Menu Close
Uma Bharathi
హృదయగానం (ధారావాహిక)
నేడే విడుదల
కోసూరి ఉమాభారతి

19

hrudayagaanam-19

టెలీఫిల్మ్ పని మొదలయ్యే ముందు రోజు, ఆదివారం నాడు... అమ్మమ్మతో చెప్పి ... పొద్దుటే, శ్రీనివాస్ గారిని చూసేందుకు బయలుదేరింది పారూ. పది నిముషాల్లో వారింటికి చేరింది..

హాల్లోనే కూర్చునున్న శ్రీనివాస్ గారి వద్దకి వెళ్లి, ఆయన పాదాలంటి నమస్కరించింది. చదువుతున్న పేపర్ పక్కకి పెట్టి "రామ్మా రా కూర్చో" అంటూ... భార్య కోసం పిలిచాడు.

పారూని ఉద్దేశించి "అయితే ప్రొడక్షన్ వారి వసతి వద్దన్నావట. మీ పిన్నీ వాళ్ళగెస్ట్-హౌజ్ లోనే ఉన్నారట కదా!.. అయినా ఏది కావాలన్నా అడిగి తెప్పించుకో పరమేశ్వరి." అన్నారాయన.

"అలాగే అంకుల్. మా అమ్మమ్మకి అక్కడ అలవాటయింది. పైగా లలితమ్మ వంటకి ఆమె ఫిదా. పోతే మీరెలా ఉన్నారు. విశ్రాంతిగా ఉంటున్నారుగా!" అడిగింది పారూ.

"అంతా ఒకే. ఇదిగో నీవొస్తున్నావని మీ ఆంటీ ఏదో హడావిడి పడుతున్నట్టుంది. ఆవిడకి నీవంటే చాలా ఇష్టం. నీకు సంగీతలక్ష్మి అని పేరు పెట్టింది. నిన్ను మరో బిడ్డలా భావిస్తుందని చెప్పానా?" అన్నారాయన.

"నా అదృష్టం అంకుల్. మీనా ఎలా ఉంది? అయినా నేను మరీ పొద్దుటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసానేమో." అంటుండగానే, విమల గారు వచ్చారు. ఆమెకి నమస్కరించింది పారూ.

"ఆంటీ... నేనిక్కడ ఇంకా నెలన్నర ఉంటాను. ఆదివారం సెలవు. మీకు, అంకుల్ కి ఎటువంటి పని ఉన్నా చెప్పండి. నేను వెంటనే వస్తాను. మీరు నన్ను మీ సొంత బిడ్డలా భావించి... నాకు పనులు పురమాయించవచ్చు. అంది పారూ.

"అలాగే పరమేశ్వరి, నిన్ను కన్నవారు అదృష్టవంతులు. సుఖంగా ఉండు." అని దీవించింది విమల.

బ్రేక్-ఫాస్ట్ చేద్దామంటూ డైనింగ్ లోకి నడిచిందామె.

'ఆలయనాదాలు' ప్రాజెక్ట్ విషయాలు చెప్పుకుంటూ బ్రేక్-ఫాస్ట్ చేస్తుండగా, జిమ్ నుండి తిరిగి వచ్చిన మీనాక్షి ... పారూని చూసి డైనింగ్ వద్దకి వచ్చింది.

"హలో... పరమేశ్వరీ... బయట కారు చూసి ఎవరో డాడీ కోసం వచ్చారనుకున్నాను. మొత్తానికి ... నీ వరస విజయాలకి అభినందనలు చెప్పాల్సిందే. నీవు లక్కీ ఫెలో.

నీ మ్యాజిక్ తో ప్రపంచాన్నే మైమరపిస్తున్నావు కదా!. నా జోలికి మాత్రం రాకు. అంటే… అదే మా అమ్మానాన్నా... ఇంకా నా చిన్ని ప్రపంచాన్ని వదిలేయ్. నీ మేజిక్ ఇటు సారించకు." పకపకా నవ్వింది మీనాక్షి.

"మంచి మూడ్ లో ఉన్నావురా మీనా! నీ పలకరింపు బాగుంది. పరమేశ్వరి మనలని చూడ్డానికి సెలవురోజున ఇంత పొద్దుటే వచ్చినందుకు మేము మిక్కిలి ధన్యవాదాలు చెప్పాము." అంటూ మరో పెసరట్టు అడిగి వేయించుకున్నారు శ్రీనివాస్ గారు.

క్షణాల మౌనం తరువాత... "ధన్యవాదాలు మీనా. మా అమ్మమ్మ శిష్యరికంలో నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాను. అందుకే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. ప్రాజెక్ట్ పని మీద కొన్నాళ్ళునేనిక్కడే ఉంటాను. వచ్చిపోతూ ఉంటాను. ఇకపోతే, మనందరికీ ఒకే ప్రపంచం మీనా. మనం తోబుట్టువుల్లా కూడా మెలగవచ్చు. సరేగాని మీ అమ్మ చేసిన పెసరట్టు ఇష్టం లేని వాళ్లెవరుంటారు? నీవు కూడా తింటావా? ఫ్రెష్ అయి వస్తావా?" అంది చలోక్తిగా పారూ.

ఈ టిఫిన్లు నాకు నచ్చవులే" అంటూ లేచి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం వరకు ఉండి వారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయింది పారూ.

***

రాత్రి తొమ్మిది గంటల సమయంలో, రామనాధం గారి నుండి ఫోన్ కాల్ అందుకుని "చెప్పండి మామయ్యా!”అన్నాడు శ్రీనివాస్.

"ఎలా ఉన్నావయ్యా శ్రీను! ఇంకా వాకర్ తోనే నడుస్తున్నావుగా. మొన్న పుట్టిన రోజు ఫంక్షన్ లో మీతో ఎక్కువ మాట్లాడనే లేదు. రేపొద్దున్న వస్తా నీవద్దకు. విమల చేసే పొంగలి, పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా తినాలని ఉందోయ్. వకుళా, శ్రీ కూడా వస్తారంట తినడానికి." అంటూ నవ్వారాయన.

అక్కడే ఉన్న విమల...ఫోన్ అందుకుని ... "బాబాయ్ గారు, అన్నయ్యా, వదినా వచ్చేయండి.... ఎదురు చూస్తుంటాము." అంది.

***

రామనాథం గారితో మాట్లాడాక, కిరణ్ కి ఫోన్ చేశారు శ్రీనివాస్. అప్పుడే జిమ్ నుంచి లోనికి వస్తున్న కిరణ్ ఫోనే తీసి, చెప్పండి మామయ్యా. ఎలా ఉన్నారు? అంతా ఓకే కదా. అత్తయ్యా, మీనా?" అడిగాడు.

అంతా బాగుంది. ఓ మారు నీతో మాట్లాడాలనిపించిందోయ్. మన మీనా పెళ్లి విషయంగా... నీ మనసులో, మాటలో మార్పేమన్నా వచ్చిందా? అని అడుగుదామని. దాన్ని బట్టి ముందుకి సాగుదామని ఆలోచన. అత్తయ్య కూడా ఇక్కడే ఉంది. చెప్పు మరి. అన్నారాయన.

కొద్ధిక్షణాల మౌనం తరువాత "ఇంత ముఖ్యమైన విషయంలో, నాకు అతి ముఖ్యమైన మీతో నా మనసులోని మాట ఎప్పుడూ ఉన్నదున్నట్టు నిజమే చెబుతాను మామయ్యా! నా ఆలోచనలో మార్పు లేదు. మీనాకి చిన్నప్పటి నుండీ నా వెంటే ఉండడం అలవాటయిపోయి నేను పక్కనే ఉండాలి అన్న భావనతో ఉందే తప్ప... ఇంకేమీ లేదు. నన్ను క్షమించండి మామయ్యా, అత్తయ్యా! అని విన్నవించుకున్నాడు కిరణ్.

***

మరునాడు పొద్దుటే టంచన్ గా ఎనిమిదిన్నరకల్లా బ్రేక్-ఫాస్ట్ కి వేంచేసిన అతిధులకు ఎదురెళ్లి ఆహ్వానం పలికారు శ్రీనివాస్ దంపతులు.

"తింటూ మాట్లాడవచ్చు రండి. లేట్ చేయడమెందుకు?" అంటూ డైనింగ్ లోకి నడిచింది విమల.

నిమ్మకాయన్నం, వడ-చట్నీ కూడా ఆరగిస్తూ కబుర్లలో పడ్డారు.

