Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

స్వాతి చినుకులకోసం ముత్యపు చిప్పలు ఎంతో ఆశగా ఎదురుచూస్తాయంటారు! అదెంతవరకు నిజమో ఇంతవరకూ ఎవరికీ తెలియదుగాని, ఈవేళ మాత్రం జీవన్ పోస్టుమాన్ రాకకోసం అంతచేటు ఆత్రంగానూ ఎదురుచూస్తున్నాడన్నది మాత్రం అక్షరాలా నిజం! ఈ రోజైనా “హితైషిణి” వార పత్రికలో ప్రచురించబడ్డ తన కథకి "రెమ్యూనరేషన్" తాలూకు డబ్బు చేతికి వస్తే బాగుండునన్న ఆశతో, ఇంటి గుమ్మం దగ్గరనుండి వీధిమొగలోకి, వీధిమొగనుండి ఇంటి గుమ్మంలోకీ - అలా గంటనుండీ అల్లంగం తిరుగుతూనే ఉన్నాడు అతడు. వేళమించిపోయినా ఆవేళ ఎందుకనో పోస్టుమాన్ దర్శనం కాలేదు.

ఈమధ్య కొన్ని నెలలక్రితం జీవన్ రాసి, "హితైషిణి" వారపత్రికకు పంపిన కథ ఈ నెలలో ప్రచురించబడింది. జీవన్ కి ఆ పత్రిక ఒక కాపీ పంపారు ఆ పత్రికవారు. ఇంక ఇకనో, ఇప్పుడో దాని తాలూకు పారితోషికం అతనికి అందవలసి ఉంది. దానికోసమే ఈ ఎదురుతెన్నులు!

జీవన్ కి ఇప్పుడు మరో కథ రాయాలన్న "మూడ్" ఐతే వచ్చింది. కాని, ఎవరైనా కథ రాయాలనుకుంటే, కథావస్తువు ఒక్కటీ ఉంటే సరిపోదు కదా! కథ రాయడానికి చాలినన్ని తెల్లకాగితాలూ, మధ్యమధ్య ఇబ్బంది పెట్టకుండా, ఏకబిగిని ఆగకుండా రాసుకుంటూపోయే మంచిరకం ఊటకలమూ(pen) కూడా ఉండాలి. జీవన్ జేబులు తడుముకున్నాడు. జేబులోని చిల్లర వాటిని కొనడానికి సరిపోయేటంతగా లేదు. తల్లిని డబ్బులు అడగాలంటే ఈమధ్య అతనికి మనస్కరించడం లేదు.

విధవరాలైన అతని తల్లి మీనాక్షి ఒక వంటలక్క. తన ఒక్కరెక్క సంపాదనమీద, కొడుకుని పెంచి పెద్దచేసి, డిగ్రీవరకూ చదివించడానికి అవిశ్రాంతంగా శ్రమించి, ఆమె మంచిగంధపుచెక్కలా తెగ అరిగిపోయింది. జీవన్ కూడా తల్లి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకున్నాడు. శ్రద్ధగా చదివి, చక్కగా పరీక్షలు రాసి, మంచి మార్కులతో పాసయ్యి, గోల్డు మెడల్ కూడా దక్కించుకున్నాడు. తానుపడ్డ కష్టం ఫలించిందని చాలా సంతోషించింది మీనాక్షి. ఆమె, తన కొడుకు డిస్టింక్షన్ లో పాసై డిగ్రీ తెచ్చుకున్నాడని శ్రేయోభిలాషు లందరికీ చెప్పి, ఎంతో మురిసిపోయింది. కానీ ఆ మురిపెం అక్కడితోనే ఆగిపోయింది. జీవన్ నిరుద్యోగుల జాబితాల్లో చేరిపోయాడు.

అప్పుడే అదంతా పాతకథైపోయింది. పరీక్షలయ్యి కొంచెం తక్కువగా ఒక సంవత్సరమైనా, ఇంకా జీవన్ కి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. తను ఉద్యోగం చేసి, డబ్బు సంపాదించి, తల్లిని సుఖపెట్టాలన్న అతని కోరిక ఇంతావరకు తీరనే లేదు. తాను, తన చిన్నిచిన్నిఅవసరాలకి కూడా తల్లిని అడగాల్సిన దుస్థితిలోనే ఇంకా మిగిలి ఉండడం అన్నది, అతనికి ఈమధ్య మరీ తలవంపులుగా అనిపిస్తోంది. అందుకే ఎంత అవసరం వచ్చినా తల్లిముందు చెయ్యిచాపి అడగలేకపోతున్నాడు.

ఇప్పుడు కథ తాలూకు "రెమ్యూనరేషన్ మనీ" కనక వస్తే తను తేలికగా ఈ సమస్యనుండి బయటపడిపోతాడు. అందుకనే ఆ ఎదురుచూపులు! పోస్టుమాన్ ఆరోజు సెలవు పెట్టాడో ఏమో, జీవన్ కి మనియార్డర్ రాలేదు, అతని ఆశ తీరలేదు.

తల్లి పడుతున్న కష్టాన్ని గుర్తుచేసుకోడంతో జీవన్ మనసులో బాధ సుళ్ళు తిరిగింది. "రోజులో ఏదో ఒక వేళలో మిషన్ కైనా కొద్దిపాటి విశ్రాంతి ఉంటుందేమోగాని, అమ్మకు మాత్రం అసలు ఒక్క క్షణమైనా తీరిక అన్నది ఉండడం లేదుకదా" అనుకున్నాడు బాధగా.

