Menu Close
Nagamanjari-Gumma
సీతాకోకచిలుకలు (ధారావాహిక)
నాగమంజరి గుమ్మా

నలుగురు దొంగలు లబోదిబోమన్నారు. మేకపిల్లల్ని తోలుకొని, దొంగలకు కట్టిన తాడు చేత్తో పట్టుకొని గూనోడు ముందు దారి తీసాడు. వెనక ఆరుగురు తమ్ముళ్లూ కావిళ్లు మోసుకుని నడుస్తున్నారు.

“ఒరేయ్ అన్నా… ఈ గూనోడు ఒక్క పిసరు కూడా బంగారం మొయ్యట్లేదు. మహా దర్జాగా నడుస్తున్నాడు. ఈడికి మనం తెస్తున్న బంగారంలో వాటా ఇవ్వాలా?” అడిగాడు నల్లోడు.

“ఇవ్వాలి కదరా” అన్నాడు భీముడు.

“ఓ పని సేద్దాం… గూనోడిని కూడా సెరువు లోకి తోసేద్దాం. కాలుజారి పడిపోయాడు అని సెప్పుదాం” అన్నాడు కృష్ణుడు.

“సరే” అన్నారు అందరూ. సిమ్మాద్రి సూపిన దారిలో నడిచారు. చెరువు దగ్గరకు రాగానే దొంగలతో పాటు గూనోడిని కూడా చెరువులోకి తోసేసారు. మేకపిల్లలు “మే మే” అన్నాయి. దొంగలతో పాటు గూనోడు కూడా చెరువులో మునిగిపోయాడు. ఆరుగురు గబగబా నడిచి పోయారు.

గూనోడు “పిట్టల్లారా రండి గింజలు తిని పోండి” అని కేక పెట్టాడు. పిట్టలన్నీ చుట్టూ చేరాయి. గూనోడు తాడు చివర నూకల మూట కట్టాడు. రెండో చివర పట్టుకున్నాడు. పిట్టలు నూకల మూట పట్టుకుని బలంగా ఎగిరాయి. ఆ ఊపుకి గూనోడు చెరువులో నుంచి బయటకు వచ్చాడు. చొక్కా పిండి, తొడుక్కొని, ఇంటి వైపు బయలుదేరాడు.

********

భీముడు తమ్ముళ్లతో, మేకపిల్లలతో ఇల్లు చేరాడు. రామమ్మ “గూనోడేడిరా?” అంది. “దొంగల్ని సెరువులోకి తోసినపుడు ఊపు కాసుకోలేక గూనోడు కాలుజారి సెరువులో పడిపోయినాడే అమ్మా” అంటూ దొంగ ఏడుపులు ఏడ్చారు అందరూ…

“అయ్యో గూనోడా ఎంతపని అయ్యిందిరా” అని గొల్లుమంది రామమ్మ.

“లేదమ్మా నేను సచ్చిపోలేదు. ఈదుకొని ఒచ్చీసినాను.” అన్నాడు గూనోడు గుమ్మంలో నిల్చుని.

తమ్ముళ్ళందరూ దెయ్యాన్ని సూసినట్టు సూసారు ఆడి వంక. అందరూ తెచ్చిన డబ్బులు, బంగారం మూటల్ని లెక్కపెట్టింది రామమ్మ.

“గూనోడు లేకపోతే మనకి ఈ బంగారం ఇసయం తెలీదు. మీరందరూ అక్కడే ఇరుక్కుపోయి సచ్చిపోయేవారు. ఆడుండబట్టి మీరందరూ బతికేరు. మీరు తెచ్చిన మూటల్లో ఒకటి గూనోడికి ఇవ్వండి. మీకొకటి ఉంచుకోండి” చెప్పింది రామమ్మ. ఏడవలేక… నవ్వలేక… ఒక మూట గూనోడికి ఇచ్చారు తమ్ముళ్లు. అందరికి ఒక్కొక్కటి మిగిలింది. గూనోడికి ఆరు మూటలు వచ్చాయి. గూనోడు కలగన్నట్లు అందరికంటే గొప్పోడైపోయాడు. “నా పేరు గూనోడు కాదు. నా పేరు రావుడు” అన్నాడు వాడు. “రావుడు గోరండీ దండాలండీ” అంది అమ్మ.

“ఇదిరా కథ. మన ఒళ్ళు ఎలా ఉన్నా, చదువు ఉన్నా, లేకపోయినా, సమయస్ఫూర్తి, తెలివితేటలు, ధైర్యం ఉంటే ఎంతటి కష్టం అయినా దాటిపోవచ్చు అని గూని పొట్టోడి కథ చెప్తోంది.” ముగించింది మహేశ్ నాన్నమ్మ.

