జంబేష్ ను హాస్పిటల్ నుండి డిశ్చార్జి చేశారు.
“అమ్మాయి నువ్వు మాతో పాటు వస్తావా? నాలుగు రోజులు ఉండి, మాణిక్యపురం వెళుదువు,” అంటూ అడిగాడు రాజన్.
ప్రణవికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ‘రాజన్ అడిగినట్లుగా వాళ్ళ దగ్గరకి వెళ్ళి ఉంటే! అమ్మో! మళ్ళీ మా ఇద్దరి మధ్యా గొడవలు పెడితే! భర్తను తీసుకుని మాణిక్యపురం వెళ్ళిపోతే! అక్కడ తానే చూసుకుంటుంది,’ అని అనుకుని,
“ఆయన్ని మాణిక్యపురం తీసుకుని వెళతాను,” అని చెప్పింది.
“నీకు అదే పోయింది కాదు! పెద్దవాళ్ళు చెప్పింది ఫాలోకావు. ఎదురు మాట్లాడతావు. ఆ ఊరు నీకేం తెలుసు? ఎప్పుడన్నా? నువ్వు ఒంటరిగా ఏమి తెలియని ఊర్లో ఎలా వెళ్లి ఉంటావు? వాడిని ఈ స్థితిలో మేము ఎలా పంపిస్తా మనుకుంటున్నావు? అన్నీ ఆలోచించి చెప్పాను. కాదు నేను ఉంటాను అంటే, నువ్వు ఒక్కదానివి పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఉండు. వాడ్ని తీసుకుని వెళతా… తగ్గాక వస్తాడు. ఆలోచించుకుని నిర్ణయం చెప్పు. ఏదైనా నీ ఇష్టమే,” అన్నాడు రాజన్.
‘భర్త ఈ స్థితిలో ఉంటే దగ్గర ఉండి చూసుకోవలసింది పోయి, వదిలేసి వెళ్ళింది. అని అంటారు. వెళితే ఒకరకం, వెళ్ళకపోతే మరోరకం,’ అనుకొని, “సరే బావగారు, మీ ఇష్ట ప్రకారమే వస్తాం. అయితే నాలుగు రోజులలో మమ్మల్ని పంపించండి,” అంది.
“నాలుగు రోజుల్లోనే తగ్గుతుందని హామీ ఇవ్వడానికి, నేను డాక్టర్ని కాను కదా! గుర్తు పెట్టుకో నీ కండీషన్స్ కి ఒప్పుకోవడానికి నీవు నేను చెబితేనో… నాకోసమో రావడంలేదు. నీ మొగుడు కోసం వస్తున్నావు. నీ ఇష్టం వస్తే రా! లేకపోతే లేదు,” అన్నాడు కోపంగా.
తన మాటల్లోని పొరపాటు గ్రహించిన ప్రణవి,
“సారీ బావగారు పొరపాటు గా మాట్లాడాను,” అంది.
“మాట అనే ముందు ఆలోచించుకొని అనాలి. నోటి నుంచి జారే మాట… గోడకేసి కొట్టిన బంతి లాంటిది. నువ్వు ఎంత స్పీడుగా వదిలితే అంతే స్పీడుగా వెనక్కి వస్తుంది. ఆడదానికి, మాట పొదుపు అవసరం. సర్లే నీకు నేను ఎంత చెప్పినా ఎక్కదు గానీ, ఏం నిర్ణయించుకున్నావు?” అన్నాడు.
“వస్తున్నాను,” అంది.
“రా… వచ్చాక, అక్కడ వాళ్లతో సఖ్యత గా ఉండు. గొడవలు పడబోక, నీ అవసరం మీద వెళుతున్నాను, అన్న విషయాన్ని మర్చిపోక,” అన్నాడు.
అందరూ కలిసి ఇంటికి చేరుకున్నారు.
***
ఇంటికి వెళ్ళిన ప్రణవిని వాళ్ళంతా అంటరాని దానిని చూసినట్లు చూడటం మొదలు పెట్టారు. ఆమె ఏదైనా అడిగితే అంటి ముట్టనట్టు జవాబులు చెప్పేవారు.
ఎవరైనా ఇంటికి వచ్చి ప్రణవిని పలకరిస్తే, ఆమెతో మాట్లాడకండి, మాట్లాడితే మీ మీద కూడా కేసు పెడుతుంది అనేది సుందరి.
గేటుకు తాళం వేసేసేవారు. జంబేష్ కు చెప్పుకునేందుకు ఉండేది కాదు. ఈ నాలుగు రోజులు తనను కాదు… అన్నట్లు ఉంటే సరిపోతుంది కదా! మాట ఒంటి మీద పడి పీకదు, అనుకుని ప్రణవి కామ్ గా ఉండేది.
ప్రణవికి సెల్ ఫోన్ ఉన్న విషయం జ్ఞాపకం వచ్చి, తీసి చూసింది. ఛార్జింగ్ లేదు. ఎవరూ ఫోన్ ని చూడకుండా ఛార్జింగ్ అయితే పెట్టింది, కానీ ఆమె దగ్గర ఫోన్ ఉన్న విషయాన్ని దాయలేక పోయింది.
సెల్ ఫోన్ వచ్చిన కొత్త కావడంతో ఫోన్ రీఛార్జ్ చేయాలంటే స్కాచ్ కార్డ్స్ ఉండేవి.
వాటిని కూడా ఇచ్చి పంపారు. కానీ వాటిని ఎలా వాడాలి అనేది చెప్పేటప్పుడు ప్రణవి సరిగ్గా వినలేదు. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో తెలియలేదు. ఇంట్లో అందరూ శత్రువును చూసినట్టు చూస్తుంటే… ఎవర్ని అడగాలో అర్థం కాలేదు. అసలు అలా దొంగతనంగా వాడాలన్నా ఆమె గిల్టీ గా ఫీల్ అయ్యింది.
‘ఏదో తప్పు చేసినట్లు దొంగతనంగా వాడుకోవడం దేనికి? డైరెక్ట్ గా వాళ్ళకు చూపించే వాడుకొంటా! పెద్ద కోడలు చక్కగా అన్నింటిలో స్వతంత్రం గానే ఉంది. తను చెప్పాలంటే మా అత్త ని కూడా డామినేట్ చేస్తుంది. నా కేంటి ఈ పరిస్థితి? అయినా నా వ్యక్తిత్వానికి విరుద్ధం, ఇలా దొంగచాటు వ్యవహారాలు, అబద్ధాలు చెప్పడం… నేను చేయను. ముఖ్యంగా నా భర్త దగ్గర అస్సలు చేయకూడదు. అతనికి విషయం చెప్పేస్తాను,’ అనుకుని ఫోన్ తీసుకుని వెళ్ళి జంబేష్ కు చూపించి, పనిలో పనిగా రీఛార్జి విషయం కూడా అడిగేసింది ప్రణవి.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక
రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)
పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.
బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి ‘సాహితీ విశారద’ బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.
సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.
ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.