Menu Close
ఆదర్శమూర్తులు
-- డా. మధు బుడమగుంట --

తమ జీవిత అనుభవపూర్వక గాథల ద్వారా మన జీవితాలలో స్ఫూర్తిని నింపి, ప్రశాంత జీవన సరళికి మార్గ నిర్దేశకులుగా నిలిచిన ఎందఱో మహోన్నత వ్యక్తుల జీవన శైలి గురించిన సమాచారం అందించడమే ఈ ‘ఆదర్శమూర్తులు’ శీర్షిక యొక్క ముఖ్యోద్దేశం. ప్రతి సంచికలో తమ తమ రంగాలలో నిష్ణాతులై, నిస్వార్ధంగా నివసించి అందరికీ మంచి మార్గాన్ని చూపించిన మహానుభావుల గురించిన సమాచారం క్రోడీకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము.

మన సిరిమల్లె ఆరవ వార్షిక ప్రత్యేక సంచిక సందర్భంగా సెప్టెంబర్ 2021 నుండి జూలై 2022 సంచిక వరకు ప్రచురించిన ఆదర్శమూర్తుల జీవిత గాథలు మరొక్కసారి సంగ్రహంగా మీకు అందిస్తున్నాం.

ఈ అంశాలను పూర్తిగా చదువుటకై క్రింద ఇవ్వబడిన శీర్షికలపై క్లిక్ చేయండి.

సెప్టెంబర్ 2021 - సర్. జగదీష్ చంద్రబోసు

ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు అది చెడైనా, మంచైనా మనం ఉద్వేగానికి లోనవడం జరుగుతుంది. అలాగే విపరీతమైన వేడిని లేక చలిని ఎదుర్కొన్నప్పుడు మన శరీరంలో ఏర్పడే జలదరింపు, రోమాలు నిక్కపోడుచుకోవడం తదితర ధర్మాలు మనకు తెలియకుండానే జరిగే అసంకల్పిత చర్యలు. వాటినే మనం ఫీలింగ్స్ అని అంటుంటాము. అటువంటి స్పందనలే మరి ఇతర జీవాలలో కూడా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి అని చెబుతాము.

కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా చెట్లు తమకు కావలిసిన పిండిపదార్థాలను సూర్యకాంతిని ఉపయోగించి తయారుచేసుకుంటాయి. ఇది 18 శతాబ్దంలోనే కనుగొనడం జరిగింది. ఇది ఒక రసాయన ప్రక్రియ. అయితే మనుషుల లాగే చెట్లకు కూడా వాతావరణ మార్పులకు అనుగుణంగా స్పందించే గుణం ఉంటుందన్న విషయాన్ని శాస్త్రీయంగా వంద ఏళ్ల క్రితం అంటే 20 వ శతాబ్ద ప్రారంభంలో కనుగొనడం మరియు నిరూపించడం జరిగింది. ఆ ప్రక్రియకు ప్రధాన సూత్రధారి మన భారతీయ శాస్త్రవేత్త సర్. జగదీష్ చంద్రబోసు, నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/jagadish-chandrabose/

