Menu Close
Galpika-pagetitle

గిరి స్కూల్ -- కైలాసనాథ్

కురవగేరికి, బలిజగేరికి,
బాపనగేరికి కలిపి  ఒకే ఒక్క ఎలిమెంటరీ స్కూల్
బాపనగేరిలోని గిరి స్కూల్..
అరవైలలో ఎందరో పిల్లలను
అక్కున చేర్చుకున్న
చదువులతల్లి వొడి గిరి స్కూల్ ...

వీధి మధ్యలో ఏ హంగు లేకుండా
సాదాసీదా ఇల్లులా కనిపించేది,
ఎప్పటిదో చాలా పాతబడ్డ
మధ్వుల ఇల్లే గిరి స్కూల్.

చిన్నమెట్లెక్కితే వరండా,
వరండాలోనే ఒకటో క్లాసు
ఒకటో క్లాసు అయివారు రాజారావు
నాలుగున్నర అడుగుల ఎత్తు
చూడగానే నవ్వు పిల్లలకు ..
సారు నోరు తెరిస్తేచాలు
తిట్ల పంచాంగం వల్లించేవాడు
మాసిన గడ్డము తెల్లచొక్కా
కాళ్ళ పైకి మడిచిన అడ్డపంచితో
బొంగురు గొంతుతో
స్వాగతం చెప్పేవాడు స్కులులోనికి ...

వరండా దాటుకొని వెళితే
ఎడమవైపు చిన్న హలు
అందులో హెడ్మాస్టరు కృష్ణమూర్తి
నల్లగా, తెల్ల జిబ్బా పుల్ పంచితో
అస్తమానమూ లవంగాలు నములుతూ
చేతిలో బెత్తంతో వుండేవాడు
కుడివైపున చిన్న నీళ్ళబావి
ఇటు స్కూలు కు అటుపక్క
బాపనయ్యవారు అయోదనాచారి
ఇంటికీ ఉమ్మడిగా వుండేది
అయ్యవారి అసలు పేరు హయవదనాచార్యులు
జనం నోళ్ళల్లో అది అయోదనాచారిఅయింది ...

అదిదాటితే చిన్న నడవ
తరవాత చిన్నహలులాంటి గది
పగలే చీకటితాండవించేది ఒకే కిటికీతో
అది రెండవ క్లాసు గది
శకుంతలమ్మ టీచరుండేది
తెల్లటి తెలుపుతో చూడగానే
చాలాతెలివిగల వర్చస్సుతో వుండేది ...

ఆది దాటుకొని ముందుకెళితే
విశాలమైన హలు రెండు భాగాలు
ఒకవైపు అయిదు బి సెక్షను
ఇంకో వైపు మూడవ క్లాసు
సగానికి పైకప్పులేకుండా
ఆకాశం కనిపిస్తూ వుండేది
అందులో గోడవారగా చిన్న కానుగ చెట్టు
నాగన్న అయివారు దాన్నిపట్టుకొని
మిద్ది పైకి వెళ్ళేవాడు  టార్జాన్ లా
మాకందరికీ విస్మయం
ఎప్పుడెప్పుడు పైకి ఎగురుతాడా అని
ఎదురుచూసేవాళ్ళం ...

హెడ్మాస్టరు రూంలోనుండి పైకి మెట్లు
పైకి వెళితే  మెుదటిరూములో నాలుగవ క్లాసు
క్లాసుటీచరు కృష్ణమ్మ
తెల్లగా లావుగా చేతికి బంగారు గాజులతో
చూడగానే దండంపెట్టాలనిపించేటట్లుండేది..
ఆ గది దాటితే పైకప్పు పెంకులతో
గోడలు లేకుండా పెద్ద హలు
చుట్టూవున్న మిద్దెలన్నీ కనిపించేవి
అక్కడ నాలుగవ క్లాసు ..లక్మీకాంతయ్యసారు
మంచితనం రూపుకట్టినట్లుండేవారు ..

