Menu Close
SirikonaKavithalu_pagetitle

యంత్ర నాటకం -- గంగిశెట్టి ల.నా.

ముడుతలు పడ్డ రెప్పల వెనుక ఇప్పుడెవరో శుభ్రంచేశారు
కళ్ళల్లో పడ్డ వాస్తవం బొమ్మ
రంగులు పులుముకోకుండా
మనసు తెరమీద పడుతోంది.
నాటకం రక్తి కట్టడం కాదు, శక్తి నిస్తోంది
ప్రేక్షక పాత్ర కూడా జీవం పోసుకొని తెరపైకి నడిచి వస్తోంది

జీవితానికి నాటకానికి మధ్య అంతరం తొలగిపోతోంది
కాలం 'మాయ' స్క్రిప్టునుమార్చుకొంటోంది
రంగ'స్థలా'న్ని తీసేసి బ్రతుకును
రంగుల కెమేరా ముందు నించోబెట్టింది
ఇప్పుడు పడుతున్న ప్రతిముఖం
రంగుల్లో మిలమిలలాడుతోంది తేటతెల్లంగా మెరిసిపోతున్నది
వ్యాకులత నీలి ఛాయలు శుభ్రంగా
తుడిచిపెట్టుకు పోయాయి....

ఇంతకీ ఇది కనవస్తున్న వాటిల్లోనా
కనురెప్పల వెండితెర బొమ్మల్లోనా
లోన రీళ్ళు దాచుకు ప్రదర్శించే 'నా' లోనా
"అసలునేను'' ఓ ప్రొజెక్టరేనా??

సాధనమ్మున సమకూరు.. -- సుప్రభ
తే.గీ. చావు బ్రతుకులు జగతిని సహజమగును 
       రాక పోకలఁ దెలియఁగరాదు మనకు 
       ఎప్పుడెవరికి నేమౌనొ యెఱుఁగలేము 
       ఉన్న మూన్నాళ్ళు హితముగా నుండ మేలు

       బుద్ధి కర్మలఁ బట్టియే పుట్టునన్న 
       శుద్ధ భావనలను బెంచ శుభములొనరు
       బుద్ధిమంతుల చెలిమినే పొంది జనులు 
       వృద్ధి నొందుట పాడియౌ బృథ్వి నెపుడు

       పాంచభౌతిక దేహము వదలునాఁడు
       కూడి రాదేది మనతోడఁ గోరుకున్న
       చేసియున్నవి కర్మలే వాసినొంది 
       నిర్ణయించును మఱుజన్మ నిజమునైన

       నాది నాదని బ్రమయుచు ఖేదపడక 
       వేదవేద్యుని స్మరియించి ప్రీతి నెపుడు 
       సాధుసంగతి తోడను సంతసించి
       వాదు లేకుండ బ్రతుకుటే భావ్యమగును

       ఉన్నదేదియొ పంచుక యుచితగతిని 
       సాధ్యమైనట్లు పరులకు సాయపడుట 
       దేవదేవుడు మెచ్చెడి తేట యగును
       భావి తరమును గొనియాడు బాట యగును

       పువ్వు వోల్కినిఁ దావిని భువినిఁ జిమ్మి 
       నొవ్వఁజేయక యొకరిని నొడువు తోడ 
       నవ్వులొలుకుచు బ్రతుకుట నాణ్యమగును
       గవ్వకైనను గొఱగాదు కాని విధము

       గురువు నొక్కని నెంచుక గరిమ మీఱ 
       నిరతమాతని బోధల నియతి వినుచు 
       నరయ నాత్మస్వరూపమ్ము హరుసమగును 
       తిరిగి పుట్టువు లేనట్టి తీరు గలుగ

       చేదు కూడయు భాగమే జీవితాన 
       బాధలున్నను ధీరులై బ్రతుకుచుండి 
       సాధనలఁ జేయుచుండుట సార్థకంబు 
       సాధనమ్మున సమకూరు సర్వమిలను
నిన్నా ఈ రోజే -- స్వాతీ శ్రీపాద

నిన్న మొన్నలానే ఉంది
ఎన్ని యుగాలు గడిస్తేనేం?
లిప్తపాటు చాలుగదా
ఒక్కసారి రెక్కలు లేకుండానే
వెనక్కు వెళ్ళి వచ్చేందుకు?