అక్టోబర్ 2021 - ‘మహానటి’ శ్రీమతి సావిత్రి

మనుషులు నిజజీవితంలో ఏర్పడిన ఒడిదుడుకులు, సంతోష సమయాలు, ఉద్వేగాలు ఇలా అన్ని రసాలను కలిపి జీవిత సారాన్ని అనుభవిస్తున్నారు. నిజజీవితంలో జరిగిన కొన్ని అంశాలను ఆధారంగా తీసుకొని మొదట్లో నాటకాలను ప్రదర్శించేవారు. కాలక్రమేణా చలనచిత్ర రంగం ఏర్పడి తద్వారా చిత్రాలను నిర్మించి మనిషి జీవితంలోని భాగాలను మరింత కళ్ళకు కట్టినట్లు చూపించడం జరుగుతున్నది. అయితే సినిమా అనేది కేవలం నటన, కృత్రిమము అని మనకు తెలుసు. కానీ కొంతమంది నటీనటుల నటనా చాతుర్యం ఎంతో సహజసిద్ధమై ఆ చిత్రాన్ని వీక్షిస్తున్నంత సేపు మనం కూడా ఆ అనుభూతులకు లోనౌతూ అందులో మునిగిపోతాము. అటువంటి వారిని తలచుకోగానే మనకు వెంటనే స్ఫురించేది, మన తెలుగింటి ఆడపడుచు, తన అసమాన నటనతో ఎంతో మంది చలనచిత్ర నటీ నటులకు స్పూర్తినందించిన ‘అన్ని తరాల’ అభిమాన తార, వెండితెరపై తన ముద్రను స్థిరంగా వేసుకున్న సామ్రాజ్ఞి, దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రకాశించిన ధృవతార, కేవలం అందం, అభినయంతో నటనకే భాష్యం చెప్పిన, మహానటి ‘శ్రీమతి నిశ్శంకర సావిత్రి’ నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/mahanati-savithri/

నవంబర్ 2021 - డా. రావూరి భరద్వాజ

మనిషి పుట్టుక ఎంతో మహత్తరమైనది. మనిషిగా ఈ గడ్డమీద కాలుమోపిన ప్రతి ఒక్కరి జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది, ఉండాలి. ఆ విషయాన్ని అవగతం చేసుకున్న వారు వారి పుట్టుక యొక్క ఆంతర్యాన్ని గ్రహించి తదనుగుణంగా వారి జీవన శైలిని మలుచుకుని తమ జీవితసారాన్ని అర్థవంతంగా మలిచి సార్ధకతను చేకూరుస్తారు. అటువంటి వారినే మనం మహాపురుషులంటాము. నిరాడంబరులైన అటువంటి పుణ్య పురుషులు తమ జీవితాలనే అనుభవాలుగా, తృష్ణతో, తపనతో, సేవాతత్పరతతో సమాజ పోకడలను, అందులోని లోటుపాట్లను ఎత్తి చూపుతూ ప్రజల జీవితాలలో చైతన్యం రగిలించి అభ్యుదయ అభివృద్ధి పథం వైపు శ్రమ తెలియకుండానే నడిపించి, మానసిక స్థైర్యంతో సమస్యలను ఎదుర్కొనే విధానాలను సమాజానికి అందిస్తారు. తమ రచనల ద్వారా అటువంటి సామాజిక చైతన్యానికి దారి చూపిన మహనీయుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. రావూరి భరద్వాజ నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/ravuri-bharadwaja/

డిసెంబర్ 2021 - ఆంటోనీ వాన్ లీవెన్హోక్ FRS (Antony van Leeuwenhoek, FRS)

నేటి విజ్ఞాన సాంకేతిక ప్రపంచంలో, అత్యంత సూక్ష్మ పదార్థాలను, జీవులను మొదలుకొని అమిత పెద్దవైన గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలను కూడా మనం వీక్షించగలుగుతున్నాము. అందుకు మనకు ఎన్నో రకాలైన సూక్ష్మదర్శినిలు మరియు దూరదర్శినిలు ఉపయోగపడుతున్నాయి. అత్యంత పరమాణు ప్రమాణంలో ఉన్నవాటిని కూడా స్పష్టంగా చూడగలుగుతున్నామంటే అందుకు మనం ఉపయోగించే సూక్ష్మదర్శిని లు మరియు వాటిని తయారుచేసిన శాస్త్రవేత్తల మేధోసంపత్తి అపూర్వము. మరి అవి ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తున్నాయని ప్రశ్నించుకుంటే కాంతి యొక్క పరావర్తన ధర్మమే అని తెలుస్తుంది. మరి అదే ధర్మాన్ని రెండు విభిన్న ప్రక్రియలకు ఎలా వాడగలము అనుకుంటే ... దానికి సమాధానం మరింత శాస్త్రీయ పరిజ్ఞానంతో కూడుకుని వుంటుంది. అది అప్రస్తుతం.

మనిషి నిజజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను పారద్రోలే ప్రక్రియలలో ఎన్నో విషయాలను అవగాహనతో అర్థం చేసుకునే స్థితికి చేరుకొని, ఎన్నో సైద్ధాంతిక శాస్త్రీయ విశ్లేషణలు జరిపి తద్వారా ఈ సృష్టిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎన్నో వందల సంవత్సరాలుగా మనిషి తన మేధోసంపత్తిని ఉపయోగించి ఎన్నో ఆవిష్కరణలు చేయడం జరుగుతూనే ఉంది. ఆ క్రమంలోనే నేటి అత్యాధునిక పరికరాలకు మూలం వందల ఏళ్లనాడే ప్రారంభమయింది. ఆ కార్యక్రమ బాటలోనే క్రీ.శ. పదిహేడవ శతాబ్దంలోనే కనుగొన్న సూక్ష్మదర్శిని నేడు మనం చూస్తూ, పరిశోధనలు చేస్తున్న ఎన్నో రకాల విషక్రిములను మరింత పటిష్టంగా క్రమపద్ధతిలో నియంత్రించేందుకు ఉపయోగపడుతున్నది. ఆ పరికరాన్ని మొట్టమొదటగా రూపకల్పన చేసి తద్వారా సూక్ష్మ క్రిములు (bacteria), ఏకకణజీవుల (protozoa) ఉనికిని మొట్టమొదటగా గుర్తించిన శాస్త్రవేత్త, microscopist, వ్యాపారవేత్త మరియు డచ్ దేశ ప్రతినిధిగా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీ ఆంటోనీ వాన్ లీవెన్హోక్ (Antony van Leeuwenhoek) నేటి ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/antony-van-leeuwenhoek/

జనవరి 2022 - పద్మశ్రీ డా. సుధా మూర్తి

ప్రతి మనిషి పుట్టుకకు ఒక ప్రాయోజిత నిర్దేశాత్మక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని దిగ్విజయంగా అధికమించిన రోజు మానవ జన్మకు నిజమైన సార్థకత చేకూరుతుంది. అయితే అటువంటి ఆలోచనలు, ఆచరణలు అందరికీ సాధ్యం కాదు. అందుకు కృషి, పట్టుదల, పారదర్శక జీవన విధానం, అతీంద్రియమైన సంకల్ప బలం ఉండాలి. కనుకనే అటువంటి లక్ష్యాలను సాధించిన వారిని కారణజన్ములు లేక ఆదర్శమూర్తులు అంటాము.

‘మనసుంటే మార్గముంటుంది’ అని స్వచ్ఛ సంకల్పంతో వేయి విధములైన కార్యాలను అలుపెరుగక, అన్ని పనులను అలవోకగా చేస్తూ, నిత్య సంతోషాన్ని ఆస్వాదిస్తూ, పదిమందికీ పంచుతూ, సకల జనావళి అభ్యున్నతికై పాటుపడిన మానవతా మూర్తి, ‘ఎంత ఎదిగినను, నేను సగటు మనిషినే’ అనే భావనతో అందరితో కలివిడిగా మసలే కారుణ్యమూర్తి, అన్ని సద్గుణ లక్షణాలను తనలో ఇముడ్చుకుని మూర్తీభవించిన చైతన్యమూర్తి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మహిళామూర్తి, పద్మశ్రీ శ్రీమతి సుధా కులకర్ణి మూర్తి నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/sudha-moorthy/

ఫిబ్రవరి 2022 - పద్మభూషణ్ డా.గుర్రం జాషువా

సాంఘిక జన జీవన నాగరికత ఏర్పడినప్పటి నుండి మనిషి తన అభ్యున్నతికై స్వార్థచింతనతో సామాజిక అసమానతలను సృష్టించి వాటిని పెంచి పోషిస్తూ అగ్రవర్ణాలు, నిమ్నజాతులు అనే వివక్షతను సంఘంలోని కొన్ని వర్గాలకు అనుగుణంగా మలుచుకొని తద్వారా ఎంతో ఉన్నత స్థితికి చేరుకొన్నారు. దాని పర్యవసానం సమాజంలోని బడుగువర్గ ప్రజలు ఎటువంటి అభివృద్ధిని, సమాజ స్థాయిని చేరుకోలేక ఎన్నో అసమానతల అవమానాలతో తమ జీవితాలను గడిపేవారు. అటువంటి వారి పట్ల సానుభూతిని కలిగి, సమాజంలో ఏర్పడిన అసమానతనలు తొలగించేందుకు, ఆ వర్ణ వివక్షను రూపుమాపి మనుషులందరూ ఒక్కటే అని నిరూపించేందుకు ఎంతోమంది మహానుభావులు తమ వంతు బాధ్యతతో కృషి సల్పారు. తమ రచనల ద్వారా అభ్యుదయవాదాన్ని వినిపిస్తూ ప్రజలలో సమసమాజ చైతన్యస్ఫూర్తిని నింపేందుకు అలుపెరుగక శ్రమించారు. ఆ అసమానతల దాష్టికాలను స్వయంగా అనుభవించి తద్వారా ఎంతో మానసిక క్షోభను పొంది ఆ స్వానుభవంతో, సమసమాజ నిర్మాణ అవరోధాలను అధికమించి, తన అనుభవపూర్వక ఆలోచనల స్రవంతికి అక్షరరూపం కల్పించి, తన అభ్యుదయ రచనల ద్వారా ఎంతోమందికి చైతన్య స్ఫూర్తిగా నిలిచి తను కలలుగన్న ఆ నవసమాజ స్థాపనకై పాటుపడిన మహోన్నత వ్యక్తి, పద్మభూషణ్ డా. గుర్రం జాషువా, నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/gurram-jashuva/

మార్చి 2022 - భారతరత్న లతా మంగేష్కర్

వసంత ఋతువు ఆగమనాన్ని సూచిస్తూ వనంలోని చెట్లన్నీ ప్రకాశవంతమైన పూతతో చిగురించడం మొదలుపెడతాయి. పుప్పొడి రేణువులు గాలిలో విహరిస్తూ ఉంటే కోకిలలు తమ కిలకిలరావాలతో తమ పారవశ్యాన్ని తెలుపుతాయి. అటువంటి ఆహ్లాదకర వాతావరణంలో, సమాజవనం లోని సగటు మనిషి ఆనందకర ఆలోచనలతో సరికొత్త ఆశలను సృష్టించుకొని మాటలకు వర్ణించలేని అనుభూతులకు లోనవడం జరుగుతుంది. అంతటి ఆరోగ్యకర అనుభూతులకు కారణమైన కోయిల మనిషి జన్మను దాల్చి తన గానామృతంతో ఎల్లవేళలా మనకు ఆహ్లాదాన్ని అందిస్తే, అంతకుమించిన అదృష్టం మరోటి ఉండదు. అటువంటి అదృష్టాన్ని మన భారతీయులందరికీ అందించి తన సంగీత సాగరంలో అందరూ సేదతీరి మనోల్లాసాన్ని పొందేటట్లు చేసి, ఏడు దశాబ్దాలు తన గాత్రంతో అన్ని భారతీయ భాషల వారినీ అలరించి ముప్పై సంవత్సరాలలో ముప్పై వేల పైచిలుకు పాటలను ఆలపించి, గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించి, ఎందఱో వర్ధమాన గాయనీగాయకులకు స్ఫూర్తిగా నిలిచి, సమాజ శ్రేయస్సుకై తన వంతు కృషి సల్పిన ‘భారత రత్న’ పురస్కార గ్రహీత, నిగర్వి, ‘గాన కోకిల’, లతా మంగేష్కర్ నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/bharatharathna-latha-mangeshar/

ఏప్రిల్ 2022 - పేదల పెన్నిధి దామోదరం సంజీవయ్య

సమాజంలో సామాజిక, ఆర్ధిక అసమానతలు, మనుషులమైన మనం సృష్టించుకున్నవే. తద్వారా సామాజిక హోదాలు, మెరుగైన ఆర్ధిక స్థితిగతులు కల్పించుకొని కొన్ని వర్గాలు, కొంత శాతం మేర మనుషులు బాగుపడ్డారు. వారి పరంపర వారసత్వ తరాలు అన్నీ, ఆ సుఖాలను అనుభవిస్తూ నేటికీ ఆ అసమానతల వైవిధ్యాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఈ సూత్రాన్ని, వ్యత్యాసాన్ని మనిషి మేధస్సుకు ఎవ్వరూ ఆపాదించలేరు. ఎన్ని అసమానతలు, వర్ణ వివక్షల విధానంలో సమాజమున్ననూ కూడా మేధా సంపత్తి అనేది పుట్టుకతోనే ప్రతి మనిషికీ అబ్బే ప్రధాన గుణం. దానిని పదునుపెట్టే విధానంలో ఆ మేధస్సు ఎంతో చురుకుగా వ్యవహరించి ఎంతో విజ్ఞానాన్ని సముపార్జించి, మట్టిలో ఉన్న మాణిక్యం వలె మనిషి ఉనికిని సూచిస్తుంది. ఆ విజ్ఞాన గని అయిన మేధస్సుకు కుల, మత, వర్ణ, వర్గ విబేధాలు ఏవీ ఉండవు. అటువంటి మేధస్సును కలిగి సామాజిక అభివృద్ధి, సర్వ సమానత్వం కొరకు పాటుపడిన మహా మంచి మనిషి శ్రీ దామోదరం సంజీవయ్య నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/damodaram-sanjeevayya/

మే 2022 - రాణీ రుద్రమదేవి

మదర్ థెరీసా, సరోజిని నాయుడు, ఇందిరాగాంధీ, పల్నాటి నాగమ్మ, కవయిత్రి మొల్ల, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా యావత్ భారత చరిత్రలో తమకంటూ ఒక పుటను పదిలపరచుకొన్న, సాధ్వీమణులు ఎందఱో ఉన్నారు. వీరందరూ తమకు లభించిన ప్రాత్సాహంతో, తాము నమ్ముకున్న సిద్దాంతాల ద్వారా సామాజిక స్ఫూర్తిని కలిగించారు. తద్వారా దేశ అభ్యున్నతికి అవిరళ కృషి సల్పారు. వీరి చరిత్రను చదివిన తరువాతైనా, మహిళలను చిన్న చూపు చూసే వారికి కనువిప్పు కలిగితే అది ఎంతో సంతోషకరమైన విషయం.

అయితే, వీరందరి కన్నా చరిత్ర పుటలలో ముందుగా నిలిచి ఆడది అంటే అబల కాదు ఆదిపరాశక్తి అని అక్షరాల నిరూపించి వీరోచిత జీవన అభ్యున్నతితో తన రాజ్యం సస్యశ్యామలమై ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లే విధంగా ఎన్నో మంచి కార్యాలను చేపట్టి వారికి అండగా ఉంటూ చాలామందిలో ముఖ్యంగా మహిళలలో ధీరోదాత్త గుణాలను ద్విగుణీకృతము చేసిన కాకతీయ వంశాంకురం మరియు పట్టపురాణి ‘రాణీ రుద్రమదేవి’, ఈనాటి మన ఆదర్శమూర్తి, మహిళలందరికీ గొప్ప స్ఫూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/rani-rudramadevi/

జూన్ 2022 - పద్మశ్రీ స్వామి శివానంద

ఆదర్శమూర్తులు అంటే వారి జీవితానుభవాల సారాన్ని పదిమందికి పంచి, సత్సంకల్పంతో సమాజ అభివృద్ధిని ఆకాంక్షించేవారు. వారిలో రెండు రకాలు ఉంటారు. మొదటి వర్గం వారు పుట్టుకతోనే సంపన్నులై అన్నీ సౌకర్యాలను కలిగివుండి, సామాజిక స్పృహతో వారి వారి పలుకుబడిని, సంపదను సమాజ శ్రేయస్సుకై వెచ్చించి తద్వారా సమాజంలో మార్పును ఆశించేవారు. ఇక రెండవ వర్గం కష్టాలు, సామాజిక అసమానతలు, పేదరికం తదితర జీవన్మరణ సమస్యలను పుట్టుకతోనే పొంది వాటిని అధికమించి జీవితంలో రాణించి వారి ఆశయాలను నెరవేర్చుకొని అందరికీ ఆదర్శంగా నిలిచేవారు. రెండు వర్గాలలోనూ ఒకటే ఆశయం, ఆకాంక్ష. అదే సమాజ శ్రేయస్సు, అభివృద్ధి. అయితే మొదటి వర్గానికి లభించిన పేరు, గుర్తింపు రెండో వర్గంలోని అందరికీ లభించదు. అటువంటి వారిని గుర్తించడం కొంచెం కష్టమే. ఎందుకంటే వారు దైనందిన జీవన సమస్యలను అనుభవిస్తూ వాటిని అధికమించి వారి అనుభవపూర్వక జీవన శైలిని అందరికీ చూపిస్తారు. ఇతరులకు మేలు చేయాలనే చేతలు తప్ప మాటలు అంతగా ఉండవు.

ఎల్లప్పుడూ డబ్బు సంపాదించాలనే కోరిక, కుటుంబ స్థితిగతులను పెంచుకొని అందరూ తమను గుర్తించాలనే కీర్తి కండూతి మరియు సామాజిక ఉన్నతికై ఆరాటపడే స్వార్థ చింతన వంటివి ఏమీ లేకుండా సాధారణ కుటుంబ జీవన శైలితో నివసిస్తున్న ఎంతోమంది సామాజిక సేవామూర్తులు మన నిజజీవితంలో తారసపడుతుంటారు. అటువంటి వారికి ఎటువంటి రుగ్మతలు దరి చేరవు, మానసిక ఆందోళనలు ఉండవు. అటువంటి జీవన సూత్రాలతో అత్యంత సాధారణ దైనందిన జీవన కార్యాలు, సదా ఉత్తేజపూరిత ఆలోచనలు, ఆచరణలతో నిత్య సంతోషంగా నివసిస్తున్న శ్రీ స్వామి శివానంద నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/padmasri-swami-sivananda/

జూలై 2022 - వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయ్

వీరత్వం అనేది ప్రతి మనిషిలోనూ ఉండే, ఉండవలసిన సహజలక్షణం, ధర్మం. ఆ లక్షణం మన ఆలోచనలలో స్థిరంగా ఉండి భౌతికంగా ధృడంగా ఉన్నప్పుడు ఆ ధర్మం ద్విగుణీకృతము అవుతుంది. సహజంగా మగవారు దేహధారులు కనుక వీరత్వం అనేది మగవారిని ఉద్దేశించి వీరుడు అని నిర్వచించి ఆ పదమే వాడుకలోకి వచ్చింది. కానీ స్త్రీలు కూడా ధీరోదాత్తులే అని నిరూపించి సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య దాష్టికానికి ఎదురొడ్డి ధైర్యంగా పోరాడి అసువులు బాసిన వీర వనిత, ఎంతో మంది మహిళలకు వారిలో సహజంగా నిద్రాణమై ఉన్న ధీరత్వాన్ని, ధైర్యాన్ని గుర్తించి వారిని వీర నారీమణులుగా, వీర మాతలుగా తీర్చిదిద్దిన శ్రీమతి ఝాన్సీ లక్ష్మీ బాయ్ నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/jhansi-laxmibai/

Posted in August 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!