Menu Close
Lalitha-Sahasranamam-PR page title

ముందుమాట:

“అమ్మలఁ గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి వుచ్చినయమ్మ దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్”.

విజయవాడ ఇంద్రకీలాద్రిలో వెలసిన కనకదుర్గాదేవి గర్భాలయ ప్రవేశ రాజద్వారము పైన ఉన్న పద్యాన్ని ప్రతిరోజు స్మరించుకొనటం, ఇంట్లో మా తండ్రిగారి (శ్రీ పోతాప్రగడ నరసింహారావు) నిత్యపూజ, మా అమ్మగారు (శ్రీమతి సువర్చలాదేవి) చేసేటి నిత్య లలితా సహస్రనామ పారాయణం మా అందరికీ ఆ పరాశక్తి మీద భక్తి భావాన్ని కలిగించాయి. వృత్తిరీత్యా మా తండ్రిగారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో 35 సం.లు పనిచేసిన జీవితకాలములో ఎక్కువ కాలము విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసియున్న కనకదుర్గాదేవిని సేవించుకునే భాగ్యము దక్కినది. చివరగా ఆయన డిప్యూటీ కమీషనర్, ఎండోమెంట్స్ గా పదవీ విరమణ చేసినారు. చిన్ననాటి మా ఎదుగుదల ఆ దేవి సన్నిధిలో జరిగే దైవకార్యక్రమాలను కనులార వీక్షించే విధంగా జరగడం మా అదృష్టము. మా కుటుంబం ఇంతటి ఉన్నతస్థితిని నేడు కలిగియుండుటకు ఆ దేవి కృపయే కారణము. అటువంటి ఆ మహాశక్తి ని స్తుతిస్తూ రచించిన మహిమాన్విత లలితా సహస్రనామ స్తోత్రాన్ని భావపూరితంగా అందరికీ అర్థమయ్యే విధంగా వ్రాస్తే సులువుగా పారాయణము చేసుకొని ఆ దేవి కృపకు పాత్రులగుదురనే ఒక చిన్ని ఆశతో, మన సిరిమల్లె పాఠకుల కొరకు నా శక్తిమేరకు అర్థ వివరణ తో సంకలనం చేసి అందిస్తున్నాను. మీ అభిప్రాయాలను స్వచ్ఛందంగా తెలుపుతూ ఆశీర్వదించ మనవి. – పోతాప్రగడ వెంకటేశ్వర రావు

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం – విశిష్టత

వశిన్యాది వాగ్ధేవతలు (శ్రీ చక్రములో బిందుస్ధానమునుంచి మూడవ చక్రమైన సర్వరోగహర చక్రంలో ఉండే అమ్మవారి శక్తులు వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణి, జయిని, సర్వేశ్వరి, కౌళిని) సమకూర్చి వ్యాప్తిచేసిన ఈ లలితా సహస్రనామాలు దివ్యమైనవి, రహస్యమైనవి. ఈ నామాలలో అమ్మవారి రూప వైభవం, లీలా వైభవం, మంత్ర వైభవం, యోగ వైభవం, తత్త్వ వైభవం దాగి ఉన్నాయి. అందుకే వీటిని రహస్య నామాలు అంటారు.

ప్రథమ అధ్యాయం

(అమ్మవారి స్థూలరూప వర్ణన) శ్లోకాలు: 01-21, సహస్రనామాలు: 01-54

001. ఓం శ్రీ మాత్రే నమః

లక్ష్మీ స్వరూపిణియై సంపదలన్నింటినీ ప్రసాదించునట్టి శ్రీ మాతకు నమస్కారాలు.


002. ఓం శ్రీ మహారాజ్ఞ్యై నమః

సామ్రాజ్యలక్ష్మీ స్వరూపిణియై మహారాజ్ఞినిగా చరాచర విశ్వాన్ని పాలించు దేవికి వందనాలు.


003. ఓం శ్రీమత్సింహాసనేశ్వరీ నమః

సింహాసనాధీశ్వరి అయిన లేదా సింహాన్నే-- ఆసనంగా అంటే వాహనంగా గల మహేశ్వరికి వందనాలు.


004. ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః

బ్రహ్మతేజ స్స్వరూపమైన ప్రకాశానికి ‘చిత్’ అని పేరు. అట్టి మహత్తర చిదగ్నికుండం నుండి ప్రాదుర్భవించిన తల్లికి నమోవాకాలు.


005. ఓం దేవకార్యసముద్యతాయై నమః

దుష్టశిక్షణ, శిష్టజన సంరక్షణ దేవకార్యాలు. అట్టి కార్యాలను ఆచరించడానికి సంసిద్ధురాలగు పరమేశ్వరికి ప్రణామాలు.

----సశేషం----

Posted in January 2022, ఆధ్యాత్మికము

1 Comment

  1. Sai Prabhakar Yerrapragada

    Namaskaram,

    Today only I opened this website first time and saw this posting. Very much thankful for your time and spirit to enlighten us with Namavali.

    Regards

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!