కాని అతడు అంతకంటే ఇంకేమి చెయ్యగలడు? తన చేతిలో ఉన్నంతవరకు అన్నీ సవ్యంగానే చేస్తున్నాడు. "టెంతు" క్లాసులో ఆ జిల్లా మొత్తానికి ఫష్టుమార్కులు తెచ్చుకుని, జిల్లాకే ప్రధముడిగా వచ్చి స్కాలర్ షిప్ గెలుచుకుని కాలేజీలో చేరాడు. ప్రాయంలో సాధారణంగా అలవడే ఏ దురలవాట్ల జోలికీ పోకుండా శ్రద్ధగా చదివి, డిగ్రీ పరీక్షల్లో కూడా గొప్పగా నెగ్గి, కాలేజీకి ఫస్టు వచ్చి గోల్డు మెడల్ సంపాదించుకున్నాడు. కాని, ఉద్యోగం సంపాదించాలంటే మాత్రం అతనివల్ల కావడం లేదు. అక్కడకీ, కనిపించిన ప్రతి అడ్వర్టైజ్ మెంటుకీ, తన క్వాలిఫికేషన్ కి సరిపోయేదైతే చాలు, వెంటనే అప్లికేషన్ పంపిస్తూ, వచ్చిన ఒకటీ అరా ఇంటర్వూలకు హాజరౌతూ, రిజల్టుకోసం ఆశగా ఎదురుచూస్తూ శాయశక్తులా తాపత్రయపడుతూనే ఉన్నాడు జీవన్.

డిగ్రీ చేతికి వచ్చాక, ఖాళీగా ఉన్న ఈ సంవత్సర కాలంలో జీవన్ కాలాన్ని వృధా పోనీకుండా కథలురాసి, వివిధ పత్రికలకు పంపుతున్నాడు. కథల్లో పస ఉండడంవల్ల ఆ కథలు తరచూ ప్రచురించబడి, అతనికి కొద్దిపాటి ఆదాయాన్ని కూడా ఇస్తున్నాయి. ఆ డబ్బును అతడు, కాగితాలూ, కలాలూ కొనడానికీ; కధలు పత్రికలకు పంపడానికి కావలసిన పోస్టేజికీ, ఉద్యోగాలకి అప్లికేషన్లు పెట్టడానికి అయ్యే పోస్టల్ ఛార్జెస్ కీ పొదుపుగా వాడుతున్నాడు.

ఆ రోజింక పోష్టుమాన్ రాడని నిర్ధారణ అయ్యిపోయాక, జీవన్ కి ఆకలి గుర్తొచ్చింది. అప్పటికే భోజన సమయం మించిపోయింది. ఏ రోజునా భోజనసమయంలో తల్లి తనకోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నది అతనికి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. వెంటనే కంగారు పడుతూ కాళ్ళు చేతులూ కడుక్కుని ఇంటి లోపలకు వచ్చాడు.

అప్పటికి చాలాసేపటినుండి, అన్నీ అమర్చిపెట్టి, వడ్డనకు సిద్ధంగా ఉండి, కొడుకు రాకకోసం ఎదురుచూస్తోంది మీనాక్షి. ఈ మధ్య ఒంట్లో కొద్దిగా నలతగా ఉండడంతో ఆమెకు విసుకు ఎక్కువై, తేలికగా కోపం వస్తోంది. ఆలస్యంగా భోజనానికి వచ్చిన జీవన్ ని చూడగానే ఆమెకు అరికాలిమంట ఒక్కసారిగా తలకి ఎక్కినట్లయ్యింది. కొడుకుమీద కోపంతో విరుచుకుపడింది మీనాక్షి.

"ఏరా! ఇంతసేపటిదాకా తిండికి కూడా రాకుండా చక్కపెట్టవలసినంత గొప్ప గొప్ప రాచకార్యాలు ఏ మున్నాయిరా నీకు? ప్రతిరోజూ నిన్ను నేను, వియ్యపురాలిని పిలిచినట్లు, బొట్టెట్టి మరీ భోజనానికి పిలవాలా ఏమిటి?" అలా కోప్పడుతూనే కొడుక్కి వడ్డించింది.

జీవన్ ఏమీ మాటాడకుండా తలవంచుకుని, విస్తరిలో పెట్టిన భోజనాన్ని నెమ్మదిగా తినడం మొదలుపెట్టాడు. ఒకసారి కొడుకువైపు ఉరిమిచూసి, ఆపై తనూ వడ్డించుకుంది మీనాక్షి.

*      *       *

వితంతువైన మీనాక్షి యాజులుగారి ఇంట్లో వంటలక్కగా పనిచేస్తోంది. ఏరోజూ చీకటితోనే నిద్రలేచి, తన ఇంటి పనులు వేగంగా ముగించి, స్నానంచేసి; దేవుని ముందు దీపం వెలిగించి, పూజచేసి, ఆపై బయలుదేరి వెళ్లి ఏడవ్వకముందే యాజులుగారి ఇల్లు చేరుకుంటుంది మీనాక్షి, వాళ్ళకి కాఫీ, టిఫిన్లు సకాలంలో అందివ్వడంకోసం. ఆ పని అయ్యాక, మడికట్టుకుని వంట మొదలుపెడుతుంది, యాజులుగారి దేవతార్చన ముగిసే సమయానికి మహానివేదన సిద్దంగా ఉంచడం కోసం. ఆపై పన్నెండున్నర అయ్యేసరికి ఆ ఇంట్లో అందరి భోజనాలూ ఔతాయి. ఆ తరవాత, తనవంతు భోజనం స్టీలు డబ్బాల్లో సద్దుకుని, సంచీలో ఉంచుకుని, కొడుకుతో కలిసి తినడం కోసం ఇంటికి తెచ్చుకుంటుంది మీనాక్షి.

కొడుకు మరీ చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆ అన్నమే ఇద్దరికీ సరిపోయేది. జీవన్ పెరిగి పెద్దవాడయ్యాక, మళ్ళీ కొద్దిగా అన్నం వండవలసి వస్తోంది.

భోజనాలు అయ్యాక ఒక గంటసేపు చాప పరచుకుని, విశ్రాంతిగా ఓ అరగంట సేపు పడుకుని లేచి, ఆపై "స్వగృహా ఫుడ్సు" వాళ్ళకి పిండివంటల తయారీలో సాయం చెయ్యడానికి వెడుతుంది మీనాక్షి. అక్కడ పని పూర్తయ్యేసరికి మళ్ళీ యాజులుగారింట్లో రాత్రి వంటకి వేళౌతుంది.

"వంటలక్క" అంటూ ఎవరైనా ఆ వృత్తిని తక్కువచేసి మాటాడితే మీనాక్షికి  కోపం వస్తుంది. పరిస్థితి బాగుండక వీధిన పడవలసి వచ్చినప్పుడు, ఆట్టే చదువుకోని ఆడకూతురు, విధం చెడకుండా గౌరవంగా తలెత్తుకు బ్రతకాలంటే సహకరించేది ఈ వంట పనే! ఆకలితో బేజారౌతున్నవాళ్ళ పొట్టల్ని సముదాయించడం కోసం - శుచిగా, రుచిగా వండి, వడ్డించి, వాళ్ళకు ఆకలివల్ల వచ్చిన ఆర్తిని తీర్చి సంతృప్తిపరచడం అన్నది ఎంతో పవిత్రమైన వృత్తి అంటుంది!" ఒకళ్ళకింత వండిపెట్టి వాళ్ళ కడుపు నింపి, మాకడుపు నింపుకోడం అన్నది తప్పెలాగౌతుంది" అని ఎదురు ప్రశ్న వేస్తుంది ఆమె. అంతేకాదు సాక్షాత్తూ ఆ కాశీ అన్నపూర్ణే స్వయంగా ఆ వృత్తికి అధిదేవత అని కూడా చెప్పి వాళ్ళ నోళ్ళు చక్కగా మూయిస్తుంది. పదిహేను ఏళ్ళకు పైనుండి యాజులుగారి కుటుంబానికి వండిపెడుతూ ఆమె, తన మంచితనంతో, అంకితభావంతో వాళ్ళకి అన్నింటా ఆసరాగా ఉంటూ వంటమనిషిగానేకాదు, అనతికాలంలోనే ఇంటిమనిషిగా కూడా మారింది. యజమానులకు తలలో నాలుకలా ఉంటూ వాళ్ళ ప్రేమాభిమానాల్ని పొందగలిగింది మీనాక్షి.

కొడుకు కాలేజి చదువుకోసం మీనాక్షికి కొద్దిపాటి అప్పులు చెయ్యక తప్పలేదు. జీవన్ హైస్కూల్లో చదివేటప్పుడు ఆమెకు అంతగా కష్టం తెలియలేదు. తమ భోజనం కర్చు అంతగా లేకపోవడంతో, యాజులుగారు ఇచ్చే జీతంలో ఇంటద్దె, ఇతర ఖర్చులకు పోగా కొద్దిపాటి సొమ్ము మిగిలేది. అదీ, ఆపై - ఎవరింటిలోనైనా పిండివంటలు చేసిపెట్టీ, కందిపొడి లాంటివి విసిరిపెట్టి - మీనాక్షి సంపాదించిన డబ్బు జీవన్ చదువుకి సరిపోయేది. జీవన్ తో పాటుగా అతనికోసమయ్యే ఖర్చుకూడా పెరుగుతూ వస్తోంది. దాంతో మరో గత్యంతరం లేకపోడంతో మీనాక్షి ఎక్కువ పనులు చెయ్యడానికి నిస్సంకోచంగా సిద్ధపడవలసివచ్చింది.

ఎవరూ ఊహించని విధంగా జీవన్ టెంత్ క్లాసులో మంచిమార్కులు తెచ్చుకుని, జిల్లాకే ఫస్టుగా వచ్చాడు. దాంతో అతనికి కాలేజిలో చదవడానికి స్కాలర్షిప్ వచ్చింది. శ్రేయోభిలాషులందరూ, జీవన్ని కాలేజిలో చేర్పించి చదివించమని మీనాక్షిని ప్రోత్సహించారు. అవసరమైతే తాము డబ్బు అప్పుగా ఇస్తామనీ, నెమ్మదిగా తీర్చవచ్చుననీ చెపుతూ మరికొందరు ముందుకి వచ్చారు. వారిలో యాజులుగారూ ఉన్నారు.

కొడుక్కి చదువుమీద ఉన్న ఆసక్తి మీనాక్షికి తెలుసు. అందరూ సాయం చేస్తామని చెప్పాక తానింక జీవన్ని నిరాశపరచ లేకపోయింది. జీవన్ పై చదువులు చదివి, పెద్ద ఉద్యోగంలో చేరాలేగాని, ఈ అప్పులన్నీ ఇట్టే తీరిపోవా - అనుకుని, కొడుకుని మంచిరోజు చూసుకుని కాలేజిలో చేరిపొమ్మని చెప్పింది.

