Menu Close
‘చిన్ని ఆశ’
- రాఘవ మాష్టారు -

ప్రభో! అనుమతించవా! ఓ నిమిషం
నీ సరసన కూర్చునే సమయం
నా పనులన్నీ
వాయిదా వేస్తాను ఈ దినం

నీ ముఖం
చూడనీ ఓ క్షణం
ఓ ఎంత గంభీరం
ఎంత మోహనం
ఎంత ఆహ్లాదం
అంతా అనంతం

నిను చూడనిదే
నా హృదయానికి లేదు శాంతి
నా బ్రతుకుకు లేదు క్రాంతి

నా జీవన సముద్ర ప్రయాణంలో
విశ్రాంతిలేని అంతులేని అలసటతో ఉన్నాను
తీరం చేరని ప్రయాణికునిలా
వేగుచుక్కకై ఎదురుచూసే నావికునిలా ఉన్నాను

ఈ రోజు నీతో
నా నిట్టూర్పులు హృదయ ఘోషలు
ఎన్నెన్నో చెప్పాలనుకున్నా...
నా హృదయ కవితా సుమాలతో
నిను సేవించాలనుకున్నా...

ప్రభో! ఇదే సంధ్యా సమయం
నీ లయల హొయల సింగారాల
సింధూర కాంతుల సంజ్ఞలతో
నను మరీ మరీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు

ఈ నిశ్శబ్ద విరామ జీవితానికి
నీతో ఒక్కసారైనా
ముఖాముఖిగా
శాంతంగా... నీప్రక్కన
కూర్చోనీయవూ...

Posted in August 2022, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!