Menu Close
అక్షరాభ్యాసం (కథ)
లక్ష్మీ సుగుణ వల్లి, చీమలమఱ్ఱి

నాయనమ్మా! ఒకసారి ఇటు చూడు తాతయ్య నాకు తెలుగులో డిక్టేషన్ చెబితే నేను వ్రాసాను. “సుత్తేశ్వరరావు.. సుత్తి వీరభద్రరావు .. నేను తప్పు లేకుండా వ్రాశానా?” అంటూ తను వ్రాసిన కాగితం చూపించింది సంవేద్య. ఆ పేర్లలో వత్తులు పొల్లులు ఉంటాయనేకాదు, చక్కని తెలుగును చిక్కని హాస్యంతో రంగరించి అలరించిన ఆ జంట పేర్లను ఈ తరం పిల్లలకు పరిచయం చేయాలని ఆయన తపన.

దానికింకా నిండా మూడేళ్ళే. ఎంత త్వరగా దీనికి తెలుగులో “అ” నుంచి “క్ష” వరకు వచ్చేశాయో అని నేను సంబరపడ్డాను. ఈ విషయంలో మా అబ్బాయి మారుతీ రామ్ కి కూడ ఆశ్చర్యము కలిగి, అమ్మా! మన ఇంటి దగ్గరలో గానీ చుట్టుప్రక్కల గానీ తెలుగు వారే లేరు కదా! టొరెంటో నగరంలో ఉంటూ తెలుగు పిల్లల సహవాసమే లేని ఈ పిల్లకు గుడింతాలూ, వత్తులూ చక్కగా నేర్పించావు. ఇంత త్వరగా మన సంవేద్య నేర్చుకుంటుందనుకోలేదు. ఏమాత్రం కష్టం లేకుండా ఆడుతూ పాడుతూ నేర్చుకుందని మురిసిపోయాడు.

సంవేద్య పుట్టాక మా అబ్బాయి మమ్మల్ని ఇండియా నుంచి కెనడాకు తీసుకు వచ్చాడు. టొరంటోలో విమానం దిగినప్పటి నుంచి ఇంట్లో మేము తప్ప తెలుగు మాట్లాడేవాళ్ళెవ్వరూ కనిపించలేదు. బయటకు వెళితే మౌన వ్రతమే.

మేము టొరెంటో కి వచ్చిన ఇరవై రోజులకు మా అబ్బాయి మారుతీ రామ్ మమ్మల్ని వై.యమ్.సి.ఎ. ఆఫీసుకు తీసుకు వెళ్ళాడు. మాకు కాలక్షేపం తో పాటు ఇంగ్లీష్ భాష మరియు ఈ దేశ విషయ పరిజ్ఞానం కొంతైనా తెలుస్తుందని వాడి ఆలోచన. మాకు ఇంగ్లీషు ఎంత వచ్చో తెలుసుకోవడానికి వ్రాయడం, చదవడం, మాట్లాడడం, వినడం ఈ నాలుగు విభాగాలలోనూ పరీక్ష నిర్వహించారు. సరిగ్గా వారానికల్లా మాకు ‘74 విక్టోరియా లింకు’ స్కూలు నుంచి ఫోను వచ్చింది. సోమవారం నుండి ఇంగ్లీషు నేర్చుకోవడానికి రమ్మని. మధ్యాహ్న భోజనం కూడా తెచ్చుకోమని స్కూల్ లో మేనేజరు ‘ఎమిలీ’ సారాంశం.

అలా సరిగ్గా మేము టొరెంటో వచ్చిన నెల రోజులకు అదే తారీఖున మొదటిసారి స్కూలుకు వెళ్ళాము. ఆ రోజు మా క్లాసు సప్లై టీచరు ‘జౌన్’ కెనడా నాణెములు నికిల్, డైమ్, క్వార్టర్, లూనీ, టూనీ గురించి బాగా చెప్పింది. వారానికి ఐదు రోజులు క్లాసులు ఉదయం 9 గం॥ నుంచి మధ్యాహ్నం 2:30 గం॥ వరకు. ఉత్సాహంగా వెళ్ళేవాళ్ళం బడికి వెళ్ళే పిల్లల్లాగా.

