సుప్రసిద్ధ సినీ గేయ రచయిత "వేటూరి సుందరరామ్మూర్తి"
కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘ఓ సీత కథ’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి గా పిలవబడే వేటూరి సుందర రామ్మూర్తి గారు సంగీత జ్ఞానాన్ని పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమా పాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవిలను, పురాణ సాహిత్యంలోని పంక్తులను గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. అప్పట్లో వేటూరి పాట లేని సినిమా విడుదలయ్యేది లేదంటే అతిశయోక్తి కాదు. సినిమా పాటన్నది ఒక సమిష్టి కృషి అని అందులో తన వంతుగా తన పాత్ర పాటించడమే తన ధర్మమని నమ్మి ఆచరించిన వ్యక్తి ఆయన. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమైన అద్భుతమైన పాటలు ఆత్రేయ లోని అనుకరణ సాధ్యం కాని బాణీని, సినారె పదాలలోని భారీ తనాన్ని, శ్రీశ్రీలోని ఆవేశాన్ని, ఆరుద్రలోని పద మాలికలను తలపింప చేసెలా రచనలు చేసి అందరి అభిమానాన్ని చూరగొన్న సినీ కవి వేటూరి.
వేటూరి సుందరరామ్మూర్తి గారు 1936 జనవరి 29న పెదకళ్ళేపల్లి, (కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం) లో జన్మించారు. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడ లో డిగ్రీ పూర్తి చేశారు. దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా ఆంధ్ర ప్రభ, ఆంద్ర పత్రిక లలో ఉప సంపాదకుడిగా పని చేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. శంకరాభరణం సినిమాలో సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి అడవి రాముడు సినిమాలో జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్న మహానుభావుడు వేటూరి. పండితుల నుండి పామరుల వరకు అందరినీ అలరించిన విశిష్ట శైలి ఆయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకు 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. కానీ కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం వేటూరి. ఇది ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.
సాహిత్యం మీద మక్కువతో జర్నలిస్టు, రచయిత రెండూ అయ్యారు వేటూరి. సాహిత్యాన్ని ఆరాధించి, జర్నలిస్టిక్ వేలో తన కంటే పూర్వీకుల గురించి, తన తర్వాత వారి గురించి కూడా ఎన్నో రచనలు చేశారు. తన పాటల్లో గతాన్ని, భాషను గుర్తు చేసే కొంటెతనం, ఋతువులు, కాలం, ఆత్మీయత అనుబంధం, తెలుగుదనం ఉండాలనుకున్నారు. తెలుగు భాష వాడుక భాష స్థాయికి మారిపోయాక అచ్చ తెలుగు పదాలు ఉపయోగిస్తే ఎవరికీ అర్థం కావట్లేదనేవారు. ఉదాహరణకు సీతారామయ్య గారి మనవరాలు చిత్రం కోసం రాసిన ‘కలికి చిలకల కొలికి’ పాటలో ‘అద్ద గోడలకి’ (వంట గదిలో వండిన పదార్థాలు మరుగున ఉంచడం కోసం ఉండే గోడ) అని చేసిన ప్రయోగం చాలా మందికి తెలియదు. ఇక ప్రాస విషయానికొస్తే 'సాగర సంగమం'' చిత్రంలోని ''తకిట తథిమి తకిట తదిమి తందాన'' పాటలో ''నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన - తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా, తెలిసీ తెలియని ఆశల వయసీ వరుసా'' అన్న, అన్నమయ్య మాట - అచ్చ తేనే తెలుగు పాట'' అనే పదాలు విన్నా ''శంకరాభరణం'' చిత్రంలోని ''శంకరా నాద శరీరా పరా - వేదవిహారా హరా జీవేశ్వారా'' పాటలో ''మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు.. ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలూ'' వంటి పదాలు విన్నా ఆయనకు తెలుగు భాష మీద ఉన్న అధికారం మనకు తెలుస్తుంది. ''అడవి రాముడు'' చిత్రంలో ఆయన రాసిన రెండు వైరుధ్య భరితమైన పాటలను మీరిప్పుడు గమనించండి. ''మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ - పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ'' అనే పాట ఎంత స్ఫూర్తిదాయకంగా ఉత్తేజకరంగా, ఉద్భోధ పూరితంగా ఉంటుంది. అదే చిత్రంలో ''ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ హరి - కోకెత్తుకెళ్ళింది కొండగాలి, నాకు ఉడుకెత్తిపోతోంది హరీ హరీ'' అనే పాటలో ఎంత కొంటెతనంతో నిండి ఉంటుందో మనందరికీ తెలిసిందే. అదీ ఆయన కలానికున్న బలం. ఇలా చెప్పుకుంటూ పొతే ఆయన కలం నుండి వెలువడిన ప్రతి పాటా ఒక ప్రయోగమని చెప్పవచ్చు.
ఆయన రాసిన కొన్ని వేల పాటలకు గుర్తింపుగా ఆయనకు 6 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు ఒక జాతీయ పురస్కారం లభించాయి. మూడు దశాబ్దాలపాటు తెలుగు సినిమాకు ఎన్నో మధురమైన పాటలు అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వేటూరి 74 ఏళ్ల వయస్సులో 2010 మే 22న స్వర్గస్తుడైనాడు. ఆయన కాలంలో సాహిత్య సరస్వతి శతధా, సహస్రదా ఆనంద తాండవం చేసిందని చెప్పాలి. కవిత్వాన్ని చివరి వరకు ప్రేమిస్తూనే గడిపారు. నేటికీ ఆయన కలం నుండి జాలువారిన పాటలు “పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ” “ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణా గానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు” ఇలాంటి అపురూప పద విన్యాసాలు శ్రోతల చెవుల్లో మారు మోగుతూనే ఉంటాయి. వేటూరి, తెలుగు సినిమా సాహిత్య పూదోటకు మకుటం లేని చక్రవర్తి. ఆయన లేకపోయినా ఈ రోజుకు కూడా వేటూరి పాటలు అందరూ వింటుంటారు. ఆనందపడుతుంటారు. వ్యక్తిగత విషయాలకు వస్తే భార్య పేరు సీతామహాలక్ష్మీ, ఆయనకు ముగ్గురు కుమారులు.