Menu Close
దీపపు వెలుగు (కథ)
గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం

"విశ్వనాధంగారూ, ఎపెక్స్ గార్మెంట్స్ ఫైలు మీద మీ నెగెటివ్ నోటింగ్సు చూసేను. ఈ ప్రొపోజల్, మన బ్రాంచికి చాలా ముఖ్యమయినది. నిజానికి, దీన్ని వాళ్ళు స్టేట్ బ్యాంకుకి ఇద్దామనుకొన్నారు. నేను, అతి కష్టం మీద, వాళ్ళ ఎమ్.డి.ని ఒప్పించి తెచ్చేను. ఈ లోను ఎకౌంటు మన బ్రాంచికి వస్తే, మన బ్రాంచికి మనం ఊహించలేని లాభాలు వస్తాయి.

మీకూ, త్వరలో ప్రొమోషనుకు, ఇంటర్వూ కాల్ రావలసి ఉంది. బాగా ఆలోచించుకోండి. ప్రొపోజల్ రిజెక్ట్ చేస్తే, నష్టపోయేది, మన బ్యాంకే. వాళ్లకి, ఏ బ్యాంకయినా కళ్ళకద్దుకొని సేంక్షన్ చేస్తుంది. అవసరమయితే, వాళ్ళ ఫైనాన్స్ మేనేజరు తో డిస్కస్ చేసి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రివైజుడివి సబ్మిట్ చెయ్యమనండి. ఈ ఎకౌంటు మన బ్రాంచికి వచ్చి తీరాలి. అది జ్ఞాపకం ఉంచుకోండి." బ్రాంచి ఛీఫ్ మేనేజరు రఘురామయ్యగారు, లోన్సు మేనేజరు విశ్వనాధంగారికి, ఫైలు అందజేస్తూ, ఇచ్చిన సలహా.

"సర్, ఫైలుని చాలా పోజిటివ్ మైండ్ తోనే, చూసేను. కాని, ఇంపార్టెంట్ పెరామీటర్స్, చాలా వీక్ గా ఉన్నాయి. వాళ్ళ మార్కెటింగ్ ప్రొజెక్షన్స్ కూడా రియలిస్టిక్ గా లేవండి. వాళ్ళ టార్గెట్ గ్రూపు, స్టూడెంట్సు ఎండ్ మిడిల్ క్లాస్ అన్నారు. ప్రొజెక్టెడ్ సేల్సులో, హాఫ్ స్లీవ్ షర్టు 875 నుండి 1080 రుపీస్ చూపిస్తున్నారు. ఇప్పుడు నేను వేసుకొన్న షర్టు, పీటర్ ఇంగ్లండ్ వాళ్లదండి. క్రిందటి వారం 655 కి కొన్నాను. సర్, ఎక్సపెండిచరు కూడా, అలాగే, చాలా తక్కువగా చూపిస్తున్నారు. Acceptable levels లో లేవండి.” అని, విశ్వనాథంగారు ఇంకా ఏవో చెప్పబోతూంటే,

"విశ్వనాధంగారూ, బ్యాంకింగు ఒక బిజినెస్. బిజినెస్ లో సక్సెస్ కావాలంటె, రిస్కు తీసుకోవాలి. వాళ్ళూ రిస్కు తీసుకొంటున్నారు. మీరు తెలివయిన వారు. లోన్సు లో మీరు ఎక్స్పర్ట్. ఏం చెయ్యాలో మీకు నేను చెప్పక్కర్లేదు. అంచేత, నా సలహా ఏమిటంటే; మీరు ఈ ఫైలు తీసుకెళ్లి, రేపు సాయంకాలానికి, రికమండేషన్ నోట్ తో, నాకు సబ్మిట్ చెయ్యండి. నాకు కలెక్టరు గారితో మీటింగు ఉంది; వెళ్తున్నాను." అని తొందరగా లేచి, రఘురామయ్యగారు బయటకు నిష్క్రమించేరు.

అదే రోజు రాత్రి, తొమ్మిది గంటల సమయం. బ్యాంకు ఛీఫ్ మేనేజరు రఘురామయ్యగారి సెల్ ఫోను మ్రోగింది.

"సర్, ఎపెక్స్ గార్మెంట్స్ ఎమ్.డి. సురేష్ గుప్తా మాట్లాడుతున్నాను."

"చెప్పండి, గుప్తాగారూ, మీ ఫైనాన్సు మేనేజరు, మా మేనేజరుని, మేనేజ్ చేసేడా."

