Menu Close
ప్రకృతి నేర్పిన పాఠం (కథ)
G.S.S. కళ్యాణి

పన్నెండేళ్ల సత్యవ్రత్ ముద్దుపేరు సత్యం. సత్యానికి చదువు మీదకన్నా ఆటపాటలమీద ధ్యాస ఎక్కువగా ఉంటూ ఉండేది. ఒకసారి పరీక్షల్లో బాగా తక్కువ మార్కులు వచ్చాయని సత్యాన్ని తీవ్రంగా మందలించారు అతడి లెక్కల మాష్టారు. బిక్కముఖం పెట్టుకుని ఇల్లు చేరిన సత్యం తనను మాష్టారు కోప్పడిన విషయం తన తల్లి సీతకు చెప్పాడు.

"మరి ఆటలు ఆపి చదువుకోమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకోలేదు. కనీసం మీ మాష్టారు మాటైనా విని ఇకనుండీ సరిగ్గా చదువుకో. లేకపోతే నీ భవిష్యత్తు పాడైపోయే అవకాశం ఉంది!", అని సత్యాన్ని గట్టిగా హెచ్చరించింది సీత.

తన తల్లి తనని కాకుండా తనను కోపడ్డ మాష్టారుని సమర్ధించిందని విపరీతంగా బాధపడ్డాడు సత్యం. సాయంత్రం కావచ్చింది.

ఆఫీసులో రోజంతా పని చేసి చేసి అలసిపోయి చిరాకుగా ఇంటికి వచ్చిన సత్యం తండ్రి రఘురాం, సత్యం మార్కుల సంగతి తెలుసుకుని, "ఒరేయ్ సత్యం! ఏం మార్కులురా అవీ? నీలాంటి ఎందుకూ పనికిరాని వాడిని నేను కాబట్టి ఇంకా భరిస్తున్నాను! ఛ! ఛ! కాసేపు నాకు కనపడకు!", అని అన్నాడు కోపంగా.

అమ్మా, నాన్నా, బడిలో మాష్టారూ అందరూ ఒకేసారి తనను కోప్పడటం అనేది సత్యం అస్సలు తట్టుకోలేకపోయాడు. వెంటనే చెప్పులేసుకుని వాళ్ళ ఊరిపొలిమేరవరకూ పరుగులాంటి నడకతో వెళ్లి అక్కడున్న చెరువుగట్టుపైన కూర్చుని బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు సత్యం. అంతలో చెరువులోని నీళ్ళల్లో ఏదో అలజడి కనపడటంతో సత్యం ఏడుపాపి చెరువువంక చూశాడు. అక్కడొక చిన్న చేపపిల్ల సత్యాన్ని చూసి భయపడినట్లుగా పారిపోతూ కనపడింది.

సత్యం ఆ చేపపిల్లతో, "ఏం చేపా?! నేను ఎందుకూ పనికిరాను! నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు? నేను నిన్నేమీ చెయ్యనులే!", అని అన్నాడు.

అందుకు ఆ చేపపిల్ల ఆగి, సత్యాన్ని చూస్తూ ఫక్కున నవ్వి, "పరిమాణంలో నేను నీ కన్నా చాలా చిన్నగా ఉన్నాను కదా! అందుకే నిన్ను చూసి కొంచెం భయపడ్డా. కానీ, నీలాగా నేను అశక్తురాలిని కాను. వేగంగా ప్రవహించే నీళ్లలో సునాయాసంగా ఈదిపోగల శక్తి నాకుంది! తెలుసా??", అంటూ వెళ్ళిపోయింది.

అప్పుడు చల్ల గాలికి సత్యం పక్కనే ఉన్న చెట్టు కొమ్మలు నెమ్మదిగా కదిలాయి. ఆ చెట్టు కొమ్మమీద కూర్చుని ఉన్న ఒక పిట్ట సత్యాన్ని చూసి రివ్వున గాల్లోకి ఎగిరింది.

అది చూసిన సత్యం విచారంగా ముఖం పెట్టి పిట్టతో, "ఓయ్ పిట్టా! నిన్ను పట్టుకోవడం నావల్ల కాదులే. నన్ను చూసి భయపడక్కర్లేదు. అయినా, నేను దేనికీ పనికిరానట! కాబట్టి నీకు ఎక్కడ కావాలంటే అక్కడే వాలి హాయిగా కూర్చోవచ్చు!", అని అన్నాడు.

సత్యం మాటలు విన్న పిట్ట అతని భుజంపై వాలి, "ఓ మనిషీ! నువ్వంటున్నది ఆశ్చర్యంగా ఉందే! నువ్వు దేనికీ పనికిరావని ఎవరో అన్నారా?? అది అబద్ధం! నేను నీ అంత బాగా మాట్లాడలేకపోవచ్చేమోగానీ కమ్మగా పాడగలను!", అని అంటూ తన తియ్యటి గొంతుతో లయబద్ధంగా కూస్తూ ఎగిరి వెళ్ళిపోయింది.

కాసేపటి తర్వాత సత్యం ముందున్న మట్టిలోంచీ ఒక వానపాము బయటకొచ్చి చెరువుకేసి జరజరాపాకుతూ వెళ్ళిపోసాగింది. దాన్ని చూసిన సత్యం, "మట్టిలో ఉండే వానపామువి! నువ్వు కూడా నేనంటే భయపడుతున్నావా? నాకు ఏమీ చేతకాదని అందరూ అంటున్నారు! నువ్వు ఇక్కడే ఉండచ్చులే. నేను నిన్నేమీ చెయ్యను", అని అన్నాడు.

అందుకు ఆ వానపాము, "ఏయ్ అబ్బాయ్! నీకేమీ చేతకాకపోవడమేమిటీ? నన్ను చూడు! నాకు మీ మనుషులకున్నట్లుగా కళ్ళూ, కాళ్ళూ, చేతులూ లేకపోయినా నేను మట్టిని సారవంతం చెయ్యగలను. తెలుసా? నాకు వచ్చిన పని నేను ఎవరి సహాయం తీసుకోకుండానే చేసుకుంటూ పోతా!", అని అంటూ చెరువు వైపుకి వెళ్ళిపోయింది.

అంతలో, సత్యం పక్కనున్న చెట్టుపైనుండీ, తన మిత్రుడు చిలుకతో కలిసి జరిగినదంతా గమనిస్తున్న ఒక కోతి, సత్యం దగ్గరికి వచ్చి, "బాబూ! నీ మాటలను బట్టి నువ్వు ఏదో బాధలో ఉన్నావని అర్ధమవుతోంది. ఏమిటి నీ సమస్యా?", అని అడిగింది.

"నా పేరు సత్యం. నాకు పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని అందరూ నన్ను కోప్పడుతున్నారు. నేను ఎందుకూ పనికిరాని వాడినైపోయానని బాధగా ఉంది. ఈ ప్రపంచంలో నేను తప్ప అందరూ ఏదో ఒక పని చెయ్యగలిగినవారే! ఆఖరికి ఇందాక వచ్చిన చేప పిల్లా, పిట్టా, వానపామూ కూడా వాటికి వచ్చిన పనులు అవి చక్కగా చేస్తున్నాయి. ఈ పక్కనున్న చెట్టు ఎంతో నేనూ అంతే! మేము దేనికీ పనికిరాము!", అన్నాడు సత్యం నిరాశగా.

అది విన్న చెట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడి, "నేను దేనికీ పనికి రాకపోవడమేమిటీ? మీ మనుషుల్లాగా నేను ఉన్నచోటినుండీ కదలలేనేమోగానీ అందరికీ చల్లటి నీడనూ, తియ్యటి పళ్ళనూ, పీల్చడానికి స్వచ్ఛమైన గాలినీ ఇవ్వగలను తెలుసా?", అంది సత్యంతో.

అప్పుడు సత్యం,"చూశావా? ఆఖరికి ఆ చెట్టు కూడా మంచి పనులు చేస్తోంది! నేనే ఎందుకూ పనికిరాకుండా పోయాను!", అన్నాడు దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో.

అందుకు కోతి, "ఆగవయ్యా సత్యం! నీకొక విషయం చెప్తాను విను. ఒక ప్రాణికి ఈ సృష్టిలో సుఖంగా బతకడానికి ఏమేం కావాలో అవన్నీ మీ మనుషులకి ఆ భగవంతుడు ఇచ్చాడు! అందమైన ఈ ప్రపంచాన్ని చూడటానికి కళ్ళూ, నడవటానికి కాళ్ళూ, పనులు చేసుకోవడానికి చేతులూ....", అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది.

సత్యం కోతి చెప్తున్నది అడ్డుకుంటూ, "ఆఁ! అవన్నీ ఆ భగవంతుడు నీక్కూడా ఇచ్చాడుగా! ఒక పెద్ద తోకతో సహా!", అన్నాడు.

అందుకు కోతి, "సత్యం! నేను చెప్పదలచుకున్నది నన్ను పూర్తిగా చెప్పనీ! మనుషులకున్న బుద్ధిబలం ఎంతో గొప్పది! మరి ఏ ఇతర ప్రాణులకూ లేనంత అపారమైన జ్ఞాపక శక్తి, అపురూపమైన ధారణా శక్తి, అద్భుతమైన ఊహా శక్తి, అబ్బురపరిచే ఆలోచనా శక్తి మీ మానవులకు మాత్రమే ఉంది! కాదంటావా?", అని అడిగింది.

"నిజమేనేమో.. నాకు తెలియదు!", అన్నాడు సత్యం.

కోతి మాటలను వింటున్న చిలుక, కోతి చెప్పినదానిని సమర్ధిస్తూ, “నాయనా సత్యం! కోతి అంటున్నది అక్షరాలా నిజం! పరులకు ఉపకారం చెయ్యడం, అవసరంలో ఉన్నవారికి సహాయపడటంవంటివి మీ మానవులు చేసినట్లు మేము చేయగలమా? అన్ని సామర్ధ్యాలకూ మించి, ఈ సృష్టికి కారణమైన ఆ భగవంతుడిని తెలుసుకుని, ఆయనని చేరుకోగలిగే అమూల్యమైన శక్తి మానవజన్మకు మాత్రమే ఉంది! ఏ విషయాన్నైనా తెలివిగా శోధించి సాధించే శాస్త్రపరిజ్ఞానం మీ మనుషుల సొంతం! మరి ఆ జ్ఞానానికి మూలం చదువు! బాగా చదువుకుని, దానివల్ల సంపాదించిన జ్ఞానంతో ఈ రోజు మానవుడు తన మేధస్సుకు పదును పెట్టుకుంటూ ఎవ్వరూ ఊహించలేనివి ఎన్నో సాధించాడు! అలాంటి ఒక మానవుడిగా పుట్టిన నువ్వు, పదే పదే ఎందుకూ పనికిరానివాడినని అనుకుంటూ చింతించడం అవివేకమే కదా?”, అంది.

అప్పుడు కోతి, చిలుక సంభాషణను కొనసాగిస్తూ, ”చూడు సత్యం! పెద్దలు పిల్లలను సరైన దారిలో పెట్టేందుకు వారిని అప్పుడప్పుడూ కోప్పడతారు. వారి కోపాన్ని నువ్వు సరిగ్గా అర్ధం చేసుకోవాలి. నిన్ను నువ్వు నిందించుకోవడం ఆపి కొద్దిగా ఆలోచిస్తే సత్యం బోధపడి నీ బాధకు పరిష్కారం నీకే దొరుకుతుంది!", అని చెప్పి చెట్టుపైకెక్కి కనుమరుగైపోయింది. కోతితోపాటే చిలుక కూడా ఎగిరి ఎటో వెళ్ళిపోయింది.

ఆలోచనలో పడ్డాడు సత్యం. అతడికి కోతి చెప్పినదీ, చిలుక అన్నదీ రెండూ సబబుగానే తోచాయి. చెట్టుతో సహా ఇతర ప్రాణులు తమ బలహీనతలను పక్కనపెట్టి, తమకున్న ప్రత్యేక గుణాలను ఉపయోగించుకుంటూ తృప్తిగా, ఆనందంగా కాలం గడపటం సత్యానికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

"అవును నిజమే! నేను అన్నీ చెయ్యగలిగిన సమర్థుడిని. అమ్మ చెప్పినట్లు నేను బాగా చదివి ఈసారి పరీక్షల్లో అందరికన్నా ఎక్కువ మార్కులు సంపాదిస్తా! ప్రకృతి నాకు ఈరోజు మంచి పాఠమే నేర్పింది. అందుకు ప్రతిఫలంగా ఈ ప్రకృతికి మేలు చేసే పనులు ఏమిటో అమ్మనడిగి తెలుసుకుని, వాటిలో నేను చెయ్యగలిగినవన్నీ చేస్తా!!", అని కళ్ళు తుడుచుకుని ఆత్మస్థైర్యంతో ఇంటిదారి పట్టాడు సత్యం.

********

Posted in August 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!