా మళ్ళీ విజయం కోసం ప్రయత్నించడమే గొప్ప అని Confucius అనే చైనాకు సంబంధించిన ఒక తత్వవేత్త అన్న మాట ఇప్పుడు నాకు గుర్తు వస్తోంది.

అయితే ఈ స్థితిస్థాపకత ఎలా వస్తుంది? పుట్టుకతోనే వస్తుందా? ఒకవేళ రాకపోతే ఆతర్వాత దీన్ని మనం ఎలా అలవాటు చేసుకోగలం? ఈ ప్రశ్నలకి సమాధానం ఆలోచిస్తే నాకేమనిపిస్తుందంటే, మిగిలిన లక్షణాలలాగానే ఈ గుణం కూడా స్వభావసిద్ధంగా వచ్చినా అది ఏదో కొంతవరకే! ఆతర్వాత సాధన చేయక తప్పదు. మిగిలిన కళలు, విద్యలన్నిటిలాగానే ఇది కూడా ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత ఎక్కువ లభ్యమవుతుంది. ఆటలు ఆడటంలాగా, పాటలు పాడటంలాగా, సైకిలు తొక్కటంలాగా, టైపు చెయ్యటంలాగా, ఇలా ఏ విద్య అయినా సరే, సాధన కొద్దీ ఎక్కువ పదునుబారుతుంది. స్థితిస్థాపకత కూడా అంతే!

కోపం, విసుగులాంటి చెడు భావాలను వదిలించుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లు ఈ స్థితిస్థాపకతను ఎక్కువ చేసుకోవటానికి కూడా చాలా ప్రయత్నం చెయ్యాలి. ఏదన్నా ఒక సమస్య వచ్చినపుడు ఒకొక్కసారి మనం తలకిందులైపోతాం. లేనిపోనివన్నీ వూహించుకుని గోరంతలుని కొండంతలుగా చూస్తాం. అందుకే ముందు అలాంటి ఆలోచనలు మాని కేవలం వాస్తవాల ఆధారంగానే ఆ సమస్యను చూడాలి. అప్పుడు ఒకవేళ ఆ సమస్యను ఆ సమయంలో పరిష్కరించలేకపోయినా ఆ ప్రయత్నాలు మాత్రం మళ్ళీ తప్పకుండా మొదలుపెట్టగలం. మన మీదకి వచ్చే బయటి శక్తుల మీద మన నియంత్రణ ఎటూ లేదు. కానీ వాటిల్ని ఎలా మన అధీనంలో వుంచుకోవాలి అన్నది తప్పకుండా మన చేతిలోనే వుంది. అందుకే జీవితంలో సమస్యలు రావటం తప్పనిసరి, కానీ వాటి చేతిలో ఓడిపోవటం మాత్రం తప్పనిసరి కాదు అని Roger Crew Ford అనే అమెరికాకు చెందిన ఒక మిలిటరీ ప్రముఖులు అన్నారు.

