Menu Close
మైత్రీవనం (కథ)
ఆదూరి హైమావతి

అదొక అందమైన ఫలపుష్పాలు పుష్కలంగా లభించే అడవి. ఎన్నో పక్షులు నిర్భయంగా అక్కడ జీవిస్తుంటాయి. ఆ అడవి లో ఉండే పెద్ద వటవృక్షం ఆ పక్షులన్నింటికీ నివాసం. పక్కనే ప్రవహించే తీయని నీటితో ఉన్న నది వాటి దాహం తీర్చే అమృతమయి. పగలంతా ఎక్కడెక్కడో తిరిగి కడుపునింపు కుంటూ, సూర్యాస్తమయానికంతా తమ నెలవుకు చేరుతాయి. హాయిగా తాము చూసిన వింతలు చెప్పుకుంటూ నిద్రిస్తాయి.

ఒకరోజు సూర్యోదయం కాకముందే ఆచెట్టుమీది పక్షులకు కొత్త అరుపులు వినిపించి అన్నీ లేచి విన్నాయి. పక్షిజాతిలాగే ఉన్నా ఆ అరుపుకు కొత్తగా ఉన్నాయి, రెక్కలు దులుపుకుని అన్నీ చెవులు రిక్కించి వింటూ చుట్టూ చూడసాగాయి.

ఆ వటవృక్షానికి దగ్గరగా పారే నదినుండి ఆ ఆరుపులు వస్తున్నట్లు గ్రహించి, ముందుగా పక్షిరాజైన ఖగేశ్వరుడు వెళ్ళి దూరం నుండి చూశాడు. అక్కడ నీరు త్రాగుతూ రంగు రంగుల చిత్రమైన, చిన్నా పెద్దా పక్షులు ఉండటం చూసి, ప్రమాదమేమీలేదని సూచించాక, మిగతా పక్షులన్నీ తమ గూళ్లనుండి బయటకు వచ్చి, క్రిందకు దిగాయి. అక్కడ వున్న పక్షులను చూసి అన్నీ చిత్రంగా ఒకరినొకరు చూసుకున్నాయి, సంతోషంతో, ఆహ్వానిస్తూ గీరగా అరిచాయి.

ఆ పక్షుల్లో పెద్దగా ఉన్న ఒక కొంగవంటి పక్షి ముందుకు వచ్చి "ఓ ఇక్కడ మాలాంటి జీవులు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము వలసపక్షులం. మాదేశాల్లో చలికాలం వచ్చినపుడు మేము ఇలా 9నుండి 12వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాం. సముద్రాలమీదుగా ఎగురుకుంటూ ఇలా వస్తాము. మాకు అనుకులంగా ఉన్న వాతావరణంలో ఎక్కువ చలిలేకుండా, నీరు, తిండి దొరికేచోట, 3,4 మాసాలు గడిపి తిరిగి మా దేశాల్లో వేసవి వచ్చేముందు వెళ్ళిపోతుంటాం. మాలో చాలా పక్షుల లాగానే ఉన్నారు మీలో చాలామంది. కాస్త రంగూ, ఆకారాల్లో భేదం అంతే. మాపేర్లతో పనిలేదు. మీపేర్లూ మాకు అక్కరలేదు. మమ్మల్ని మీతో 3,4 మాసాలు ఉండనిస్తేచాలు. మీకే అపకారమూ చేయం." అంది సుదీర్ఘంగా.

అడవి పక్షుల రాజు ఖగేశ్వరుడు ముందుకు వచ్చి "ప్రియమిత్రులారా! మీరంతా మా అతిధులు. మీరంతా యధేఛ్ఛగా ఇక్కడ మీకు కావలసినంతకాలం ఉండవచ్చు. ఇక్కడ తేనె ఉండే పూలూ ఉన్నాయి. కాయలు, పండ్లూ, లభిస్తాయి. ఈ వటవృక్షం కొమ్మలు మీకంతా నివాసంగా ఉపయోగాపడతాయి. మీకు కావల్సితే మా పిచ్చుక తమ్ముళ్ళూ చక్కగా గూళ్ళు అల్లి ఇస్తాయి. నీటిపక్షులు నీటిలోనూ ఉండవచ్చు. స్వాగతం” అంది.

పక్షులన్నీ ఒక్కమారుగా కోయిలలు, గోరువంకలూ, నైటింగేల్స్ పిచ్చుకలూ అన్నీ అరుస్తూ కొత్త పక్షులన్నింటికీ ఆహ్వానగీతం పలికాయి.

ముందుజాగ్రత్త గల కాకమ్మ "ప్రియ మిత్రులారా! బాగా అలసిపోయి వచ్చి ఉంటారు. ఈ అడవిలో మధురమైన ఫలాలు లభిస్తాయి. హాయిగ తిని అడవంతా సంచరించి వింతలన్నీ చూసి రండి. మేమూ సాయంకాలానికి ఇళ్ళు చేరుతాము.” అంది.

గోరువంక "ఒక హెచ్చరిక మిత్రులారా! ఇటీవల ఈ అడవిలోకి ఒకవేట గాడు వచ్చి వలపన్ని పోతున్నాడు. ఆ వలలో చాలా రకాలైన విత్తనాలూ, పండ్లూ కూడా పెడుతుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఆశించి వల జోలికి వెళ్ళకండి. మరునాడు వచ్చి పట్టుకెళ్ళి చంపి తినేస్తాడు. ఇదొక్కటే మాకు ఇక్కడ భయం. మా ప్రాంతానికి వచ్చిన మీకు ఏ అపకారమూ జరక్కూడదు. అది మాకు అవమానం. కనుక జాగ్రత్త" అని చెప్పింది. పక్షులన్నీ ఒక్కమారుగా ఎగిరి వివిధ దిక్కులకు ఆహారంకోసం వెళ్ళిపోయాయి.