“మా ఫైనాన్సు మేనేజరు, విశ్వనాధంగారి ఇంటికి వెళ్లి ఆయనను కలిశాడు సర్. విశ్వనాథంగారు, ఫైలులో ఆయన నోటింగ్సు మార్చే అవకాశాలు లేవని, చాలా మర్యాదగా చెప్పేరట. ఆఫర్ను…పోలైటుగా రెఫ్యూజ్ చేసేరట సార్. అయితే...ఇప్పుడు మా ప్రొపోజలు సంగతేమిటి సర్."

"గుప్తాగారూ, గాభరా పడకండి. ఎల్లుండి సాయంత్రానికి, సేంక్షన్ లెటర్ మీ చేతిలో ఉంటుంది."

"థాంక్ యూ సర్. అయితే, ఫేక్టరీ శంకుస్థాపన కార్యక్రమానికి ఇండస్ట్రీస్ మినిస్టరు గారి కన్ఫర్మేషన్ తీసుకోవచ్చా.”

"ఓ, తప్పకుండా.”

“థాంక్ యు సర్. ఎల్లుండి రాత్రి, క్లబ్ లో పార్టీ బ్రహ్మాండంగా చేసుకొందాం సర్.”

“ఓకే. గుడ్ నైట్. గుప్తాగారు."

"గుడ్ నైట్. సర్."

ఆ మరునాడు ఉదయం. రఘురామయ్యగారు తన ఛాంబర్ లో ఆసీనులై ఉన్నారు. ఎదురుగా, జూనియరు ఆఫీసరు భాస్కరరావుగారు, విధేయతతో కూర్చొని ఉన్నారు.

"భాస్కరరావుగారు, మీ పెర్సనల్ ఫైలు చూసేను. క్లరికల్ కేడరులో ఉన్నప్పుడు, మీరు చాలా రోజులు, లోన్సు డిపార్టుమెంటులో పనిచేసేరు కదూ." సి. ఎమ్. గారు, భాస్కరరావుగారి ముఖంలోనికి చూస్తూ అడిగేరు.

"అవును సర్." వినయంగా భాస్కరరావుగారు జవాబిచ్చేరు.

"లోన్సు లో; క్లరికల్ కేడర్ లోని అనుభవంతో బాటు, ఆఫీసరు కేడరులో కూడా అనుభవం ఉంటే, మీకు ఫ్యూచరు కెరియరులో చాలా ఉపయోగపడుతుంది. అది ఆలోచించి, మిమ్మల్ని లోన్సు డిపార్టుమెంటులోనికి మారుస్తున్నాను.”

"విశ్వనాధం సార్ దగ్గరా సర్. థాంక్ యు సర్."

"పూర్తిగా వినండి. విశ్వనాధంగారిని మరో ఇంపార్టెంట్ డిపార్టుమెంటుకు మారుస్తున్నాను. ఇవాళనుండి మీరు లోన్స్ డిపార్టుమెంటుని ఇండిపెండెంటుగా హేండిల్ చెయ్యాలి. అవసరమయినప్పుడు, మీరు తప్పక నా సలహా తీసుకోవచ్చు."

"థాంక్ యు సర్." వినయంగా, చిన్న చిరునవ్వుతో, తల మెల్లగా ఊపేరు, భాస్కరరావుగారు.

"ఒకే. మీ పని చూసుకోండి." అక్కడికి ఆ సంభాషణ ముగించేరు, సి. ఎమ్. గారు.

కొద్దిసేపటి తరువాత, విశ్వనాథంగారు, ఛీఫ్ మేనేజరుగారి ముందు కూర్చొని ఉన్నారు.

"విశ్వనాధంగారూ, అనిల్ కుమారు ప్రమోషను మీద ట్రాన్స్ఫర్ అయినప్పటినుండి, లోన్స్ డిపార్టుమెంటు తో బాటు, ఫారిన్ ఎక్ఛేంజ్ డిపార్ట్మెంట్ కూడా, మీరే హేండిల్ చేస్తున్నారు. దానివలన, మీకు వర్కులోడ్ బాగా ఎక్కువయింది. అది నేను చూస్తున్నాను. ఇప్పట్లో, ఆ వేకెన్సీ భర్తీ అయ్యేటట్లు లేదు. ఫారిన్ ఎక్ఛేంజ్ లో, ఇంకెవరికి అనుభవం లేదు. అంచేత ఇవాళనుండి, మీరు, ఫారిన్ ఎక్ఛేంజ్ ఒక్కటే చూసుకోండి. మీకు కొంత రిలీఫ్ ఉంటుంది. ప్రమోషన్ ఇంటర్వూకు, ప్రిపేరవ్వడానికి, మీకు కొంత టైము కూడా దొరుకుతుంది.”

"థాంక్ యు సర్." విశ్వనాథంగారు, వినయంగా స్పందించేరు.

ఛీఫ్ మేనేజరు గారు, ఎవరికో ఫోను చేసే ప్రయత్నంలో ఉన్నారు. అది గమనించి, విశ్వనాథంగారు బయటకు నిష్క్రమించేరు.

మరో అరగంటలో బ్రాంచిలోని నలుగురు ఆఫీసర్లు, ఇద్దరు క్లర్కుల విధులలో తక్షణం మార్పులు చేస్తూ, ఆఫీస్ ఆర్డర్ జారీ అయింది. విశ్వనాథంగారు, ఫారిన్ ఎక్ఛేంజ్ ఇన్ ఛార్జ్ గాను, భాస్కరరావుగారు లోన్సు ఇన్ ఛార్జ్ గాను, బాధ్యతలలో చేరేరు.

చెప్పిన వ్యవధిలోనే, గుప్తాగారి చేతులకు సేంక్షన్ లెటరు అందింది. ఆ రాత్రి, క్లబ్బులో ఖరీదయిన ఆల్కహాలిక్ పానీయాల సీసాలు, లెఖ్ఖలేనన్ని ఖాళీ అయ్యాయి. మరో వారంలో, ఎపెక్స్ గార్మెంట్స్ కర్మాగారానికి, మంత్రిగారి చేతులతో శంకుస్థాపన జరిగింది. బ్రాంచిలో పనిచేస్తున్నవాళ్ళందరకు, ఒక్కొక్క కేజీ మిఠాయి పొట్లాలు అందేయి. విశ్వనాథంగారు మిఠాయి పొట్లం అందుకొంటూ, ఓ చిరునవ్వు నవ్వేరు. ఆ చిరునవ్వులో, మిఠాయి పొట్లం అందజేసిన వానికి ధన్యవాదాలో, లేక మరేదయినా అంతరార్థం ఇమిడియుందో, విశ్వనాధంగారికే తెలియాలి.

మరో ఆరు నెలలు గడిచేయి. విశ్వనాధంగారు, పదోన్నతి మీద సీనియరు మేనేజరుగా, రాష్ట్రంలో మరో పెద్ద బ్రాంచికి, శాఖాధిపతిగా బదిలీ చేస్తున్న ఆదేశాలు అందుకొన్నారు. ఆ మరునాడు సాయంత్రం, బ్రాంచిలో, విశ్వనాధంగారికి వీడ్కోలు సభ ఏర్పాటయింది. వక్తలు, విశ్వనాధంగారిని అభినందిస్తూ, ఆయన గుణగణాలను, ముఖ్యంగా ఆయన నిజాయితీని, పరిపరి విధాల కొనియాడేరు. వక్తలు మాట్లాడుతున్న సమయంలో, ఛీఫ్ మేనేజరు రఘురామయ్యగారు తన సెల్ ఫోనులో బిజీగా ఉండేవారు. మాట్లాడడానికి తన వంతు వచ్చినప్పుడు, ముక్తసరిగా మూడు ముక్కలు పలికి, విశ్వనాధంగారికి శుభాకాంక్షలు తెలియజేసేరు. విశ్వనాథంగారు సభనుద్దేశించి మాట్లాడుతూ, బ్రాంచిలోని ఉద్యోగులందరకు, వారు తనయెడ చూపిన గౌరవాభిమానాలకు, హృదయపూర్వక అభివందనలను తెలియజేసేరు. ప్రక్కనే ఆసీనులయి ఉన్న, ఛీఫ్ మేనేజరు రఘురామయ్యగారిని ఉద్దేశించి, "సర్, నా హితవు కోరి, సరైన సమయంలో, నన్ను లోన్సు విభాగపు పనులనుండి విముక్తి చేసి, కేవలము, ఫారిన్ ఎక్ఛేంజ్ విభాగపు విధులకు, బదిలీ చేసేరు. ఆ విధంగా, నా ప్రొమోషనుకు తయారీ కావడానికి, సహృదయంతో నాకు అవకాశం కల్పించినందులకు, నేను మీకు సర్వదా కృతజ్ఞుడను." అని ఆయనకు నమస్కరిస్తూంటే, ఎదురుగా ఉన్న సభవారంతా, ఒకరి ముఖంలోనికి ఒకరు చిరునవ్వులు చిందిస్తూ, చప్పట్లు కొట్టేరు. ఆ చిరునవ్వులు, చప్పట్ల, వెనుక ఏదయినా అంతరార్థం దాగిఉందేమో వారికే తెలియాలి.

విశ్వనాథంగారు, రిలీవు అయ్యేక, అయిదు రోజులు ఆ ఊళ్ళోనే ఉన్నారు. ఆయన, ప్యాకింగు, తదితర పనులలో నిమగ్నులయ్యేరు. ఆ పనులలో, భార్య సీతాలక్ష్మిగారు కూడా, ఆయనకు సహాయం చేయవలసి వచ్చింది. ఆ పరిస్థితి, ముందుగానే ఊహించి, బ్రాంచిలోని ఉద్యోగులు, వంతులవారీగా, విశ్వనాధంగారి కుటుంబానికి పొద్దున్న ఫలహారం, మధ్యాహ్న భోజనం, ఆయన ఇంటికి రోజూ సరఫరా చేసేరు. రాత్రి భోజనాలు, వంతులవారీగా ఒక్కొక్కరి ఇంట్లో ఉద్యోగస్తులందరూ కలసి, విశ్వనాధంగారి కుటుంబంతో, సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఆరగించేరు.

విశ్వనాథంగారు, తన గమ్యస్థానానికి చేరే రైలుబండిని అందుకోవడానికి, రాత్రి ఎనిమిది గంటలకు సకుటుంబంగా రైల్వే స్టేషను చేరుకొన్నారు. బ్రాంచిలోని ఉద్యోగస్తులందరూ, ఆయనకు వీడ్కోలు పలకడానికి, స్టేషనుకు వచ్చేరు. వారిని చూస్తూ; సుమారు ఆరు సంవత్సరాలు, వారి ప్రేమానురాగాలు పంచుకొని, ఒకే కుటుంబం లాగ వారితో కాలం గడిపిన మధుర స్మృతులు, ఆయన కళ్ళ ముందు గిర్రున తిరిగేయి. ఆయన కళ్ళలో నీళ్లు తిరిగేయి. అక్కడ చేరిన ఉద్యోగస్తులదీ, అదే పరిస్థితి. కొద్దిపాటి దూరంలో, ఆపుకోలేని కన్నీళ్లు తుడుచుకొంటున్న ప్యూను అప్పలస్వామి, విశ్వనాధంగారి దృష్టిలో పడ్డాడు. ఆయన వెంటనే వాడి దగ్గరకు పోయి, తన చేతిరుమాలుతో వాడి కన్నీళ్లు తుడిచి, ఏవో బుజ్జగింపు మాటలు చెప్పి వాడిని ఓదార్చేరు. గార్డు పచ్చ జెండా ఊపేడు. విశ్వనాథంగారు, బరువయిన గుండెతో, తన బోగీలోనికి ప్రవేశించేరు.

విశ్వనాధంగారి గుణగణాలతోబాటు, ఆయన వివరాలన్నీ ఆయన చేరవలసిన బ్రాంచికు, ఆయన కన్నా ముందే చేరేయి. ఆ వివరాలు తెలిసి, బ్రాంచిలోని ఉద్యోగస్తులలో అధిక శాతం, ఆయన రాకను స్వాగతించేరు. కొందరు తటస్థంగా ఉన్నారు. బహుకొద్దిమంది, 'కిం కర్తవ్యమ్' లో పడ్డారు. ఆయన రాకకు ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు, ఉదయాన్నే రైల్వే స్టేషనుకు వెళ్లి, ఆయనకు స్వాగతం పలికేరు. లాంఛనంగా ఆయన ఒక్కొక్కరిని పరిచయం చేసుకొన్నారు.

విశ్వనాథంగారు బ్రాంచిలో విధులలో చేరేరు. ఇద్దరు ఫ్యూన్లతో సహా అందరివద్దకు పోయి వారి పరిచయం చేసుకొన్నారు. రెండు మూడు రోజులు, ప్రతి ఉద్యోగి యొక్క పెర్సనల్ ఫైలు చూసి, చాలవరకు బ్యాంకులో వారి పూర్వ చరిత్ర తెలుసుకొన్నారు. వారం రోజులు బ్రాంచిలోని ప్రతివారి పనితీరు, నిశితంగా పరీక్షించేరు. సమస్యలు గుర్తించి, అవగాహన చేసుకొన్నారు. సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక వేసుకొన్నారు. కొన్ని సమస్యలు జఠిలమయినవి. బాగా ఆలోచించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ చెయ్యాలి. దానికి కొంత సమయం పట్టొచ్చు. ప్రణాళిక సత్ఫలితాలు ఇయ్యాలంటే అన్నింటికన్నా ముందు, ఉద్యోగస్తులందరికి చేరువ కావాలి. వారు, తనను వారిలో ఒకనిగా అంగీకరించాలి. విశ్వనాథంగారు ఆ దిశగా ఆలోచనలు చేయసాగేరు.

ఒక ఆదివారం మధ్యాహ్నభోజనాల సమయంలో, విశ్వనాధంగారి భార్య సీతాలక్ష్మి, కొత్త బ్రాంచిలో ఉద్యోగస్తుల నైజం గురించి తెలుసుకోగోరి,

"ఏమండి, బ్రాంచిలో ఉద్యోగస్తులు ఎలాంటివారండి. మంచివాళ్లేనా. మీకు ఇబ్బందులు ఏమీ పెట్టడంలేదా." అని ఆరా తీసేరు.

"సీతాలూ, మనం మంచయితే, ఊరంతా మంచవుతుంది. స్టాఫు అందరూ మంచివాళ్ళే. నాకు ఏ ఇబ్బంది పెట్టడం లేదు. అందరూ మర్యాదస్తులు."

"మనం వచ్చేముందు, ఈ ఊళ్ళో, బ్యాంకుల్లో అల్లర్లు ఎక్కువ అని చాలామంది చెప్పేరుకదా. అందుకు అడిగేను."

"సీతాలూ, నా బ్రాంచిలో ఉన్నవాళ్ళంతా, రోజూ ఎవరి పనులు వాళ్ళు సాఫీగా చేసుకు పోతూ ఉంటారు. అల్లరులు, అంటే, ఒకరిద్దరు ఉన్నా, ప్రమాదస్తులేమీ కాదు. బెంగపడకు. నాకు ఏ ఇబ్బంది లేదు." అని భార్యకు అభయమిచ్చేరు, ఆ తరువాత, విశ్వనాథంగారు, భార్య, ఊళ్లోని వస్తువుల ధరలు, ఇదివరకు వారుండెడి ఊళ్లోని ధరలతో పోల్చి మాట్లాడుకున్నారు.

బ్రాంచి పనివేళల తరువాత, సాయంత్రం ఏడు ఎనిమిది వరకు, కొందరు ఆఫీసర్లు, పనులలో నిమగ్నమయి ఉండడం తరచూ జరుగుతూంటుంది. అట్టి సమయాల్లో, విశ్వనాథంగారు, వారిలో ఒకరై, వారికి పనిలో సహాయపడడం ప్రారంభించేరు. ప్రతిరోజూ లంచి సమయంలో, ఉద్యోగస్తులందరూ దగ్గర దగ్గరగా చేరి, వారి లంచ్  బాక్సులు తెరచి, సరదాగా కబుర్లు చెప్పుకొంటూ, లంచి తీసుకోంటూ ఉంటారు. లంచి షేరింగు కూడా ఉంటుంది. ఆ సమయాల్లో, విశ్వనాథంగారు వారితో చేరడం ప్రారంభించేరు. సున్నితమయిన జోక్సు వినిపిస్తూ ఉండేవారు. ఒకరోజు, లంచి విరామ సమయంలో, ప్యూను సింహాద్రిని, "సింహాద్రీ, నీ పిల్లలు ఏమి చేస్తున్నారు" అని అడిగేరు, విశ్వనాథంగారు.

"నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సార్. అమ్మాయి ఎనిమిదిలో ఉంది సార్. కొడుకు పదిలో ఉన్నాడు సార్." వినయంగా విన్నవించుకున్నాడు, సింహాద్రి.

"అమ్మాయిని చదివిస్తున్నావు. మంచిపని చేస్తున్నావు. పిల్లలిద్దరికీ పెద్ద చదువులు చదివించు. మన బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్సు తీసుకో. ఏ ఇబ్బందీ ఉండదు." అని హెచ్చరిస్తూ సింహాద్రికి సలహా ఇచ్చేరు, విశ్వనాథంగారు.

"అలాగే సార్." వినయంగా అంగీకరించేడు, సింహాద్రి.

ఆ రోజు ఆదివారం. సమయం, సాయంత్రం ఆరుగంటల ప్రాంతం. ఆ ఊరి బ్యాంకులలో పనిచేస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ (క్లర్కులు, ఫ్యూన్ల యూనియను) ఎక్జిక్యూటివ్ మెంబర్ల సమావేశం జరుగుతోంది. వేదిక; విశ్వనాధంగారి బ్రాంచిలో పనిచేస్తున్న క్లర్కు విలాసరావు గృహం. విలాసరావు యూనియను జనరల్ సెక్రెటరీ. బ్రాంచిలలోని కొద్దిమంది మెంబర్ల సమస్యలు చర్చిస్తున్నారు. ఆ సమయంలో ఒక మెంబరు విలాసరావును ఉద్దేశించి, "సార్, మీ కొత్త మేనేజరు, ఎటువంటి ఘటమండి." అని విశ్వనాధంగారి కాండక్టు రిపోర్టు అడిగేడు.

"కొత్తగా బ్రాంచి మేనేజరు అయ్యేడు. ఏవేవో అనుకొంటున్నాడు. మనం ఒక షాక్ ట్రీట్మెంటు ఇస్తే, ఎలా పని చెయ్యాలో తెలుసుకొంటాడు." అని చెప్పగానే, మిగిలిన సభ్యులు విరగబడి నవ్వుకొన్నారు. తరువాత కొన్ని విషయాలు చర్చించుకొన్నాక సభ ముగిసింది.

ఒకరోజు, విశ్వనాథంగారు తన క్యాబినులో ఉన్నారు. టేబిలు మీద ఉన్న కంప్యూటరులో ఏదో చూస్తున్నారు. లోన్సు ఆఫీసరు ఓబులరెడ్డిగారు, విశ్వనాధంగారి అనుమతితో క్యాబినులో ప్రవేశించి, కుర్చీలో ఆసీనులయ్యేరు.

"సార్, మీతో ఓ విషయం మాట్లాడడానికి వచ్చేను." రెడ్డిగారు వినయంగా అన్నారు.

"రెడ్డిగారూ, చెప్పండి ఏమిటో అది."

"సార్, మేడం సుభద్రమ్మగారు, అర్జన్టుగా పదిహేనువేలు ఓ.డి. (ఓవర్ డ్రాఫ్ట్) కావాలంటున్నారండి."

"దేని కోసం."

"ఆవిడ మేనమామగారి అబ్బాయి, అమెరికానుండి వచ్చేరట. ప్రస్తుతం హైద్రాబాదులో ఉన్నారట. ఆయన కుటుంబంతో, సుభద్రమ్మగారిని చూడడానికి వస్తున్నారట. ఎల్లుండి పొద్దున్న వచ్చి, రాత్రికి వెళిపోతారట. ఆ భార్యాభర్తలకు, ఇద్దరు పిల్లలకు, బట్టలు అవీ పెట్టాలట. సుభద్రమ్మగారు, B.Sc. వాళ్ళ మేనమామగారి ఇంట్లో ఉండి చదువుకొన్నారట. అందుకు వాళ్లకి బట్టలూ అవీ పెట్టకపోతే బాగుండదు అంటున్నారు."

"రెడ్డిగారూ, ఆవిడ పరిస్థితి, I can understand. అది ఇంటింట రామాయణమే. అందులోనూ, మనవాళ్ళు చాలామంది, బ్యాంకులో ఆఫీసర్లు, అంబానీ అంతవాళ్లేమో అనుకొంటారు. కాని రెడ్డిగారూ, స్టాఫుకి ఓ.డి. లు అలవాటు చెయ్యకూడదండి. నిజానికి స్టాఫుకు ఎలిజిబిలిటీ లేదండి. నాకు తెలుసు; చాలా బ్రాంచీలలో ఇస్తున్నారు. ఇవాళ సుభద్రమ్మగారికి, ఇస్తే, రేపటినుండి మిగిలినవాళ్లు కూడా ఏదో మిషమీద ఓ.డి. కావాలని, క్యూ కడతారు. అప్పుడు ఎవ్వరినీ కాదనలేం."

"అది నిజమే సార్. అయితే ఆవిడకి, వీలు పడదని చెప్పేయమంటారా?"

"తొందరపడకండి. చూద్దాం, whether we can help her."

ముగింపు వచ్చే సంచికలో ...

Posted in August 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!