క్లాసులో చైనా, పాకిస్తాన్, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, కొరియా, సిరియా, ఇరాన్, థాయిలాండ్ ఇలా వివిధ దేశాలనుంచి వచ్చిన వారందరూ ఉన్నారు. చాలా మంది మాకు లాగానే 50 సం॥ లు దాటినవారే. మా క్లాసు టీచరు ‘ఆనియా’ ఎంతో ఉత్సాహంగా పాఠం చెప్పేది. అర్థమయ్యేటట్లు రిపీట్ చేస్తూ చెప్పేది. ఎంతో ఓర్పుగా అందరి చేతా బోర్డు మీద లైనుగా వ్రాయటం నేర్పించేది. అందరూ ఒకరితో ఒకరు చాలా స్నేహంగా ఉండి, వచ్చిన కొద్ది కొద్ది ఇంగ్లీషు మాటలతోనే ఒకళ్ళ గురించి ఒకళ్ళం తెలుసుకునేవాళ్ళం. మేము స్కూల్ లో ఉన్నంతసేపూ 2,3 తరగతులలో ఉన్నప్పుటి మా చిన్నతనమే గుర్తుకు వచ్చేది.  కొంతమందైతే చిన్నపిల్లల్లా అల్లరి చేసే వాళ్ళు కూడా. ‘హంగరీ’ నుంచి వచ్చిన ‘ఈవాన్’ క్లాసులో మా అందరికన్నా చిన్నవాడు. టీచర్లను అనుకరించడం లాంటివి చేసి అందరినీ నవ్విస్తూ ఉండేవాడు.

ఈ దేశం వచ్చినప్పటినుంచీ మా మనుమరాలు సంవేద్యకు తెలుగు అక్షరాలు నేర్పాలని నా తాపత్రయం. ఇక్కడ పలకలూ, బలపాలూ దొరికేటట్లు కనబడలేదు. ఒక పేపరు మీద పెద్దదిగా “అ” అని వ్రాసి నేను సంవేద్య చేత దిద్దించే ప్రయత్నం చేసినప్పుడల్లా, కాసేపటికి గీతలు గీసి దానికి బొట్లూ, కాటుకలూ పెట్టి, చివరికి అది తెల్ల కాగితం కాదు అనిపించేట్లు చేసేది. పిల్లను ఒళ్ళో కూర్చోపెట్టుకొని, అక్షరం దిద్దిచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా ఏదో వంక వెతికి వాళ్ళ అమ్మ పనికి అడ్దుపడేది. ప్రక్క గదిలో ప్రయత్నించినా నన్ను మాయ చేసి తప్పించుకొనేది. కొన్నాళ్ళు నేనూ మా అబ్బాయీ సంవేద్యను 11వ అంతస్తులో ఉన్న రిక్రియేషన్ హాల్ కి తీసుకు వెళ్ళి దిద్దిచ్చే ప్రయత్నం చేశాము. అదీ బాగా పని చేయలేదు. “‘అ ఆ’ లు దిద్దించడం ఇంత కష్టమని నేననుకోలేదు అమ్మా! ఇంక వదిలేద్దాం” అన్నాడు మా అబ్బాయి. ‘అ’ ఒక్కటీ రావటం కొంచెం ఆలస్యమౌతుంది కానీ, ఆ తరువాత అక్షరాలు చాలా త్వరగా వస్తాయని నాకు తెలుసు. ‘అ’ నేర్పించడమొక్కటే నా ధ్యేయం గా మారిందిక.

మా ఇల్లు ఎడిలైడ్ స్ట్రీట్ లో ఉండేది. మా బాల్కనీలో కూర్చుంటే ‘సి.యన్. టవర్’ బాగా కనిపించేది. ‘టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్’ బిల్డింగ్ ప్రక్కనే మా బిల్డింగ్. సెప్టెంబరులో జరిగే సినిమా పండుగకు వచ్చే చాలా మంది జనం కనిపించేవారు. ఊరేగింపు కూడా మా ఇంటి ముందుగా వెళుతుంటే నేను సంవేద్య చూస్తూ ఉండేవాళ్ళం. మా కొడుకూ కోడలూ ఫిలిం ఫెస్టివల్ లో వాలంటీర్లు గా చేసే వాళ్ళు. అక్కడికి వివిధ దేశాల అవార్డు సినిమాలు వచ్చేవి. మా అబ్బాయి మాకు నచ్చుతుందనుకున్న సినిమా కధ క్లుప్తంగా చెప్పి సినిమాకు పంపేవాడు. కథ కొంచెం తెలియడం వలన, స్కూలులో వివిధ దేశాల స్నేహితులతో మాట్లాడటం వలన ఆ పాత్రలు మాట్లాడుతున్న భాష తెలియకున్నా, భావం స్పష్టంగా తెలిసేది.

నేనూ మావారూ ప్రతిరోజూ హాజరు తప్పకుండా బడికి వెళ్ళే వాళ్ళం. నేను లెవెల్ 2 క్లాస్ లో ఉన్నప్పుడు నా ప్రక్కనే అటు బంగ్లాదేశీ- ‘ఫెబీహా’, ఇటు పాకిస్తానీ- ‘సామియా’ కూర్చొనే వాళ్ళు. ఆ ప్లేస్ ఇంకెవరికీ ఇచ్చేవాళ్ళు కాదు. బ్రేక్ టైం లో నాకు కొంచెం అర్థమయ్యేటట్లు హిందీలో మాట్లాడేవాళ్లు. హుషారుగా కబుర్లు చెప్పేవాళ్ళు. నేను వింటూ ఉండేదాన్ని. ఎప్పుడైనా నేను కొంచెం మౌనంగా ఉంటే “అమ్మా ఏం? మీ ఇద్దరమ్మాయిలూ ఇండియాలో చాలా దూరంగా ఉన్నారని అనుకుంటున్నావా? అదేం కుదరదు. మేమిద్దరం నీ పిల్లలమే” అనేవాళ్ళు. శంఖు చక్రాల్లా నా కిరువైపులా ఉండేవాళ్ళు భారతదేశ పటానికి ఇరువైపులా వారి దేశాలు ఉన్నట్టు. దేశాల మధ్య విభేదాలు ఎన్ని ఉన్నా మనుష్యుల మధ్య ఎంత స్వచ్ఛమైన స్నేహం ఉందోకదా!

శని, ఆదివారాలల్లో సంవేద్య తెలుగు అక్షరాల గురించే నా ఆలోచన. ఒకరోజు సాయంత్రం మా అబ్బాయి పిజ్జా ప్యాకెట్ కొనుక్కొచ్చాడు. పిజ్జా డబ్బా లోపల ఒక అట్ట ముక్క ఉంటుందిగా, దాన్ని తీసి, పెద్దదిగా ‘అ’ అని వ్రాసి ఆ అక్షరం మీద లైనుగా పెన్సిల్ ముక్కుతో పొడుస్తూ చిల్లులు పెడుతున్నాను.  మా మనవరాలు శ్రద్ధగా చూస్తూ “నాయనమ్మా! నేనూ చేస్తాను నాకివ్వు” అన్నది. మరలా ఇంకో పెద్ద ‘అ’ వ్రాసి ఇవ్వగానే వరుసగా చిల్లులు పెట్టేసింది. ఇంక ప్రతీసారీ ఏదైనా కార్డ్ బోర్డ్ పెట్టెలు ఇంట్లోకి రాగానే  “నాన్నా! ఆ ఖాళీ అట్టపెట్టె నాది. నేను ‘అ’ ‘ఆ’ లు వ్రాసుకోవాలి“ అని ముందే రిజర్వ్ చేసుకునేది. ప్రతి రోజూ బాగా సాధన చేస్తుండేది ‘అ’ ‘ఆ’ లను.

ఒకరోజు సంవేద్య బాల్కనీలోకి వెళ్ళే తలుపు దగ్గర కూర్చున్నది. ఏం చేస్తోందా అని చూస్తుండగానే “నేను తమాషా చేస్తాను చూడు” అని అద్దానికి దిగువ భాగంలో ఆవిరితో ఏర్పడిన నీటి చుక్కలను చూపుడు వేలుతో అద్దుకొని తలుపు పొడిగా ఉన్నచోట గుండ్రంగా ‘అ’ వ్రాసింది. ఆహా! ఇక నాకు కొండెక్కినంత ఆనందం కలిగింది. అమ్మానాన్న, తాతయ్యలకు అందరికీ ఇలా చేసి చూపించింది ఉత్సాహంగా. ‘అ ఆ’ లు రెండూ బాగా వచ్చేశాయి.

ఇక్కడ బంగాళాదుంపలు 5 కిలోలు ఒక మందపాటి పేకెట్ లో వస్తుంటాయి. అది చూచినప్పుడల్లా మా చిన్నప్పుడు, పుస్తకాలకు అట్టలు వేసుకోవటం కోసం మా నాన్న బ్రౌన్ అట్టలు కొనుక్కొచ్చిన సంగతి గుర్తుకొస్తుంటుంది. ఆ ప్యాకెట్టును జాగ్రత్తగా విప్పదీసి కార్పెట్ కింద అణగబెట్టి చార్ట్ లాగా చేసి అక్షరాలు వ్రాసి వాడుకోవడం భలే సరదాగా నచ్చేసింది సంవేద్యకి. ప్యాకేజింగ్ అట్ట డబ్బాలూ, బంగాళా దుంపలు సంచీ మొదలైనవన్నీ కూడా మాకు చదువు నేర్చుకునే సాధనాలయ్యాయి.

నేను 3 క్లాసుల్లోకి వెళ్ళేటప్పటికి కొంచెం చిన్నవాళ్ళు చేరారు. అందరం కలిసి మెలిసి మెలిగేవాళ్ళం. కొందరు నన్ను వాళ్ళ భాషలో ‘అమ్మా’ అని పిలిచేవారు. నేను తీసికెళ్ళిన వంటకాలు రుచి చూసేవారు. ‘జెన్నిఫర్’ టీచర్ చిన్న చిన్న పదాలు కలపడము, వాక్యాలు నిర్మించడమూ నేర్పారు. కుటుంబంతో వారాంతాల్లో నయాగరా ఫాల్స్ కి, మాంట్రియాల్ కీ ఇంకా చాలా ప్రదేశాలకీ వెళ్ళినప్పుడల్లా, కాశీ గంగా తరంగాలనీ, హిమాలయాలనీ గుర్తు తెచ్చుకుని ఇక్కడే దర్శించేదాన్ని.

సంవేద్యకు ‘క’ నుంచి ‘క్ష’ వరకు గుడింతాలు చాలా తేలికగా వచ్చేశాయి. వత్తులు కూడా వచ్చేశాయి. ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా క్రొత్త మాట వినపడినా, టి.వి లో క్రొత్త పదం విన్నా, కాగితం మీద వ్రాసి చూపిస్తుంది. అంత పెద్ద పదాలు ఎలా వ్రాస్తుందా అని మేమందరం ఆశ్చర్యపోతుంటాము. హమ్మయ్య! మొత్తానికి బంగాళా దుంపల ప్యాకెట్లు మాకు ఉపయోగపడేలా ప్యాకింగు చేసిన వారికీ, చేయించిన వారికీ మా ధన్యవాదాలు.

మార్చి బ్రేక్ తర్వాత అంటే వసంతంలో, జెన్నిఫర్ టీచరు నన్ను లెవెల్ 4 కి పంపారు. కోవిడ్-19 మహమ్మారి వలన లాక్ డౌన్ విధించారు స్కూళ్ళకు వెళ్ళకుండా ఇంట్లోనే ఆన్ లైన్ క్లాసులు ఏర్పాటు చేశారు విద్యాశాఖవారు. ఒకరోజు మా మాష్టారు ‘లెస్సర్ స్వియాట్’ పాఠం చెబుతూ, నా వెనక గోడకు వ్రేలాడుతున్న ఛార్టులను చూచి ఏమిటని అడిగి, దగ్గరగా కెమేరా పెట్టమని మన అక్షరాలని చూసి భలే అందంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. మనుమరాలికి నేర్పడం కోసం చేసానని విని, చిన్న పిల్లలకు ఇంగ్లీషే కాకుండా మన మాతృ భాషలను నేర్పుకోవటం మంచిదనీ, 3 సం. ల నుంచి 7 సం. ల వరకూ పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు కాబట్టి చాలా భాషలను నేర్చుకునే శక్తి ఉంటుందనీ చెప్పారు.

ఈ మాస్టారు ఒక్కోసారి పుస్తకాల లో పాఠాలే కాక రోజువారీ సంభాషణల ద్వారా ఇంగ్లీషు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా మన భారత దేశం, రామాయణం, మహా భారతాలను ఎంచుకున్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, అశోక ధర్మ చక్ర ప్రాముఖ్యతని చెబుతుంటారు. మన సంస్కృతి సంప్రదాయాలను గురించి చెబుతున్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది.

ఇప్పుడు సంవేద్య తెలుగులో అంకెలు చెప్పటం నేర్చుకుంది. 1 నుంచి 200 వరకు వచ్చిన తరువాత ఎక్కాలు కూడా నేర్చుకుంది. 5 ఎక్కాల వరకు చెప్పటం వ్రాయటం వచ్చేశాయి. తనతో భారతం చదివించాలని ఉంది. నేను 6వ తరగతి పరిక్షలైంతరువాత సెలవులకు ‘రామ్మూర్తి’ తాతయ్య గారింటికి పెద నందిపాడు దగ్గర రాజుపాలెం వెళ్ళినప్పుడు, ‘లీలాకుమారి’ వ్రాసిన మహాభారతం మొదటి పుస్తకం ‘ప్రతీకారం’ నా చేతికిచ్చి నేను పొలానికి వెళ్ళొచ్చేవరకు చదువుతూండమని చెప్పాడు. ‘అమ్మో నాకు రాదు!’ అంటుండగా ముందు నువ్వు మొదలు పెట్టు అర్దం కాకపోతే చూద్దాం అని పొలానికి వెళ్ళాడు. మొదలు పెట్టిన తరువాత ఇక ఆపకుండా చదవగలిగేటట్లుగా లీలా కుమారి వ్రాసింది. సెలవులలోనే 13 పుస్తకాలు పూర్తి చేశాను. ఆ పుస్తకాలు ఇప్పుడు మరలా దొరికితే మా మనుమరాలి చేత ‘లీలా కుమారి భారతం’ చదివించాలని కోరిక.

ఈ మధ్య క్రొత్తగా మా ఎదురింట్లోకి ఒక పంజాబీ కుటుంబం వచ్చింది. చాల త్వరగానే ఆ ఇంట్లో వ్యక్తులందరూ మా ఇంట్లోని వారందరితో వయసులవారీగా స్నేహితులైనారు. వాళ్ళ తల్లిదండ్రులు నాకూ మావారికీ, వాళ్ళ కొడుకూ, కోడలూ మా అబ్బాయి, కోడలికీ, వాళ్ళ పాప మా మనవరాలికీ ఇలా స్నేహం కుదిరింది. వాళ్ళ అబ్బాయి హరికిరత్, మా అబ్బాయి మారుతీ రామ్ ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. వాళ్ళ పాప బానీ మా సంవేద్యతో కలిసి రోజూ మాఇంట్లో కొంతసేపు బొమ్మలతో ఆడుకుంటుంది. అలాగే ఒక రోజు ఆడుకుంటుండగా మధ్యలో ఆట ఆపి మా సంవేద్య తనకువచ్చిన అక్షరాలను గుండ్రంగా వ్రాస్తూ కూర్చుంది. బానీ కూడా దాని దగ్గరకు వచ్చి కూర్చొని శ్రద్ధగా చూస్తుంది. వ్రాయటం పూర్తిచేసి అక్షరాలను నాకు చూపించింది సంవేద్య. అది చూచి బానీ నాతో దాదిమా నేను కూడా వ్రాస్తానని ఇంగ్లీష్ లో చెప్పింది. మరి నాకు మీ పంజాబీ రాదే ఎలాగ? అన్నాను. నేను ఎలాగైనా వ్రాయాల్సిందే నని పట్టుపట్టింది.

నేను మాఅబ్బాయితో చెప్పాను బానీ అక్షరాలు నేర్పించమంటుంది నాకు పంజాబీ రాదు ఎలాగ అని. ఓస్ ఇంతేనా అని నాకు ఇంటర్నెట్ లో పంజాబీ అక్షరాలను చూపించాడు. ఇంక నా సమస్య తీరింది. మంచిరోజు చూచి మొదట నేను ఆ అక్షరాలు ఎలావ్రాయాలో నేర్చుకొని, ఆతరువాత బానీ చేత ఒక పేపరుమీద ‘ੳ’ (ఉడా) అని వ్రాసి ఇచ్చి గీతమీదనే కొన్నిసార్లు వ్రాయించాను. రెండు రోజులలొ బానీ నాకు  ‘ੳ’ (ఉడా) ని వ్రాసి చూపించింది. నాకు చాలా సంతోషంకలిగింది. ఇంకనేను ఊరుకోకుండా పేపరు నిండా ‘ੳ’  (ఉడా) లను వ్రాయమన్నాను. బానీ అలాగే పేపరును నింపేసింది గుండ్రంగా. బానీ రోజూ నా దగ్గరకు వచ్చి అక్షరాలను నేర్చుకుంటున్నది. క్రొత్త అక్షరం వచ్చినప్పుడల్లా బాణీ కళ్ళల్లో సంతోషాన్ని చూచాను. అమ్మ, నాన్న, తాత, దాదీమాలకు గర్వంగా చూపిస్తుంది. ప్రతిరోజూ ఆఇద్దరు పిల్లలూ నాదగ్గర శ్రద్ధగా చదువుకుంటున్నారు.

అక్షరాభ్యాసము అంటే తెలుగు అక్షరాలు దిద్దటమే కాదు, దేశ కాల భాషా వయోపరిమితుల కతీతంగా నిరంతరం కొత్త విషయాలను జిజ్ఞాసతో అభ్యసించటమే!

బాపట్లలో 10వ తరగతి తర్వాత నాన్న చేత అప్పు చేయించి చదవడం ఇష్టం లేక ఆగిపోయిన నన్ను ఇన్ని సంవత్సరాల తరువాత ఈ 60 సంవత్సరాల వయస్సులో మరలా మా అబ్బాయి నన్ను బడిలో చేర్చటం, నేను చదువుకోవటం ....ఇదంతా ఆలోచిస్తున్న నాకు ఆ జన్మలో తీరని కోరికను మా నాన్న ఈ జన్మలో మా అబ్బాయిగా తీర్చుకుంటున్నాడని అనిపిస్తుంటుంది.

ఈ విధంగా, నాలుగేళ్ల లోపు మనవరాలికి తెలుగు అక్షరాభ్యాసమూ, అరవై ఏళ్లు దాటిన నాకు ఇంగ్లీష్ అక్షరాభ్యాసము జరిగి, నేను ఇంగ్లీష్ నేర్వటం మొదలెడితే, సరుకులు సర్దేటప్పుడు క్రింద పడిన బియ్యపు గింజలను, కందిపప్పు గింజలను కుదురైన తెలుగు అక్షరాలుగా అమర్చి మాకు చూపిస్తోంది మా సంవేద్య.

ఇదే మా అక్షరాభ్యాసం!

********

Posted in August 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!