తూర్పుతెల్లవారగానే వేటగాడు వలలు పట్టుకుని వచ్చాడు. ఆ వటవృక్షం క్రింద పక్షుల రెట్టలను చూసిన వేట కాడు 'ఇక్కడ చాలా పక్షులున్నాయి, కొన్నైనాపడకపోతాయా!' అని భావించి వలలు పన్ని వెళ్లాడు.

సాయంకాలానికి ముందే వలస స్కేలార్క్ వచ్చి వలలో ఉన్న రంగు రంగుల పండ్లనూ, రాగి, పిల్లిపేస, జొన్న, సౙ్జ గింజలనూ చూసి క్రింది దిగబోయింది. వాగ్టెయిల్ పక్షి "తొందరపడకు మిత్రమా! మన మిత్రులు హెచ్చరించారు కదా! వలజోలికి వెళ్లవద్దని. ఆగు" అనే లోపే క్రిందికి దిగేసి వల దగ్గర నించుని వంగి చూస్తుండగా దాని పాదాలవ్రేళ్ళు వలలో చిక్కుకుపోయాయి. అది గీరగా, "కాపాడండి, కాపాడండి" అని అరవ సాగింది.

ఈలోగా ఆ అడవిపక్షులన్నీ వచ్చేశాయి."అయ్యో! మన మిత్రుడు, వలలో చిక్కున్నాడు" అని అరిచాయి.

అడవి పక్షులరాజు క్రిందికి దిగి "కంగారు పడకు మిత్రమా! మానేస్తం ఒకడున్నాడు, నీ ఉచ్చు త్రాళ్లను తెంపగలడు. ఉండు పిలుస్తాను. అంటూ "బుజ్జి మిత్రమా ఉడుత తంబీ!" అని అరిచింది.

వెంటనే పక్కనున్న పొదల్లోంచి వీపున మూడు తెల్ల చారలున్న ఉడుత వచ్చి "అన్నా! నాతో పని బడిందా చెప్పన్నా! మీరు మా ఉడుతజాతికి చంపి తినమని ఇచ్చిన రక్షణ మేరకు మేమిక్కడ హాయిగా ఉంటున్నాం. నేను చేయగల సేవ ఏమైనా ఉందా అన్నా!" అని అడిగింది.

గరుడుడు 'బుజ్జి మిత్రమా! మన అడవికి వచ్చిన కొత్త మిత్రుల్లో ఒకరు ఈ వలలో ఇరుక్కున్నారు పొరబాటున. ఆ మిత్రుని కాళ్ళ ఉచ్చులు కొరికి బయటకు రాను నీ సాయం అవసరం" అనగానే ఉడుత ఒక్క గంతున వెళ్ళి తన పదునైన పళ్లతో ఆ స్కేలార్క్  పక్షిపాదాలకు అతుక్కుని ఉన్న ఉచ్చుతాళ్ళను కొరికేసింది అది బయటికి వచ్చింది.

గరుడ పక్షి "బుజ్జి మిత్రమా! ధన్యవాదాలు, మన ఇంటికి వచ్చిన వారికి ఏ ఆపదా రాకుండామనం జాగ్రత్త పడాలికదా! "అంది.

"అన్నా! మీకు ఏసేవ కాలన్నా మేం నిరంతరం తయారుగ ఉంటాం." అని చెప్పి వెళ్ళింది.

వలసపక్షుల నాయకుడు గూడ కొంగ, ఎంతో కృతజ్ఞతగా "ప్రియ మిత్రులారా! మీ అభిమానం, ప్రేమ, సేవా భావన, అతిధి మర్యాద, దయ, కరుణ, మీ సత్య ప్రవృత్తి, అహింస, ముందుజాగ్రత్త, మీ కట్టుబాటు, ఇంకా ఎన్నెన్నో మంచి విలువలను పాటించే మీ స్వభావం మాకెంతో ఆనందంగా ఉంది. అందుకే దీన్ని పుణ్యభూమి, మధురభూమి, అమరభూమి అని ఇంకా అనేక పుణ్యనామాలతో పిలవడం. మీ ప్రేమకు, స్నేహానికీ  మా ధన్యవాదాలు” అంది.

డేగ "మిత్రులారా! మా నివాసానికి వచ్చిన మీకు మర్యాద చేయడం, తోడ్పడటం మా బాధ్యత, బాగా అలసి పోయి ఉంటారు, విశ్రాతి పొందండి, రేపు మన నెమలి మిత్రుడు చక్కని నాట్యంతోనూ, చిలుక, నైటింగేలూ, కోయిలమ్మా  కమ్మని గానంతోనూ మనందరినీ అలరిస్తారు. రేపు నిండు పున్నమి వెన్నెలరేయి. కాస్తంత ముందుగానే చంద్రోదయానికి మనం ఇక్కడ కూడుదాం. విశ్రమించండి" అంది. అంతా తలలూపి వారి వారికి అనుకూలమైన తావుల్లో కొమ్మలమీద విశ్రమించారు.

maitreevanam
Images credit: https://te.petmypet.ru/3942-migratory-birds-names-descriptions-and-features-of-mi.html

శరదృతువు ప్రారంభంలో లార్క్స్ వెచ్చని ప్రాంతాలకు వెళ్లి, వసంతకాలం చివరిలో తిరిగి వస్తాయి.

********

Posted in August 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!