Menu Close
ఆదర్శమూర్తులు
-- డా. మధు బుడమగుంట --
పద్మశ్రీ డా. సుధా మూర్తి
Photo of Dr. Sudha Moorthy

ప్రతి మనిషి పుట్టుకకు ఒక ప్రాయోజిత నిర్దేశాత్మక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని దిగ్విజయంగా అధికమించిన రోజు మానవ జన్మకు నిజమైన సార్థకత చేకూరుతుంది. అయితే అటువంటి ఆలోచనలు, ఆచరణలు అందరికీ సాధ్యం కాదు. అందుకు కృషి, పట్టుదల, పారదర్శక జీవన విధానం, అతీంద్రియమైన సంకల్ప బలం ఉండాలి. కనుకనే అటువంటి లక్ష్యాలను సాధించిన వారిని కారణజన్ములు లేక ఆదర్శమూర్తులు అంటాము.

‘మనసుంటే మార్గముంటుంది’ అని స్వచ్ఛ సంకల్పంతో వేయి విధములైన కార్యాలను అలుపెరుగక, అన్ని పనులను అలవోకగా చేస్తూ, నిత్య సంతోషాన్ని ఆస్వాదిస్తూ, పదిమందికీ పంచుతూ, సకల జనావళి అభ్యున్నతికై పాటుపడిన మానవతా మూర్తి, ‘ఎంత ఎదిగినను, నేను సగటు మనిషినే’  అనే భావనతో అందరితో కలివిడిగా మసలే కారుణ్యమూర్తి, అన్ని సద్గుణ లక్షణాలను తనలో ఇముడ్చుకుని మూర్తీభవించిన చైతన్యమూర్తి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మహిళామూర్తి, పద్మశ్రీ శ్రీమతి సుధా కులకర్ణి మూర్తి నేటి మన ఆదర్శమూర్తి.

Photo of Dr. Sudha Moorthyఆగస్టు 19, 1950 వ సంవత్సరంలో నేటి కర్ణాటక రాష్ట్రం లోని హావేరీ జిల్లా షిగ్గాన్ లో మన సుధామూర్తి గారు జన్మించారు. చిన్నప్పటి నుండి ఉమ్మడి కుటుంబ లోగిలిలో ఎదిగిన సుధామూర్తి, కుటుంబ అనుబంధాల విలువలను ఆకళింపు చేసుకున్నారు. బాల్యం నుండే చదువులో ఎంతో చురుకుగా ఉంటూ అన్ని తరగతులలో ప్రథమ విద్యార్ధినిగా గుర్తింపు పొందారు. ఆ విధానంలోనే సాంకేతిక విద్యనభ్యసించి ఆ తరువాత కంప్యూటర్ సైన్సు లో మాస్టర్స్ డిగ్రీ కూడా పొందారు. నాటి ప్రముఖ ఆటో పరిశ్రమ అయిన టెల్కో సంస్థలో సాంకేతిక నిపుణురాలిగా చేరిన మొట్టమొదటి భారతీయ మహిళ మన సుధామూర్తి గారు. అటుపిమ్మట తన భర్త ఎన్.ఆర్.నారాయణ మూర్తి గారితో కలిసి ఇన్ఫోసిస్ అనే సంస్థను స్థాపించి ఎన్నో వేలమందికి ఉపాధిని కల్పించారు. అంతేకాదు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అనే వ్యవస్థను స్థాపించి ఆ సంస్థద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు.

ఆమె ప్రపంచాన్ని గుర్తించింది కానీ అందరూ తనను గుర్తించాలని తపన పడలేదు. అయితే ప్రపంచమే ఆమెను ఒక వ్యక్తిగా కాక మహోన్నత శక్తిగా గుర్తించి ఆమెను అక్కున చేర్చుకుంది. ఒక రచయితగా, అధ్యాపకురాలిగా, సామాజిక సేవాకర్తగా ఒకటేమిటి ఆమె చేసిన సేవలు అనన్యసామాన్యం. కనుకనే బాలీవుడ్ ప్రముఖుడు శ్రీ అమితాబచ్చన్ వంటి గొప్ప నటుడు ఆమెను ఎంతో మర్యాదగా లేచి నిల్చొని ఆహ్వానించారంటే ఆమె స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడూ ఎటువంటి గర్వపు ఛాయలు కనపడకుండా నవ్వుతూ మసలే ఆమె ఎందరికో స్ఫూర్తి దాత.

2019 సంవత్సరంలో IIT కాన్పూర్ వారు ఆమెను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. తన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థద్వారా వరదలలో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టించడం, పాఠశాలలలో గ్రంధాలయాలు నెలకొల్పడం, అలాగే మరుగుదొడ్డి సదుపాయాలు నిర్మించడం ఇలా లెక్కకు మించి బడుగువర్గాల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడింది. భావి తరాలకు చక్కగా చదువుకుని అభివృద్ధి చెందాలనే తపనతో పిల్లల కొరకు ఎన్నో పధకాలు రచించారు. ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు ఉచితంగా అందించి తద్వారా పేద విద్యార్థులకు కూడా  కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఆసక్తిని కలిగించారు. కనుకనే పురస్కారాలు, అభినందనలు, పేరుప్రఖ్యాతులు అన్నీ ఆమె వద్దకు వచ్చి చేరాయి. 2006 లో పద్మశ్రీ పురస్కారం, మిలీనియుం మహిళా పురస్కారం, ఆర్ కే నారాయణ్ సాహిత్య పురస్కారం ఇలా ఎన్నో ఆమెకు గుర్తింపును తెచ్చాయి. అదేవిధంగా తన బాధ్యతను మరింతగా పెంచాయి. నేటి సామాజిక అంశాలను వస్తువులుగా తీసుకొని ఎన్నో మంచి రచనలు చేశారు.

సుధామూర్తి వంటి మహిళాశక్తి, సామాజిక సేవాకర్తలు ఎంతోమంది ఉన్నారు. తమ సామాజిక పరిస్థితుల పరిధిలో తమ వంతు కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా సమాజ శ్రేయస్సుకై ఎంతో పాటుపడుతున్నారు. కానీ అదృష్టం అందరినీ వరించదు. కొందరికి మాత్రమే వారికి సేవలతో పాటు స్వయం అభివృద్ధి మరియు సమాజంలో ఉన్నత స్థానం గుర్తింపు లభిస్తుంది. అటువంటి కొద్దిమందిలో మన సుధామూర్తి ఒకరు. అయితే ఎంత ఎదిగినను ‘మానవ సేవే మాధవ సేవ’యని గుర్తెరిగి, ఆచరించి, సర్వహిత సమాహారాన్ని సార్థకత తో నిరూపించి మానవీయతను చాటిన మహోన్నత మూర్తి ఆమె. కనుకనే ఆమెను ఆదర్శమూర్తి అని గర్వంగా చెప్పగలము. ఆమె నేటి, రేపటి మహిళలకు వారి సామర్ధ్యాన్ని సదా పెంపొందింపజేసే స్ఫూర్తి. ఆమె ఇలాగే నిత్యసంతోషాలతో మరిన్ని మంచి కార్యాలను తను చేయడమే కాకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచి మనందరిలో సేవాతత్పరతను పెంపొందింపజేయాలని కోరుకుంటున్నాను.

Posted in January 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!