Menu Close
మోక్షం
-- భావరాజు శ్రీనివాస్ --

‘ధర్మార్ధకామమోక్షాలు’ ‘కామిగాని వాడు మోక్షగామి కాడు’, ‘సూక్ష్మంలో మోక్షం’ - ఈ మాటల్లో ఉన్న మోక్షాన్ని పొందడమే ఈ రచన ఉద్దేశ్యం. విషయాన్ని వివరించడానికి, ఈ రచనలో వాడిన పదాలు- జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, బ్రహ్మం, మోక్షం మరియు వాక్యాలు- సర్వం ఖిల్విదం బ్రహ్మ, ..మొదలైనవి ఉపనిషత్తులనుండి స్వీకరించడం జరిగింది. ఈశ్వరుడు, బ్రహ్మం జ్ఞానానికి ప్రతీకలు. మతానికి కాదు.

ఈ క్రింది ఫోటో లోని మొదటి సమీకరణం లో జీవుడు(mind), జగత్తు(matter) తో relation లో ఉన్నాడు. ‘X’ (into symbol) ఈ సంబంధాన్ని సూచిస్తున్నది. ఈ సంబంధమే, రిలేషనే relativity, సంసారం. ఈశ్వరుడు ఈ relativity ని, సంసారాన్ని దాటి ఏకాంతంగా, స్వేచ్ఛగా ఉన్నాడు. ఇది సన్యాసం(absolute). ‘గజేంద్రమోక్షం’ కథలో గజేంద్రుడు, తనను మొసలి బారి నుండి కాపాడమని దైవాన్ని ప్రార్ధించినట్టు, జీవుడు, జగత్తుతో ఏర్పడిన బంధం నుండి, సంసారం నుండి బయటపడాలని, జగత్తునుండి దృష్టి మరల్చి , relativityకి(సృష్టికి) అవతల ఎక్కడో ఉన్నాడని ఊహించే, ఈశ్వరుడి(దైవం)పై దృష్టి సారిస్తాడు. కానీ relativity ని దాటి ఈశ్వరుడి స్థాయిని అందుకోలేక ఆ ఈశ్వరుణ్ణి అక్కడనుంచి తీసుకొచ్చి, జగత్తులో ఒక గుడి కట్టి, ఆయన్ను అందులో ప్రతిష్టించి భక్తి భావంతో ఆయనతో కూడా సంబంధం పెట్టుకుని, తనకు ప్రతికూలంగా మారిన జగత్తును, తనకు అనుకూలంగా మార్చమని ఆయన్ను ప్రార్ధిస్తూ ఉండడం వల్ల , జీవుడు సంసారం నుండి బయట పడక పోగా, ఈశ్వరుణ్ణి కూడా జగత్తులోకి, సంసారంలోకి లాగి, ఆయనకు అన్నీ సమకూర్చలేక సతమతమౌతూ సంసారాన్ని మరింత పెంచుకుంటున్నాడు. లోకంతో సంబంధం పెట్టుకోవడం కోసం లౌకిక వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నట్టే ఈశ్వరుడితో సంబంధం పెట్టుకోవడం కోసం మత వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నాడు.

Relativity లో ఉండడం వల్ల జీవ, జగత్తులో ఒకటి ఉంటే రెండోది ఉంటుంది..జీవుడు లేకపోతే (మరణిస్తే) జగత్తు లేదు. ఈ రెండూ లేకపోతే సంసారం లేదు. కానీ జగత్తుతో పాటూ తను కూడా లేకుండా పోతుండడం వల్ల స్వేచ్ఛను అనుభవించే అవకాశం జీవుడికి లేదు. అందువల్ల జీవించి ఉండగానే relativity నుండి సంసారం నుండి విముక్తి పొందాలి. జీవించి ఉండగానే పొందే ముక్తే  జీవన్ముక్తి..

పోనీ, జగత్తుపై మమకారాన్ని వదిలిపెట్టేసినా శరీరం(అహంకారం) ఉన్నంతకాలం జగత్తుతో సంబంధం తప్పదు. జగత్తు నుంచి తప్పించుకున్నా దాన్ని గూర్చిన ఆలోచనల్నుంచి జీవుడు తప్పించుకోలేడు. అహంకారమే విత్తనమై జగత్తుతో సంబంధం పెట్టుకుని సంసార వృక్షాన్ని విస్తరింపచేస్తుంది.

శాస్త్రజ్ఞుడు జీవుడి స్థానంలో ఉండి తను చూసే జగత్తులో ఒక పదార్ధానికీ, మరో పదార్ధానికీ, శరీరంలో ఒక అవయవానికీ మరొక అవయవానికీ, మనస్సులో ఒక ఆలోచనకు, మరొక ఆలోచనకు ఉన్న సంబంధాన్ని తెలుసుకుంటున్నాడు. ఐనస్టీన్ మాత్రం జీవుడి స్థానంలో కాకుండా ఈశ్వరుడి స్థానంలో ఉండి అక్కడనుండి జీవ జగత్తుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించి సాపేక్ష సిద్ధాంతాన్ని (theory of relativity) ప్రతిపాదించిన తరువాత సృష్టిని గూర్చిన దృష్టి మొత్తం మారిపోయింది.

స్వేచ్ఛను పొందాలంటే జీవుడు relativity ని దాటి ఈశ్వరుడై పోవాలి. ఈశ్వరుడంటే జ్ఞానం. ఎటువంటి జ్ఞానం? నేను స్వతఃసిద్ధంగా ఈశ్వరుణ్నేనని, ఆ స్థితిని (జ్ఞానాన్ని) కోల్పోయి జీవుణ్ణవడం వల్ల జగత్తుతో సంబంధం (సంసారం) ఏర్పడిందని గుర్తించే జ్ఞానం. ఈ జ్ఞానం శివుడికి ఉందనడానికి ఆయనకు జ్ఞాననేత్రం ఉండడమే నిదర్శనం. ఈ జ్ఞానంతోనే, తనను జీవుణ్ణి చేసి relativity లో సంసారంలో, మాయలో పడెయ్యబోయిన మన్మధుణ్ణి గుర్తించి ధగ్ధం చేసి తన ఈశ్వర స్థాయిని కోల్పోకుండా నిలుపుకున్నాడు. ‘నేను’ ఈశ్వర స్థానం నుంచి జీవుడి స్థానానికి పతనమవ్వడం వల్ల ఈశ్వర స్థానం ఖాళీ అయి ఆ స్థానంలో మరొక ఈశ్వరుణ్ణి (ఇష్ట దైవాన్ని)ప్రతిష్టించ వలసి వచ్చింది.

జీవుడు తన నిజ స్వరూపాన్ని గుర్తించి ఈశ్వరుడై ఆ స్థానంలో ఉండి జీవ జగత్తుల మధ్య జరిగే వ్యవహారాలను ‘సాక్షి’ గా చూస్తూ ఉండిపోదామనుకున్నా జగత్తు ఉండనివ్వదు. అతణ్ణి వ్యవహారంలోకి, వివాదంలోకి లాగి జీవుణ్ణి చేసి మళ్ళీ సంసారంలో పడేస్తుంది. ఈ ప్రమాదం(సంసారం) నుంచి ఈశ్వరుడు తప్పించుకోవాలంటే జగత్తు ఉండకూడదు. ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. అందుకోసం ఈశ్వరుడు(జ్ఞానం) తను సాక్షిగా ఉండి చూస్తున్న relativityని,జీవజగత్తులను (అహంకార,మమకారాలను) రెండో సమీకరణంలో చూపించినట్టు తనలో కలిపేసుకుని ‘బ్రహ్మం’ అయిపోవాలి. అపుడు నదులన్నీ సముద్రంలో లయమై తమ ఉనికిని కోల్పోయి సముద్రంగా మారినట్టు, జీవజగదీశ్వరులు ముగ్గురూ జ్ఞానసాగరం(బ్రహ్మం) లో లయమై తమ ఉనికి కోల్పోయి బ్రహ్మంగా మారిపోతారు. ఇప్పుడు జగత్తు బ్రహ్మమే (సర్వం ఖిల్విదం బ్రహ్మ). అలాగే జీవుడు (అయమాత్మా బ్రహ్మ), జ్ఞాన స్వరూపుడైన ఈశ్వరుడు (ప్రజ్ఞానం బ్రహ్మ). ఇపుడు బ్రహ్మం తప్ప రెండోది లేదు . ‘ఏకమేవా అద్వితీయం బ్రహ్మ’. నదులన్నీ సముద్రంలో కలిసి సముద్రంగా మారిన తర్వాత వాటిమధ్య బేధం ఎలా లేదో, కనపడదో, జీవజగదీశ్వరులు మూడూ బ్రహ్మమైనపుడు వాటిమధ్య భేదం లేదు. కనపడదు. మూడింటినీ(అన్నింటినీ) సమానంగా బ్రహ్మంగా చూడడం -ఇది spiritual communism.

జీవజగత్తులు (relativity) కార్యమై, ఈ కార్యం యొక్క సృష్టి, స్థితి, లయలకు ఈశ్వరుడు కారణమైతే ఈ కార్యకారణ సంబంధాన్ని (relativityని) దాటి ఉన్నది ‘సత్యం’. బ్రహ్మం. ఈ సత్యానికి, బ్రహ్మానికి తాను ఉన్నానన్న స్పృహ, స్ఫురణ, జ్ఞానం కూడా తనకే ఉన్నందున ‘జ్ఞానం’ కూడా అదే. అనంతమూ అదే. ‘సత్యం, జ్ఞానం, అనంతంబ్రహ్మ’ నదులన్నీఅనంతమైన సముద్రంలో కలిసి నదులుగా అంతమై సముద్రంగా అనంతత్వాన్ని పొందినట్టు, జీవజగదీశ్వరులు బ్రహ్మంలో లయమై జీవజగదీశ్వరులుగా అంతమై(మృతమై) బ్రహ్మాంగా అనంతతత్వాన్ని, (అమృతతత్వాన్ని) పొందుతున్నారు ఇలా జీవుడుగా ఒక జన్మ, బ్రహ్మంగా మారి మరో జన్మ - ఇలా రెండు జన్మలు కలిగిన వాడు ద్విజుడు.

భగవత్తత్వానికి, జ్ఞానానికి, బ్రహ్మానికి,(1)కి లింగం(+,-) లేదు. లింగం లేకపోతే, జీవ,జగత్తులు, relativity (సంసారం) లేదు. సంసారం లేకపోతే దాన్నించి బయటపడేసే సన్యాసమూ (ఈశ్వరుడు) లేదు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు -ఈ త్రయం (తాప’త్రయం’) నుండి బయటపడడమే మోక్షం. పైకి పరస్పర విరుద్ధంగా కనిపించే relatives రెండూ (+,-), మొదట్నుంచీ ఒకటి (1) గానే ఉన్నాయని గుర్తిస్తేనే గానీ రెండింటి నుంచి బయట పడలేం. గుర్తించేది ఎపుడూ నిరాకారమైన(+,- లేని) జ్ఞానమే కాబట్టి జ్ఞానం తప్ప మోక్షానికి మరో మార్గం లేదు. భగవత్తత్వానికి లింగం(ఆకారం) లేకపోవడం (వ్యక్తం కాకపోవడం) నాస్తికత్వానికి, రెండు లింగాలు (+,-) ఏకమై ఒకటి(1)గా అవ్యక్తంగా ఉండడం ఆస్తికత్వానికీ దారితీసింది.

ఇప్పుడు ఉన్నది ఒకటే. అది బ్రహ్మం. అది నేనే(అహం బ్రహ్మాస్మి)..బ్రహ్మం వేరు, నేను వేరు అనుకుంటే రెండింటి మధ్య మళ్ళీ సంబంధం, relativity, సంసారం వచ్చిపడతాయి రెండు ఉంటే రెండో దాని వల్ల భయం, దాని మీద కోరిక..జీవుడిగా ఉన్నంత కాలం ఇటు జగత్తు(ఇహం), అటు ఈశ్వరుడి(పరం) వల్ల భయం. వాటి మీద కోరిక. కోరిక, భయం లేకపోవడమే స్వేచ్ఛ.,మోక్షం. జీవుడు, జగత్తును, ఈశ్వరుణ్ణి, బ్రహ్మాన్నీ తనకు వేరుగా చూస్తూ వాటి వారి గురించి వింటూ  తెలుసుకుంటున్నంత సేపూ అది అవగాహనే కానీ అనుభవం కాదు. సన్యాసాన్ని ఇష్టపడి relatives ని వదిలి ఉన్న శివుడు, బంధుత్వాలను (relativesని) ఇష్టపడి సంసారంలో ఉన్నపార్వతిని, తనలో లయం చేసుకుని అర్ధనారీశ్వరుడైనట్టు, relativity దాటి ఏకాంతంగా, సన్యాసంలో ఉన్న ఈశ్వరుడు, జీవజగత్తులను, సంసారాన్ని, relativity ని తనలో లయం చేసుకుని బ్రహ్మం అయ్యాడు..బ్రహ్మం అయిన ఈశ్వరుడు కేవలం సన్యాసీ కాదు. కేవలం సంసారీ కాదు. రెండింటినీ తనలో లయం చేసుకున్న‘జ్ఞాని’, బ్రహ్మ జ్ఞాని. జ్ణాని సన్యాసాన్ని, సంసారాన్ని వేరుచేసి చూడడు. ఈ జ్ఞానంతోనే శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తన ‘జగమంత కుటుంబం’ పాటలో “సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావేలే” (రెండూ నావే)అని బ్రాహ్మీస్థితి లో ఉండి పాడుకున్నారు.

శ్రీకృష్ణుడు జ్ఞాని. అందుకే అయన సంసారాన్నీ- సన్యాసాన్నీ; ధర్మాన్నీ-, రాజకీయాల్నీ వేరు చేసి చూడలేదు. సంసారంలో ఉంటూనే, సన్యాసిలా తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నాడు. రాజకీయాల్లో ఉంటూనే ధర్మాన్ని (పాండవుల్ని)విడిచి పెట్టలేదు. సంసారాన్నీ- సన్యాసాన్నీ; ధర్మాన్నీ-రాజకీయాల్నీ వేరు చేసి చూసేవారికి ఆ రెండిట్లో ఏ ఒక్కటీ ఎప్పటికీ పూర్తిగా అవగాహనకు రాదు.

ఉపనిషత్ మహర్షులు  relativity ని, సంసారాన్నిదాటి ఈశ్వరులై, తాము దాటి(transcend అయి) వచ్చిన సంసార సాగరాన్ని తమలో లయం చేసుకుని బ్రహ్మామై ‘అహం బ్రహ్మాస్మి’ అని అనుకున్నవారే. Relitivity ని దాటిపోవడం స్వేచ్ఛ అయితే, దాటి వచ్చిన relitivity ని తిరిగి కలుపుకోవడం బాధ్యత. బాధ్యతతో కూడిన స్వేచ్చే మోక్షం (utmost freedom). దాటిపోతే అనుభూతి, కలుపుకుపోతే అనుభవం కలుగుతాయి.

ధర్మార్థకామమోక్షాలలో ధర్మం ఈశ్వరుడు(moral life). అర్ధం జగత్తు (public life), కామం జీవుడు(private life) మోక్షమే బ్రహ్మం(spiritual life). జీవ,జగత్తులను కలుపుకుపోలేని ఈశ్వరుడు బ్రహ్మం కాలేడు. అలాగే అర్ధకామాలను కలుపుకుపోలేని ధర్మం మోక్షానికి(పరిపూర్ణతకు) దారితీయదు. బ్రహ్మంలో జీవజగదీశ్వరులు ముగ్గురూ ఉన్నట్టు, మోక్షంలో ధర్మార్ధకామాలు మూడూ ఉన్నాయి కానీ ఆ మూడింటిలో ఏ ఒక్క దానిలోనూ మోక్షం లేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీరి జీవితాల్లో ధర్మార్ధకామాలు మూడూ ఉన్నాయి కానీ వాటిల్లో వారు లేరు. ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నట్టు వారు మోక్ష స్థితిలో ఉండి ధర్మార్ధకామాలను .మూడింటినీ కలుపుకుపోయారు.

భగవద్గీత ఆఖరి అధ్యాయం ‘మోక్షసన్యాసయోగం’లో ఆఖరి శ్లోకం ’సర్వధర్మాన్ పరిత్యజ్య’ మోక్షం కోసం ధర్మాన్నీ విడిచిపెట్టమంది. కారణం ఈశ్వరుడు రెండో సమీకరణంలో చూపించినట్టు జీవజగత్తులు రెండింటితోనూ సంబంధం పెట్టుకుని వాటిని control చేస్తూ relativity (సంసారం)లో ఉన్నట్టు, ధర్మం కూడా అర్ధకామాలతో సంబంధం పెట్టుకుని వాటిని control చేస్తూ relativity (సంసారం)లోనే ఉన్నది. అర్ధకామాలను కలుపుకుపోవడం ద్వారా ధర్మం relativity ని దాటిపోతేనే మోక్షం. ‘ఇంటికన్నా గుడి పదిలం’  ‘నికృష్టమైన శరీరం - ఉత్కృష్టమైన ఆత్మ’ .అంటూ అర్ధకామాలను, ధర్మాన్నీ; జీవజగత్తులను, ఈశ్వరుణ్ణి (ఇహం-పరం అని) వేరు చేసి చూస్తే మోక్షం(పరిపూర్ణత) లేదు..’ (జీవుడు x జగత్తు), (జననం x మరణం), (మంచి x చెడు), (సుఖం x దుఃఖం), (శరీరం x మనస్సు),(దేశంx కాలం) (ఇహంxపరం), (ఆస్తికతxనాస్తికత) మొదలైన ద్వంద్వాలన్నీ relatives. వాటిది విడదీయలేని బంధం. విడిచిపెడితే రెండింటినీ విడిచిపెట్టాలి. కలుపుకుంటే రెండింటినీ కలుపుకోవాలి. కానీ విడిచిపెట్టలేం. ఎందుకంటే already జీవుడిగా జన్మించి ఉన్నాం. జీవుడిగా ఉన్నందుకు జగత్తును కలుపుకు పోవాలి. జన్మించినందుకు, మరణాన్ని కలుపుకుపోవాలి. కలుపుకుపోవడం(positive thinking) తప్ప మనకు మరో మార్గం లేదు. మనలో ఉండి వెలుగు చీకటిని కలుపుకు పోయినట్టు కలుపుకుపోయేది జ్ఞానమే. తన జ్ఞానంతో జనన, మరణాలను కలుపుకుపోయి బ్రహ్మం అయిపోవడం వల్ల బ్రహ్మానికి లాగే శివుడికి జననం లేదు. స్వయంభువు. మరణం లేదు. మృత్యుంజయుడు. బ్రహ్మానికి మల్లే లింగం లేదు. అర్ధనారీశ్వరుడు కలుపుకోవడం వేరు, కలిసిపోవడం వేరు. కలుపుకుంటే అనుభవానికి వస్తుంది. కలిసిపోతే అస్థిత్వమే పోతుంది. శివుడు ఈశ్వరుడై, జీవజగత్తులను (relativityని) తనలో కలుపుకుని బ్రహ్మానుభవాన్ని, అమృతత్వాన్ని పొందాడు. మన్మధుని ప్రభావానికి లోనై జీవుడై relativity లో, సంసారంలో కలిసిపోతే ఈశ్వరుడిగా తన అస్థిత్వాన్ని కోల్పేయేవాడు. ఈశ్వర స్థాయిని వదిలి పెట్టి జీవుడై,జగత్తుతో సంబంధం పెట్టుకోవడం మొదలు చెడ్డ బేరం అవుతుంది.

గణితపరంగా, లేదా తాత్వికంగా చూసినా మూడుగా ఉన్న జీవజగదీశ్వరులు, ధర్మార్ధకామాలు ఒక సమస్య (given problem, data). ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి వాటిని  ఏకం చెయ్యడమే, సూక్ష్మీకరించడమే (simplify చెయ్యడమే)సమస్యకు పరిష్కారం,.పరిష్కారమే మోక్షం. సూక్ష్మీకరించడంలోనే (ఏకం చెయ్యడంలోనే) మోక్షం ఉంది కనుక ‘సూక్ష్మంలో మోక్షం’. జీవజగదీశ్వరుల నుండి ‘సత్యం, జ్ఞానం, అనంతం’ అయిన బ్రహ్మం దగ్గరికి, అమృతత్వం వైపు ప్రయాణం చెయ్యడమే, ’అసతోమా సద్గమయా’, ‘తమసోమా జ్యోతిర్గమయ’. ’మృత్యోర్మా అమృతంగ మయ.

Moksham

Posted in August 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!