Menu Close
అయ్యరు హోటల్ కమ్ సమాచార కేంద్రం
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం --

బొజ్జ గణపతి, కుర్రకుంక.

మరో రోజు. రోజూ లాగే అయ్యరు హోటల్ కిటకిట లాడుతూ ఉంది. శాస్త్రి గారు తీర్థయాత్రలకు వెళ్లడం మూలాన్న అతని కుర్చీ ఖాళీగా ఉంది. పొట్టి ప్లీడరు ధర్మారావు, మసాలా దోస తింటూ ఫోన్ లో “మేజిస్ట్రేట్  గారు శలవు మీదున్నారు. రేపు కోర్టుకి వస్తారు. ఆయన రాగానే నీకు బెయిలు దొరుకుతుంది. గాభరా పడకు.” అని, ఎవరో ఖైదీకి కాబోలు, అభయమిస్తున్నారు. ఇంతలో, యూనిఫార్మ్ లో నున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్, హోటల్ ఎదురుగా సైకిలు నుండి దిగేరు. సైకిలుకు స్టాండ్ లేక పోవడం వల్ల, దానిని హోటల్ గోడకు జారబెట్టేరు. ఇద్దరూ హోటల్ లోకి అడుగు పెట్టేరు. ఆ ఇద్దరిలో ఒకడు కొత్తగా చేరినట్టున్నాడు. బొజ్జ, ఇంకా అయ్యరు హోటల్ పూరీ లాగ, పొంగి బయటకు రాలేదు. రెండో వాడికి ఖచ్చితంగా అయిదేళ్లకు పైనే సర్వీస్ ఉంటుంది. బొజ్జ పొంగి పొంగి, బెల్టు మీదనుండి క్రిందకు జారిపోతున్నాది. హోటల్ లో ప్రవేశిస్తూనే, బొజ్జ గణపతి “అయ్యా, మీలో ఎవరైనా మోటర్ సైకిలు మీద వెళుతున్న ఇద్దరు, ఈ రోడ్డు మీద వెళ్లడం చూసేరా.” అని అందరకు వినబడేట్టు వాకబు చేసేడు.

“మోటర్ బైకు ఏ కంపెనీది.” అని అడిగేడు, పొంగల్ తింటున్న కాలేజీ స్టూడెంటు గంగిరెడ్డి.

“రాయల్ ఎన్ఫీల్డు బాబూ. మీరు చూసేరా.” బొజ్జ గణపతి ఆతృతగా అడిగేడు.

“లేదు.” గంగిరెడ్డి సమాధానం.

“అయితే, ఏ కంపెనీ అయితే నీకెందుకురా.” అని మెత్తగా మందలించేడు, ప్రక్కనే కూర్చొని, పొంగల్ షేర్ చేస్తున్న, అతగాడి ఫ్రెండు కాంతారావు.

“మోటరు సైకిలు మీద పారిపోతున్న వాళ్ళని సైకిలుతో వెంట బెట్టి, ఎలా పట్టుకొందామని అనుకొంటున్నారయ్యా మీరు.” వేడి కాఫీ తాగే తొందరలో, నాలుక కాల్చుకున్న, రిటైర్డ్ లెక్కల మాస్టర్ నారాయణరావు, సూటి ప్రశ్న.

“సైకిల్ని, మా ఊరినుండి ఇసక లారీలో ఎక్కించి తెచ్చేమండి. దారిలో, ఆరు దఫాలు, ఫెయిల్ అయ్యి, ఇక్కడే, మైలు దూరం కాడ లారీ బ్రేకులు ఫెయిలు అయిపోయినాయండి. ఆ కాడనుండి సైకిలుమీద ఒచ్చినామండి.” లెక్కల మాస్టర్ సంధించిన చిక్కు ప్రశ్నకు, టక్కున సమాధానమిచ్చేడు, బొజ్జ గణపతి.

“మీరు… గిత్తలూరు ఠాణా వాళ్ళు కదూ.” ఇన్సూరెన్స్ ఏజెంటు కూర్మారావు, ఎంక్వైరీ.

“అవును సార్.” కుర్రకుంక, వినయంగా ఇచ్చిన సమాధానం.

“మరి, ఎన్ఫీల్డ్ బైకును వెంటాడుతున్నామంటున్నారు, మీ ఠాణా మోటర్ సైకిలు, హోండా ఏమిటయింది. కిందటి నెలే, దాని ఇన్సూరెన్స్ పాలసీ చేయించేను.”  కూర్మారావు కూపీ.