మార్పు అన్నది ఒక జీవితసూత్రం. ఈ సూత్రాన్ని బాగా గుర్తు పెట్టుకుంటే జీవితంలో ఒకవేళ మనకి నచ్చని మార్పు ఏదన్నా జరిగినా కూడా దానితో త్వరగా రాజి పడిపోతాము. ఆతర్వాత మళ్ళీ మన ప్రయాణం స్థితిస్థాపకతతో కొనసాగిస్తాం. అందుకే, నాకేదన్నా అయితే నేను మార్పుకు లోనవుతానేమో కానీ ఏమీ వెనక్కు తగ్గను అని Maya Angelou అనే అమెరికాకు చెందిన ఒక రచయిత్రి, నటి అన్నారు. అలాగే మన ప్రముఖ హిందీ నటులు శ్రీ అనిల్ కపూర్ గారు కూడా అలాంటి మాటలే అన్నారు. ఇంత వయసులో కూడా మీరు అలిసిపోవటం లేదు అని ఎవరో అంటే నేను అలిసిపోతానేమో కానీ ఎప్పుడూ, ఎక్కడా ఆగను అని అన్నారట. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సాధారణంగా మార్పు అంటే చాలామందికి ఇష్టం వుండదు. అలవాటు అయిన దారిని వదిలేసి కొత్త దారిని వెళ్ళే ప్రయోగం చెయ్యాలని ఎవరికుంటుంది? ఒకవేళ ఆ దారిలో ముళ్ళు వుంటేనో? మరి ఆ భయాన్ని వదిలేసి, ఆ ముళ్ళని దూరంగా విసిరేసి తిరిగి ప్రయాణం సాగించడమే స్థితిస్థాపకత. ఎందుకంటే జీవితం ఎప్పుడూ పూలబాట కాదు కదా! అందుకే జీవితంలో ఎప్పుడన్నా తుఫాన్లు వచ్చినా అవి ఆగేదాకా వేచివుండకుండా వాటితో కలిసి ప్రయాణం చేయడం నేర్చుకోవాలి అని Vivian Greene అనే బ్రిటిషు రచయిత్రి అన్నారు.

సకారాత్మకత చాలా శక్తి కలది. ఇది అసాధ్యాలను సాధ్యాలుగా మార్చేస్తుంది. ఏవన్నా సమస్యలు వచ్చినా సకారాత్మకంగా ఆలోచిస్తే బహుశా వాటిని పరిష్కరించటం తేలిక అవుతుందేమో! కింద పడినా కూడా లేవటం తేలిక అవుతుందేమో! సమస్యల వుక్కిరిబిక్కిరిలోంచి కాస్త నియంత్రణ లభిస్తుందేమో! అసలు మీ నిఘంటువులో నుండి పరాజయం, పతనం, ఘోరం లాంటి పదాలను తొలగించండి. పోనీ, పరాజయం కి బదులు అడ్డు అని, పతనం కి బదులు ఎదురుదెబ్బ అని, ఘోరం కి బదులు ఛాలెంజ్ అన్న పదాలను వాడండి. అప్పుడు స్థిరస్థాపకత తేలిక అవుతుంది. అందుకే ఏడుసార్లు పడిపోయినా ఎనిమిదోసారి లేచి నిలబడు అని జపానుకి చెందిన ఒక సామెత చెపుతుంది.

సకారాత్మకత ఎంత మంచిదో నకారాత్మకత అంత చెడ్డది. అలాగే ప్రతికూల ఆలోచనలు, అంటే negative thoughts కోపం, ద్వేషం, అసూయ, పగలాంటి చెడు భావనలు లేచి నిలబడుతున్న మనిషిని కూడా మళ్ళీ కింద పడవేస్తాయి. ముందుకి వెళ్ళకుండా ఆపుతాయి. ఎందుకంటే అవి ఇచ్చే ఒత్తిడి అంత బలంగా వుంటుంది. మనిషిని వెనక్కి లాగేస్తాయి. అందుకే ఇలాంటి నకారాత్మక భావాలని వదిలేద్దాం. అప్పుడే మనం స్థితిస్థాపకతని సాధించగలం.

జీవితం అన్న తర్వాత సమస్యలు తప్పవు. కానీ వాటి గురించి వగచి బాధపడేకంటే ఆ సమస్యల పరిష్కారాల కోసం దారులు వెతికితే అప్పుడు అది స్థితిస్థాపకత అవుతుంది. అవునా? అసలు అప్పుడప్పుడు మన సంగతి మనకు తెలీదు కానీ మనలో చాలా ప్రతిఘటనా శక్తి దాక్కుని వుంటుంది. అవసరమైనప్పుడు దాన్ని మనమే బయటికి లాగాలి. అప్పుడు కానీ మనలో ఎంత స్థితిస్థాపకత దాగివుందో మనకు తెలీదు.

మీరు నమ్ముతారో లేదో కానీ ఒకొక్కసారి ఒక సాధారణ నవ్వు మనిషికి ఎంత శక్తినిస్తుందో చెప్పలేను. మనం నవ్వినా, నవ్వుతున్నవారిని చూసినా కూడా మనసు ఎంతో ఆహ్లాదంగా అయిపోతుంది. అందుకే చాలామంది Laughing yoga చేస్తారు. మామూలు yoga శరీరానికైతే Laughing yoga మనసుకోసం. మనలో ఒత్తిడిని, stress ని, depression ని తగ్గించి, స్థితిస్థాపకతని పెంచటంకోసం. అందుకే ఎప్పుడూ నవ్వుతూ వుండాలి. నవ్విస్తూ వుండాలి.

మానవస్వభావం ఎలా వుంటుందంటే సుఖాలలో ఫరవాలేదు, కానీ ఏదన్నా చిన్న కష్టం వస్తే మాత్రం ఈ ప్రపంచంలోని కష్టాలన్నీ ఎప్పుడూ నాకే వస్తాయి, ఇంక అవి పోవు కూడాను అని అనుకుని ఇంత బాధని ఇంతింతలుగా చేసుకుని బాధపడతాము. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతాము. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అలాగే ఈ కష్టాలు, బాధలు కూడా. అవి కూడా శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అవి కూడా పలాయనం చిత్తగిస్తాయి. ఇలా ఆలోచిస్తూ స్థితిస్థాపకతని తెచ్చుకోవాలి. అంతేకానీ లేని శాశ్వతత్వాన్ని వాటికి అంటగట్టకూడదు.

మానవస్వభావంలో ఇంకో లక్షణం ఏమిటంటే మన అనుభవాలకు, అవి చేదువి అయినా సరే, వాటికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని జోడిస్తే అప్పుడు ఆ చేదుని మనం తేలికగా మింగగలం. వ్యాయామం చెయ్యటం అంత సుఖంగా లేకపోయినా దానివలన వచ్చే లాభాలు, ఆరోగ్యంలో మెరుగుదల ఇవన్నీ తలుచుకుంటే అప్రియమైన వ్యాయామం కూడా ఫరవాలేదులే, చేసేద్దాం అనిపిస్తుంది. అలాగే ప్రసూతివేదన కూడా. పుట్టబోయే బిడ్డని తలుచుకుని మాతృమూర్తి ఎంతటి బాధనైనా ఇట్టే సహించేస్తుంది. అంటే స్థితిస్థాపకతకి ఇలాంటి ముందుచూపు ఆలోచన చాలా సహాయం చేస్తుందన్నమాట. అందుకే Viktor Frankl అనే ఒక Austrian neurologist బాధలలో కూడా ఏదన్నా ప్రయోజనాన్ని చూసేవారు ఆ బాధలలో నుండి త్వరగా బయటపడతారు అని అన్నారు.