కనురెప్ప పాటులో కాలాన్ని వెనక్కు తిప్పి
కొంచం చిరునవ్వు దూమెరుగ్గా అద్దుకుని
నడి వేసవి లోనూ చుట్టూ వెన్నెల తోటలు వేసుకుందుకు
ఇంద్రధనుసు కాస్త వెనక్కు వంచి
చంద్రవంకలా అలంకరించుకుందుకు
హిమాలయాన్ని సంజీవనిలా మోసుకు వచ్చి
సాగుచేసిన ఆకాశాన పేర్చుకుందుకు
ఆగిపోయిన సమయాన్ని నిద్రలేపి
చుట్టూ ప్రేమ పూల మడులు పెంచుకుందుకు

ఏమీ లేనితనం కమ్ముకున్న సమయాన
గోరంత ఆనందాన్ని వెలిగించి
నిన్నటి సామాన్ల గదిలో దాచుకున్న
మెరుపు తీగలు వెతికి తెచ్చి వాకిట్లో నాటుకోవచ్చు

ఊపిరాడని రోహిణీ కార్తె ఉక్కపోత మధ్యాన్నాలు
ఆవిరి తెప్పలా ఎగిసి కాస్త పలకరింపు తేమను
బ్లాటింగ్ పేపర్లా అద్దుకోవచ్చు
నిక్షిప్తమైన సరాగాల మధ్య
నింగికెగిరే నీటి తుంపర కావచ్చు
అలలరెక్కలపై తలవాల్చి
చల్లని ఆవర్తనం ఆహ్వానించవచ్చు
శిశిరంలోనూ చిటారు కొమ్మన వసంతం
పూయించవచ్చు
రోజూ ఉగాదిలా
తీపి తేనె ఒకింత
జీవితం నాలుక చివర
అద్దుకోవచ్చును.

తెలుగు కవిత్వమా ... -- కైలాస్ నాథ్

తేనె కన్నా తీయనైన కవిత్వమా
వెయ్యేళ్ళుగా తెలుగు గుండెల వెలుగా

పురాణాల తో పురుడుపోసుకొని
ద్వర్తి కావ్యాలతోతో ఆటలాడుకొని

ప్రభందాలతో యవ్వనించి
ఆధునిక ముత్యాల సరాలు ధరించి

అభ్యుదయ  నినాదంతో
సామాన్యుని మనోలోగిళ్ళలో
ప్రవహించిన తేనెల వాగా

మనిషి తనకు తాను ఆవిష్కరించుకునే రసస్థలి కవిత్వం!
మనిషి మనో నేత్రంతో స్పర్శించే ఆనంద ఝరి కవిత్వం!

తెలుగు కవిత్వమా ఆగిపోకు
మనిషిలో వసంతాలు పూస్తున్నంతవరకు!!

తెల్లని వన్నీ పాలు.. -- రాజేశ్వరి దివాకర్ల

అలనాటి రోజుల మననం,
గోపాలునితో నడచివచ్చి
నిలిచేది ఇంటి ముందు
పశు గ్రాస పరిమళం,
నిఘా కళ్ళను తప్పించుకోలేక ..
తళ తళ  లాడే ఇత్తడి చెంబు
వెచ్చని పొదుగు పాలతో
నురగలను కక్కడం,
ఒక అమాయకపు సమయం...
అదుముతున్న లేగ దూడ
అర్రులు చాచుతుంటే
తల్లి కళ్ళలో చెలమ
కోరుకునేది, బిడ్డల కుశలం.
మసక వెలుతురుమేరల్లో,
తొలి రేఖల అరుణంలో,
నగరానికి అంటి పెట్టుకునేది ,జానపదం.
తదుపరి రొజుల్లో ..
సత్తు డబ్బా పాలబ్బి,
పావు కొలతలు పోస్తుంటే
జగడాల ఇల్లాలి దురుసు తనానికి ..
నోటి నానుపుల జవాబులో
పాలలో నీళ్ళు
కలిసిపోయాయి కనుక
కుదుట పడిపోయేది,
కలహాల ఉదయం.
అటు పిమ్మటి కాలంలో
సీసాల గల గలలతో
బడికెళ్ళే పిల్లాడు,
అమ్మ చేతి చలువగా
అందించవచ్చే
వితరణల శబ్దానికి
ఇంటింటికి కాఫీ వేడుక
సెగలు పీల్చేది ...
తిరిగి తీసుకెళ్ళే ఖాళీ బాటిళ్ళ కేదో
తృప్తి నిండిన గాలి తగిలేది.
ఇప్పడేమో ఇక అలికిడి చేయని
ప్లాస్టిక్ పేకెట్లలో క్షీరం
గేటు ముందు సంచిలో,
వేలాడుతుంటే
అప్పటికే శీతలం పెట్టెలో నిలువ వున్న
నిన్నటి పాలతో
ఆవులింతలు వీడని పిల్లలకు,
ఊరడింపుల నిస్తుంది,
బోర్న్ వీటా బలం.
దేశం ఏదైనా ఇక
తొలి పొద్దు సంజెలకు, భూమి గుండ్రం,
ఎదురు చూడదు నిజం.
పగలు, రాత్రులు, సూర్య చంద్రులు,
గాలివాటులు, శరత్తులు, ఋతువులు
ఏవి, ఏమైనా గేలన్ల కొలది ...
వారానికి, పక్షానికి నెలసరికి
టెట్రా బంధంలో మురిపాలు,
చెడవు, ఎల్లప్పటికి, అవసరాల పాలు.
శాస్త్ర, సాంకేతిక ఉత్పత్తి కేంద్రాలు,
ఎక్కడికక్కడ సరఫరాలు,
తూనిక, కొలతలు, తలమానికాలు,
ఇవన్నీ ఆరోగ్యరక్షణా క్షణాలు,
తెల్లనివన్నీ పాలని
తప్పక నిలిచాయి చెదరని నమ్మకాలు.

నిజ నిర్ధారణ -- పి. లక్ష్మణ్ రావ్

పగలూ రాత్రి
మెదడులో మల్లగుల్లాలు పడ్డాక
నిన్నా నేడు
మనసులో అక్షర యుద్ధం ముగిశాక
కవితా వాక్యం
ఎలాగుండాలో తేలిపోయింది
పదును పెట్టడమెలాగో అర్ధమైపోయింది!

మట్టిపొరల్ని
నిశ్శబ్దంగా చీల్చుకొచ్చిన
చైతన్య విత్తులా
వాక్యం పిడికిలి బిగించాలి!

ఆకాశాన్ని
నిలువునా చీల్చిన
మెరుపుకత్తిలా
వాక్యం పదునుదేరాలి!

పర్వతం గుండెల్లో పుట్టి
భూమాతను అభిషేకిస్తున్న
జలపాతంలా
వాక్యం వినమ్రశీలి అవ్వాలి!

భూగర్భంలోని జీవజలాన్ని
ఉప్పొంగించే అస్త్రంలా
వాక్యం వాడిగా ఉండాలి!

తనలో తానూ దగ్ధమౌతూ
లోకానికి వెలుగునిచ్చే
సూర్యకిరణంలా సూటిగా ఉండాలి!

ప్రగతిపథానికి బాటలువేసే
తల్లిదండ్రుల చల్లని దీవెనలా
వాక్యంలో ఆత్మీయ స్పర్శ ఉండాలి!

వ్యాకులత చెందిన
కవి మనసు నుండి
విస్ఫోటనమయ్యే భావంలా
వాక్యం ప్రతిధ్వనించాలి!

చివరిగా
భావచైతన్య కాగడాలు వెలిగించి
మానవత్వ పరిమళాలు వెదజల్లి
సమ సమాజ స్థాపనకోసం
కవితావాక్యం
సంస్కరణోధ్యమమవ్వాలి!

Posted in January 2022, సాహిత్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!