Menu Close
Muggulu-AR

సంక్రాంతిరోజుల్లో ఇళ్ళముందు రంగురంగుల రంగవల్లులు తీర్చి దిద్దడం మన భారతీయ మహిళలకు అనువంశీకంగా వస్తున్న సంప్రదాయం! ముఖ్యంగా గ్రామీణయువతులు, బాలికలు, రకరకాల రంగురంగుల ముగ్గులు వేయడంలో అతిశ్రద్ధతో పాటు పోటీ కూడా పడతారు. గజగజలాడే ఎముకలు కొరికే చలిలో సైతం తెల్లవారుఝామునే సంక్రాంతి పర్వదినాల్లో నిద్ర లేచి ముంగిళ్ళముందు ముగ్గులు పెడతారు.

muggu

సంక్రాంతి అందం అసలు ముగ్గుల్లోనే ఉంది. పసుపు, కుంకుమలతో, పూలతో అలంకరించిన గొబ్బిళ్ళను, వేసిన ముగ్గుల మధ్యలో పెట్టి, వాటికి అక్షింతలు జల్లి పూజ చేస్తారు. ముగ్గుల మధ్యలో మూడు గొబ్బిళ్ళు పెడతారు. ఈ మూడు గొబ్బిళ్ళు ఒకటి గోపాలస్వామికి, మరొకటి గోవుకు, ఇంకొకటి గోవర్ధనగిరికి చిహ్నంగా భావించి, వాటిని పూజలతో ఆరాధిస్తారు.

అసలు ముగ్గులపుట్టుక గురించి ఒక జానపదకథ మనకు బహుళప్రాచుర్యంలో ఉంది. ఈ సంక్రాంతి పర్వదినాల్లో ఆ కథని ఒకసారి గుర్తు చేసుకోవడం ఎంతో సమంజసం.

ఒకానొక రాజుగారి వద్ద ఒక రాజగురువు ఉండేవాడు. ఆ రాజగురువుకు లేకలేక ఒక బాలుడు జన్మించాడు. విధివశాత్తున ఒక రోజున ఆ బాలుడు అకాలమరణం చెందాడు. యావత్తు రాజ్యం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆ బాలుని తిరిగి బ్రతికించమని రాజ్యంలోని ప్రజలు బ్రహ్మదేవుని ప్ర్రార్థించారు. బ్రహ్మ ఆ ప్రజల మొర ఆలకించి, ఆ బాలుడి స్వరూపాన్ని నేలపై చిత్రించమని ప్రజలను ఆదేశించాడు. బ్రహ్మదేవుని ఆదేశానుసారం, ప్రజలు ఆ బాలుని స్వరూపాన్ని నేలపై చిత్రించిన మరుక్షణమే ఆ బాలుడు తిరిగి ప్రాణాలతో లేచి కూర్చున్నాడు. అప్పటినుంచే నేల మీద బొమ్మలు గీయడం, రంగవల్లులు చిత్రించడం ఆరంభమై ప్రాచుర్యంలోకి వచ్చిందని ఆ జానపదకథ చాటుతోంది.

పండుగ పబ్బాలప్పుడే గాక ప్రతినిత్యం ఇళ్ళముందు కళ్ళాపి జల్లి ముగ్గులు వేసుకోవడం మనకి పరిపాటి అయిపోయింది. ఇంటిముందు ముగ్గు ఉంటే అతిథి, అభ్యాగతులకే కాక లక్ష్మీదేవికి సైతం అది స్వాగతం పలుకుతుందని మనపెద్దల ఉవాచ.

mugguరంగవల్లులలో కన్పించే రంగులు కూడా అంతర్గతంగా గొప్పభావానికి అద్దంపడతాయి. మనం ఉపయోగించే ముగ్గుపిండి తెలుపు. అది స్వచ్చతకు, శాంతికి చిహ్నం. అలాగే ముగ్గుపిండి తయారీకి ఉపయోగించే బియ్యం సాక్షాత్తు అన్నపూర్ణస్వరూపం. మన పురోభివృద్ధికి సంకేతం! కొన్ని ముగ్గుల మధ్య పసుపు, కొన్ని ముగ్గుగీతల నడుమ కుంకుమ జల్లుతారు. అవి శుభానికి, పవిత్రతకు చిహ్నాలేకదా.

ఇక ముగ్గుల్లో మనం వేసే చుక్కలూ, గీతలూ భగవంతునికి ప్రతీకలుగా చెప్తారు.

సమబాహు త్రిభుజాకారం ముగ్గు విష్ణుమూర్తికి, తిరగబడిన త్రిభుజం శివునికి, పరస్పరం ఖండించుకుపోయే రేఖలు బ్రహ్మదేవునికి, సంకేతాలుగా గణుతికెక్కాయి. మధ్యప్రదేశీయులు “రంగోళీ”, తమిళులు “కోలమ్”, బెంగాలీలు “అల్పన”, గుజరాతీలు “సాధియా”, రాజస్థానీయులు “మందన” – ఇలా రకరకాల పేర్లతో రంగవల్లులను వాకిళ్ళముందు తీర్చి దిద్దుతారు. సంక్రాంతి సంబరాలకి ముగింపు రథంముగ్గు. రథంముగ్గు వేసి త్రిమూర్తులకు వీడ్కోలు పలుకుతారు.

నేటి నవనాగరికకాలంలో అతిప్రాచీనము, అద్భుత కళారూపాలైన ముగ్గులు కేవలం పల్లెటూళ్ళకే పరిమితమై పోయాయి. నగరవాసుల శాతం ఎక్కువవుతున్నకొద్దీ, నివాసాల వైశాల్యం కూడా కుంచించుకుపోతోంది. ఫ్లాట్స్ లో ఉండేవాళ్లు ముగ్గులు పెట్టే వీలులేక రెడీమేడ్ ప్లాస్టిక్ ముగ్గుల స్టిక్కర్లు ఇళ్ళల్లో అతికిస్తున్నారు.

సంక్రాంతి వంటి పండుగరోజైనా తమ ముంగిట ముగ్గులు తీర్చిదిద్దితే, మన సంస్కృతి మరికొంతకాలం పాటు కొనసాగుతుంది.

--O--O--

Posted in January 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!