ఇపుడు నేను అందరికీ బాగా తెలిసిన ఇంకో మానవలక్షణం గురించి చెప్తాను. Man is a social animal అని మనందరికీ తెలుసు. మనందరం సంఘంలో కలిసిమెలిసి జీవిస్తాం, కష్టసుఖాలు పంచుకుంటాం. దాంట్లోంచి అపారమైన శక్తిని పొందుతాం. ఆ శక్తే మనకి స్థితిస్థాపకతని కూడా ఇస్తుంది. మీకు ఒక చిన్న వుదాహరణ చెప్తాను. కోవిడ్ సమయంలో మనందరం ఇళ్ళల్లోనే ఖైదీలుగా మారిపోయాం. ఇంట్లోనివారిని తప్ప వేరే మనిషి ముఖం కూడా చూడలేని అయోమయంలోకి వెళ్ళిపోయాం అందరమూ. అవునా? అప్పుడు కొంతమంది స్నేహితులం కలిసి ఒక చిన్న కూటమిలాగా ఏర్పడి, దానికి B+, అంటే Be Positive అని ఒక పేరు పెట్టుకుని, ప్రతి రాత్రి జూమ్ సమావేశంలో అందరం కలిసేవాళ్ళం. రకరకాల ఆటలు, పాటలు, పద్యాలు, కధలు, పురాణాలు, పేరడీలు, ఒకటేమిటి, ఇది అది అన్న తేడా లేదు, ఎన్నో వైవిధ్యమున్న విషయాలతో కార్యక్రమాలు చేసుకునేవాళ్ళం. వినోదంతో పాటు ఆనందం, ఆనందంతో పాటు విజ్ఞానం, అన్నిటికి మించి మనసుకి వూరట, రేపు మీద ఏదో ఆశ, ఇవన్నీ ప్రతి రాత్రి పుష్కలంగా అందరం సంపాదించుకునేవాళ్ళం. కష్టసుఖాలను పంచుకునేవాళ్ళం. చివరికి అందరమూ అబ్బా, ఈ కోవిడ్ రోజులు ఎంత బాగా వున్నాయి, దీని పుణ్యమా అని మనందరం చక్కగా ప్రతి రాత్రి కలుసుకోగలుగుతున్నాము, మంచి మంచి విషయాలు చర్చించుకోగలుగుతున్నాము అనుకుని ఆనందపడే స్థితికి వచ్చాము అని అంటే ఏమాత్రమూ అతిశయోక్తి కాదు. అపార ప్రతిభావంతుడైన మా నాయకుని మార్గదర్శకత్వంలో ఈ కూటమి మాఅందరికి ఎంతటి మానసిక శక్తిని ఇచ్చిందో నేను మాటల్లో చెప్పలేను. ఒంటరిగా పొందలేని మానసిక నిబ్బరాన్ని, దృఢత్వాన్ని ఈ సమూహ స్నేహంలో పొందాము మేము. ఒకరి అనుభవాల్లోంచి ఇంకొకరు పాఠాలు నేర్చుకున్నాం. ధైర్యాన్ని తెచ్చుకున్నాం. ఓదార్పుని పొందాం. శారీరక రుగ్మతల్లోంచి, మానసిక మనస్తాపాల్లోంచి బయటపడటానికి ఉపాయాలని సాధించాం. ఇంకేముంది? స్థిరస్థాపకత అప్రయత్నంగానే మాకు కనీసం కొంతవరకన్నా వచ్చేసింది. అందుకని సంబంధాలు, అనుసంధానాలు, అంటే connections కూడా స్థిరస్థాపకతని పొందటానికి చాలా అవసరం. ఎప్పుడూ పదిమందితో కలిసి వుండాలి. జ్ఞానం పంచుకోవాలి.

స్థితిస్థాపకత రహస్యం ఏ అసాధారణ పరిస్థితి తెరల వెనక దాక్కోలేదు. అలాగే స్థితిస్థాపకత కొంతమందికి మాత్రమే, లేక కొన్ని ప్రత్యేకతలున్నవారి కోసం మాత్రమే కాదు. ఇది అందరికోసం. ఇది అందరికీ లాభాన్ని చేకూర్చటం కోసం. అందుకే స్థితిస్థాపకతని అందరు అలవరచుకోవచ్చు. జీవితంలో వున్న అర్ధాన్ని గ్రహించి, తోటివారందరితో సంబంధబాంధవ్యాలను చక్కగా నిర్వహిస్తూ, బతికున్నంత కాలం ఆనందంగా వుండే చిట్కాని స్థితిస్థాపకత నేర్పుతుంది. అందుకే పరిస్థితులకు అతీతంగా నిలిచి, ఎన్ని కష్టాలొచ్చినా చెక్కుచెదరక వుండగలిగే ఎంపికను స్థితిస్థాపకత ఇస్తుంది అని David Coggins అనే అమెరికాకు చెందిన ఒక రచయిత అన్నారు.

జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయి. అయితే వాటిల్ని ఏ విధంగా ఎదుర్కొంటాము అన్నదే ప్రశ్న. స్థితిస్థాపకత వున్నవాళ్ళు ఎప్పటికైనా వాటిల్ని తప్పకుండా ఓడిస్తారు. అందుకే నన్ను ఓడించటానికి బయట వున్న శక్తి కంటే నాలోపల వున్న శక్తి చాలా ఎక్కువ బలమైనది అని Caroline Myss అనే అమెరికాకు చెందిన ఒక రచయిత్రి అన్నారు. ఈ సమస్యల పెనుగులాటలో మనకి గెలుపొక్కటే కాదు, తెలివి, చాకచక్యం, ఎటువంటి జటిల పరిస్థితులనైనా సరే, ఎదుర్కోగల సాహసం, శక్తి, ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. వాటిని వాడేదాకా అసలు మనలో అంతటి శక్తి దాగివుందని కూడా మనకు తెలీదు అని Isabel Allende అనే అమెరికాకు చెందిన ఒక రచయిత్రి అన్నారు. అసలు మనం గమనిస్తామో లేదో కానీ మానవ జన్మ అంటూ ఎత్తిన తర్వాత సమస్యలు, కలతలు, కన్నీళ్ళు అన్నవి తప్పవు. దేవుడు రాముడికే తప్పలేదు. ఇంక మనం ఎంత? కానీ అలాంటి సమయాలలోనే మన స్థితిస్థాపకత మనల్ని రక్షిస్తుందని, బాధల లోంచి తెలివితేటలు, భయం లోంచి ధైర్యం, దుఃఖం లోంచి శక్తి ని ఇస్తుందని Iric Greitens అనే అమెరికాకు చెందిన ఒక రాజకీయవేత్త, వ్యాపారవేత్త, పూర్వపు navy seal అన్నారు.

మనుషులలోని శక్తి వారి విజయాల వలన రాదు, వారు పడిన సంఘర్షణల వలన వస్తుంది. సంఘర్షణ ఎంత ఎక్కువైతే మనుషులలో సంయమనం, సహనం, శక్తి కూడా అంత ఎక్కువగా వుంటాయి. దానితో స్థితిస్థాపకత కూడా ఎక్కువగానే వుంటుంది. అలాంటివారి మధ్య మనం వుంటే మనకి కూడా అలాంటి గుణాలే వచ్చే అవకాశం ఎక్కువగా వుంది. జీవితంలో వచ్చే రకరకాల అవరోధాలని మనం ఏ దృష్టికోణంతో చూస్తే మన స్థితిస్థాపకత శక్తి కూడా అదే స్థాయిలో వుంటుంది. ఇక్కడ మనందరం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. కష్టకాలం ఎక్కువ రోజులు వుండదు, కానీ వాటిని ఎదుర్కొనే బలవంతులు మాత్రం ఎన్ని ఏళ్ళైనా చెక్కు చెదరకుండా వుంటారు. జీవితాన్ని జీవించే కళలో సగానికి పైగా స్థానం అసలు ఈ స్థితిస్థాపకతకే వుంటుంది అని Alian De Botton అనే ఇంగ్లాండుకు చెందిన ఒక రచయిత అన్నారు. మనందరికీ ఇంత మంచిని చేసే ఈ స్థితిస్థాపకతని మనందరం అలవాటు చేసుకుందాము.

సరే, మరి ఇప్పటికి ఇంతటితో అపి మళ్ళీ వచ్చే నెల ఇంకో మంచి విషయాన్ని వెంటబెట్టుకుని మీ ముందుకు వస్తాను. అంతదాకా సెలవు.

********

Posted in April 2026, వ్యాసాలు

2 Comments

  1. Manonmani

    Lovely.. చాలా బాగా చెప్పావు అక్కా.. “అనిర్వేదమయమైన జీవిత శైలి అత్యుత్తమ విధానం” 👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *