Menu Close
పిపీలికం
-- ఆదూరి హైమావతి --

ఆ రోజు ఆదివారం. హోంవర్క్ చేసుకుంటున్నాడు సోము. మధ్యమధ్యలో అమ్మ ఒలిచి, పొట్టుతీసి ఊది ఇచ్చిన వేరుసెనగపప్పు, బెల్లం ముక్కా నముల్తూ, హోం వర్క్ చేసుకుంటున్న వానికి తాను తినేప్పుడు క్రిందపడ్డ ఒక చిన్న బెల్లం ముక్క ను లాక్కెళుతున్న చీమ కనిపించింది.

వెంటనే సోము "అమ్మా! చూడూ! ఈ చీమ తనకంటే 20 రెట్ల బరువైన బెల్లం ముక్కను కష్టపడి ఎలా ఈడ్చుకుంటూ వెళుతున్నదో! మధ్య మధ్యలో బెల్లం ముక్క క్రింద పడ్డా తిరిగి దాన్ని పట్టుకుని వదలకుండా లాక్కెలూతూనే ఉంది. చీమ అలా బెల్లం ముక్కని లాక్కుపోకుండా ఇక్కడే తినవచ్చుకదా!" అన్నాడు ఆశ్చర్యంగా.

అపుడు వాళ్ళ అమ్మ అందికదా! "ఒరే సోమూ! చీమవద్ద మనం చాలా నేర్చుకోవాలిరా! చీమలు కష్ట జీవులు, వర్షాకాలంలో అవి బయటకు రాలేవు. అందుకే వేసవిలో విశ్రాంతి లేకుండా శ్రమిస్తాయి. వర్షాలు కురిసేటప్పుడు పుట్టల్లోనే ఉండి లోపలే అవి అవిశ్రాంతంగా ఏదో ఒక పనిచేస్తూనే ఉంటాయి."

"అమ్మా! చీమలు పుట్ట లెలా కట్టుకుంటాయో చెప్పవా?" ఆశగా అడుగుతున్న కొడుకును దగ్గరికి తీసుకుని చెప్పసాగింది అమ్మ.

"చీమలను ఆంగ్లంలో యాంట్స్ అంటాం కదా!  చీమ ఒక చిన్నకీటకం, ఐనా ఇది మానవులకేం తీసిపోదు. ఇది తన కంటే 20 రెట్ల బరువును మోయ గలుగుతుంది. చీమలు భూమిని గుల్లగా చేస్తూ పుట్టలను కట్టుకుంటాయి. ఇది మన ఇంజనీర్లను మించి పోతుంది పుట్టలు కట్టడంలో. చీమను సంస్కృతంలో 'పిపీలకం' అంటారు. ఎర్రచీమ, కొండచీమ, గండుచీమ, చలిచీమ, నల్లచీమ, రెక్కలచీమ ఇలా చీమల్లో అనేక రకాలు ఉన్నాయి. మాంసం తినే చీమలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది.

"అమ్మో! మాంసం తినే చీమలే! నాకు భయమేస్తున్నదమ్మా!" అంటూ కాళ్ళు మంచంపైన పెట్టుకున్న కొడుకును చూసి నవ్వింది అమ్మ.

"భయపడకు ఇక్కడ కాదులే." అంటూ సోమూ భుజం తట్టి అమ్మ చెప్పసాగింది.

"శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు – అనే సామెత విన్నావుకదా! ఇంకా చీమ గురించిన ఈ సుమతి శతక పద్యం విను.

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుఁడుదగన్
హేమంబుఁ గూడఁ బెట్టిన
భూమీశుల పాలఁజేరు భువిలో సుమతీ.!

చీమలు కష్టపడి పుట్ట కట్టుకోగానే పాము వచ్చి దానిలో చేరుతుంది, కష్టపడకుండా సునాయాసంగా ఆ పుట్టను తన నివాసంగా చేసేసుకుంటుంది పిసినారితనంగా, ఎవ్వరికి ఇవ్వక దాచిన ధనాన్ని దొంగలో, పాలకులో తీసేసుకుంటారు. అందుకే కాస్తంత త్యాగ గుణంతో దానధర్మాలు చేయాలని చెప్తారు పెద్దలు."

"అబ్బో చీమ గురించీ సుమతీ శతకం లో పద్యంకూడా ఉందా!" ఆశ్చర్యపోతున్న రామూతో అంది అమ్మ.

"ఒకటికాదు మరో పద్యమూ ఉంది రామూ! అందరితో స్నేహంగా ఉండాలని, నేను గొప్పవాడిననీ, బలవంతుడిననీ గర్వించ రాదని కూడా సుమతీశతక పద్యం ఉంది.

బలవంతుడనాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుటమేలా!
బలవంత మైన సర్పము
చలిచీమలచేతచిక్కి చావదె సుమతీ!

చీమలు సామన్య మైనవి కావు, పామునే చుట్టుముట్టి చంపేస్తాయి వాటి పట్టుదల, ధైర్యం చాలా గొప్పవి.