కానీ, కాలేజీ చదువంటే మాటలా! పెద్దపెద్ద పుస్తకాలూ, పరీక్ష ఫీజులూ, మంచి బట్టలూ - ఇలా ఏవేవో అదనపు ఖర్చులు కొన్ని తోడౌతాయి. వాటికోసం మీనాక్షి మధ్యాహ్నాలు "స్వగృహా ఫుడ్సు" వాళ్ళ దగ్గర పనికి ఒప్పుకుంది. అది కాక కొన్ని అప్పులూ చేసింది.

మీనాక్షి కష్టం ఫలించింది. జీవన్ శ్రద్ధగా చదివి చక్కగా కాలేజీ ఫస్టు వచ్చి మాటదక్కించాడు. డిస్టింక్షన్ మార్కులతో పరీక్ష పాసై గోల్డుమెడల్ గెల్చుకున్నాడు. డిగ్రీ చేతికి వచ్చింది. అది చూసి తల్లితోపాటుగా శ్రేయోభిలాషులంతా కూడా సంతోషించారు. కాని ఏం లాభం! గోల్డు మెడల్ అందుకున్నంత తేలిగ్గా జీవన్ ఉద్యోగాన్ని అందిపుచ్చు కోలేకపోతున్నాడు. తన లోపమేమీ లేకుండా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడుగాని, ఫలితం మాత్రం శూన్యం! పరీక్ష పాసై సంవత్సరం గడిచాక కూడా జీవన్ పేరు ఇంకా నిరుద్యోగుల జాబితాలోనే ఉండిపోయింది.

*      *       *

ఆ వూరు వచ్చినప్పటినుండీ పక్కపక్క వాటాలు కావడంవల్ల జీవన్ కి, కిరణ్ కి మంచి స్నేహం కుదిరింది. కిరణ్ కుటుంబం కూడా జీవన్ ఉంటున్న చిన్న ఇంట్లోని పెద్దవాటాలో కాపురముంటున్నారు. వాళ్ళదీ సామాన్య సంసారమే. జీవన్, కిరణ్ ఒకే వయసువాళ్ళు కావడంతో ఒకే క్లాసులో ఉండి, కలిసి మెలిసి చదువుకున్నారు. కాలేజిలో కూడా కలిసి చదివి ఒకేసారి డిగ్రీ కూడా తెచ్చుకున్నారు. జీవన్ లా ర్యాంకుల్లో రాకపోయినా కిరణ్ కూడా ఫస్టుక్లాస్ లోనే నెగ్గాడు పరీక్ష. ఇప్పుడు కూడా ఇద్దరూ ఒకేలా ఎడతెగని ఉద్యోగప్రయత్నాలు చేస్తున్నారు. రోజూ లైబ్రరీకి వెళ్లి, ఏ డైలీ న్యూస్ పేపర్లోనైనా తమ క్వాలిఫికేషన్ కి సరిపడిన ఉద్యోగం ఉందేమో వెతికి చూసి, ఉంటే - వెంటనే అప్లికేషన్ పెట్టి మరీ ఇంటికి తిరిగి వస్తోంటారు వాళ్ళు. పరీక్షలు ముగిసి రిజల్ట్సు తెలిసినప్పటినుండీ ఇదే వాళ్ళకు దినచర్య అయ్యింది. రోజులాగే ఆ రోజు కూడా వాళ్ళిద్దరూ కలిసి, జట్టుగా కాలినడకను లైబ్రరీకి బయలుదేరారు. ఇంటినుండి రెండు కిలోమీటర్లు నడిస్తేగాని లైబ్రరీ రాదు. ఎప్పటిలాగే లైబ్రరీకని బయలుదేరారు వాళ్లిద్దరూ.

దారిలో కిరణ్ జీవన్ తో అన్నాడు, "ఒరే జీవా! మనలాంటి వాళ్ళ ఆశలు తీరే రోజులు కేలండర్లో లేవనుకుంటారా! ఉద్యోగం రావడమంటే మాటలతో అయ్యే పనా ఏమిటి? ఉత్తర, దక్షిణల ప్రసక్తి లేకుండా ఎంత చిన్న ఉద్యోగమైనా కూడా ఎవరికీ తేరగా వస్తుందనిపించడం లేదురా. ఎప్పటి కప్పుడు ఇలా మనం పశ్చిమాన నిలబడి తూర్పుకి తిరిగి చేతులు జోడించి నమస్కరిస్తూ, "గోవిందా... గోవింద " అని గోవిందనామ స్మరణం చెయ్యడమే మనకు గతి అనిపిస్తోందిరా! అలాంటప్పుడు మనం ఇంకా ఇంటర్యూలకు వెళ్లడంలో అర్థం లేదేమో... దాహంతో అలమటిస్తూ, ఎండమావుల్ని చూసి నీరని భ్రమించి, వాటి వెంట పరుగులుపెట్టి, అలసి కుప్పకూలిపోయే, ఎడారి భూముల్లోని లేళ్ళలాంటి వాళ్ళంరా మనం! ఉద్యోగం దొరుకుతుందని ఎంతో ఆశగా అప్లికేషన్లు పోష్టుచేసి, కళ్ళల్లో ఒత్తులేసుకుని రోజులతరబడీ ఇంటర్వూ కోసం ఎదురుచూస్తూ, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ, మనం ఇలాగే పండిపోయి, చివరకు కాలదోషం పట్టిపోతామేమోరా... " అంటూ పకపకా నవ్వసాగాడు కిరణ్.

కిరణ్ లా నవ్వలేకపోయాడు జీవన్. "నువ్వు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. కాని అంత బరువైన మాటల్ని చెప్పి కూడా నువ్వంత ఇదిగా ఎలా నవ్వగల్గుతున్నావన్నది మాత్రం నాకు ఎంతకీ అంతుపట్టడం లేదురా కిన్నూ" అన్నాడు జీవన్ చిరాకుగా. మళ్ళీ అంతలోనే తగ్గి, "నిజంగా ఈ రోజుల్లో ఉద్యోగం రావాలంటే ఉత్తరం - (రికమెండేషన్ లెటర్) అయినా ఉండాలి లేదా, దక్షిణ (దండిగావున్న లంచం) ఇవ్వగల స్తోమతైనా ఉండాలి! నువ్వు చెప్పింది నిజమేరా ఒప్పుకుంటున్నా. ఇక మనకు మిగిలింది ఏముందిట! నువ్వు చెప్పినట్లుగా తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టి,  దైవ నామ స్మరణం చెయ్యడమే! అదే మనలాంటి వాళ్ళపని!" గాఢంగా నిట్టూర్చాడు జీవన్.

కిరణ్ ఏమీ మాటాడకుండా జీవన్ వైపు చూశాడు. జీవన్ మళ్ళీ తానే మాటాడాడు …

"కాకపోతే ఏమిటి చెప్పు? మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరైనా అసలు పట్టించుకున్నది ఎప్పుడైనా ఉందా! కర్మంచాలక ఎవరైనా మనల్ని ఇంటర్వ్యూకి రమ్మని పిలిచినా, మనల్ని ఒదిలించుకోడానికన్నట్లు వాళ్ళు వేసే మొదటి ప్రశ్న, "నీకున్న జాబ్ ఎక్సుపీరియన్సు ఎంత" అని కదా! ఎవరైనా జాబిస్తేకదా మనకు జాబ్ ఎక్సుపీరియన్సు వచ్చేది! ఇదంతా చూస్తూంటే నాకో సామెత గుర్తొస్తోంది, "వెర్రి కుదిరితేగాని పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితేగాని వెర్రి కుదరదు" అన్నది. ఈ సమస్య పరిష్కారానికి ఇంకేది దారి చెప్పు? జాబు ఎక్సుపీరియన్సు గురించి అడిగినవాడిని గట్టిగా రెండు పీకాలనిపిస్తుంది. కాని సభ్యతకాదని ఊరుకుంటున్నాను. రోజులు గడిచిపోతున్నకొద్దీ నాకు మతి పోతోంది. ఈ పరిస్థితిలో నీకు నవ్వాలని ఎందుకనిపిస్తోందో నాకు అంతుపట్టడం లేదు. నీకింత మనోనిబ్బరం ఎలా అబ్బిందిరా కిన్నూ?"

"పోరా! ఎన్నింటికని ఏడవాలి? ఈ కష్టాలూ, ఇబ్బందులూ లాంటివి ఈ వేళ నాకేమైనా కొత్తవా ఏమిటి? నేను పుట్టినప్పుడే అవీ పుట్టి, నాతోపాటుగా పెరుగుతూ వచ్చాయి అవి కూడా, తెలుసా! ఇంక వాటిని చూసి కొత్తగా నేను భయపడే దేమిటి చెప్పు? మనం భయపడడం మొదలుపెడితే, అవి మరింత లోకువకట్టి, మన వెంటతగిలి మరీ మనల్ని తరిమి తరిమి వేధిస్తాయి. అందుకే నేను అంతగా పట్టించుకోకుండా వాటి దారిని వాటిని పోనిస్తా, అంతే! అంతకంటే దేవ రహస్యం మరేమీ లేదు. మొండాడు రాజుకన్నా బలవంతుడుట! వినలేదా నువ్వు?

కిరణ్ మరీ లేతనెలల పిల్లాడిగా ఉన్నప్పుడే అతనికి పోలియో వచ్చింది. కాలు అవిటిదయ్యింది. అసలే అంతంత మాత్రపు బ్రతుకులు వాళ్ళవి. మార్వాడీ కొట్టులో పద్దులు రాసే ఉద్యోగం తండ్రిది. జాతకాలు చెప్పీ, ముహూర్తాలు పెట్టీ మరో నాలుగురాళ్ళు సంపాదిస్తాడు ఆయన. తనది చాలీ చాలని సంపాదనే అయినా, అవిటివాడైన కొడుక్కి, శ్రమ తక్కువగా ఉండే - కుర్చీలో కూర్చుని పనిచేసే, ఒక మంచి బ్రతుకు తెరువు చూపించాలనే తాపత్రయంతో ఆ తండ్రి , తనకది ఎంత కష్టమైనా సరే, కొడుకును కాలేజీలో చేర్పించి చదివించాడు. కిరణ్ కూడా శ్రద్ధగా చదివి, జీవన్ లాగే గణితం ప్రధానాంశంగా పరీక్షలురాసి, ఫస్టుక్లాసులో పరీక్ష నెగ్గాడు. అప్పటినుండీ మిత్రులిద్దరూ అవిశ్రాంతంగా ఉద్యోగప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఫలితమే కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు.

"ఒరేయ్ కిరణ్! మనం డిగ్రీ తీసుకుని ఎన్నాళ్ళయ్యిందో నీకు జ్ఞాపకముందా? అప్పటినుండీ మన క్వాలిఫికేషన్ కి తగినదనిపించిన ప్రతి జాబ్ కీ అప్లై చేస్తూనే వచ్చాము కాదురా! ఆపై, వచ్చిన ఒకటీ అరా ఇంటర్వూలకు కూడా సరైన టైంకి వెళ్ళివచ్చాము, కాని ఏం లాభం! కనీసం నీకైనా రాలేదు ఉద్యోగం! నాకైతే చాలా దిగులుగా ఉందిరా! నీలా నేను ఎంతమాత్రం నవ్వలేకపోతున్నాను. నీలో ఇంకా ఆపాటి స్పిరిట్ మిగిలి ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, కీప్ ఇట్ అప్!"

అలా మిత్రులిద్దరూ ఆ కబురూ, ఈ కబురూ చెప్పుకుంటూ లైబ్రరీకి వెడుతున్నారు, అక్కడ దొరికే పేపర్లలో పడ్డ "వాంటెడ్ కాలం"లు  చూసుకోడానికి. ఈమధ్యన ఆ పని వాళ్ళకు దినచర్యలోని ప్రధానాంశమై కూచుంది కదా మరి!

అదాటుగా ఆగి, "అంతా ఆ పైవాడి దయ" అన్నాడు కిరణ్, చేతిలోని కర్ర చంకలో పెట్టుకుని, చేతులు రెండూ జోడించి దేవునికి నమస్కరిస్తూ... ఆపైన లోయెలుగులో, "చంపేదెవరు, సమసేదెవరు - సర్వము నీవేకదా, దేవా! సర్వము నీవే కదా" అంటూ శ్రావ్యంగా పాడసాగాడు.

జీవన్ కిరణ్ వైపు కోపంగా చూసి, ఆగకుండా విసురుగా రెండడుగులు ముందుకి వేశాడు. "ఈ కిన్నూ గాడికి అంతా హాస్యమే! సమయం సందర్భం కుదురుతుందా, లేదా అని కూడా చూడడు కదా" అని గొణుక్కున్నాడు.

ముందుకి వెళ్ళిపోతున్న మిత్రుని అందుకోడం కోసం పాట ఆపి, కర్ర సాయంతో వేగంగా ముందుకి నడిచాడు కిరణ్. జీవన్ బుజం మీద చెయ్యేసి, "సారీరా జీవా! బక్కప్రాణిని, నాపై కోపగించకురా, నీకు పుణ్యముంటుంది! మనం ఎంత బాధపడినా ఏ ప్రయోజనం లేనప్పుడు ఇక బాధపడి ప్రయోజనం ఏముంది కనక! దేనికైనా ఆ సమయం రావాలి. కాలం, కర్మం  కలిసివచ్చిననాడు ఎన్నెన్నో అద్భుతాలు అవలీలగా జరిగిపోతాయి. అంతవరకూ మనం ఓపికపట్టక తప్పదు. ఈలోగా నవ్వినా, ఏడ్చినా ఫలితం ఒకటే! మనమేమిటో మన భవిష్యత్తు ఏమిటో ఆ పైవాడు ఎప్పుడో రాసిపెట్టే ఉంటాడు కదా!"

"ఆ టైం రావాలి, అంతా మన తలరాత, ఇంతే పెట్టిపుట్టాం, ఇదంతా నా కర్మ ఫలం - ఇలా ఏవేవో తలా తోకాలేని మాటలతో మనసు సరిపెట్టుకుని, చేతులు కట్టుకుని పడి ఉండడం తప్పించి మనం ఇంకేం చెయ్యగలం! మనచేతిలో ఏముంది కనుక - అనుకుని, ఏమీ చెయ్యకుండా చేతులు ముడుచుకుని ఒక మూల కూర్చుంటే సరిపోతుంది" అంటూ జీవన్ ఉక్రోషపడ్డాడు.

"అబ్బెబ్బే! మనమేం చేతులు కట్టుకు కూర్చోనక్కరలేదు, మనం మన ప్రయత్న లోపం లేకుండా, భగవంతుడు మనకు ప్రసాదించిన ప్రజ్ఞను ఉపయోగించి మనసుపెట్టి చెయ్యవలసిన పనిని చెయ్యాలి, తప్పదు. దాన్నే పురుషకారం - అంటారు. ఆపైన ఫలితాన్ని గురించి ఆలోచిస్తూ మనసు పాడుచేసుకోకుండా దైవం మనకు ఏది ప్రసాదిస్తే దాన్ని మనం నిండుమనసుతో స్వీకరించాలి. అదే గీతా వాక్యం. దానిని నమ్మిన వారికి మనస్తాపం ఉండదు."

"మనం ప్రయత్నలోపం ఎప్పుడు చేశామో చెప్పు! ఇకపోతే ఫలితమే..." మాట మధ్యలో ఆపేసి ఉసూరుమన్నాడు జీవన్.

"అదే వద్దన్నది! ఓరిమి, ఓరిమి! దేనికైనా ఆ టైం రావాలి, వస్తుంది కూడా! కొంతకాలం వేచి ఉండక తప్పదు, అంతే" అంటూ జీవన్ కి ధైర్యం చెప్పి, తన పెద్దరికం నిలబెట్టుకున్నాడు కిరణ్. జీవన్ కంటే కిరణ్ పది రోజులు పెద్దవాడు మరి!

నెమ్మదిగా అలా పిచ్చాపాటీ మాటాడుకుంటూ, రోడ్డువారగా నడుస్తూ పోతున్న మిత్రులిద్దరూ, రోడ్డు వెంట వేగంగా వచ్చి, తమదారికి అడ్డంగా ఆగిన ఆటోని ఉలికిపాటుతో తెల్లబోయి చూశారు. ఆటోడ్రైవర్ క్రిందికి దిగి, వాళ్ళకి ఎదురుగా వచ్చి, తన కాఖీ షర్టుని సవరించుకుంటో నిలబడి, వాళ్ళ కళ్ళలోకి చూసి చిరునవ్వు నవ్వాడు.

"ఓరీ, నువ్వుట్రా రాఘవా" అంటూ మిత్రులిద్దరూ ఏకగ్రీవంగా పెద్దగా కేకపెట్టారు. చురుగ్గా రెండడుగులు ముందుకు వేసి, రాఘవని కౌగిలించుకున్నాడు జీవన్. "ఇదేం వేషం! మేము నిన్ను గమ్మున ఆనవాలు పట్టలేకపోయాము సుమీ" అన్నాడు కిరణ్.

"ఇప్పుడు తెలిసిందికదా, నేను మీ క్లాస్మేట్ రాఘవనేనని! నేను ఆటో డ్రైవర్ గా మారడానికి స్ఫూర్తి దాతలు మీరే! స్ఫూర్తిదాతలకు వందనాలు!" నాటక ఫక్కీలో వయ్యారంగా వంగి వాళ్ళకి నమస్కరించాడు రాఘవ.

“బలేవాడివిరా రాఘవా! ఇంకొకళ్ళకి స్ఫూర్తి కావడానికి మా ఇద్దరి దగ్గరా ఏముందిట, బూడిద" అన్నాడు కిరణ్ ఆశ్చర్యంతో. జీవన్ కి నోట మాటరాలేదు. అవాక్కై కళ్లప్పగించి చూస్తూ నిలబడిపోయాడు.

రాఘవ నవ్వి అన్నాడు, “మీరిద్దరూ మరీ అంత ఇదైపోనక్కరలేదు. నేను చెప్పింది నిజం! మంచి మార్కులతో పాసైన మీకే రాని ఉద్యోగం, ఆప్టరాల్, ఏవరేజి స్టూడెంటుని నాకెలా వస్తుందనుకోగలను, చెప్పండి? అందుకే ఉద్యోగం మీద పెద్దగా ఆశ పెట్టుకోకుండా, నిర్లిప్తంగా అప్లికేషన్లు పడేస్తూ, ఆటో డ్రైవర్ గా రంగప్రవేశం చేశాను. ఇప్పుడు చెప్పండి నాకు స్ఫూర్తి ఎవరో! ఇక సంపాదనంటారా - ఫరవాలేదు! ఆటో బాడుగ పోగా, నా చేతి ఖర్చులకు, అప్లికేషన్ ఫారాలకు, కర్మం చాలక వస్తేగిస్తే - ఒకటీ అరా ఇంటర్వ్యూలకు తడుముకోవలసిన పనిలేదు ఇప్పుడు. కాలక్షేపం లేదనే బాధ కూడాలేదు నాకు. నా పనిప్పుడు హాయిగా ఉంది. ఫ్రీడం వచ్చినట్లుంది నాకు. ఇదివరకులా ఇప్పుడు నేను మా అన్నయ్యల నెవర్నీ డబ్బులకోసం అడగాల్సిన పనిలేదు" అన్నాడు రాఘవ ఉషారుగా.

జీవన్, కిరణ్ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరూ రాఘవ తెలివికి అతన్ని మనసారా అభినందించారు. తమ కిద్దరికీ ఇంతవరకూ ఇలాంటి మంచి ఆలోచన ఒక్కటీ రానందుకు విచారించారు. రాఘవ చేసిన పని వాళ్ళకు బాగా నచ్చింది.

“అరే భాయీ! మేమిద్దరం నీకు స్ఫూర్తి నిచ్చామన్నది ఏమోగాని, ఇప్పుడు నువ్వు మాత్రం మాకు గొప్ప స్ఫూర్తి దాటవన్నది నిజం! ఇప్పటినుండీ మేముకూడా ఉద్యోగం కోసం నోరెళ్ళబెట్టుకుని ఎదురుచూస్తూ కూర్చోకుండా, చేతికి దొరికిన ఏపనైనా సరే చెయ్యాలనే నిర్ణయానికి, ఇప్పటి కిప్పుడు వచ్చేశాము" అన్నాడు జీవన్.

"మనవాళ్ళు, అమెరికా వాళ్ళలా ఉండాలని, అడ్డమైన పనుల్లోనూ వాళ్ళని ఇమిటేట్ చేస్తారు! కాని, వాళ్ళు నమ్మి, పాటించే "డిగ్నిటీ ఆఫ్ లేబర్" అన్నదానిని మాత్రం చూసీ చూడనట్లుగా వదిలేశారు! వైట్ కాలర్డు జాబ్సుకిచ్చిన విలువ మనవాళ్ళు బ్లూ కాలర్డు జాబ్సుకి ఇవ్వరు. అందరికీ అందలం ఎక్కాలన్నదే ఆశ! కాని అందరూ పల్లకీ ఎక్కితే మోసే వారెవరు? నిజానికి వైట్ కాలర్డు జాబ్సు కంటే బ్లూకాలర్డు జాబ్సు అవసరమే ఎక్కువ. వైట్ కాలర్డు జాబ్సు లేని రోజుల్లో కూడా మనుష్యులు కాయకష్టం చేసుకుంటూ సుఖంగానే బ్రతికారు" అన్నాడు కిరణ్ తన సహజ ధోరణిలో.