అప్పటికే పొద్దుపోవడంతో సుబ్బిగాడు హడావిడిగా ఇంటికి పరిగెత్తాడు. ఇంటికి వెళ్లేసరికి దుర్గమ్మ భద్రకాళి అవతారంలో ఉంది.

“అయ్యేయా అయ్యగారి తిరుగుళ్లు? ఎంతసేపు సూడాలి? సీతని ఒగ్గేసి పోయావు. ఇంట్లో సుక్క నీళ్లు లేవు…” దండకం కొనసాగుతూనే ఉంది. సుబ్బు కుండ దగ్గరకు పరుగెత్తాడు. దుర్గమ్మ కోపం తీరక కర్ర పట్టుకోబోయింది. కుండ చేతిలోకి వచ్చిన క్షణంలోనే దుర్గమ్మ కర్రకి అందకుండా నీటి వైపు పరుగుతీసాడు.

*******

“మన సైన్యాధ్యక్షుల వారు చురుకైన, బలమైన యువకులు కావాలన్నారట. మనం ప్రయత్నిద్దామా?” వ్యాయామశాలలో కసరత్తులు చేస్తున్న తోటివారిని అడిగాడు రుద్రుడు.

“ఇప్పుడు యుద్ధ సన్నాహాలేవీ లేవే? సైన్య సమీకరణ ఎందుకు?” ప్రశ్నించాడు శంభుడు.

“అదంతా నాకు తెలీదు. మా బావ సైన్యంలో పనిచేస్తున్న విషయం నీకు తెలుసు కదా! మొన్న ఇటుగా వచ్చినప్పుడు చెప్పాడు. బహుశా గ్రామ రక్షణకై అయి ఉంటుంది” అన్నాడు రుద్రుడు.

“చూద్దాంలే! మన స్నేహితులను కూడా అడుగుదాం. తెలిసిన వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది కదా!” అన్నాడు శంభుడు.

ఆ మాట అటు తిరిగి, ఇటు తిరిగి గ్రామంలోని యువకులందరకూ చేరింది. అందరూ రుద్రుని ఇంటికి వచ్చి విషయం ఏమిటంటూ అడిగారు. రుద్రుడు తనకు తెలిసింది చెప్పాడు. ఈసారి తన బావ వచ్చినప్పుడు ఏ విషయం అడుగుతానన్నాడు. మరొక నాలుగు రోజుల్లో రుద్రుని బావ వచ్చాడు. రుద్రుడు సైన్యం విషయం తన బావను అడిగి తెలుసుకున్నాడు. తన స్నేహితులందరినీ రమ్మని చెప్పాడు. దాదాపు ఇరవై మంది యువకులు సైన్యంలో చేరడానికి సిద్ధపడ్డారు. రుద్రుని బావ వారందరినీ తమ సైన్యాధ్యక్షుడు అయిన వీరసింహుని దగ్గరకు తీసుకువెళ్లాడు. వీరసింహుడు వారందరినీ పరిశీలించి ఎనిమిదిమందిని ఒకచోట చేర్చి మిగతా వారిని గ్రామ రక్షణ దళంగా తమ ఊరికి పంపాడు. అక్కడ వారికి ‘రుద్రుని బావ శిక్షణ ఇచ్చి మరి కొంతమందిని కలిపి సైన్యంగా తయారు చేస్తాడు’ అని చెప్పాడు.

వీరసింహుడు ఎంపిక చేసిన ఎనిమిదిమందిని అడవిలో ఒక చోటుకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అలాగే వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన మరొక ఇరవై రెండు మంది యువకులు ఉన్నారు. వీరందరూ బలిష్టంగా, మంచి వయసులో ఉన్న కుర్రవాళ్ళు. ఆ ముప్పై మందిని ఒక గుహలోకి తీసుకువెళ్లాడు. “నేటి నుంచి ఇక్కడే మీ నివాసం. మీ తిండి నిద్ర అన్నీ ఇక్కడే. ఒక సంవత్సరం పాటు ఇక్కడ మీరు అనేక విద్యలు అభ్యసించాల్సి ఉంటుంది. అనేక పనులు చేయాల్సి ఉంటుంది.” అని చెప్పాడు. వారందరూ సమ్మతించారు. ఆ పూటకు భోజనం చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు వీరసింహుడు. అందరూ ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారేమో, భోజనం చేసి, నడుం వాల్చగానే నిద్రలోకి జారుకున్నారు.

