Menu Close
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
-- దినవహి సత్యవతి --

సాహితీ మిత్రులకు శుభదినం.

ఈ మాసం పంచపదులు అష్టాదశ శక్తి పీఠాల గురించి. అంతకు ముందుగా శక్తి పీఠాల గురించి ఉటంకిస్తాను. మీలో చాలామంది శక్తి పీఠాల గురించి వినే ఉంటారు. కొంతమంది దర్శించి కూడా ఉంటారు.

దక్షుడు యజ్ఞం చేసుకుంటూ కూతురు సతిని, అల్లుడు పరమేశ్వరుడినీ ఆహ్వానించడు. సతీదేవి ఎంతో బాధపడుతుంది. శివునికి ఆగ్రహం కూడా వస్తుంది. ఆహ్వానం లేకపోయినా పుట్టింటి పై మమకారం కొలదీ సతీ దేవి యజ్ఞం చూడటానికి వెళ్లి తండ్రి చేత అవమానింప బడుతుంది. అవమానభారంతో కృంగిపోయిన సతీ దేవి యజ్ఞశాలలోనే అగ్ని రగుల్చుకుని ఆత్మాహుతి చేసుకుంటుంది. విషయం తెలిసిన ఈశ్వరుడు మహోగ్రుడై వచ్చి సతీ దేవి పార్థివ దేహాన్ని భుజం పై వేసుకుని ఉగ్ర తాండవం చేస్తాడు.

శివుడీని శాంతిప జేయడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ దేహాన్ని ఖండ ఖండాలుగా చేస్తాడు. ఆ ఖండాలు ఎగిరి భూమి పై ఏ యే ప్రదేశాలలో పడినాయో ఆయా ప్రదేశాలలో 18 శక్తి పీఠాలు...అవే అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిసాయని ప్రతీతి.

1 నుంచి 3 శక్తి పీఠాలపై నేను వ్రాసిన పంచపదులు.

అంశం: అష్టాదశ శక్తిపీఠాలు

1. శాంకరీ దేవి

ఈశ్వర హృదయాధి కారిణి,
దక్ష యజ్ఞ వినాశ కారిణి,
శంకర మనః క్లేశ కారిణి,
అష్టాదశ శక్తి పీఠోద్భవ కారిణి,
శాంకరీదేవి పరమేశ్వర అర్థాంగినీ రూపిణి సత్యా!

2. కంచి కామాక్షి

పరమేశ్వర మనోహారిణీ దేవీ నమః
శ్రీ వాణీ మనస్విని రూపిణీ భక్త  ప్రియా, దేవీ నమః
అష్టా దశ శక్తి పీఠోద్భవ కారిణీ దేవీ నమః,
కాంచీపురాధీశ రమణీ,కామాక్షి దేవీ నమః,
దేవీ దర్శన భాగ్యమునొంది ధన్యు రాలివి కమ్ము సత్యా!

3. శ్రీ శృంఖలా దేవి

జగన్మాత, సకల లోక పూజిత లలితా దేవి,
అష్టాదశ శక్తి రూప విశృంఖలా దేవి,
త్రయ శక్తి పీఠ ప్రద్యుమ్న నగర స్థిత దేవి,
ఋష్యృంగ ముని సేవలందిన శృంఖలా దేవి,
శక్తి స్వరూపణి అమ్మవారిని  కొలిచి తరించు సత్యా!

శక్తి పీఠాల పంచపదుల గురించి మీ సూచనలు తెలిపి, అభిప్రాయాలు పంచుకొనగలరు.

*** సశేషం ***

Posted in August 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!