"నాకైతే అదంతా డాంబికమనిపించదు... దానికి కారణం బ్లూకాలర్డు జాబ్సుకి ఇక్కడ తగినంత రాబడి, గౌరవం ఉండకపోవడం కూడా కారణం కావచ్చు. పొద్దున్నమొదలు సాయంకాలంవరకూ నడుమువంచి పని చేసినా, వచ్చిన డబ్బు ఆరోజు కుటుంబ పోషణకు కూడా సరిపోనప్పుడు, అలాంటి పనిని చెయ్యాలని ఎవరికనిపిస్తుండి చెప్పు?"

"ఒరే జీవా! ఇప్పుడు మనమున్న స్థితిలో అలా మీనమేషాలు లెక్కించడం ఎంతమాత్రం మంచిదికాదు. "లేని బావకన్నా గుడ్డిబావ మే"లంటారు. ఏది దొరికితే అది చెయ్యడం మంచిది. ముందు ఏదో ఒకటి దొరకాలి కదా" అన్నాడు కిరణ్.

"రండిరా! నా ఆటో ఎక్కండి. మీరు ఎక్కడ దించమంటే అక్కడ దింపి నేను వెళ్లిపోతా!" ఉబలాటపడ్డాడు రాఘవ.

జీవన్ రాఘవ చెయ్యి పట్టుకుని, "నేను నీకు పోటీ అని నీకు అనిపించకపోతే, నాక్కూడా ఒక ఆటో ఇప్పించరా, నీకు పుణ్యముంటుంది. రేపటినుండీ నేనుకూడా ఇంతో, అంతో సంపాదించి, మా అమ్మకు సాయపడాలని ఉంది. ఆమె ఒక్కర్తీ పొద్దంతా, విశ్రాంతి అన్నది లేకుండా పడుతున్న కష్టం చూడలేకుండా ఉన్నానురా" అన్నాడు. అలా అంటూoటే అతని కంఠం గద్గదమయ్యింది.

"పోటీ గీటీ లాంటిదేం లేదురా. అలా ఆలోచించొద్దు. ఈ ఆటో యజమాని మాకు బంధువు. అందుకే నాకు డిపాజిట్ అడక్కుండా బండి ఇచ్చారు. నీకైతే కనీసం పదివేలు డిపాజిట్ అడుగుతాడేమో... ప్రయత్నించి చూద్దాం. పెద్దగా ఆశ పెంచుకోకు."

"నీ చేతిలో ఉన్నది నువ్వు చెయ్యి. ఆపైన అంతా దైవేఛ్ఛ!" అన్నాడు కిరణ్ రాఘవతో.

"సరేలే! ఫరవాలేదులేరా. వదిలెయ్యి. నువ్వు మమ్మల్ని లైబ్రరీ దాకా తీసుకెళ్ళు, నీ సరదా తీరుతుంది. ఇప్పుడు మేము అక్కడికే వెడుతున్నాం. పద" అంటూ జీవన్ ఆటో ఎక్కాడు.

కిరణ్ కూడా, ముందుగా తన చేతికర్రను ఆటోలోఉంచి, నెమ్మదిగా, జీవన్ చెయ్యాసరాతో తనూ ఆటో ఎక్కాడు. ఆటో కదిలి లైబ్రరీ వేపుకి నడిచింది.

ఆటో కొంతదూరం వెళ్ళేవరకూ ఎవరూ మాటాడలేదు. ముందు కిరణ్ పెదవి విప్పాడు. పక్కకు తిరిగి జీవన్ తో అన్నాడు, "దిగులుపడకురా జీవా! ఇన్నాళ్ళూ మనకీ ఆలోచన రాకగాని, మనకు కూడా ఏ బట్టలకొట్టులోనో పద్దులు రాసే పని ఇప్పించమని మా నాన్నని అడుగుదాం మనం. చెయ్యాలనుకుంటే ఎక్కడో ఒకచోట ఏదో ఒక చిన్నపని దొరక్కపోదు, చూద్దాం! ఇన్నాళ్ళకి కదా వచ్చింది ఈ ఆలోచన!"

"పెట్టుబడి అవసరం లేనిదైతే చాలు, ఎంత చిన్నపనైనా సరే చేసి, ఎంతో కొంత డబ్బు సంపాదించాలని ఉంది నాకు" అన్నాడు జీవన్.

"నేనూ ఊరుకోను, నువ్వు నాతో ఉంటావంటే నాకూ సంతోషమే! ఈవేళే ఆటో ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అడిగి చూస్తా, మా పెద్దమ్మ ఏమంటుందో..." అన్నాడు రాఘవ జీవన్తో. జీవం హతాశుడయ్యాడు.

రాఘవ హుషారుగా ఆటో నడుపుతున్నాడు. చదువులో తాను మిత్రులకంటే వెనకనున్నా, సంపాదనలో వాళ్ళకంటే తనే ముందు వరుసలో ఉన్నందుకు అతనికి చాలా సంతోషంగా ఉంది. దారిలో కూల్ డ్రింక్సు షాపు దగ్గర బండి ఆపి, ముగ్గురికోసం "థంసప్" తీసుకుని, దానికైన డబ్బులు తనే ఇచ్చేశాడు రాఘవ.

****సశేషం****

Posted in August 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!