Menu Close
sravanthi_plain
నేస్తమా! కుశలమా?
అయ్యగారి సూర్యనారాయణ మూర్తి
కం.
చెలిమికి మన సంస్కృతిలోఁ
గల విలువనుఁ దెలుపఁ గలదె కావ్యంబైనన్?
అలనాటి కృష్ణునెయ్యము
గలిగించెఁ గుచేలునకును గలుముల నెలమిన్
తే.గీ.
రామసుగ్రీవమైత్రికిఁ బ్రభువు లిరువు
రమిత దుఃఖంబువోయి హర్షంబు నొంది
రెంత గట్టిదొ యీబంధ మిదియె తెల్పు
దశరథాత్మజు జన్మ సార్థకము గాఁగ
కం.
‘డామను’ ‘పిథియాసు’ల కథ
యే మిత్రత కద్దమగునొ యెఱుఁగదె జగమే?
ఆ మిత్రులు ప్రాణములను
తా మొడ్డిరి స్నేహబంధ ధర్మంబునకై
తే.గీ.
జాతి వైషమ్యమును వీడి సఖ్యముమెయి
జంతువులు కూడ రక్షణనెంతొ కూర్చి
పంచుఁ బ్రేమను, నెమ్మికిఁ బ్రాంతవర్ణ
జాతిభాషలు హద్దులే స్రష్టసృష్టి?
కం.
కలువకుఁ జంద్రున కంబుజ
ములకును రవి కసితమేఘములకును శిఖికిన్
చలియించు తంత్రికిని స్వర
ములకును బ్రకృతియె యొనర్చు మురిపెపుఁ గూర్మిన్
కం.
పొంతనము చాలుఁ దలఁపఁగ
స్వాంతమునన్ శాంతి గలిగి సద్భావనలే
చింతలనుఁ బాఱఁ ద్రోలుగ
సాంతము, సాంగత్యమహిమ కంజలి సేతున్

ఈ కవితలో స్నేహము మొత్తము తొమ్మిది రూపాలలో దర్శనమిస్తుంది.

Posted in August 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!