పక్కనే ఉన్న మరో గుహలోకి వెళ్ళాడు వీరసింహుడు. అక్కడ వివిధ రకాలైన కత్తులు, కటార్లు తయారు చేస్తున్నారు కమ్మర్లు. మూడు అడుగుల పొడవైన కరవాలాలు, కొడవలి వంటి వంకీ కత్తులు, కాస్త సన్నగా నిట్టనిలువుగా ఉండే విచ్చుకత్తులు, చురకత్తులు, పలుచని రేకు కత్తులు, అరచేతిలో ఇమిడిపోయే చిన్న కత్తులు, మడత కత్తులు, పెద్ద కటారులు, చిన్న కటారులు, గుదియలు, గొలుసు గుదియలు, అర్ధచంద్రాకారంలో ఉండి, విసరగానే ఎదుటివారి పీక సగం నరికేసే వింత కత్తులు, వేళ్ళకు తగిలించడానికి ఉంగరాల్లా ఉన్న కత్తులు, పదును తేలిన నక్షత్రాకారాలు, ఇనప గొలుసులు, బల్లేలు, ఈటెలు, బాణాలు, విల్లులు, నేల లోకి పాతే వంపు తిరిగిన పెద్ద మేకులు ఇలా అనేక చిత్ర విచిత్ర ఆయుధాలు, సామగ్రి అక్కడ తయారవుతున్నాయి.

“శభాష్ శూరసేనా! మంచి ఆయుధాగారం తయారు చేసావు” అన్నాడు వీరసింహుడు.

“అవన్నీ నేను తయారు చేయించినవి కాదు వీరసింహా! మన సంగ్రాముడు సేకరించి తెచ్చాడు. వాటికి నేను నకలులు తయారు చేయిస్తున్నాను.” అన్నాడు శూరసేనుడు.

సన్నని చువ్వలతో చేసిన నాలుగడుగుల ఎత్తైన కిటికీలు నాలుగు చేయబడి ఉన్నాయి. వివిధ పరిమాణాలలో ఊచలను వంచి, అతికించి గుండ్రంగా తయారు చేసి ఉన్నాయి. అలాగే బండి చక్రం పరిమాణంలో కూడా వృత్తాకారంలో ఇనుప ఊచలను తయారు చేశారు. తయారవుతున్న వస్తువుల నాణ్యతను పరిశీలించారు వీరసింహుడు, శూరసేనుడు.

ఇంతలో గుర్రపు సకిలింపు వినబడి, గుహ బయటకు వచ్చారు వీరసింహుడు, శూరసేనుడు. రెండు గుర్రాల మీద నుంచి సంగ్రాముడు, విక్రముడు దిగారు. నలుగురూ ఆయుధాలు తయారు చేసే గుహలోకి వెళ్లారు. సంగ్రాముడు సేకరించగా, శూరసేనుడు తయారు చేయిస్తున్న ఆయుధాలను పరిశీలించాడు విక్రముడు. సంతృప్తి వ్యక్తం చేశాడు. నలుగురూ బయటకు నడిచారు.

మరికొంత దూరంలో, తక్కువ ఎత్తులో పందిళ్లు వేసి ఉన్నాయి. అక్కడ వంటలు సిద్ధమవుతున్నాయి. రాగి పిండి అంబలి, జొన్న అన్నం, మిరప్పళ్ళ పచ్చడి, ఉడకబెట్టిన దుంపలు, కాల్చిన మాంసం ముక్కలు, అడవి చెట్ల బెరళ్ళు వేసి కాచిన చారు… సుమారు వందమందికి అక్కడ భోజనం సిద్ధమవుతోంది.

వంటలు వండేవాళ్ళు, వంటసామగ్రి సిద్ధం చేసేవాళ్ళు, విస్తరాకులు కుట్టేవాళ్ళు, ఆయుధాలు తయారుచేసేవాళ్ళు, వాళ్లకు సూచనలు ఇచ్చేవారు, విశ్రాంతి తీసుకుంటున్న యువకులు… అందరూ కలిపినా వందమంది కాలేదు కదా… మరి ఇంత ఎత్తున వంటలు ఎందుకో… సంగ్రాముడు, వీరసింహుడు ఆలోచించసాగారు. తమ పక్క నుండే నక్క ఊళ వినబడింది. ఎక్కడి నుంచో జవాబుగా మరో నక్క ఊళ వేసింది. చుట్టూ ఉన్న చెట్టుకొమ్మలు కదిలాయి. తల ఎత్తి చూసారు అందరూ. ఎక్కడా కోతుల జాడ లేదు. కొమ్మలు మాత్రం కదులుతున్నాయి. వంటినిండా నలుపురంగు పూసుకుని, తలకు ఈకలు, మొలకు ఆకులు కట్టుకున్న ఆటవికులు కొందరు చెట్లమీద నుంచి దుమికారు. ఉలిక్కిపడ్డారు సంగ్రాముడు, వీరసింహుడు.

“వీరందరూ మనకు సహాయం చేసే భిల్ల యువకులు” పరిచయం చేశాడు శూరసేనుడు. విక్రముడు తలవూచాడు.

శూరసేనుడు సైగ చేయగానే నిశ్శబ్దంగా చెట్లు ఎక్కేసారు. ఈసారి ఒక్క ఆకు కూడా కదలకపోవడం గమనించారు సంగ్రాముడు, వీరసింహుడు.

“విక్రమా కొద్ది కాలంలోనే మన సేన సిద్ధమైపోయిందే…” అన్నాడు వీరసింహుడు.

“నువ్వు తీసుకొచ్చిన యువకులందరూ కత్తుల్లా ఉన్నారు. వీరికి రకరకాల శిక్షణ నివ్వాలి. రాటు దేల్చాలి. మనకి అనువుగా మార్చుకోవాలి” చెప్పాడు విక్రముడు.

“సరే పొద్దు గుంకబోతోంది. ఇక నిష్క్రమిద్దాం” ఒకరికొకరు చెప్పుకొని, తమతమ గుర్రాలను అధిరోహించారు నలుగురూ…

*******

“నాన్నమ్మ ‘గూని పొట్టోడి’ కథ భలేగా చెప్పింది కదరా…” అడిగింది లష్మి.

“నాన్నమ్మ భలే కథలు చెప్తుంది తెలుసా… రాజు గారు – నల్ల గుర్రం, పేను – పెసరచేను ఇలా ఎన్ని కథలు వచ్చునో…” చెప్పాడు మహేశు.

“నీకు రోజూ కథలు చెప్తుందా?” అడిగింది లష్మి.

“ఉహు. ఎప్పుడైనా చెప్తుంది.” చెప్పాడు మహేశ్.

“బుజ్జిగాడేడి?” అడిగాడు శీను.

“సుబ్బు ఎల్లిపోగానే బుజ్జిగాడు కూడా ఎల్లిపోనాడు” చెప్పేడు మహేశు.

“అయితే నేను కూడా ఎల్లొస్తా” చెప్పింది లష్మి.

శీను కూడా బయలుదేరాడు. “నాన్నమ్మా శీనుతో అలా పోయెస్తా” చెప్పి, శీను భుజం మీద చెయ్యేసి బయలుదేరాడు మహేశు.

“ఒరే మా నాన్న తాగకపోతే నాకు మిఠాయిలు, మా అమ్మకి పువ్వులు తెస్తాడురా. ఇంతకు ముందు రోజు తాగీవోడు కాదు, అప్పుడు తెచ్చేవోడు. ఇప్పుడు రోజూ తాగేసి వత్తన్నాడు.” బాధగా చెప్పేడు శీను.

“లష్మీ! మీ నాన్న వొండుతాడా?”

“అవును. కానీ నేను కూడా వంట నేర్చుకోవాలనుకుంటున్నాను. కానీ పెద్ద గిన్నెలు పొయ్యి మీద నుంచి కిందకు దింపలేను. అందుకే మా నాన్న కొంచెం పెద్దయ్యాక వొండమన్నాడు” చెప్పింది లష్మి.

“సరే కాని లష్మి నువ్వు మీ అమ్మను చూశావు కదా” అడిగాడు మహేశు.

“చూసాను”

“నేను మా అమ్మని చూళ్ళేదు, మా నాన్నని చూళ్ళేదు. శీనుగాడికి అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు. నీకు నాన్న ఉన్నాడు. బుజ్జి గోడికి అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు. సుబ్బి గోడికి అమ్మ నాన్న లేరు. పిన్ని ఉంది. ఏటో మన బతుకులు.” బాధగా నిట్టూర్చాడు మహేశు.

****సశేషం****

రచయిత్రి పరిచయం:

Nagamanjari-Gummaనాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..

కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల… ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.

అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.

Posted in April 2026, కథలు

1 Comment

  1. chavali seshadri somayajulu

    పాత్రల పేర్లు చాలా బాగున్నాయి. రచనా విధానం అద్భుతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *