Menu Close
Abhiram Adoni
భళా సదాశివా..
అభిరామ్ ఆదోని (సదాశివ)

తన అవసరం కోసం
ఇతరులను నొప్పిస్తూ....
మా మనసు బాలేదని మధనపడడం ఏమిటి శంకరా....
ఎవడికైనా కర్మ కర్మే కదా....
ఆ కర్మ నీ ఆటకు బానిస కదా....
నీ ఆటలో ఆవేదన పడకుండా కాపాడు సదా...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా...

లేత మనసులో
భక్తి పూత....
నీ ఆట అద్భుతానికి పులకింత...
శ్రీశైల పాదయాత్ర
మా మనసు చేసుకున్న పవిత్ర చరిత్ర
శ్రీశైల మల్లికార్జున...
నీ కరుణే మా హృదయ జ్యోతిర్లింగం...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా

అవసరం తీరిందని దూరం పెట్టిన వాడే....
అవసరం వచ్చిందని దగ్గరకు వచ్చి పని చెబుతాడా..‌.
అవకాశవాదుల అవసరాలకు నేను ఆవిరి కాకుండా...
చేయి చాపిన వాడికి సాయం చేసే అవకాశం ఇచ్చిన ఈశ్వరా..‌‌.
నీ దయకు ధన్యవాదాలు
సాయం పొంది మౌనంతో తప్పుకు తిరిగే తుంటరి మనసులకు నమస్కారాలు....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఆకలి ఆవేదన తడితో ఒకడిని పంపావా...
నా జేబులో లక్ష్మి దేవితో
ఆ మనిషి కడుపులోకి అన్నపూర్ణమ్మను పంపి...
కడుపు నిండగా ఆనంద కళ్ళలోంచి నువ్వు దర్శనం ఇచ్చావా...
సాయం చేసే అవకాశం ఇచ్చి సాకార రూపంగా ఎదుట నిలబడిన ఈశ్వరా....
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా...

ఎవరిది అవసరం
ఎవరిది స్వార్థం
ఎవరిది అర్థం
ఎవరిది వ్యర్థం...
ఎవరి పిచ్చిలో వారుంటే
చావును చూపించి ఇది నా ఆట అని తెలిపితివా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా

ఎవరిది ప్రకాశం
ఎవరిది ప్రశాంతం
ఎవరిది ప్రమాదం
ఎవరిది ప్రమోదం
అందరిది నీ ఆటలో పరాభవ నామ ఉగాదే కదా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా

ఒక తనువు మరో తనువుతో కలిసి
ఇంకో తనువును సృష్టిస్తుందా...
ఆ తనువు పెరిగి పెద్దై మరో తనువును సృష్టిస్తుందా..‌.
ఇదేనా నీ సృష్టి తత్వము...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా

స్త్రీ పురుషుల చూపుల్లో వ్యామోహ యుద్ధమా...
స్త్రీ పురుష సంయోగంలో సుఖ స్పర్శ యుద్ధమా...
స్త్రీ పురుషులకే సంసార బరువు బాధ్యతల యుద్ధమా...
ఈ స్త్రీ పురుష ఆకర్షణ అయస్కాంతం సృష్టించిన తిక్కలోడు ఎవరయ్యా...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా

అమ్మ నాన్నలు....
అన్నదమ్ములు...
అక్కా చెల్లెళ్ళు...
బంధువులు తోబుట్టువులు
స్నేహితులు
అందరూ నా వెంటరాని అనామకులేనా....
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా

నీ ఆట ఎత్తు
నీ ఆట లోతు
నీ ఆట పొడవు
నీ ఆట వెడల్పు
తెలిపే స్థలమే శ్మశానమా..‌‌‌.
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా

Posted in April 2026, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *