Menu Close
సామ వేదం: సాక్షాత్కారం
-- దూర్వాసుల వేంకట సుబ్బారావు, ఫ్లోరిడా --

శ్రీ అన్నమయ్య, శ్రీ దీక్షితార్, శ్రీ త్యాగరాజ స్వామి, సంగీత, సాహిత్య, వేదాంత సమారోహంలో చక్రవర్తులు. నాదోపాశనతో పరిపుష్టి చెంది, కైవల్యం పొందిన ప్రసిద్ధులు, ధన్యులు, వారికి వారే సాటి. వీరు కవులా, వేదాంతులా, భక్తులా అని వివరించడము దుస్సాధ్యం. వీరు స్వర ప్రస్థానం లో అక్షర స్థితిని పొంది,  నాదోపాశనచే, భగవత్ సాక్షాత్కారం పొందిన జీవన్ ముక్తులు. వీరి జీవితాల్లో కొన్ని మరపురాని సంఘటనలు, ఒకే రకమైన సన్నివేశాలు జరిగి, వారి జీవితాల్లో మార్పులు, భగవత్ సాక్షాత్కారం కలిగించాయి. ఆ సమయoలో వారు మానవాళికి లోకసిద్ధమైన తమ సందేశాన్ని ప్రభోదించారు. వాటిని ఈ వ్యాసం లో పొందు పరచి మీకు అందచేయటమే నా సంకల్పం.

శ్రీ తాళ్ళపాక అన్నమయ్య

Annamayyaశ్రీ అన్నమయ్య(1408-1503) మనుమడు చిన తిరు వెంగల నాధుడు శ్రీ  అన్నమాచార్యుల జీవిత చరిత్రము ద్విపద గా రచించేరు. అదియే అన్నమాచార్యుల వారి పై ప్రామాణిక చరిత్ర గ్రంధము. శ్రీ అన్నమయ్య   చిన్నతనం పెంపకంలో  శివ భక్తుడు. తన తల్లి పాడుతుంటే, తాను కూడా  దేమునిపై పాడుతుండే వాడు. ఇంట్లో పనులు కూడా చేస్తుండేవాడు. మేనత్త, ఆవిడ కూతురు, పెనిమిటి కూడా అక్కడే వుండేవారు. పశువులకు గడ్డి కోసుకురమ్మని అన్నమయ్యని వారు కోరగా, అన్నమయ్య వెళ్ళేడు. ఒక గుంపు పాడుకుంటూ వెళ్తూంటే అన్నమయ్య వారిని చూసి

“నెన్నటి చుట్టంబు లిటువంటి వార- లెన్నటి బoదుండ నేను వారలకు.. .. తల్లి యు దండ్రి యు దైవము గురువు – నెల్ల సంపదలునై యల్లచందముల-  నను బ్రోచు శేషాద్రి నాధుని గొలిచి- మనియెద ననుచు”

వారిని అనుసరించాడు. అక్కడి వేడికి అన్నమయ్య తట్టు కోలేక సొమ్మసిలి “తొడిగిన చెప్పులతోడనే బిగుల- బడలిక నొక రాతి పై శయనింప”, దేవి ఒక ముదుసలి గా ప్రత్యక్షమై, స్వామి ప్రసాదం ఇచ్చి, ఈ కొండ పవిత్రమైనది, “ఘనులకు  నిది చెప్పుగాళ్ళ నెక్కoగ-  జనదు నీ చెప్పులు సడలించి వైచి- కనుగొను కన్నుల గనవచ్చు” స్వామి గుడికి మార్గం ఇదనీ చెప్పి అదృశ్యమైనది. అన్నమయ్య నెమ్మదిగా పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్తే తలుపులు వేసి వున్నాయి. శ్రీ అన్నమయ్య

యలమేలు మంగకు నాశుమార్గమున – సలాలితంబుగా నొక్క శతకంబు జెప్పే”. అక్కడికక్కడే కూర్చిన దే  ఈ మంగాంబిక శతకం. కాని, ఈ శతకం అలభ్యం. ఆన్నమయ్య దివ్య స్థలాలన్నీ దర్శించి వచ్చే సరికి

“యల వేంకటేశ్వరు నపరంజీ తగదు- తలుపు బీగముల దాచి యున్నె డను, వెంకట పతి మీద వివర స్తవముగ- వేంకటేశ్వర శతకంబు విన్నవించుటయు” స్వామి వారిని పొగడుతూ దర్శనo ఇప్పించమని వేడుకున్నాడు.

తాళముల్  వీడియు దనుదానే పడిన – అల తలుపులు ఫెళ్  ఫెళన (ని?) తెరచుటయు”. అచ్చటి అర్చకులకు సంభ్రమాశ్చర్యలను కలుగ జేసేయి. వరహస్వామి, వెంకటేశ్వర స్వామ ల దర్శనం చేసుకుని అర్చకు లిచ్చిన ప్రసాదం తీసుకుని, చుట్టు పక్కటి ప్రదేశాలు చూస్తున్నాడు. ఆచ్చట ఘనవిష్ణుడను మౌని కలలోన వచ్చి “తాళ్లపాకాన్నమయా నామకుండైన మద్ భక్తుడొకడు .. కడవేగ రేపు నీకడ కేగు దెంచు – దడయక ముద్రధ రణంబు గావింపు” మనగా అన్నమయ్యకు వైష్ణవ యతి పంచ సంస్కారములు చేసి అన్నమయ్యకు మంత్రోపదేశం చేసేరు. శ్రీ అన్నమయ్య 32,000 కీర్తనలను కూర్చేరు.

శ్రీ అన్నమయ్య సంకీర్తనలు విని, పరవశుడై, నరసింహ రాయుడు ఆభరణాలు, మడి, మాన్యాలు బహూకరించి, కొన్ని శృంగార కీర్తనలు పాడమని వేడెను. శ్రీ అన్నమయ్య “ఏమోకో చిగురుటధరమున యెడనెడ గస్తూరి నిండెను” కీర్తన ‘నాదనామక్రియ’ రాగం లో పాడెను. రాయుడు చాలా సంతోషించి, తన మీద కూడా  ఇటువంటి కీర్తనలు  పాడమనగా “హరి ముకుందుని గొనియాడు నా జిoహ నిను గొనియడంగా నేరదు” అని తిరస్కరించగా రాయుడు అన్నమయ్యను పరిపరి విధముల హింసించారు. అయినను అన్నమయ్య తన కీర్తనలు ఆ గోవిందునికే అంకితమని స్థిర చిత్తంతో చివరి వరకు ఉన్నాడు.

శ్రీ ముత్తు స్వామి దీక్షితార్

Mutthuswamy-dhikshitharశ్రీ ముత్తు స్వామి దీక్షితార్(1776-1835) తంజావూర్ దరిలో నివసించేవారు. సమీపంలో తిరువారూర్ కి దరిలో ఉన్న కివలూర్ కి బయలుదేరేరు. అచ్చట  శివాలయం వున్నది. శంకరాభరణ రాగం లో శ్రీ దీక్షితార్ శివునిపై  “అక్షయ లింగ విభో స్వయం భో” కీర్తనను ప్రత్యేకంగా కూర్చుతూ దేవాలయంకి వెళ్ళేరు. పాడుకుంటూ దేవాలయం చేరేరు. అప్పటికే స్వామి పూజ పూర్తయింది, అర్చకులు గర్భగుడి మూసివేసి వెళ్లిపోడానికి తయారయారు. శ్రీ దీక్షితార్ తాను చాలా దూరం నించి వచ్చిన వైనం తెలుపుతూ,  తలుపులు తీసి స్వల్ప కాలంలో వారు సమకూర్చిన కీర్తన పూర్తి చేయటానికి శ్రీ స్వామి వారి దర్శనం కలిగించమన్నారు. సాయంత్రం వరకు వేచి ఉండనవసరం లేకుండా, మీరు మర్నాడు వచ్చి దర్శించు కోవచ్చును, ఆకాశం పడిపోదు కదా, స్వామి ఎక్కడకు పారిపోడు కదా అని తలుపులు మూసి వేశారు. శ్రీ దీక్షితార్ అక్కడే చతికిలపడి, స్వయంభవుడవైన, అఖిలాండ లోకాలకు ప్రభువైన ఓ శంభో నన్ను కాపాడుము, ఓ అంతర్యామి, పరిమితము లేని రూపము కలవాడా, అనంత కీర్తి కలవాడా, అక్షర స్వరూప, గురు స్వరూప, మేరు పర్వతం పై వుండే ఓ శంభో అక్షయ లింగవిభో స్వయంభో శంకరాభరణ రాగం లో పాడటం ప్రారంభించారు.

పల్లవి
అక్షయ లింగ విభో స్వయంభో, ఆఖిలాండ కోటి ప్రభో, పాహి శంభో

అను పల్లవి
అక్షయ స్వరూపో అమిత ప్రతాప, ఆరూఢ వృషవాహ, జగన్మోహ
దక్ష శిక్షణ సుర లక్షణ, విధి విలక్షణ, లక్ష్య లక్షణ
బహు విచక్షణ సుధా భక్షణ, గురు కటాక్ష వీక్షణ.

చరణo
బదరి వాన మూల నాయిక సహిత బద్ర కాలేశ భక్త విహిత
మదన జనఖాధి దేవ మహిత మాయా కార్య కాలనారహిత
సదయ గురుగుహ తాత, గుణాతీత, సాధు జనో పేత, శంకర నవనీత
హృదయ విభాత తుంబురు సంగీత హ్రీంకార సంభూత హిమగిరి నాధ.
సదాశ్రిత కల్పక మహీరుహ పాదాఅంబుజ భావ రధ గజ తురంగ
పదాతి సంయుత చైతోత్సవ సదాశివ సచ్ఛిదానందమయా.

కివలూర్ ప్రజలు ఆ పాటకు తన్మయులై తండోపతండాలుగా వచ్చేరు తమ వూరికి అంతటి మహామహులు వచ్చేరని సంతోషిస్తూ. అర్చకులు కూడా తన్మయత్వంతో విన్నారు. శ్రీ దీక్షితార్ పాట ముగించేసరికి గర్భగుడి తలుపులు వాటంతట అవే తెరచుకొని అందరికీ సంభ్రమాశ్చర్యాలను కలుగ జేశాయి. ఎప్పుడైనా స్వామి దర్శన భాగ్యం దీక్షితార్ కి లభిస్తుందని తెలియజేస్తూ, అర్చకులు శ్రీ దీక్షితార్ కి పాదాభివందనం చేసి క్షమార్పణ కోరేరు. శ్రీ దీక్షితార్ అర్చకుని దీవించి శ్రీ స్వామి వారి దర్శనం పూర్తి చేసుకుని తిరువారూర్ వెళ్లిపోయారు. తంజావూరు చక్రవర్తి మీద పాడితే, కనకాభిషేకం పొందవచ్చు అని వీరికి సలహా ఇస్తే, తాను భోగరాజుని, భోజరాజుని పాడను అని ఎనిమిది కీర్తనలు ‘త్యాగరాజo భజరే చిత్త తాపత్రయం త్యజరే’ అని త్యాగరాజ యోగా వైభవం పాడేరు. శ్రీ దీక్షితార్ 450-500 కీర్తనలు రచించేరు.

త్యాగరాజ స్వామి (1767-1847)

Thyagarajaసంగీత, సాహిత్య, వేదాంతములకు శ్రీ నారద మహర్షి, సహజకవి శ్రీ పోతన, శ్రీ ఆది శంకరులు వరుసగా ప్రతినిధులైనచో, వీరి సంయోగమే సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి (కాకర్ల త్యాగ బ్రహ్మం) వారు.

శ్రీ రామ భక్తుడు, శ్రీ త్యాగరాజ స్వామి వేదాంగ పండితుడు, రాజ యోగి. వారు రచించినవి 24,000 కీర్తనలు. వారిని ‘త్యాగ బ్రహ్మ’ అని, వారి కీర్తనలను ‘త్యాగోపనిషద్’ అని శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధి పతులు శ్రీ చంద్ర శేఖర సరస్వతి గారు  కీర్తిoచేరు. శ్రీ త్యాగరాజ స్వామికి శరభోజిరాజు అపారమైన కానుకలిస్తాం, తన మీద కీర్తనలు వ్రాయమని కోరగా, తిరస్కరిస్తూ కల్యాణి రాగం లో ‘నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? మమతా బునధన యుతః నారాస్తుతి సుఖమా? అని పాడుకున్నారు.

శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి 1839 లో ఒక శుక్రవారం, తిరుపతి యాత్ర ప్రారంభించి, స్వామి పుష్కరిణి లో స్నానం చేసి, వరాహస్వామిని దర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేరు. ఆలంకార ప్రియుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని అలంకరించడానికి అర్చకులు తెరవేసేరు. భక్తులు దర్శనము కొరకు వేచి వున్నారు. శ్రీ స్వామి దర్శనానికి ఒక తెర అడ్డం వచ్చిందని, స్వామి నీ దివ్య సారూప్యం చూడడానికి వేచి వుండటం కష్టంగా వుంది. కనుక శ్రీ వెంకటరమణా, నాలోని మత్సరం అనగా ఈర్ష్య క్రోధంలు ఒక తెరగా ధర్మ, అర్ధ, కామ, మోక్షములను చతుర్విధ పురాషార్ధాలను అడ్డుకుంటున్నది. ఆ తెరని తొలగించి నీ దర్శన భాగ్యం కలిగింపమని ఈ విధంగా తెర తీయగా రాదా అన్న కీర్తన పాడటం ప్రారంభించేరు.

గౌళిపంతు రాగం, ఆది తాళం.

పల్లవి
తెర తీయగా రాదా లోని
తిరుపతి వెంకట రమణ మత్సరమను

అనుపల్లవి
పరమ పురుష ధర్మాది మోక్షముల
పార దోలుచున్నది నా లోని....తెర తీయగా రాదా....)

చరణం
1. మత్స్యము ఆకలికొని గాలముచే
మగ్నమైన రీతున్నది
అచ్చమైన దీప సన్నిధిని మరు
గడ్డ బడి చరచీ నట్టున్నది.... తెర తీయగా రాదా.....
2. ఇర వొందగ భుజించు సమయమున
ఈగ తగులు రీతున్నది
హరి ధ్యానము సేయు వేల చిత్తము
ఆంత్యజువాడకు పోయినట్టున్నది ….తెర తీయగా రాదా....
3. వాగురమని తెలియక మృగ గణములు
వచ్చి తగులు రీతున్నది
వేగమే ని మతముననుసరించితిని

త్యాగరాజ నూట మద మత్సరమను... తెర తీయగా రాదా ......

ఈ కీర్తన సద్గురు కీర్తనల్లో ఒక మకుటం. దీని లోని భావ సౌందర్యం, భావ గర్భితమై, కండ్లకు కట్టినట్లు వుంటుంది. సులభంగా అర్ధమగును. ఈ కీర్తనలో 5 ఉపమానాలున్నాయి:

  1. చాలా ఆకలితో, భోజనానికి కూర్చుంటే, ఈగ తిరుగుతూ ఇబ్బంది కలిగించినట్లు,
  2. శ్రీ హరి ధ్యానం చేసుకుందామనుకుంటే, మనస్సు అనాచారపు వాడలకు పరి పరి విధాలా సంచారం చేస్తున్నట్లు,
  3. ఆకలిచే తళుకు బెళకుల మెరిసే ఎరని ఆహారంగా భ్రమించి, గేలానికే చేప చిక్కుకొన్నట్లు,
  4. దీపం కాంతికి పురుగు అడ్డుపడి అంధకారాన్ని కలిగించినట్లు,
  5. వేటకాడు పన్నిన ఉచ్చుగోతిని గుర్తించక లేళ్ళు అదే గోతిలో పడినట్లు

లోక సహజమైన వుపమానాలతో ఇవన్నీ విచక్షణ జ్ఞానము లేక పోవుట వలననే కలుగుతాయి, అందుచే  నాలోని మత్సరం తొలగించమని ప్రార్ధించేరు శ్రీ త్యాగరాజ స్వామి. వెంటనే ఆ తెర దాని అంతట అదే తొలగి పోయింది. మహాదానందంతో, ఆ సంతోషంలో శ్రీ త్యాగరాజ స్వామి

మధ్యమావతి రాగం లో, నీ నామ స్మరణమే నిన్ను చేరుటకు సోపానం అని ఈ విధంగా కీర్తించేరు. ఈ కీర్తన శ్రీ భగవద్గీత లో శ్రీ కృష్ణ విశ్వరూప దర్శనం లో చెప్పిన, వేయి సూర్యుల కాంతి (దివిసూర్యసహస్రస్య) అర్జునకు ఎట్టి సంభ్రమాశ్చర్యలను కలిగించిందో (11:8). ఆలాగునే శ్రీ వెంకటేశ నీ దివ్యస్వరూపం దర్శించటానికి వెయ్యి కన్నులు కావలెను, అని ఈ కీర్తనను పాడేరు సద్గురు త్యాగరాజ స్వామి.

పల్లవి

వెంకటేశ నిను సేవింపను పది
వేల కన్నులు కావలెనయ్య

అనుపల్లవి

పంకజాక్ష పరిపాలిత ముని జన
భావుకమగు దివ్య రూపమనుకొన్న (వెంక)

చరణం

  1. ఎక్కువ నీవని దిక్కులు పొగడ
    అక్కర కొని మది సొక్కి కనుగొన
    నిక్కము నీవే గ్రక్కున బ్రోవు
    తళుక్కని మెరసే చక్క తనము గల (వెంక)
  2. ఏ నోము ఫలమో నీ నామామృత
    పానము అను సోపానము దొరికెను
    శ్రీ నాయక పరమానంద నీ సరి
    కానము శోభాయమానాంఘ్రులు గల (వెంక)
  3. యోగి హృదయ నీవే గతియను జన
    భాగధేయ వర భోగీశ శయన
    భాగవత ప్రియ త్యాగరాజ నుత
    నాగాచలముపై బాగుగ నెలకొన్న (వెంక)

శ్రీ మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారు శ్రీ వేంకటేశ్వర వైభవం లో, జనాదరణ పొందిన ఈ పాటని వినిపించారు.

తెర తీయరా తిరుపతీ దేవరా
తెర తీయరా తిరుపతీ దేవరా
తెర తీసి నీ వెలుగు కిరణాలు ప్రసరించి
మాలోని తిమిరాలు హరియించి
మము బ్రోవరా, మా భూవరా  ....
నేత్ర దర్శన మొసగరా, మా కళ్ళు తెరిపించరా  ...
శివుడవూ, భవుడవూ, మాధవుడవూ నీవూ,
పరతత్వమును తెలుపరా పరమ పదమును చూపరా//
తెర తీయరా తిరుపతీ దేవరా, తెర తీయరా.

మన నాలుగు వేదాలలో, సామవేదము, భగవంతుని సంగీత పరంగా కీర్తిస్తుంది; భగవద్గీత లో (10: 22) వేదానాo సామవేదోస్మి అని శ్రీ  భగవాన్ చెప్పేరు. అట్టి నాదతనం లో వీరందరూ తాము తరించి, మనల్ని తరింపచేసిన, మార్గ నిర్దేశం చేసిన ఆచంద్ర తారార్కమైన కీర్తిని గడించిన మహానుభావులు. ప్రాతః స్మరణీయులు.

Posted in August 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!