Menu Close
తెలుగు పద్య రత్నాలు
-- ఆర్. శర్మ దంతుర్తి --

ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు భోజనాలు ఎలా జరుగుతాయనేది చూస్తే మొదటగా పెద్ద గదిలో రెండు మూడు బంతిలలో అరిటాకులు వేసి వడ్డన మొదలుపెడతారు. ఈ బంతిలో ఎవరెక్కడ కూర్చోవాలనేది, ముందు ఎవరు కూర్చుంటారనేదీ, తినేముందు ఏం చేస్తారనేదీ ముఖ్యమైన విషయాలు. అందరికీ నేలమీద కూర్చునే అలవాటే కనక బల్లలూ, కుర్చీలూ అవీ ఉండవు. హాయిగా బాసింపీట వేసుకుని కూర్చోవడమే. ఇంటికొచ్చిన బంధువుల్లో తిండి పుష్టి ఉన్నవారికీ, పెద్దలకీ ఒక వరసలో ముందు. వీళ్ళకి ఎదురుగా పిల్లలకీ మిగతావాళ్లకీ. అరిటాకులు కడిగి మొదట కొంచెం కొంచెంగా చిన్న గరిటతో అన్నీ వడ్డించడం జరుగుతుంది. కొంచెం కొంచెమే వడ్డించారేమిటీ అనే ప్రశ్నకి సమాథానం ఏమిటంటే, “ఈ పదార్థం ఉంది తినడానికి, ముందు ఎంతకావాలిస్తే అంత వడ్డిస్తారు” అని తెలియజేయడానికి తప్ప తక్కువ తినమని కాదు.

ఇవన్నీ వడ్డన అయ్యాక అన్నం పట్టుకుని వస్తారు. అది రాగానే ఈ బంతిలో కూర్చున్న పెద్దవాళ్ళు, ఓ శ్లోకం చెప్తారు. ఆ శ్లోకం అలవాటు బట్టి మారుతూ ఉండవచ్చు. రామకృష్ణామఠం అయితే తినడానికి ముందు మొదట చెప్పే శ్లోకం భగవద్గీత అథ్యాయంలోనిది:

బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాథినా   (జ్ఞానయోగం,  4.24)

మరికొంతమంది అయితే “అన్నాద్భవంతి భూతాని .. (కర్మ యోగం 3.14) అనే శ్లోకం చెప్తారు. తర్వాత విస్తరి చుట్టూ నీళ్ళు జల్లుతూ గాయత్రీ మంత్రం చెప్పాక రెండేసి మెతుకులు నోట్లో పెట్టుకుని ఆపోసన చేయడం. ఈ మంత్రం చెప్తున్నప్పుడు వడ్డన ఆపుతారు. ఆ తర్వాత అందరూ కలిసి “హరిఃఓం” అని గట్టిగా అరిచి భోజనం మొదలుపెడతారు. ఆ వెనకనే పప్పూ, కూరలూ, థప్పళం, అప్పడం, వడియం అన్నీ వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి వడ్డనకి.  పిల్లల బంతికి ముందు, తర్వాత మిగతావారికీ ఎవరికి కావాల్సినంత వారికి వడ్డిస్తారు.  ఇవన్నీ ఒకసారి అయ్యాక చివరిలో పెరుగు వచ్చేసరికి ముందు అన్నీ తినేసినవారు ఆగుతారు అందరూ మిగతావన్నీ తినేదాకా. ఈ లోపున లడ్డూలో కాజాలో ఉంటే అవీ వడ్డించబడతాయి. నేను తినడం అయిపోయింది కదా అని వెంఠనే బంతిలోంచి లేవడం అపరాథం. తినేవారు కొంతమంది మెల్లిగా తింటారు కనక అందరూ తినే దాకా ఆగడం మర్యాద, ఈ లోపున లోకాభిరామాయణం మాట్లాడుకోవచ్చుకానీ ‘ఏయ్ ఎంతసేపు తింటావురా, కానీయ్, నీకోసం ఇక్కడ అందరూ కాసుకుని ఉన్నాం’ అనే మాటలు ఎప్పుడూ ఎవరూ అనకూడదు. ఈ వడ్డనలో మళ్ళీ బాగా తినేవాణ్ణి ప్రోత్సహించి ఇంకా తినమని పురి పెడుతూ నవ్వుతూ వినోదంగా చూడ్డం ఒక సరదా. ఇలా అన్నందుకు కానీ అనిపించుకున్నందుకు కానీ ఎవరూ మొహాలు మాడ్చుకోరు. అందరూ ఒకరికొకరు బంధువులం కదా అనే అప్యాయత. అందరూ తినడం అయ్యాక అందరూ ఒకేసారి లేస్తారు “అన్నదాతా సుఖీభవ” అని గట్టిగా చెప్పి.

