Menu Close
ఆత్మబంధువు
-- బి వి లత --

ఈ రోజు నా మనసంతా ఎంతో కలవరంగా ఉంది. ఏదో తెలియని బాధ నా గుండెని పిండేస్తోంది. నా ప్రక్క ఇల్లు పగలగొట్టేస్తున్నారట. ఆ ఇంటితో నా అనుబంధం ఈ నాటిది కాదు. నా కడుపులో ప్రేవులను మెలిపెట్టే బాధ. ఈ ఇల్లు నాకు పుట్టింటిలాంటిది. నేను ఇక్కడ పుట్టక పోయినా, నా జీవితమంతా ఇక్కడే గడిచింది.

రఘురామ, శ్యామల నన్ను వాళ్ళ సొంత బిడ్డలాగా చూసేవారు. నేనక్కడికి వచ్చిన నాటినుంచి వాళ్ళే నా బంధువులై నన్ను చూసుకున్నారు. వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి పండగలో, ప్రతి పూజలో నాదే ప్రధాన పాత్రగా ఉండేది.

నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆ రోజు వచ్చిన గాలివాన, నేను పోయాననే అనుకున్నాను. ఆ ఈదురుగాలి, వానతో ఏర్పడిన వరదతో నేను కొట్టుకు పోయేదాన్ని, కానీ వాళ్ళు నన్ను వడిసిపట్టుకున్నారు. ఎంతో శ్రద్ధ తీసుకుని నన్ను బలంగా తయ్యారు చేశారు.

నన్ననే కాదు, వారికి సర్వ జీవ రాసుల పట్ల ఉన్న శ్రద్ధ అనిర్వచనీయం. నేను వచ్చిన నాటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. రఘురామ రోజూ ఒక అన్నం ముద్ద పిట్టలకు గోడ మీద ఉంచి కానీ భోజనం చేయడు. ఇక కుక్కలకు అంతో ఇంతో మిగిల్చి పెడుతుంటారు. ఒక వేసవికాలం జనాలను మలమలా మాడ్చేసింది. నీటికి ఎద్దడి ఏర్పడింది. వారు వీధి చివర బోర్ వెల్ నుంచి నీరు మోసుకుని తెచ్చుకోవలసిన పరిస్ధితి. కానీ తెచ్చిన ప్రతి కడవ నుంచి కాసిని నీళ్ళు ఒక కుండలో పోసి ఉంచేవారు. ఆ నీటిని ప్లాస్టిక్ సీసాలలో నింపి వాటికున్న చిల్లులతో చుక్క చుక్క కుండీ మొక్కలకు పడే ఏర్పాటు చేసేవారు. చిన్న చిన్న పాత్రలలో నీరు పోసి ఇంటి నలుమూలల ఉంచేవారు. పిట్టలకూ, ఉడతలకూ దాహం తీర్చటానికి. వర్షా కాలానికి ముందు రఘురామ ఇంటికి నలుమూలల ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయించాడు. పెద్ద మొక్కలకు పెద్ద పెద్ద పాదులు పిల్లలతో కలిసి త్రవ్వేవారు.

‘నాన్న, అవన్నీ ఎందుకు?’ అని అడిగే పిల్లలకి ఓపిగ్గా, ‘ఈ పెద్ద చెట్ల వేరు, లోతుగా, ఎక్కడో ఉంటుంది, మరి ఈ నీరు అక్కడిదాకా వెళితేనే అది తాగగలుగుతుంది.’

‘అన్నీ మనమే చేయలా?’

‘అవును, మరి అవి ఇచ్చే పళ్ళు, పూలు మనమే కదా వాడుకుంటున్నాం?

‘ఓ! సరే అయితే’ అంటూ సాయానికి సిధ్దపడేవారు. వారి ఈ తీరే నన్ను వారికి మరింత దగ్గర చేసింది.

వారి కుటుంబంలో నేను కూడా ఒక భాగమై పోయాను. నేను పుష్పవతినైనప్పుడు వాళ్ళు చేసిన హడావుడికి నేను సిగ్గుల మొగ్గనైపోయాను. అలాగే, నా మొదటి సంతానాన్నిచూసి వాళ్ళు ముచ్చటపడి నన్ను ప్రశంసగా చూసిన చూపులు నేను గర్వ పడేలా చేశాయి.

రఘురాం నా ముంగిట్లోనే కూర్చుని పేపరు చదివి, విశేషాలు చెబుతుంటే, విని తెలుసుకునే దానిని. అదేనా, ఎన్నో పురాణకధల్ని పిల్లలకి చెబుతుంటే విని తెలుసుకున్నాను. వాళ్ళ ముగ్గురు పిల్లలు శ్రవణ, మాలతి, మాధవి నా ముంగిట్లోనే పెరిగి పెద్దయ్యారు. వాళ్ళు ఆడే ఆటలు, వాళ్ళ గిల్లికజ్జాలే, నాకు వినోదంగా ఉండేది. శ్రవణ చాలా తుంటరి వాడు. తరచూ దెబ్బలు తగిలించుకునేవాడు, కానీ, మాధవికి కాలు విరిగి అది కొంత భాగం తీసివేసేసరికి, రఘు, శ్యామల పడ్డ బాధ వర్ణనాతీతము. నేను కూడా జీవితాంతం అలా ఎలా తిరుగుతుందోనని చాలా బాధ పడ్డాను. కానీ వేరే కృత్రిమ కాలు ఒకటి అమర్చారు. దాని వలన మామూలుగానే నడవగలిగేది. అందరం గుడ్డిలో మెల్ల అని సంతోషించాము.

చూస్తుండగానే అందరికీ పెళ్ళిళ్ళు అయి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్యామలకి, రఘురాంకి  నలుగురు మనమళ్ళు, ఇద్దరు మనుమరాళ్ళు. ఎప్పుడైనా వేసవి శలవులకు అందరూ వచ్చేవాళ్ళు. గట్టుమీద కూర్చొని వాళ్ళు వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు పిల్లలకి చెబుతుంటే విని ముచ్చట పడేదాన్ని. వాళ్ళున్నన్నాళ్ళు శ్యామలకి క్షణం తీరిక దొరికేది కాదు. అనేకరకాల పిండివంటలు వండి తినిపిస్తూ ఉండేది. నా నీడనే వాళ్ళు కూర్చుని తింటుంటే నాకు ఎంతో ఆహ్లాదంగా ఉండేది. సేద తీరేందుకు మంచి చల్లటి గాలితో నేను వాళ్లకు నా ఆకులతో వింజామరలు విసురుతూ ఆనందపడే దానిని. వాళ్ళంతా వెళ్ళగానే శ్యామల అలసిపోయి అనారోగ్యంతో అడ్డం పడేది.

కాలంతో పిల్లలు పెద్దవాళ్ళయితే, పెద్దవాళ్లు ముసలి వాళ్ళైపోయారు. శ్యామల మంచాన పడింది. ఆ సమయంలో శ్రవణ కొడుకుకి, మాధవి కూతురికి పెళ్ళి నిశ్చయించారు. వాళ్ళు చిన్నప్పట్నుంచి ఇష్ట పడ్డారట. ఇంటిముందే పందిరి వేసి గొప్పగా పెళ్ళి చేశారు. రాజేష్, కమల చూడ ముచ్చటగా ఉన్నారు.

జీవితమెంతో చిన్నదంటూ, రఘురాం శ్యామలా ఒకరి వెనక ఒకరు నన్ను ఒంటరిని చేసి వెళ్ళి పోయారు. శ్రవణ ఇల్లమ్మేసి,  కొడుకూ కోడలి దగ్గరకు వెళదామనుకున్న నాడు నేను చాలా బాధ పడ్డాను. కానీ, వాళ్ళు ఇక్కడికే వచ్చిసెటిలయ్యారు, కొడుకూ కోడలు అమెరికా వెళ్ళి పోయారు, కూతురూ అల్లుడూ ఆస్ట్రేలియా లో ఉంటారు. నాకు తోడుగా వీళ్ళ రాక నాకెంతో తృప్తినిచ్చింది.

అప్పుడప్పుడూ, చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలతో వచ్చినప్పుడు సందడిగా ఉండేది వాళ్ళకు 7, 8 సంవత్సరాలకి, రాజేష్ వాళ్ళు వాళ్ళబ్బాయి మనోజ్ తో, కూతురూ అల్లుడూ వాళ్ళ అబ్బాయి సాయి తో వచ్చారు. మను కి తెలుగస్సలు రాదు. నాకు వాళ్ళమీద చాలా కోపమొచ్చింది మాతృభాష నేర్పనందుకు. వాడి మాటలు నా కస్సలు అర్ధం కాలేదు. వాళ్ళు కూడా వాడితో ఆంగ్లంలోనే మాట్లాడేవారు. ఆ తరువాత వాళ్ళెప్పుడూ రాలేదు. అప్పుడప్పుడూ శ్రవణ వాళ్ళు పిల్లల దగ్గరకు వెళ్ళివచ్చేవారు. ఈ సారి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. ఇదిగో ఇప్పుడు ఈ హడావుడి.

ఎందరో వస్తున్నారు పోతున్నారు. ఇవ్వాళ హడావుడి ఎక్కువగానే ఉంది. ఇంతలో ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక కుర్రాడు దిగాడు. రఘురామా? శ్రవణా? ఇద్దరి కలగలుపులా ఉన్నాడు. మనూ సర్ అని వాళ్ళు పిలవటాన్ని పట్టి వచ్చింది రాజేష్ కొడుకని అర్ధమైంది.

వచ్చినతను నన్నే ఎగాదిగా చూస్తూ వాళ్ళతో ఆంగ్లంలో మాట్లాడుతున్నాడు. ఒక పండు, కత్తి తెచ్చి ముక్కలుగా కోశారు.

మనూ, ‘కెన్ యూ కీప్ దిస్? వుయ్ హావ్ అటాచ్మంట్ విత్ దిస్ ఫర్ లాస్టు ఫోర్ జనరేషన్సు’

‘హరీ, ఇలా రా, మా ఆర్కిటెక్టు సర్’

‘హరీ, సర్వాళ్ళ ఫామిలీకి అటాచ్మంట్ ఉందట, ఫోర్ జనరేషన్లుగా, అలాగే ఉంచగలమా?’

‘ఓయస్, అలాగే చేద్దాము.’

మను, పండు ముక్కలు అందరికీ పంచి తనూ ఒక ముక్క తింటూ, నా దగ్గరగా వచ్చి నన్ను ముట్టుకొని ఒక ఫొటో తీసుకొని ఫోన్‌లో ఎవరికో మమ్మల్ని చూపిస్తున్నాడు.

‘హాయి, వాళ్ళు రాజేష్, శ్రవణ్ నా ఆనందానికి అంతు లేదు, నా కొమ్మల కదలికలు చూసిన మను నన్నుకౌగలించుకుని, ‘లవ్ యూ’ అంటుంటే, నా మనసు ఆనందంతో ఉరకలేసింది. భాష చెప్పలేనిది, భావం చెప్పింది మా మధ్య ఏర్పడ్డ ఆత్మబంధం చెరిగిపోలేదని.

తరువాత కొన్నాళ్ళకి నా ప్రక్కన ఒక పెద్ద భవనమొచ్చింది. నా మామిడి పళ్ళు తింటూ నా నీడలో ఆడుకోటానికి  ఇంకొక కొత్త తరం రాబోతోందని నాకు అర్ధమైంది.

**సమాప్తం**

Posted in January 2022, కథలు

2 Comments

  1. Murali Mohan

    Very nice story. More than the story, I very much liked that it gave a message that trees need not be destroyed for making buildings.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!