తన గది నుండి కిందకి వచ్చింది మీనాక్షి. "గుడ్ మార్నింగ్ తాతగారు. అత్తయ్య, మామయ్యా! మీరు వస్తున్నారని చెప్పింది అమ్మ. బ్రేక్-ఫాస్ట్ మెన్యూ కూడా చెప్పింది. నాకేమో వెస్ట్రన్ ఆమ్లెట్ తినాలనుంది. ఇక్కడే జూబిలీ హిల్స్ లో... ఆమ్లెట్ కార్నర్ అని కొత్తగా తెరిచారు. రాధికతో కలిసి వెళుతున్నాను. మీరు చక్కగా ఎంజాయ్ చేయండి." అని చెప్పి వెళ్ళిపోయింది మీనాక్షి.

వాతావరణం ఆహ్లాదంగా ఉండడంతో స్విమ్మింగ్ పూల్ వద్దనున్న సిట్-అవుట్ లో కూర్చుని అందరూ కాఫీ సేవిస్తున్నారు.

శ్రీనివాస్ ని ఉద్దేశించి, "అబ్బాయ్... శ్రీను... పిల్లలు పాతికేళ్ల వారయ్యారు. వాళ్ళకి పెళ్ళిళ్ళుచేయాలి. అప్పట్లో ఓ మారు మాటొచ్చినప్పుడు.. మీనాక్షి పట్ల తనకి అటువంటి భావన కానీ, ఉద్దేశం కానీ లేదన్నాడు కదా కిరణ్. స్పష్టంగా వాళ్ళఅమ్మానాన్నలకి అదే అభిప్రాయాన్ని వెల్లడించాడట. ఎవరికి తొందరున్నా లేకున్నా నాకు వయసయిపోయింది. నాకు ఒక్కగానొక్క మనవడు, వారసుడు వాడు. నేనింకా బాగుండగానే వాడికి వివాహం చేయాలి." అంటూ విమల, శ్రీనివాస్ ల వంక చూశాడాయన.

మనం పిల్లలకి తగిన సంబంధాలు చూసుకోడమే శ్రేయస్కరం అన్నది నా భావన." అన్నారాయన కాస్త సంశయంగా.

రెండు నిముషాల పాటు అక్కడ మౌనమే రాజ్యమేలింది. "మీరు బాధ పడకండి బాబాయ్! కిరణ్ అలా అన్నాడనో, అనుకున్నాడనో మాకేమీ వాడి మీద కోపం లేదు, ద్వేషం లేదు. వివాహబంధం అంటే ఎన్నో విషయాలు కలవాలి. ఇరువురి నడుమా ప్రేమో, ఇష్టమో లేనిదే ఈ తరం వారు పెళ్లికి ఒప్పుకోరు. మనం బలవంత పెట్టలేము కూడా.

మేమూ ప్రయత్నిస్తున్నాము. మీనాక్షి మనసు మళ్లించి తగిన వాడిని పెళ్ళాడి స్థిరపడమని చెబుతూనే ఉన్నాము, బాబాయి గారు." అంది నొచ్చుకుంటూ విమల.

"అయినా వాణ్ని నా భుజాల మీద ఆడించి పెంచాను. ఏదైనా అద్భుతం జరిగి కిరణ్ మనసు మారితే తప్ప మనం ఏమీ చేయలేము. వాడు ఆనందంగా బతకాలి.

కాబట్టి మీరు కిరణ్ కి సంతోషంగా ఇతర సంబంధాలు చూడండి. వాడి మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి. వాడికి మా ఆశీస్సులు ఉన్నాయని చెప్పండి." అంటూ అందరి మనస్సుల్లోని వ్యధని దూరం చేసాడు శ్రీనివాస్.

మరో రౌండ్ కాఫీ సేవించి రామనాధం వాళ్ళు సెలవు తీసుకున్నారు.

***

ఇంట్లోకి అడుగుపెట్టి, మేడ పైకి వెళుతున్న మీనాక్షిని… ఆఫీస్ రూము నుండి పిలిచాడు తండ్రి.

"ఏమిటి డాడీ? ఈ టైములో ఆఫీస్ లో ఉన్నారు. అమ్మ కూడా ఇక్కడే ఉంది. సరే... చెప్పండి. కిరణ్ కుటుంబం అంతా ఒక్కసారిగా వచ్చారు. మరి అప్పుడే వెళ్లిపోయారా? అసలెందుకు వచ్చారట? ఏమన్నా విశేషమా?" అడిగింది కుతూహలంగా.

"ఏమీ లేదు.. అమ్మ చేతి పొంగలి, పొట్లకాయ తినాలని ఉందన్నారు తాతయ్య గారు. త్వరలో తన మనవడి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారని కూడా చెప్పారు.