ఐకమత్యానికీ, శ్రమకూ పెట్టింది పేరు చీమలే!. అంతా కలిసి కష్టపడి కట్టుకున్నపుట్టలో కలిసి మెలసి ఉండటమేకాక, వాటి పనిని  అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి. నేరుగా ఒకదాని వెనుక ఒకటి సైనికుల్లా కవాతు చేస్తూ ఎంత చక్కాగా పోతాయో చూస్తుంటాం కదా!

చీమలు పుట్టుకొచ్చింది కందిరీగల నుంచే. ఇవి సుమారు 10 కోట్ల ఏళ్ళ కిందట కందిరీగలతో విడిపోయి, ప్రత్యేక జీవులుగా రూపొందాయి. మనుషుల్లా వీటికీ స్వాభిమానం, స్వంతజాతిపై మక్కువా ఎక్కువన్నమాట! సుమారు 11,880 జాతులుగా ఉన్న చీమల్లో ఇటీవల మరో కొత్తరకం చీమను శాస్త్రవేత్తలు కనిపెట్టారుట!.

మనలాగే  చీమలకు ఊపిరితిత్తులు, గుండె ఉండవు. రక్తానికి రంగు కూడా ఉండదు. వీటి వంటిమీది కవచానికి ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాస తీసు కుంటాయి. బయటకు కనబడేవి రెండు కళ్ళే అయినా, వాటిల్లోనే చిన్నచిన్న కళ్ళు బోలెడన్ని కలిసి ఉంటాయి. ఈగలకు కూడా ఇలానే ఉంటాయి కళ్ళు. తల మీద అటూ ఇటూ కదిలే కొమ్ముల్లాంటి యాంటెన్నాలతో, తాము విడుదల చేసే రసాయనాల వాసనను పసిగట్టి , మాట్లాడేసుకుంటాయి. ఇక చీమల కోరలు బలం అంతా ఇంతా కాదు. పెద్ద ఏనుగునైనా కుట్టాయంటే ఏనుగూ బాధతో విలవిలా లాడుతుంది. చీమలు తమకన్నా 20 రెట్ల బరువునైనా ఇట్టే మోస్తాయి. అంత పట్టుదల ఉన్న ప్రాణి అన్నమాట!

అడవీ ప్రాంతాలలో కనిపించే పెద్దవైన వాటిని కొండ చీమలనీ, రెక్కలతో ఎగరగలిగే చీమలను రెక్కల చీమలనీ, ఎర్రగా ఉండేవి ఎర్రచీమలనీ, చిన్న నల్ల చీమల్ని చలి చీమలనీ అంటారు. చీమలు దూరని చిట్టడవీ, కాకులు దూరని కారడవీ అని కధల్లో వస్తుంటుందికదా! అంటే చాలా దట్టమైన అడవి అని అర్ధం.

చిన్న పరిమాణాన్ని చెప్పడానికి చీమంత, చీమతల కాయంత అని అంటాము. పుట్టలను కట్టుకోవడంలో చీమల తెలివి అంతా ఇంతా కాదు. వానలు కురిసినా పడిపోకుండా ఆ గోడలు బలంగా ఉండేందుకు మట్టి, ఇసుకల్లో, మనం పెద్ద పెద్ద అంతస్తులను కట్టను పిల్లర్స్ వేసుకున్నట్లుగా పుల్లలను కలిపేస్తాయి. లోపల చాలా అరలు ఉంటాయి. ఒక్కో అవసరానికి ఒక్కో అర. కొన్నింటిలో ఆహారం దాచుకుంటే, మరికొన్నింటిలో గుడ్లుపెట్టి పిల్లల పెంపకంకోసం వాడుకుంటాయి.. ఇంకొన్ని గదులు విశ్రాంతి కోసం. ఐతే అన్ని గదులను కలిపేలా దారులు, అంటే నడవాలు అంటే మనం అంటామే వరండాలు ఏర్పాటు చేసుకోవడం మాత్రం మరచిపోవు. కొన్నిరకాల చీమలు చెట్ల కాండంలో ఇళ్ళను ఏర్పాటు చేసుకుంటాయి కూడా.

కలిసి కట్టుగా జీవించడంలో, పనులను విభజించు కోవడంలో చీమలను మించినవి లేవు. మనుషులు వాటి ముందు దిగదుడుపే! మనకు ఒకరంటే ఒకరికి పడదు కదా! మీక్లాస్ లో ఒకరిమీద ఒకరు ఎప్పుడూ చాడీలు చెప్పుకుంటూనే ఉంటారాయె!"

"ఔనమ్మా! మా టీచర్ అంటుంటారు.'తప్పురా! అలా చాడీలు చెప్పకండీ!' అని కానీ ఎవ్వరం వినంలే!"

"చిలిపి వెధవా! అదేమరి ప్రకృతినుండి మనం నేర్చుకోవల్సిందెంతో ఉంది. చీమల్నేచూడు! ఒక్కో పుట్టలో 80 లక్షల దాకా నివసిస్తాయి. రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలు. ఇలా వేటి పని వాటిదే. రెక్కలు ఉండే రాణి చీమ గుడ్లు పెట్టడం తప్ప మరేపని చేయదు. ఆడ మహారాణి! మగ చీమలు రాణి చీమలతో జత కలిశాక వెంటనే చనిపోతాయి. ఇక రాణికి సేవలు చేసేవేమో శ్రామిక చీమలు. ఇవి రాణి చీమ శరీరం నుంచి వచ్చే రసాయనాన్ని రుచి చూసి, దాని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాయి. గుడ్లను కాపాడడం, అవి లార్వా దశ నుంచి పిల్లలుగా మారి పెద్దయ్యే వరకు కని పెట్టుకొని ఉంటాయి ఆయాల్లా, నర్సుల్లా. పుట్టను కాపాడే పని సైనిక చీమలది. శత్రువులు దాడి చేశారని తెలియగానే కాపలా చీమలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. వాటిని పసిగట్టగానే సైనిక చీమలు ఒక్క పెట్టున శతృవుపై దాడిచేసి, తమకోటను అదే పుట్టను కాపాడుకుంటాయి   .

చీమల మాటలను ఒక రకంగా రసాయనిక భాష అనుకో వచ్చు. ఎందుకంటే. ఏ విషయాన్ని అయినా తమ లోంచి వచ్చే 'పెరోమోన్స్' ద్వారా తెలియజేస్తాయి. పెద్దక్లాసుల కెళితే నీకివన్ని ఇంకా బాగా అర్ధ మవుతా యిలే!

ఉదాహరణకు ఏ చీమకైనా ఆహారం కనబడిందనుకో... వెంటనే అది 'ఫెరోమోన్' ను దారి అంతటా విడుదల చేసుకుంటూ తమ ఇంటికి వస్తుంది. తిరిగి తన వారిని వెంటే సుకొని ఆ వాసనను బట్టి అక్కడికి చేరుకుంటుంది. చూడు సోమూ! వాటికెంత తెలివో, మనం ఎప్పుడైనా కొత్త చోటుకెళితే దారి మర్చిపోతాం కదా! అవి అలా కాకుండా ఇలా తమశరీరం నుండి రసాయనం విడుదలచేయటం ద్వారా దారిని గుర్తుంచుకుంటాయి.

కీటకాలన్నింటిలోకీ చీమలే ఎక్కువ కాలం బతుకుతాయి. వాటి జీవితకాలం సుమారుగా 30 సంవత్సరాలు అంటే ఆశ్చర్యంగాలేదూ!

చీమల్లో బానిసత్వం ఉంది. కొన్ని రకాల జాతుల చీమల వద్ద ఇతర జాతి చీమలు బానిసలుగా పని చేస్తాయి, వీటిని బానిస చీమలుగానే పిలుస్తారు.

నీటిలో పడితే చీమలునీ ఈదుకుంటూ వచ్చేస్తాయి, వాటికి పుట్టుకతోనే ఈత వచ్చేస్తుంది. ఇరవై నాలుగ్గంటలూ నీటిలోనే ఉన్నా, చీమలకు ఏమీ కాదు!

చీమల దండ్లు ఆహారాన్ని గోతుల్లో కానీ, చిన్ని, చిన్ని తొర్రల్లో కానీ దాచుకుంటాయి. ఇది ఎంత చిత్రమంటే , ఒక్కో గొయ్యి, తొర్ర ఒక్కో రకమైన వాసన వస్తుంది. ఆ వాసనను బట్టే అవి తాము దాచిన వాటిని గుర్తిస్తాయి . చీమల వల్ల మనకొచ్చిన నష్టమేమీ లేదు. వాటిలో అవి విపరీతంగా పోట్లాడు కుంటాయి. ప్రాణాలు తీసేసుకుంటాయి కూడానూ.

రెండు చీమలు కొట్టుకున్నాయి అంటే వాటిలో ఒకటి చావాల్సిందే! అంత పౌరుషం వాటికి. మన గొఱ్రె పొట్టేలులాగా, సినిమాల్లో రౌడీలలాగా!"

కిలకిలానవ్వాడు సోము. "మరి మాక్లాస్ లో మేము  కొట్టు కుంటుంటే మా మాం మమ్మల్ని కోప్పడుతుందే! వీటిని కోప్పడేవాళ్ళెవ్వరూ లేరా?"

"ఎందుకులేరూ! వాటన్నింటికీ రాణి చీమే సామ్రాజ్య లక్ష్మి! హైకమాండ్ ! ఐతే అవి ఇతర జాతి చీమలు తమ పుట్టను ఆక్రమిస్తాయన్నభయంతోనే పోట్లాడు కుంటాయన్నమాట! సరే ఇహ పద హోం వర్క్ ఐందిగా! బువ్వతిని పడుకుందువుకాని, రేపు స్కూల్ ఉందికదా!"

" ఔనమ్మా! రేపు మా తరగతి పిల్లలందరికీ ఈ చీమ కధ చెప్తాను." అంటూ అమ్మచేయిపట్టుకుని లేచాడు సోమూ.

(సమాప్తం)

Posted in January 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!