Menu Close
Page Title
అందాల కళాకృతులతో బొమ్మల కొలువు

kondapalli-bommaకొండపల్లి బొమ్మలు: కృష్ణ జిల్లాలోని కొండపల్లి (విజయవాడకి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది) ఐదు వందల ఏళ్ళనుంచి ప్రసిద్ధి గాంచింది. ఒకటి, ఎన్నో రాజ వంశాలు చూసిన పురాతన కోట, రెండోది అక్కడే కొండల అడవులలోనే పెరిగే మెత్తని 'తెల్ల పొణికి’ చెక్కతో స్థానిక శిల్పులు చెక్కుతూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, క్రమేణా పెంచుకుంటూ తయారు చేసే ‘కొండపల్లి బొమ్మలు’. 1960 లో కొసరాజు వ్రాసిన 'కుంకుమ రేఖ' చిత్రం లోని 'కొండపల్లి బొమ్మలా కులికింది పిల్ల, వయ్యారపు నడకతో వచ్చే పడుచుపిల్ల ' శ్రీమతి జిక్కి బృందం పాడిన పాట కొంతమందికైనా గుర్తు ఉండే ఉంటుంది. అందాల రంగు బొమ్మలు, వయ్యారాలు చిందించే నాట్యం చేసే బొమ్మలు నేటికీ ప్రాముఖ్యాన్ని కోల్పోకుండా అందరు కాకపోయినా కొందరైనా కళా దృష్టి కలిగిన తెలుగువారి ఇళ్ల 'షో కేసెస్' లో కులుకుతూ కనిపిస్తాయి. అల్లాగే ఏటికొప్పాకలో జన్మించి ఎందరో ఇల్లనలకరించే ‘లక్కపిడతలు’ భావ స్ఫూర్తిని పెంచుతూ చూపరులని ఆకర్షించుతూ ఉంటాయి.

మొదట బాగా గుర్తింపుపొందిన కొండపల్లి బొమ్మల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ పురాణంలో వివరించబడ్డట్టు శివానుగ్రహపాత్రుడైన ‘ముక్తిఋషి’ సంతతిలోని ప్రతిభావంతులైన శిల్పులు కొందరు ఐదు శతాబ్దాలకు పూర్వం రాజస్థాన్ నుంచి వలసవచ్చి కొండపల్లి లో ‘నకార్షాలు’ (ఆర్యక్షత్రియులు) గా స్థిరపడి కొండపల్లి ప్రాంతంలో మాత్రమే దొరికే తెల్ల పొణికి చెట్ల కాండాన్ని నరికి ముక్కలు చేసి, వేడి చేసి తేమనంతా తొలగించి, బొమ్మలకి మౌలిక ఆకృతిని కల్పించారు. అదే పద్ధతిని వారిసంతతి వారు కూడా కొనసాగిస్తున్నారు. అక్కడనుంచి వారు అద్భుత శిల్పులుగామారి అత్యంత ఓర్పుతో సున్నితంగా మలచి కావలసిన రూపురేఖల్ని అందముగా కల్పిస్తారు. అవసరమైన శరీరభాగాలు నగిషీలతో సహా మలచి పూర్తి చేసి ఆ ఆకృతులకి అతికిస్తారు. అతికించడానికి కావలిసిన బంకని వారే చింత పిక్కలు, రంపపు పొట్టు, చింత జిగురులతో తయారు చేసుకుని, వివిధ భాగాలని అతికిస్తూ, చెట్టు కాండంలో ఉండే రంధ్రాలను, పగుళ్ళను  మూసివేస్తారు. దీనితోనే ఆవులకు, ఎడ్లకు  గంగడోలు, వింజామరలు, చిన్ని సంగీత వాయిద్యాలు మొన్నగునవి, అనగా చెట్టుకఱ్ఱతో సాధారణంగా సులభముగా చెయ్యలేనివి తయారుచేసుకుంటారు. ఒక ముఖ్య విషయమేమిటంటే ప్రతి ఒక్క భావగర్భిత ప్రతిమ ప్రత్యేకంగా శిల్పులచే చెయ్యబడినదే కానీ ఒక మూస చేసి దానితో బహుళాకృతులు చేయ వీలుకాదు. అందుకే ఒకే భావం ప్రదర్శించే ఏ రెండు బొమ్మలు అచ్చుగుద్దినట్లు ఒకే రీతిగా ఉండవు. వీటి తయారీలో ఆకారాలు కూర్చడంలో మగవారి ప్రయత్నం ఎక్కువగాను, రంగుల అలంకరణలోను, చిత్రీకరణలోనూ స్త్రీల ప్రమేయం ఎక్కువగాను ఉంటుంది. కళా దృష్టి, పనిముట్ల వాడుకలో నేర్పరితనం పిల్లలు నడకతో బాటే పెద్దవాళ్ళని  చూస్తూ నేర్చుకుంటారు. మొదట్లో వృక్షసంపదతో చేసిన రంగులనే ఈ బొమ్మలకి వాడేవారు. కాలక్రమేణా వాటి సేకరణ క్లిష్టతరమౌతుండడము, దుమ్ము ధూళీల నుంచి బొమ్మలసంరక్షణ దుస్సాధ్యమవ్వడం, వేరే పదార్ధాల కోసము వెతకాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడే వాడుకలోకి వస్తున్న 'ప్లాస్టిక్ యిముల్షన్' రంగులు కావలసిన రంగుల కలయికతో మన్నికగలవిగా ఉంటూ సంరక్షణలో కూడా ఎక్కువ సహకరించడంతో ప్రసుతం అందరూ వాటివైపు మొగ్గుచూపుతున్నారు.

kondapalli-bomma

kondapalli-bommaకాలం గడుస్తున్న కొద్దీ ఆచారవ్యవహారాలు, సంఘములో జరిగే మార్పులను ప్రతిబింబిస్తూ బొమ్మల నిర్మాణ పద్దతి, వాటి ప్రదర్శనా తీరు మారుతూ జనంలో ప్రాచూర్యత పెంచడం కోసం మార్పులు చేయ వలసి వచ్చింది. కొంత సాంకేతిక మెరుగుదలలు కూడా పరిగ్రహించి వాటిని వాడుకుంటూ శిల్పులు బొమ్మల తయారీలో మార్పులు చేయవలసి వచ్చింది. ఒకే మూసలో చేయలేకపోవడం వల్ల భారీ ఉత్పత్తి సాధ్యం కాక ప్రతి ఒక్క బొమ్మ ప్రత్యేక శ్రద్ధతో తయారు చెయ్యవలసిన అవసరం ఏర్పడింది. బొమ్మల ముఖకవళికల ఇతర వివరాలు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో వాటికి ఆదరణ పెరిగింది. దీనితో శిల్పులలో, చిత్రకారులలో నైపుణ్యం అవసరమై ఆసక్తికరంగా శిక్షణ పెంచుకోవాలిసి వచ్చింది. దానికి సాయంగా సమకాలిక సమాజ స్థితిని ప్రతిబింబిస్తూ చేస్తున్న ఆకృతులకి ఆదరణ పెరగడంతో అమ్మకాలు పెరగడం, ఎక్కువ కళాకారులు వారి నైపుణ్యం విలువలు పెంచే అవసరం పెరిగి వారి జనాభా, దానితో ఊరు పెరగడం తప్పనిసరి అయింది. నేడు క్రమంగా పాశ్చాత్యులుకూడా ఈ హస్తకళని ఆదరిస్తున్నారు. ఈనాడు కొండపల్లి పేరు అంతర్జాతీయంగాకూడా వినిపిస్తోంది. ఆధునీకత పెరిగి కళరూపురేఖలు కూడా మరి పోయేటట్లు చేస్తున్నాయి. పక్కనున్న బొమ్మలో ప్లైవుడ్ తప్ప పొణికి చెక్క లేనే లేదు.

yetikoppaka-bommayetikoppaka-bommaఏటికొప్పాక కొయ్య బొమ్మలు: ఇవి కూడా చెక్కతో ప్రత్యేకంగా అనేక తరాలుగా చేయబడుతున్నవే. ప్రతి ఒక్క రూపం శ్రద్ధతో అమర్చబడ్డవే. విశాఖ జిల్లా వారాహి నదీ తీరాన్న పెరిగే మెత్తని కర్ర కలిగిన అంకుడు చెట్లని ఈ బొమ్మలతయారీ లో వాడుతారు. సుమారు 400 కుటుంబాలు ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయి. చక్రం తిప్పుతూ కత్తితో మెత్తని చెక్కని మలుస్తూ కావలిసిన రూపాన్ని తీసుకువస్తారు. వీటిని లక్క పూతతో కావలిసిన ఆకారాన్నిచ్చి పూర్తి చేసి గింజలు, ఆకులు చెట్టు వేళ్ళు బెరడు, బంక లతో మనోహరమైన రంగులు తయారు చేసుకుని వాటిని పులిమి పిల్లలకు పెద్దలకు కళ్ళకు ఇంపుగా ఆనందాన్ని కలిగించేటట్లు చేస్తారు.

yetikoppaka-bomma

బొమ్మల కొలువు: దక్షిణ భారత దేశం లో సంక్రాంతికి పండించుకున్న పంటలు ఇళ్లకు చేరే సమయాన ఇళ్లన్నీ ఆనందంతో కళకళలాడుతూ ఉంటాయి. ప్రకృతిలో పువ్వులుకూడా విచ్చుకుంటూ తమవంతు ఆనందాన్ని తెలియచేస్తాయి. వాతావరణం కూడా మనోహరంగా మారి చలి పోతూ పోతూ వెచ్చదనం కమ్ముకుంటున్న వేళ పిల్లలలో ఆనందం విరబూసి రంగురంగుల వేష ధారణలతో ఆ సంతోషాన్ని వెలిబుచ్చుతూ బొమ్మలకొలువులు పెడతారు. ఆకొలువుల్లో కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క పిడతలనే కాకుండా తమవద్ద ఉన్న అన్ని రకాల బొమ్మలతో ఆ వేదికని అలంకరిస్తారు. ఇంట్లోనివారు మనోహరం గా తీర్చిదిద్దే పల్లెల కార్యకలాపాల్నిదానిలో ప్రతిబింబించే దృశ్యాలని ప్రదర్శించి తాము ఆనందిస్తూ చూపరులకు ఆనందాన్ని చేకూరుస్తారు. క్రింద అటువంటి అలంకరణ ఒకటి చూడవచ్చు.

bommala-koluvu

మళ్ళీ శీతాకాలం ప్రారంభానికి ముందు దసరాలకి కూడా ఉత్సహం పెల్లుబికించే బొమ్మలకొలువు పెట్టడం సామాన్యంగా చూస్తూ ఉంటాము. అదొక వేడుక.

-o0o-

Posted in August 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!