ఈ బంతిలో తినడం, వడ్డించడం ఎలా జరుగుతుందో చెప్పేదే ఈ నెల పద్యం. ఈ పద్యంలో వివరించడానికేమీ లేదు అతి సులభంగా అర్ధమౌతుంది. వడ్డించేవారు (సూదకులు) ‘వద్దు వద్దు’ అంటూ విస్తరిమీదకి వంగుదామంటే అప్పటికే పూర్తిగా తిన్నందువల్ల వెన్ను, పొట్టా వంగట్లేదుట. చేతులు అడ్డం పెడితే ఆ చేతులమీదనుంచే వడ్డించేస్తున్నారు. ముందు చెప్పిన “బ్రహ్మార్పణం…” అనే శ్లోకం ప్రకారం అన్నం పరబ్రహ్మ స్వరూపం కనక ఏదీ వృథాగా పారేయకూడదు. అందువల్ల కాదు, వద్దు అనలేక తినేస్తున్నారు వడ్డించినది. అదీ ఈ పద్యంలో చమత్కారం.

ఉ.
విస్తరి మీద వంగబడ వేయకమానెదరేమొ సూదకుల్
విస్తరిపైన వంగుటకు వెన్నును వంగదు పొట్టవంగదున్
హస్తము లడ్డముంచినను నాగక వడ్డన చేతురన్నియున్
గస్తిగ నట్లె తిందురవుగాదనలేక క్రతు ప్రసాదముల్

ఈ రోజుల్లో అయితే మనకి కసరత్తులు చేయడం, ఆరోగ్యం కాపాడుకోవడం అంటే ఏమీ శ్రధ్ధ లేదు కనక మనకి కాళ్ళూ చేతులూ నెప్పులు; కిందన కూర్చోవడానికి సహకరించవు. ఎత్తులో కుర్చీలమీద కూర్చోవడం, పెట్టినది తినీ తిననట్టూ ముట్టుకుని వదిలేయడం, లేకపోతే అందరితో పాటు వరసలో నుంచుని అక్కడ దొరికిన ఏ కంచమో ఏదో పట్టుకుని వాళ్ళు పెట్టినవి తినడమో, చాలలేదనో, రుచీ పచీ లేదనీ గొణుక్కోవడం మనకు కొత్తగా అంటుకున్న భ్రష్టుపట్టిన ఆచారం. మళ్ళీ ఈ వడ్డించే పదార్ధాలు కొత్త, కొత్తవి ఎన్నడూ కనీ వినీ ఎరుగనివి; దేశ విదేశాల్లోంచి ఎత్తుకొచ్చినవి. అప్పడం, థప్పళం, గడ్డపెరుగూ మనకి పడవు. మన ఆరోగ్యం సహకరించదు కనక “అబ్బే అందులో కొవ్వు ఎక్కువ, అవి తినకూడదని” మనకి మనం, మనం ఎదుటివాళ్లకీ చెప్పుకుంటూ ఉంటాం. ఇదీ మన కొత్త సంస్కృతి.

ఇంతకీ ఈ పద్యం ఎవరు రాసారో తెలిసిందా? ఇది కవి సామ్రాట్ విశ్వనాథ సత్యన్నారాయణ గారి రామాయణ కల్పవృక్షం లోది (334). దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు వచ్చినవాళ్లకి భోజనాలు ఎలా పెట్టాడనేది. కల్పవృక్షంలో కొన్ని పద్యాలు కష్టంగా ఉండడం నిజమే అయినా ఈ పద్యం సులువుగానే అర్థం చేసుకోవచ్చు.  విశ్వనాథ గారి రామాయణ కల్పవృక్షంలో పద్యాలు షాషాణాలనీ, చాలా కష్టంగా ఉంటాయనీ నారికేళాపాకం అనీ అంటే విశ్వనాథగారనేది ఏమిటంటే – “పోయి తెలుగునేర్చుకోండిరా నన్ను వెక్కిరించక” అని. ఎంత కష్టమైనా కొత్త ఆంగ్లపదాలూ, లెక్కలూ, మిగతా విషయాల్లో అనేకానేక సూత్రాలూ, ఎక్కాలూ పిడికొట్టి భట్టీపట్టి గుర్తుపెట్టుకోవడానికి మనం భగీరధ ప్రయత్నం చేస్తాం కానీ తెలుగు నేర్చుకోవడానికి, మాట్లాడ్డానికీ చులకన భావం మనందరకీను. ఇలా మనం, మన భాషా, మన ఆచార వ్యవహారాలు భ్రష్టు పట్టడానిక్కారణం మనమే కదా?

****సశేషం****

Posted in August 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!