మధ్యాహ్నం నాలుగు గంటలయితేసాలు
పంచఎగగట్టి నాగన్నసారు రంగంలోకి దిగేవాడు
ప్రభుత్వ ఉచిత పాలపొడి పాలు కలిపేకి ...
పెద్దపెద్ద కాగులనిండా నీళ్ళు నింపి
అట్టపెట్టల్లోని పాలపొడి నీళ్ళల్లో కలిపి
ముద్దల్ని నలిపి, చిక్కటి పాలు చేసి
తలాఒకమగ్గు పోసేవాడు
అది నిజంగా క్షీరసాగరమథనం లో
అమృతాన్నిపంచే దృశ్యంలా వుండేది ...

చిన్ననాటి చెలికాండ్రు  ఒకరా ఇద్దరా
బాపనోల్ల పిల్లలు ,శూద్రుల పిల్లలు కలిసి
విరబూసిన నందనవనం ...

లక్మణ్ణగాడు, ముసిలిగాడు
కదిరెప్ప, శీనాగాడు
అప్పటికే మగోళ్ళలా కనిపించే వారు మా కంటికి
వాళ్ళ ముందు నేను, నరసింహులు
ప్రసాదు, పాండాచారి, కృష్ణమాచారి
ప్రభాకరరావు నలుసులుగా కనిపించేవాళ్ళం ...

బుర్రమోద్గీన్ గానికి కాలికి మెుద్దేసి
కూచోపెట్టేవాళ్ళు... అదో వింత
వెంకట్రరమణప్ప గాడు పొప్పులుతిని
బాంబులేస్తుంటే... క్లాసుమెుత్తం
అయివారుతోసహ అదిరిపోయేవాళ్ళం ...

ఎంగటేశులుగాడు,పోతుగాడు
అగ్గిపెట్టెలో జీరంగి పురుగులు
అవితినే ఆకుతోసహ తీసుకొచ్చేవాళ్ళు
క్లాసుజరుగుతాంటే అయ్య వారికి కనపడకుండా
మా కందరి కీ చూపించేవాళ్ళు
అగ్గిపెట్టెతెరిచి జీరంగిని చేతులోకి తీసుకొని
ఎర్రబొబ్బిలిగాడు గూ...గూ...అంటూ వూదితే
అవికదిలేవి.. మాకు అదో ఆనందం
వాళ్ళు మా పాలిట మాయలమరాఠీలు...

అయివారమ్మగార్లు
కడిగిన ముత్యంలా వుండే వాళ్ళు
పిల్లలు దేవత పాదాలముందు
పూవుల్లా వుండేవాళ్ళు ...

ఎన్నో తరాల పిల్లలకు  జ్ఞాపక స్తంభం
గిరి స్కూల్ ...
మా బతుకు బాటలో తొలి గుడి
గిరి స్కూల్....

వంటిం(తి)టి కథ 4 -- కాసాల గౌరీ

"వచ్చావా తల్లి రా నీ కోసమే చూస్తున్నాను" వంటింట్లో కవరులో నుంచి వంకాయలు తీసి పెడుతూ అంది జయంతి.

"సారీ అక్క ఇవాళ మధ్యాహ్నం పోస్టులో పాఠ్యపుస్తకాలు వచ్చాయి అవి చూస్తూ ఉండిపోయాను.”

"ఇంకా ఏం పాఠాలు తల్లీ ఏవో రెండు ఎమ్మే లు ఉన్నాయి కదా”

"అవునక్కా నిజం చెప్పాలంటే నాకు చాలా సబ్జెక్ట్లు ఇష్టం. ఇప్పుడు జాబ్ లో చేరడానికి కొంచెం టైం ఉంది కదా...తెలుగు సాహిత్యం చదువుదామని ఓపెన్ యూనివర్సిటీ కట్టాను. మహాభారతంలో తిక్కన రాయబారం భాగం చదువుతూ ఉండిపోయాను. అసలు తిక్కన ఎంత రాజనీతిజ్ఞుడక్కా..” ఉత్సాహంగా తను చదివినది చెప్పబోయింది.