ఇక అదలా ఉంటే, ఇప్పుడే నేను రిషి మదురై తో మాట్లాడాను. అదేనమ్మా .. పెళ్ళికొడుకు. నిన్ను కలవడానికి ఆసక్తిగా ఉన్నాడు. అతని కాంటాక్ట్.. నీతో షేర్ చేస్తున్నాను. ఫోన్ చేసి మీట్ అవ్వండి. నీ అభిప్రాయం తెలుసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుందాము. సరేనా?" అన్నాడు కూతురితో.

మారు మాటాడకుండా ... అక్కడినుండి వెళ్ళిపోయింది మీనాక్షి.

***

మళ్ళీరెండు వారాలకి హైద్రాబాదు వచ్చాడు కిరణ్. మధ్యాహ్నం భోజనమయ్యాక, డైనింగ్ వద్దనున్న పెద్దవాళ్ళని విశేషాలేమిటని అడిగాడు.

తాత గారు, తల్లితండ్రుల మాటలని శ్రద్ధగా విన్నాడు.

"సరే, మీ ప్లాన్ బాగుంది. నా పెళ్లి విషయంగా అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. పద్ధతి, సంప్రదాయం, పెద్దల పట్ల గొరవం ఉన్న కోడలి కోసం అమ్మే నిర్ణయం తీసుకుంటుంది. అమ్మకి నా మనసు తెలుసు" అన్నాడు కిరణ్.

ఎల్లుండి మంచి రోజు. పొద్దుటే ఫ్లైట్ కి వెళ్లి, మరునాడు వచ్చేస్తాము. పోయినసారి మీరున్న హోటల్లోనే రెండు రూమ్స్ రిజర్వు చేయి కిరణ్." అన్న తల్లితో...

"ఇంతకీ ఏ ఊరెళుతున్నారమ్మా?" అని అడిగిన కొడుకుని విస్తుపోయి చూసింది వకుళ.

"అవును... అసలు ఏమీ తెలియదురా నీకు... భడవా! ఇప్పుడేగా తాతగారు వివరించి... నీకు నచ్చిన, మేము మెచ్చిన మేనరికమే సరయిన సంబంధం అని... చెప్పారు. భలే వాడివే!" అంటూ సోఫాలోని పిల్లో తీసి కొడుకు పైకి విసిరిందామె.

"సరేగానీ, కిరణ్! నీకు, మీ అమ్మానాన్నలకు కూడా ఒకే హెచ్చరిక. కొన్నాళ్ల వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడమే అందరికీ శ్రేయస్కరం. మీనాక్షి తాను బాధపడి, తల్లితండ్రుల్ని క్షోభపెట్టే అవకాశం ఉంది కనుక. సంబంధం కుదుర్చుకుని రావడమే ప్రస్తుత ధ్యేయం." అన్నారు రామనాధం గారు.

***

మరునాడు పొద్దుటే, పెద్దవాళ్ళని కాకినాడ ఫ్లైట్ కి ఎయిర్పోర్ట్ లో దిగవిడచి... నేరుగా పారూ షూటింగ్ జరుగుతున్న స్టూడియోకి వెళ్ళాడు కిరణ్.

సెట్స్ మీద ఓ పక్కకి కూర్చునున్న నానమ్మ వద్దకి వెళ్లి, నమస్కరించి పక్కనే కూర్చున్నాడు. కిరణ్ణి చూడగానే సీతమ్మ గారి కళ్ళుఆనందంతో వెలిగిపోయాయి. బ్రేక్ సమయంలో...కిరణ్ వద్దకి పరుగున వచ్చింది పారూ.

"తాతగారువాళ్ళుకాకినాడ వెళ్లారు" అన్నాడు కిరణ్..

"తెలుసును కదా అమ్మమ్మా!" అన్నది పారూ.

"ఈ రోజు, రేపు కూడా రాత్రి ఎనిమిది వరకూ షెడ్యూల్" అంది పారూ నిరుత్సాహంగా.

"పర్వాలేదులే... నానమ్మగారిని విశ్రాంతిగా ఉండనివ్వు.. ఎల్లుండి పొద్దుటి వరకు నీకు తోడుగా నేనుంటానుగా." అన్నాడు నవ్వుతూ కిరణ్.

