Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
మర్మదేశం (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ డోర్స్ మొత్తం క్లోజ్ చేసేసాడు మేథా.

"ఇక్కడే ఉంటే ప్రమాదం. క్రేన్ ముందు వీరిని మన గెలాక్సీకి తీసుకొని వెళ్ళు. నేను శార్వాణి ని తీసుకుని వస్తాను." అన్నాడు మేథా.

పిల్లలు రామని మారాం చేస్తున్నా పట్టించుకోని యు.ఎఫ్.ఓ. అక్కడి నుంచి బయలుదేరింది. మేథా మనోఫలకం పై కదలాడింది ఏదో అపశృతి. అతని ఆలోచనలు పరిపరి విధాల పరుగులు తీశాయి.

ఆలోచనలకు కళ్ళెం వేస్తూ ధ్యాన సామ్రాజ్యంలోకి వెళ్ళాడు మేథా.

&&&

ఒళ్లంతా నొప్పులుగా, సూదులతో గుచ్చినట్లుగా ఉంది. అసలు శరీరము దేనికి సహకరించడం లేదు. బలవంతంగా కళ్ళను విప్పి చూసింది శర్వాణి. ఎక్కడ వుందో తనకి అర్థం కాలేదు. అంతా కొత్తగా ఉంది. తను ఓ బల్లమీద ఉంది.

బలవంతంగా గొంతు పెగల్చుకుని "చరణ్ "అనిపిలిచింది. జవాబు లేదు.

"దినేష్ ,.......కౌషిక్........ మేథా ......అంకుల్ . ...అంటూ అందర్నీ పిలిచింది. ఎటువంటి సమాధానం రాలేదు.

ఎవరు పలకటం లేదే!....,. ఏమయ్యారో అందరూ? అని మనస్సులో అనుకుని అక్కడ ఎవరైనా ఉన్నారేమో అన్న ఉద్దేశంతో

"ఎవరైనా కొంచెం మంచినీళ్లు ఇవ్వరా ..... ప్లీజ్ గొంతు ఎండిపోతోంది ." దీనంగా అడిగింది శర్వాణి.

ఎటువంటి సమాధానం లేదు. ఎవరూ రాలేదు.

అందరూ నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్లారు? అసలు ఏమైంది? నేను ఎక్కడ ఉన్నాను? జవాబు దొరకని ప్రశ్నలు ... శర్వాణి మస్తిష్కాన్ని ఆక్రమించాయి.

శర్వాణి లో భయం మొదలైంది. మనసు ఏదో కీడు శంకిస్తోంది. పైకి లేచే ప్రయత్నం చేసింది. లేవడానికి శరీరం సహకరించడం లేదు.

వివిధ రకాల ఆలోచనలు తేనెటీగలై కుడుతున్నాయి. ఆలోచనల నుంచి బయటపడటానికా అన్నట్లుగా కళ్ళు గట్టిగా మూసుకుంది శర్వాణి.

ఆమె మనసులో మేథా మెదిలాడు.

అవును మేథాకు ఎన్నో అతీంద్రియ శక్తులు ఉన్నాయి. నేను మనసులో ఏమనుకున్నా తెలిసిపోతుంది కదా అన్న ఆలోచన రాగానే

"మేథా అంకుల్ ఎక్కడ ఉన్నావ్? ఎవరూ పలకడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. నా బాడీ నాకు సహకరించడం లేదు. ఏమైందో ఏమో తెలియదు. లేవలేక పోతున్నాను. ప్లీజ్ అంకుల్ ఎక్కడున్నావ్? ఒక్కసారి ఇక్కడికి రావా నా ఈ బాధను మంత్రమేసి పోగొట్టవా ప్లీజ్ ....ప్లీజ్... ప్లీజ్ ." దీనంగా మనసులోనే మేథాను వేడుకుంటోంది.

శర్వాణి మేథా మేధస్సుకు అందనంత దూరంలో ఉంది. నిస్సహాయస్థితిలో ఓ బల్లపై పడుంది.

ఆ పసిపాప శరీరం అనేక రకాల ప్రయోగాలు కు గురి అయ్యింది. ప్రస్తుతం ఆమె శరీరం ఓ ప్రయోగశాల లో వివిధ రసాయనాలు, పరికరాల మధ్య లో ఉంది. ఆమెలోని ప్రతిభాగంలో ఉన్న కణాలను పరిశోధనకు సేకరించారు.

ఆ విషయం ఆమెకు తెలియదు. ఆమె అందరితో కలిసి ఉన్నట్లుగానే అనుకుంటోంది. శరీరం అంతా నొప్పి అయినా శర్వాణి వదలక మెడిటేషన్ చేస్తూనే ఉంది. తపస్విలా. మూసిన కనురెప్పల మాటు నుంచి టెలిపతి ద్వారా మేథా కు సందేశం పంపిస్తూనే ఉంది.

ఆమె వేవ్ లైన్స్ మేథాను చేరాయో యేమో అస్పష్టంగా ఆమెకు ఏవో మాటలు వినిపిస్తున్నాయి.

ఎక్కడో సుదూర తీరాల నుంచి పంపిస్తున్నట్లుగా.... ఆమెకు అవి సరిగ్గా రీచ్ అవటం లేదు. గాలికి కొట్టుకుపోయే పాలిథిన్ కవర్లా అందీ అందనట్లుగా....... ఆమె కళ్ళు మరింత గట్టిగా మూసుకుంది.

ఇంకొంచెం లోతుగా..... ధ్యాస దాని మీదే పెట్టి......అయినా శర్వాణి కి అందడం లేదు. అలా అలా ధ్యాన సాగరంలో మునిగి వెదుకుతున్న శార్వాణి చెవులకు సన్నగా తలుపులు తీసిన చప్పుడు. సన్నగా అడుగుల చప్పుడు వినిపిస్తోంది.. ఆ అడుగులు... తనకు చేరువలో ...

తన కోసం మేథా వెదుకుతూ వచ్చాడా ‌...... ఆశ ఆమెలో ఊపిరి పోసుకుంది.

ఆ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. చేరువవుతున్న ఆ శాల్తీ వాసన ముక్కుపుటాలను చేరింది.

అపరిచితమైన వాసన. వాంతి అయ్యేట్టుగా అనిపించింది. మరింత చేరువలో..... ఆ అడుగుల శబ్దం ఆగింది . ఆ వింత వాసన ముక్కు పుటాలను కమ్మేసింది. తన చెవి పక్కగా బుస్...బుస్....అనే శబ్దం ... ఒక్కసారిగా భయం ముంచెత్తింది. శర్వాణి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది.

తన మొహం లో మొహం పెట్టి చూస్తున్న ఆ ఆకారం చూసేసరికి శర్వాణి గుండె గుబేలుమంది.

ముదురాకుపచ్చ రంగులో ఉన్న ఆ ఆకారం శరీరమంతా పొలుసులు తేరి ఉంది. మండుతున్న అగ్నిగోళాల్లా రెండు కళ్ళు. కండలు తిరిగిన శరీరం. ఎత్తుగా ఉన్న ఆకారం. చేతులు లాంటి వాటికి మూడు చేతివేళ్ళుక్రింద ఓ బొటనవేలు ఉన్నాయి. వాటి వెనక గా రెండు రెక్కలు కూడా ఉన్నాయి. ఆ వ్యక్తి తల కోన్ ఆకారంలో ఉంది. పైన రెండు కొమ్ములు ఉన్నాయి. తోక కూడా ఉంది. డ్రాగన్ లా ఉన్న భయంకరమైన ఆ రూపం చూసేసరికి శార్వాణి కి వొణుకు పుట్టింది.

***సశేషం***

Posted in January 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!