"ఉండు ముందు ఒక్క విషయం చెప్పు... తర్వాత నువ్వు చెప్పిందంతా వింటాను. ఇవాళ రాత్రి అత్త గారు మామ గారు ఏమీ తినరు. మీ బావగారు వంశీ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నారు కదా. ఇంక రాత్రి తిండికి మనమిద్దరమే. నిన్ననే విసిరిన కంది గుండ ఉంది కదా. వంకాయ పచ్చి పులుసు చేస్తాను సరిపోతుందా?”

“ఓ బ్రహ్మాండంగా...”

“అమ్మయ్య బతికించావు తల్లీ.. ఈ ప్రశ్న అడగటానికి ఎంతసేపు ఆలోచించానో...ఏం మనం మనుషులం కదా మగవాళ్లు తినకపోతే మనకు కూర అక్కర్లేదా.... అని లెక్చర్ పీకుతావ్ ఏమో అని భయం వేసింది” అంది నవ్వుతూ.

“ఆ మాట నూటికి నూరుపాళ్ళు నిజం అక్కా. ఏ  విషయంలోనూ మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే కొత్త కంది గుండ ఒక్క వాయ కలిపితే సరిపోదు. అందుకని ఆ ఒక్క ఐటమే ఉంటే తృప్తిగా లాగించేయొచ్చు. అసలు నాకైతే పచ్చిపులుసు కూడా అక్కర్లేదు. సరికి సరి నెయ్యి వేసుకుని పచ్చి ఉల్లిపాయ నంచుకుని తింటే ఉంటుందీ.......” చేతులు తల ఊపుతూ నాటకీయంగా అంది.

“నెయ్యా... మేము మంచి నూనె  వేసుకుంటాం....సర్లే.... ఎవరి అలవాటు వాళ్ళది..అయితే.. ఇవాళ సాయంత్రం వంట  లేదు..”

"అయితే రా పెరట్లో కూచుని హాయిగా కబుర్లు చెప్పుకుందాం."

"నువ్వు పద నేను టమాటా పచ్చడి తిరగ కలిపి వచ్చేస్తాను."

“ఏదో ఒక పని పెట్టుకోక పోతే నీకు తోచదు కదా...”మురిపెంగానే  విసుక్కుంటూ పెరట్లోకి నడిచింది కమల.

పెరట్లో కి అడుగుపెట్టగానే మంత్ర ముగ్ధురాలి లాగా ఆగిపోయింది. పెరడంతా శుభ్రంగా ఎక్కడ ఒక ఆకు ముక్క కూడా లేకుండా క్లీన్ గా వుంది. గోడ పక్కనే పూలతొట్టెలు...  ప్రార్థన కోసం లైన్ లో నిల్చున్న బుడతల లాగా వున్నాయి. మరువం దవనం మీద నుంచి వస్తున్న సువాసన తో  కూడిన గాలి..సూర్యుడు అప్పుడే అస్తమించడం తో లేలేతగా పరచుకుంటున్న చీకటి. హనీమూన్లో వంశీతో వెళ్ళిన కాండిల్ లైట్ డిన్నర్ వాతావరణం జ్ఞాపకం వచ్చింది కమలకి. అరుగు మీద రెండు కాళ్లు పైకి మడత వేసుకుని పమిట కొంగు నిండుగా కప్పుకొని అలా చూస్తూ  ఉండిపోయింది. పని ముగించుకుని పెరట్లోకి  వచ్చిన జయంతి నిశ్శబ్దంగా తోడికోడలు పక్కన  కూర్చుంది.

కమల కళ్ళు మూసుకుని జయంతి భుజం పై తల వాల్చింది....  జయంతి ఆప్యాయంగా కమల చెంప మీద చేయి వేసింది. మాటలకందని భావంతో, ప్రకృతితో ఊసులాడు కుంటూ అలా ఎంత సేపు ఉండి పోయారో....డబ్ మన శబ్దంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. పక్కింటి గోడ మీద నించి చెత్త పడింది.

వెంటనే పక్కింటి ఆవిడ గోడ మీంచి తొంగి చూస్తూ "సారీ అండీ... గోడ మీద పెట్టబోతే పొరపాటున కింద పడింది" అంది. "సారీ" అన్నప్పుడు సాధ్యమైనంతగా నోటిని సాగదీస్తూ....

తపోభంగం అయినా మునిలా  కమల కి  సర్రున  కోపం వచ్చింది.

"సారీ ఏంటండీ ఆ మాత్రం బుద్ధి ఉండాలి" అంటూ గోడ దగ్గరికి దూసుకెళ్లి పోయింది.

జయంతి గాభరాగా ముందుకు వెళ్లి కమల చేయి పట్టుకొని.. "కమలా...వద్దు... నా మాట విను” అంటూ వంటింట్లోకి లాక్కొచ్చి  తలుపులు వేసేసింది.

“ఏంటక్కా నీ పిరికితనం? అందరి దగ్గర ఒదిగి ఉండటమే నా నీ పని” అంది విసురుగా.

“కాదే తల్లీ ఆవిడ నోటి ముందు ఎవరు నిలవలేరు.”

“ఏంటిట ఆవిడ నోరు నేను చాలా పోటీల్లో బహుమతులు తెచ్చుకున్నాను.  వాగటం బానే వచ్చు.” అంటూ పెరటి వైపు వెళ్ళబోయింది.

“అబ్బా.. ఉష్.. కమలా దయచేసి నేను చెప్పేది విను...”

ఎప్పుడూ లేనిది జయంతి గొంతులో కొంత గద్దింపు వినబడి కమల ఆగిపోయింది.

"ఒకసారి ఆవిడతో తగువు పెట్టుకున్నందుకు నాకు బాగా బుద్ధి వచ్చింది. నిలువునా పరువు తీసేసింది. ఆవిడకి బద్ధకం అనిపించినప్పుడు చెత్త తీసి ఇలా మన ఇంట్లో పడేస్తూ ఉంటుంది. ఆవిడకి పనిమనిషి లేదు...., ఒకసారి ఇలాగే కావాలని చెత్త పడేస్తూ నాకు దొరికిపోయింది. ఒళ్ళు మండి చెడామడా తిట్టేశాను.. చిన్న సైజు యుద్ధమే జరిగింది నాకు ఆవిడకి..అయితే అది అంతటితో ఆగిపోలేదు.

ఏదో పని పెట్టుకుని బ్యాంకుకు వెళ్లి అక్కడ ఉన్న మీ బావ గారితో... "మీ ఆవిడకి బుద్ధి చెప్పు అన్నట్టు" అందరి ముందు మాట్లాడింది. మర్నాడు మామగారు ఆఫీస్కి వెళ్ళే ముందు అడ్డుకుని... ‘ఊర్లో మీరు ఎంత పెద్ద వారు. ఎంత నెమ్మదైన వారు. అలాంటి గయ్యాళి తనాన్ని ఎలా భరిస్తున్నారు’. అందిట.

మామ గారికి ఆవిడ సంగతి తెలుసు కాబట్టి... ‘కోడల్ని ఆవిడితో ఏవి పెట్టుకోవద్దను. బురద మీద రాయి వేసినట్టే...’అన్నారు. ఆవిడ ఆగడాన్ని మనమే పెంచి పోషిస్తున్నాము అని నీకు అనిపించవచ్చు కమలా కానీ కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి అన్నారు మన పెద్దవారు. అందులో ఇలాంటి వాళ్లతో తల పడ్డామంటే అన్నిటికీ సిద్ధపడాలి. లేదా వాళ్లతో మంచిగా సామరస్యంగా ఉండటమే మేలు.”

కమలకి జయంతి మాటలు వింటుంటే మధ్యాహ్నం తను చదివిన *వచ్చిన వాడు ఫల్గునుడు*...రాయబారం ఘట్టం లోని తిక్కన పద్యం జ్ఞాపకం వచ్చింది.(శత్రువు మనకన్నా బలమైన వాడు అని తెలిసినప్పుడు సంధి చేసుకోవటమే మేలు అంటాడు)

ఇంకేం అనకుండా జయంతి వైపు మెచ్చుకోలుగా చూస్తూ  .."అటులనే సోదరి అంటూ తన  చెవులు పట్టుకుంది...మన్నింంపు కోరుతున్నట్టు..