***

దశమి నాడు శ్రీనాధం దంపతులు మరియు రామ్‌కుమార్ దంపతుల నడుమ వారి చిరంజీవులు.. కిరణ్, పరమేశ్వరీల పెళ్లి మాటల జరిగాయి. ఆశీస్సులందించారు మాలిని, జోసెఫ్ లు.

పారూకి, కిరణ్ కి ఫోన్లు చేసి అభినందనలు తెలిపారు పునీత్, జననీలు.

"పరమేశ్వరికి టెలీ-ఫిలిం పని ముగియగానే శ్రీనివాస్ గారు పూర్తిగా కోలుకొన్నాక, తాంబూలాలు మార్చుకుందాము. ఈ తతంగం గురించి అప్పటి వరకు గోప్యంగా ఉంచమంటున్నారు మామయ్యగారు." అని కోరింది వకుళ.

సంతోష సమయంలో రెండు కుటుంబాలు భారీగా కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. 'మాలిని పిన్నీ వాళ్లకి' అంటూ జోసెఫ్ దంపతులకి ప్రత్యేకంగా కానుకలు అందించారు..

సంతోషంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని, పసందైన విందుతో... వేడుక చేసుకున్నారా పరివారమంతా.

***

మరునాడు పొద్దుటే గెస్ట్-హౌజ్ కి చేరిన కిరణ్, పారూతో కలిసి... సీతమ్మ గారికి పాదనమస్కారం చేసి, దీవెనలందుకున్నాడు. షూటింగ్ కి ఒక్క రోజు సెలవు పెట్టి ఇరువురూ ఇంటి నుండి బయలుదేరి, బ్రేక్ఫాస్ట్ ఒక చోట, లంచ్ ఒక చోట చేసి హ్యాండ్లూం శారీ ఎగ్జిబిషన్ క్కూడా వెళ్ళారు. పారూ చేయి పట్టుకుని మైళ్ళ దూరం నడిపించాడు కిరణ్.

చిన్నపిల్లల్లా కాసేపు జూ లో కూడా తిరిగారు. అక్కడక్కడ పారూని జనం గుర్తుపడుతుంటే, నవ్వుతూ ఆమెని కారు వరకు పరిగెత్తిస్తున్నాడు కూడా.

సన్నటి తుప్పర పడుతూనే ఉంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. పారూ మనసు హాయిగా ప్రశాంతంగా ఉంది.

చీకటి పడుతుండగా అదే మౌర్య పార్కుకి వెళ్లారు. దూరంగా అక్కడక్కడ మాత్రమే జనం తిరుగుతున్నారు. మునుపు తాము కూర్చున్న అదే గజేబో వద్దకు వెళ్లి, కొద్దిక్షణాలు మౌనంగా చుట్టూ పరికించి చూసాడు కిరణ్.

పోయినసారి కంటే కూడా లాన్ వత్తుగా, నేల మీద పచ్చని తివాసీలా పరుచుకునుంది. కాళ్ళకున్న సాండిల్స్ తీసేసింది పారూ. కిరణ్ కూడా షూజ్ విప్పేసి, గజేబో ఎదురుగా ఉన్న లాన్ మీద వెల్లకిలా పడుకున్నాడు.

నువ్వూ ఇలా రా, కాసేపు ఆకాశంలోని తారల్ని లెక్క పెడదాం, అంటూ చేయి చాచాడు.

వెళ్లి, చాచి ఉన్న అతని చేతి పై, అతనికి దగ్గరగా ఒరిగింది పారూ.

తలెత్తి, ఆకాశం వంక చూసారు. నక్షత్రాలు కుట్టిన నీలిరంగు చీరలా ఉంది. తారల్ని లెక్కెడుతూ, కాసేపు మౌనంగా ఉండిపోయారు.

కిరణ్ సెల్-ఫోన్ రింగయి ఆగిపోయింది. కొద్ది క్షణాలకి మళ్ళీ కాల్ వచ్చింది. ఆన్సర్ చేసాడు. హలో,” ఫోన్ స్పీకర్ మీద ఉంచాడు. అవతలి నుండి మీనాక్షి....

బావా ఓ మారు ఈట్-స్ట్రీట్ డైనర్ కి రా. నీతో అర్జెంటు గా మాట్లాడాలి" అంది.

లేదు, కాస్త లేటవుతుంది. బయటెక్కడో ఉన్నాను. జవాబిచ్చాడు...

"మరో అరగంటలో మీట్ అయినా చాలు. ముఖ్యమైన విషయం బావా." అంది.