“ఉన్నాదండి. అదీ.....”  బొజ్జ గణపతి కప్పిపుచ్చుతూ ఏదో చెప్ప బోతూంటే,

“అది మా S.I. గారి బావమరిది గారి దగ్గర…” అని అమాయకంగా, బండారం బయట పెట్టబోతున్న కుర్ర కుంక పాదాన్ని, బొజ్జ గణపతి ఒక నొక్కు నొక్కడంతో, కుర్రకుంక పాదాలు నేలకు అంటుకు పోయాయి. నోరు మూతబడిపోయింది.

“ఆ మోటర్ సైకిలు, మా ఊరి హొమియోపతి డాక్టరు గోవిందరావు గారిదండి. ఆయన ఊరెల్తూ, సేఫుగా ఉంటదని మా ఠాణాలో ఉంచారండి.” బొజ్జ గణపతి వివరించేడు.

ఇడ్లీ, మసాలా దోస, ఉప్మా, తిని, కాఫీ త్రాగుతూ, ఈ సంభాషణ మీద ఓ చెవి పారేసిన పొట్టి ప్లీడరు ధర్మారావు, బొజ్జ గణపతిని దగ్గరగా రమ్మని సౌంజ్ఞ చేసేడు.

సివిల్ వర్క్సులో ఆరితేరి, సివిల్ నాయుడుగా పిలువబడుతున్న, అప్పలనాయుడు వెనుకనే ఉప్మా తింటూ అది గమనించి, “ఆయనకు బైలు అక్కరలేదు సార్.” అని జోక్ వేసేడు.

“నాకు ఆ సంగతి తెలుసు. కానీ, నీకు ఎప్పుడు బైలు అవసరం వచ్చినా, నాకో ఫోను కొట్టు. గంటలో ఇప్పిస్తాను.” తిప్పి కొట్టేడు పొట్టి ప్లీడరు.

ఖాకీ నిక్కర్లు రెండూ, పొట్టి ప్లీడరును సమీపించేయి.

“ఆ మోటర్ సైకిలు మీద ఉన్న వాళ్లలో ఒకడు, వెదురు బొంగు లాగ సన్నగా, పొడుగ్గా, ఉండి, భుజాలదాకా వేలాడుతున్న జుట్టు, నల్ల కళ్ళజోడు, రంగు రంగుల పువ్వులు, ఆకుల డిజైన్లుతో, కుక్క నాలికను పోలిన కాలరున్న షర్టు, వేసుకొన్నవాడేనా.” అని బొజ్జ గణపతిని పూర్తి వివరాలతో ప్రశ్నించేడు, పొట్టి ప్లీడరు.

“అవును సార్. మీకు వాడు తెలుసా సార్.” ఆత్రుతతో అడిగేడు, బొజ్జగణపతి.

“నాకు, తెలియకపోవడం ఏమిటి. వాడు కుమ్మరి వీధి రౌడీ, జగ్గు. పూర్తి పేరు, ఇప్పాటి జగదీసు. కిందటి వారమే, వాడికి బైలు ఇప్పించేను. గత మూడు నెలల్లో, నాలుగు మార్లు, బైలు మీద బయటకొచ్చేడు. వాళ్లిద్దరూ ఇక్కడకొచ్చి, మస్తుగా టిఫిన్ చేసి, టీ తాగి, చెక్కేసారు.”

“ఎక్కడుంటాది సార్, కుమ్మరీధి.” కుర్రకుంక వినయంగా అడిగేడు.

“నా దగ్గరున్న వాడి ఎడ్రస్ లో రాసి ఉంది తప్ప, నాకు అదెక్కడుందో తెలీదు.”  పొట్టి ప్లీడరు తన నిస్సహాయత తెలియజేసేడు.

“ఇదిగో పోలీసయ్యా, నాకు తెలుసు. నే సెబుతా.” అని, తరచూ ఆ హోటల్ లో అతిథి సత్కారాలు పొందుతున్న, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ గారి ప్యూను రామకోటి, ఇలా వివరించేడు.

“ఇట్టా కుడిసేతి దిక్కు ఎల్తుంటే, అమ్మోరి దేవాలయం అగుబడద్ది. దానికి నే..రుగ ఎల్తుంటే, కుడిసేతి దిక్కు,.. కాదు కాదు, ఎడంసేతి దిక్కు, ఒకటి.. రెండు.. మూడో సందు దాటగానే ఒత్తది, కుమ్మరీది.”

“తేంక్స్ అయ్యా. ఓకీలు గారండీ, సేన తేంక్స్. వత్తామ్ సార్.”

ఇద్దరు పోలీసులూ, హోటల్ బయటకు వచ్చి, సైకిలు కోసం చూసేరు. ఉంటేగా, కనబడడానికి. ఇద్దరూ హతాశులయ్యేరు. గాభరాతో అక్కడున్నవాళ్ళని, “ఈ గోడ కాడ, మా సైకిలు ఉంచినాము. అగుబడడం నేదు. మీరు సూసినారేటి.” అని బొజ్జ గణపతి అక్కడ ఉన్న ఒక్కొక్కరిని వాకబు చేస్తూంటే, అప్పుడే హోటల్ లోనికి ప్రవేశించబోతున్న, దర్జీ కొండలరావు, “ఇద్దరు ఆసామీలు, ఓ సైకిల్ని బుజాలమీదేసుకొని, సేన తొందరగ ఎల్తుంటే, దారిలో సూసేను. అతగాళ్ళని అడిగినాను. ఏటయింది, సైకిలుకని. పంచరయినాదని సెప్పేరు.”

“ఎటు దిక్కు ఎలుతుండేవారేటి.” ఆతృతగా కుర్రకుంక ప్రశ్న.

“నాకది తెల్దు. నేనిటు ఒచ్చినాను. ఆల్లు అటెల్లినారు.” అని ఆఖరి దశలో ఉన్న, కాలుస్తున్న సిగరెట్టును, మరొక్క దమ్ము లాగి, నేలపై రాల్చి, కుడి పాదంతో దానిని చిత్రవధ చేసి, అయ్యరు ఆలయంలోనికి అడుగు పెట్టేడు, దర్జీ కొండలరావు.

“వడివడిగా సైకిలు రిపేరు షాపు కాడకెళ్లండి. దొంగనాయేలలు దొరికిపోతారు.” హోటలులోకి వస్తూ, ఈ సంభాషణలన్నీ వింటున్న చింతపండు వ్యాపారి అప్పలసామి, తాగుతున్న చుట్టను గోడకు రాసి, ఆర్పి, చెవికి దోపి, హోటల్ లో ప్రవేశిస్తూ, తన వంతు సలహా ఇచ్చేడు. ఇద్దరు పోలీసులూ అయోమయంలో పడ్డారు. ఆలోచించి, ఆలోచించి, ఓ నిర్ణయానికి వచ్చేరు. కుర్రకుంక, సైకిలు దొంగని పట్టుకోడానికి, బొజ్జ గణపతి, కుమ్మరి వీధి వెళ్లి జగ్గు గాడిని కలియడానికి. ఇద్దరూ చెరో దిక్కు పయనమయ్యేరు. తరువాత ఏమిటయిందో ఆ భగవంతుడికే తెలియాలి.

స్కోరు ఎంత; అదనంగా మరో వంద.

ఇంకో రోజు. ఆ సమయంలో, అయ్యరు హోటల్ లో కుర్రాళ్ళ రద్దీ ఎక్కువగా ఉంది. కారణం, హోటల్ లో ఈ మధ్యనే అమర్చబడ్డ టీ.వీ. లో క్రికెట్ మేచ్, ప్రత్యక్ష ప్రసారమవుతోంది. వీరవిహారం చేస్తున్న, కొహ్లీ ఖాతాలో తొంభై ఆరు చేరేయి. తరువాతి బంతిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాడు. సెంచరీ చేస్తాడా? అవుటయిపోతాడా? కుర్రాళ్లందరికీ ఒకటే టెన్షను. ఎవరు నమ్మిన దేముళ్ళను, వారు మ్రొక్కుకొంటున్నారు. బౌలరు, లెగ్ బ్రేక్ సంధించేడు. కొహ్లీ డేగ కళ్ళతో అది పసిగట్టి, చిరుత పులిలా, క్రీజు లో నుండి బయటకు వచ్చి, కసి తీరా ఒక్క దెబ్బతో, బంతికి  స్క్వేర్ లెగ్ దిశగా, గగన యానం చేయించేడు. బంతి గాలిలో, ముందుకు పోతోంది. కుర్రాళ్లందరూ, బాలు, బౌండరీ ఆవతల, నేల రాలాలని, జ్ఞాపకమొచ్చిన దేముళ్ళందరకు మ్రొక్కుకొంటున్నారు. మైదానంలో, ఇద్దరు ఆటగాళ్లు, ఆకాశం వైపు చూస్తూ, గాలిలో ఉన్న ఆ బంతి మీదే దృష్టి కేంద్రీకరించి, అది భూపతనం కాకుండా పట్టుకొనే ప్రయత్నంలో, ఒకరినొకరు గుద్దుకొని, ఇద్దరూ, నేల  వ్రాలేరు. హమ్మయ్య, బంతి వేటగాడు కొట్టిన పక్షిలా, నేరుగా  ప్రేక్షకుల మధ్య రాలిపోయింది. ఆరు పరుగులని తెలియజేస్తూ, అంపైరు, రెండు చేతులూ మీదకు ఎత్తేడు. కొహ్లీ ఖాతాలో మరో శతకం. చప్పట్లు, ఈలలతో, హోటల్ దద్దరిల్లింది. కిచెనులో దోశలు వేస్తున్న కేశవరావు, తొందరగా బయటకు వచ్చి, స్కోరు తెలుసుకొని, మళ్ళీ పెనం దగ్గరకు పరుగు తీసేడు. వీధిలో, తోపుడు బండి మీద కూరలమ్ముతున్న, ఎల్లాజీ, హోటల్ ముందు బండిని ఆపి, పరుగున హోటల్ లోకి వచ్చి, “మనోళ్ళా సార్, బేటింగ్.” అని, స్కోరు తెలుసుకొని, కోహ్లీ సెంచరీ చేసేడని విని, “అతగాడు, బేటు ఒట్టుకుంటే, ఓ అంద సేస్తేగాని, బేటు ఒగ్గడండి.” అంటూ, తొందరగా తన బండిని చేరి, “వంకాయలు, బెండకాయలు” అని కేకేసుకొంటూ ముందుకు సాగేడు. దారిన పోతున్న పని పిల్ల పోలి, ఆంజనేయస్వామి ఆలయంలో పూజారి శేషాచలం గారున్నూ, ఓ మారు హోటల్ గుమ్మం దాక వచ్చి, స్కోరు తెలుసుకొని మరీ వెళ్ళేరు.

క్రికెట్ ఆటగాళ్లకు భోజన విరామం. హోటల్ లోని కుర్రాళ్లందరూ, ఎవరికి కావలసినివి వారు, సెర్వర్లకు తెలియజేస్తున్నారు. ఆ సమయంలో, హోటల్ కు ఎదురుగా ఒక రెండెడ్ల బండి ఆగింది. ఎవరివో, ఒక కొత్త డైనింగు సెట్టు మోసుకెళ్తున్నాది. బండి తోలుతున్న సింహాద్రి, హోటల్ లోనికి వచ్చేడు. చేతిలో ఎవరిదో ఎడ్రస్ రాసి ఉన్న కాగితం ఉంది. ఆర్డర్ ఇచ్చిన దోస కోసం ఎదురు చూస్తున్న కృష్ణమూర్తికి దగ్గరగా చేరి, “అయ్యగారండి, ఈ అడ్రసుకు ఎట్టా ఎల్లాలండి.” అని వినయంగా అడిగేడు.

“నువ్వు ఎక్కడినుండి వస్తున్నావ్.” అని అడిగేడు, చేనేత వస్త్రాలయం ఓనరు, కృష్ణమూర్తి.

“కొత్తూరునుండి అయ్యగారు.”

“కొత్తూరునుండా, అయితే నువ్వు ఈ ఎడ్రస్ దాటే, వచ్చేవు.” కృష్ణమూర్తి, నిర్ధారణ చేసేడు.

“అదేటండి అయ్యగారు. దారెంబడి సూసుకొంటూ ఒచ్చినాను.”

“విను. దారిలో నీకు, ఇటికల బట్టీ కనిపించిందా.”

“అగుబడ్డదండి.”

“అది దాటేక రెండు పే..ద్ద ఈత చెట్లు చూసేవా.”

“ఆటికోసమే, ఎ తుక్కొం... టూ, ఇక్కడి దాక ఒచ్చినానండి అయ్యగారు.”

“వాటిని ఎప్పుడో దాటి వచ్చేసేవు.” కృష్ణమూర్తి, నిర్ధారణ చేసేడు.

“నాకు అవి అగుబడలేదండి అయ్యగారు.” దీనంగా అన్నాడు, సింహాద్రి.

“ఎలా కనిపిస్తాయ్. అవి ఉంటేగా, కనిపించడానికి.” అన్నాడు, కాఫీ త్రాగుతూ వెటకారంగా ఓ నవ్వు నవ్వుతూ ఈ సంభాషణ వైపు ఓ చెవి పారేసిన, రిటైర్డ్ తాసీల్దారు నారాయణస్వామి.

“ఏమిటయింది వాటికి. మొన్ననే సంత నుండి వస్తూ చూసేను.” కృష్ణమూర్తి అనుమానంతో ప్రశ్న.

“నిన్ననే, మాజీ ఎం.ఎల్.ఎ. గారి బావ మరిది వెంకటరెడ్డి, తన పొలాల్లో కొత్తగా తీయించిన బావికి, ఏతం వేయించడానికి, ఆ రెండింటిని కొట్టించి, తన పొలానికి మోయించుకు పోయేడు. నేనలా వెళ్తూ చూసేను. అక్కడ గొడవ కూడా ఏదో అవుతూండేది.” నారాయణస్వామి స్పస్టీకరణ.

దగ్గరలోనే, ఇడ్లీ వడ తింటూ, అది విన్న కోటయ్యదొర, “అదేటి, ఆ రెండు సెట్లు, నా పొలాల్లోవి. ఆడెలా ఒట్టుకుపోయేడు. ఆ దొంగ సచ్చినోడికి మరి బుద్ది నాదు. మొన్నాదోరంనాడు, ఈరాసామితో గొడవెట్టుకొంటే, ఆడిని, సితా…క బాదినాడు, ఈరాసామి. ఇప్పుడే ఎల్తా. కుమ్మరీదికెల్లి, జగ్గుగాన్ని ఒట్టుకెల్తా. ఆడి బాబు గాడి సెట్లనుకొన్నాడేటి.” కోటయ్య కోపగించుకొన్నాడు.

మసాలా దోస ఆర్డర్, కేన్సిల్ చేసి, తిన్న దానికి బిల్లు తొందరగా చెల్లించి, హోటల్ పైన పార్కు చేసిన స్కూటీ ఎక్కి, కుమ్మరి వీధికి వెళ్ళేడు, కోటయ్యదొర.

కృష్ణమూర్తి, సింహాద్రికి ఆ ఎడ్రసుకు ఎలా చేరుకోవాలో, బోధపరచి చెప్పేడు. సింహాద్రి బండీ వెనక్కు మళ్లింది.

మరో రెండు రోజుల తరువాత, అయ్యరు హోటల్ లో, శాస్త్రిగారు కొలువు తీర్చి కూర్చున్నారు. కోటయ్య దొర, సివిల్ నాయుడు, ఏదో మాట్లాడుకొంటూ హోటల్ లోకి వచ్చేరు. ఇద్దరూ శాస్త్రిగారికి నమస్కరించి, ఆయనకు దగ్గరలో కూర్చోగానే, సెర్వర్ వారి దరి చేరి ఆర్డర్లు తీసుకొన్నాడు. శాస్త్రిగారు, కోటయ్య దొరనుద్దేశించి “కోటయ్యా, ఏమిటయింది నీ ఈత చెట్ల వ్యవహారం.” అని చిరునవ్వుతో అడిగేరు.

“జగ్గుగాడు, నేను, ఆ యెంకట్రెడ్డి గాడి పొలానికెల్లినామండి. జగ్గుగాడ్ని సూడగానే, ఆడికి ఒల్లంతా, సమట్లు కమ్మేసాయండి. నా ఈత సెట్లు, నువ్వెట్టా కొట్టింసుకొచ్చినావని, గట్టిగ అడిగినానండి. ఆడేదో పెద్ద కబుల్లు సెప్పబోయేడండి. జగ్గుగాడు ఆడి కాలరు ఒట్టుకోంగానే, కాల్ల బేరానికొస్సినాడండి. ఆడెప్పుడంతేనండి. నిలుసుంటే కలబడతాడండి. కలబడితే పరుగులెడతాడండి. ఆడి కాడ జగ్గుగాడు ఏడొందలు ఒసూలు సేసి, ఆడో ఒన్ద ఒట్టిపెట్టుకొని, నాకారొందలు ఇస్సినాడండి.”

“పోనీ, నీ ఈత చెట్లు అమ్మకమయిపోయేయిగదా.” అన్నారు, శాస్త్రిగారు.

“ఆటికి అయిదొందలే బేరముండేదండి.”

“మరేం. అదనంగా మరో వంద వచ్చేయన్నమాట.”

(సశేషం)

Posted in January 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!