చెల్లింపు -- శ్రీముఖి

నేనూ, నాభార్య రాజమండ్రి నుండి వైజాగ్ వెళుతున్నాం బస్ లో. ఒకచోట బస్సాగింది. కాయలు, పళ్ళు అమ్మే వాళ్ళు వచ్చారు.

"ఏమండీ...జామకాయలు బాగున్నాయి...తీసుకుందామా?" అడిగింది మా వకుళాదేవి.

"అలాగే" నంటూ, జేబులోనుండి 50 రూపాయలు తీసి, ఆ కాయలు అమ్మే అతన్ని పిలిచాను.

"అన్ని వద్దు...ఓ ఇరవై రూపాయలకి తీసుకోండి చాలు" ఆర్డర్!

"ఎక్కువద్దు, నాలుగు కాయలు చాలు...ముందీ డబ్బులు తీసుకో" అంటూ అందించాను, అతనికి.

"మరీ గట్టివద్దు...మంచివి చూడు" మా వకుళ అంటూనే ఉంది... అతను మంచివి ఏరుతున్నాడు.

బస్ కదిలింది. అతను గబగబా రాబోతున్నాడు.

నేను"వద్దు, రావద్దు" అరిచాను. బస్ వేగాన్నందుకుంది.

"అనవసరం గా ముందే డబ్బులిచ్చేశారు" అంది వకుళ. నేను నవ్వుతూ ఆమె వైపు చూశా.

ఆడవాళ్ళు పిసినార్లు...మగవాళ్ళం ధర్మదాతలనుకుంటాం! కానీ, వాళ్ళకా జాగ్రత్త, పొదుపు, ముందుచూపు ఉండబట్టే...సంసారాలు సజావుగా సాగుతున్నాయేమో...

"మనం బస్ ఆగగానే తీసుకోవలసింది" అంటుంది వకుళ.

నా ఆలోచనలు కొద్ది రోజుల వెనక్కి వెళ్లాయి...

“ఏమిటీ ఆలోచిస్తున్నారు? యాభై  గూర్చా...అయితే లెండి...ఎన్నిఖర్చు కావటం లేదు..."

"ఈ యాభై గూర్చి కాదు, వకుళా... నీకు చెప్పలేదనుకుంటా, కొన్నాళ్ల క్రితం నేను ఏలూరు నుండి రాజమండ్రి వస్తున్నాను......"

అప్పటి ఆ దృశ్యం అంతా నాకు గుర్తొచ్చింది. వకుళ కు చెప్పసాగాను...

%%%%

“ఏలూరు నుండి రాజమండ్రి వస్తున్నాను. బస్ వెళుతూ ఉంది. మౌనంగా ఉంటే మెదడెలా అవుతుంది? బస్ దారిన వెళుతున్నా...నా ఆలోచనలు మాత్రం దారితెన్నూ లేకుండా సాగిపోతూనే ఉన్నాయ్. ఏదో ఆలోచిస్తూ ఉంటాం, అంతలో మరొక ఆలోచన  వచ్చి... ముందుదాన్ని వెనక్కి నెట్టేస్తుంది. చూడకుండా కళ్ళను, వినకుండా చెవులను, మాట్లాడకుండా నోరును మూసుకోవచ్చు. కానీ...మెదడలా ఆగే రకం కాదే?

బస్ ఆగింది. ఏమిటాని చూశాను. ఎదురుగా రైల్వే గేటు, బండి వస్తుంది కాబోలు, గేటువేసి ఉంది. ఏమిటేమిటో అమ్మే వాళ్లంతా ఒక్కసారిగా చుట్టు ముట్టారు. జామకాయలు, వేరుశనగ కాయలు, బొప్పాయిముక్కలు...వగైరా, వగైరా.

పన్నెండు, పదమూడేళ్ళ వయస్సునుండి... వివిధ వయసుల వాళ్ళు. వాళ్లలో వాళ్లకు పోటీలు...ఒకడిని నెట్టేసి మరొకడు అమ్మటం! నాకు వాళ్ళను...ముఖ్యంగా పదిహేను ఏళ్ళ లోపు వాళ్ళను చూస్తుంటే...అదోలా అనిపించింది. ఈ వయసుకే వీళ్ళు నడి రోడ్డు మీద...లారీలు, బస్సులు, ఆటోలు, బైక్స్...అరా కొరా సైకిళ్ళు...ఇన్ని వాహనాల మధ్యలో నుండి అభిమన్యుల్లా తిరుగుతూ, తప్పించుకుంటూ....ప్రయాణికులను ఆ కొద్ది క్షణాల్లోనే ఒప్పించి కొనుగోలు చేయించాలనే ఆరాటం...తమ చేతుల్లోవి  తొందరగా అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఆతృత! ఏమై  ఉంటుంది వీళ్ళ కుటుంబ నేపధ్యం?

తండ్రి తాగుబోతో, సోమరి పోతో అయి...వీళ్ళనిలా వదిలేశాడా? ఏ అవిటి వాడో, రోగిష్టి గానో ఉండీ, "నేను బతికించలేక పోతున్నాను" రా అని వాపోతూ పంపుతున్నాడా? లేక...కాలం కాటేసిన తండ్రి, కనుమరుగైతే ...తల్లికి చేదోడు వాదోడుగా, తమ చిన్నారి చేతులు కలిపి సంపాదనకు పూనుకున్నారా?

ఒక ప్రక్క...వేలకువేలు ఫీజులు కట్టి సకల సౌకర్యాలు అమర్చి పెట్టి,..."చదువుకోండిరా బాబూ, అంటే సెల్ఫోన్ల తో, వీడియో గేమ్ లతో కాలక్షేపం చేసే పిల్లలు కొందరు!

మరో ప్రక్క...స్థాయికి మించిన చదువుల వత్తిడికి, రాంకుల పోటీకి, తట్టుకోలేక...మొగ్గ దశలోనే కునారిల్లుతున్న బాలవృద్ధులు... శ్రీశ్రీ గారన్నట్లు...'ఎటు చూసినా ఏమున్నది గర్వ కారణం?' 'బాల్యమంతా బహుబంధాల బందికానా' లా ఉంది...

ఆలోచనల్లో ఉన్న నేను, రైలు ఎపుడెళ్లిందో... గేటెపుడు తీశారో గమనించనే లేదు. మా బస్ అలా కదిలిందో, లేదో...చుట్టుపక్కల అరుపులు, కేకలతో ఆగిపోయింది. అందరూ ఏమిటేమిటి అంటూ కిటికీలోంచి తొంగి చూస్తున్నారు...నేనూ చూశాను, వాహనాలు ఆగి పోయాయి. జనం మధ్య ఏమిటో తెలియటం లేదు. కొంత మందితో పాటు నేనూ దిగి వెళ్ళాను.

మా ముందున్న బస్ లో ఎవరో జామకాయలు కొన్నారట. డబ్బులు ఇచ్చే లోపు బస్ కదిలిందట. ఆ ఇరవై రూపాయిల కాగితాన్ని వాళ్ళు కిటికీ లోనుండి విసిరారు...గాలివాటుకు వెళుతున్న ఆ కాగితాన్ని అందుకోవాలని, దాన్ని చూస్తూ పరుగెత్తాడా కుర్రాడు...

లారీ వచ్చి గుద్దేసింది! పదునాలుగేళ్ల  వయసుంటుందేమో రక్తపు మడుగులో పడిఉన్నాడు... ఆ పసివాడి జీవితంలా...చిందర వందర గా దుమ్ములో పడివున్న జామకాయలు...

ఎవరో అంబులెన్స్ కి, ఫోన్ చేస్తున్నారు. కాయలు అమ్మేవాళ్ళంతా చేరారు. హృదయ విదారకంగా ఉందా దృశ్యం...గుండె చిక్కబట్టినట్లయ్యింది...ఇలాంటివి చూసి, చలించటమే తప్ప ఏమీ చేయలేని వెధవని...ఛ! నన్ను నేనే తిట్టుకున్నాను.

ఉదయం ప్రయాణం తొందరలో టిఫిన్ చేశాక, బి.పి.టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినట్లున్నాను. చిరుమార్పులు చోటుచేసుకుంటున్నాయి..

"బస్ ఎక్కండి...కదులుతుంది" పిలుస్తున్నారు. వచ్చి నా సీట్లో కూర్చున్నాను.  నా కళ్ళలో ఆ జామకాయల కుర్రాడే కదులుతున్నాడు. తల సీటు కానించి, కళ్ళు మూసుకున్నాను.

నీకు తెలుసు...నీవు పూజలు చేస్తూ ఉన్నా, నేను ఆ వైపు రావటంగాని, నిన్నొద్దనటం గాని, చేయనని. కానీ, అప్పటి నా మానసిక స్థితి ఎలా ఉందంటే...

"దేవుడా! నీవున్నావో, లేవో నాకు తెలియదు. ఉన్నావని నిరూపించలేను, లేవని రుజువు చేయలేను.

'ఎవరి నమ్మకం వారిది' అనుకుని.. చేతనైతే ఉపకారం చేద్దాం, అపకారం చేయకుండా ఉంటే చాలు'

నాకు వ్యక్తిత్వం వచ్చినప్పటినుండీ అనుసరిస్తున్న సూత్రం ఇది. కానీ...ఈ రోజు రక్తపుమడుగు లో

చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ పిల్లాడిని చూస్తుంటే, మనసు చలించిపోతుంది. 'వాడి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది...' అనుకోలేక పోతున్నాను. తొలిసారిగా నిన్ను ప్రార్ధిస్తున్నాను, నువ్వుంటే వాడిని బ్రతికించు! నీవున్నావు...ఆదుకుంటావు... అనే భావన...కొంత వరకు ఆశను, ఊరటనిస్తోంది! అంటే....భరోసానిచ్చే ఈ భావనేనా అస్తిత్వమంటే !? ఏమో...నాక్కావాలసింది, వాదోప వాదాలు గెలుపోటములు కాదు. వాడు బ్రతకాలనే ప్రగాఢమైన కోరిక, ఆ కోరిక తీరుతుందనే ఆశ కల్పించే మనశ్శాంతి, అంతే!' అనుకున్నాను, వకుళా.

తర్వాత వాడెలా ఉన్నాడో తెలీదు..బ్రతుకు తెరువు కోసం ...ఇలాంటి పిల్లలు వాళ్ళ జీవితాలనే చెల్లిస్తున్నారేమో ననిపిస్తోంది..!”  చెప్పటం ముగించాను.

"నిజమే...పాపం! బస్ ఆగినపుడెల్లా పరుగులు పెట్టుకుంటూ వస్తారు, అమ్ముకునే ధ్యాసే గానీ, ముందు వెనుకల ఏమొస్తున్నాయో చూసుకోరు." బాధగా అంది వకుళ.

"అప్పటి నుండి నేను ముందు డబ్బులిచ్చేసి, తర్వాత వాళ్లిచ్చేవి తీసుకుంటాను. వాళ్లివ్వక పోతే, మనకు ఇరవై పాతిక మాత్రమే నష్టం! మనం ఇవ్వక పోతే, వాళ్ళు ప్రాణం ఫణం గా పెట్టి, పరిగెత్తుకు వస్తారు."

"నిజమే...పాపం!" అంది వకుళ.

ఆ తలపులు భారంగా ఉన్నాయ్. ఇద్దరం నిశ్శబ్దంగా ఉండి పోయాం.

Posted in January 2022, కథానికలు

1 Comment

  1. G.V.L.Narasimham

    మన దేశంలో, అనేక ప్రాంతాలలో, ఒకరి సహనాన్ని పరీక్షిస్తూ , నిత్యం జరిగే సత్యం. కథలో సంభాషణలు, చాలా సహజంగా ఉన్నాయి.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!