... వెళ్ళు. పర్వాలేదు... అన్నట్టుగా సైగ చేసింది పారూ.

"సరే .. వస్తాను." అన్నాడు కిరణ్ మీనాక్షితో.

కిరణ్ జీవితం నుండి, అసలెప్పటికైనా తనని తాను వేరు చేసుకుంటుందా మీనాక్షి? అన్న ప్రశ్న మెదిలింది పారూ మనసులో కాసేపు. మీనాక్షి అర్ధంలేని నడవడిని సునాయాసంగా కట్టడి చేయవచ్చు అన్న తలంపు కూడా కలిగింది. వెంటనే, శ్రీనివాస్ గారు, విమల ఆంటీల శ్రేయస్సు కొరకైనా సహనంతో ఉండాలి అన్న ఆలోచన చోటు చేసుకుంది.

"నిన్ను ఇంటివద్ద దింపి వెళ్ళొస్తానులే పారూ! తన మనసులో విషయం కొంత అర్ధమవుతుంది. అవసరమైతే సలహా ఇస్తాను." అన్నాడు నవ్వేస్తూ కిరణ్.

పారూ వంక చూసి "ఏమంత మౌనం.. చెప్పు ఏమాలోచిస్తున్నావు? అడిగాడు.

నోరు మెదపకుండా ఉండలేకపోయింది పారూ. తడయిన కళ్ళతో... మీనాక్షి విషయంలో తనకున్న సంశయం, శ్రీనివాస్ గారి విషయంలో ఉన్న ఆవేదన బయట పెట్టింది. తన మనసు అలజడితో నిండిపోతుందని చెప్పింది.

ఆమెని దగ్గరగా పొదవి పట్టుకుని, కళ్ళుతుడిచాడు కిరణ్. కాసేపు మళ్ళీవారి నడుమ మౌనం.

పారూ చేతిని తన గుప్పిట్లోకి తీసుకుని, నీ చేతివేళ్ళలాగానే, నీ మనస్సు కూడా అతి సున్నితం. ఇతరుల బాగోగుల పట్ల, వారి జీవితాల పట్ల నీవు కనబరిచే సానుభూతి నన్ను ఆశ్చర్యపరుస్తుంది.

నీలోని ఈ నిస్వార్ధతే నాకు నచ్చుతుంది. నీతో జీవితం పంచుకోగలగడం నిజంగా నా అదృష్టం పారూ!” అంటూ ఆమె తలపై తట్టాడు.

ఔనా? నవ్వింది పారూ. "నువ్వు కూడా మంచివాడివి. నాకందుకే నచ్చావ్ బావా!" అంటూ పైకి లేచి చేయందించింది. "పద మరి... నన్ను ఇంట్లో డ్రాప్ చేయి. మీనాని కలిసాక మాట్లాడుదాము. నీకు రేపొద్దుటే ఫ్లైట్ కదా!" అందామె.

**

ఐస్-టీ తెప్పించుకుని రెస్టారెంట్ లోని ఓ టేబిల్ వద్ద కూర్చున్నారు... కిరణ్, మీనాక్షీలు.

ఆమె చెప్పేదంతా విన్నాడు. "మీనా! మామయ్యా నీకు మంచి సంబంధం తెచ్చారు. రిషి మదురై ఒక యువ సంచలన సినీ దర్శకుడు. అందగాడు. మంచి కుటంబం. దయచేసి ఆలోచించు. ఇదే నీకు మంచిది. నా పట్ల ఉన్న ఆలోచనని తుడిచేయి. నాకు నీ పట్ల అటువంటి భావన లేదురా! అర్ధంచేసుకో.. ఇక నీవు కూడా పెళ్లి చేసుకుని హాయిగా స్థిరపడితే నాకూ సంతోషమే. తెలిసిందా మీనా.." అంటూ సర్ది చెప్పాడు కిరణ్.

"లేదు బావా! నేను మీ అందరి మీదా అలిగాను. నీవు చెప్పేది నాకు నచ్చలేదు. నా పేరెంట్స్ లాగానే నీవు కూడా. నా మొర వినేవారు లేరని తెలిసింది. సరే పద." అంటూ విసురుగా అక్కడినుండి లేచింది మీనాక్షి.

****సశేషం****

రచయిత్రి పరిచయం ....

‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.

1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.

బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.

సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.

సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.

అమెరికా లోని వివిధ (25)  దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.

రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట  ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.

ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.

నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన  ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.

విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్  సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్

Posted in April 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *