Menu Close
ఆదర్శమూర్తులు
-- డా. మధు బుడమగుంట --
ఆంటోనీ వాన్ లీవెన్హోక్ FRS
(Antony van Leeuwenhoek, FRS)
Antony van Leeuwenhoek

నేటి విజ్ఞాన సాంకేతిక ప్రపంచంలో, అత్యంత సూక్ష్మ పదార్థాలను, జీవులను మొదలుకొని అమిత పెద్దవైన గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలను కూడా మనం వీక్షించగలుగుతున్నాము. అందుకు మనకు ఎన్నో రకాలైన సూక్ష్మదర్శినిలు మరియు దూరదర్శినిలు ఉపయోగపడుతున్నాయి. అత్యంత పరమాణు ప్రమాణంలో ఉన్నవాటిని కూడా స్పష్టంగా చూడగలుగుతున్నామంటే అందుకు మనం ఉపయోగించే సూక్ష్మదర్శిని లు మరియు వాటిని తయారుచేసిన శాస్త్రవేత్తల మేధోసంపత్తి అపూర్వము. మరి అవి ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తున్నాయని ప్రశ్నించుకుంటే కాంతి యొక్క పరావర్తన ధర్మమే అని తెలుస్తుంది. మరి అదే ధర్మాన్ని రెండు విభిన్న ప్రక్రియలకు ఎలా వాడగలము అనుకుంటే ... దానికి సమాధానం మరింత శాస్త్రీయ పరిజ్ఞానంతో కూడుకుని వుంటుంది. అది అప్రస్తుతం.

Leeuwenhoek microscopeమనిషి నిజజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను పారద్రోలే ప్రక్రియలలో ఎన్నో విషయాలను అవగాహనతో అర్థం చేసుకునే స్థితికి చేరుకొని, ఎన్నో సైద్ధాంతిక శాస్త్రీయ విశ్లేషణలు జరిపి తద్వారా ఈ సృష్టిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎన్నో వందల సంవత్సరాలుగా మనిషి తన మేధోసంపత్తిని ఉపయోగించి ఎన్నో ఆవిష్కరణలు చేయడం జరుగుతూనే ఉంది. ఆ క్రమంలోనే నేటి అత్యాధునిక పరికరాలకు మూలం వందల ఏళ్లనాడే ప్రారంభమయింది. ఆ కార్యక్రమ బాటలోనే క్రీ.శ. పదిహేడవ శతాబ్దంలోనే కనుగొన్న సూక్ష్మదర్శిని నేడు మనం చూస్తూ, పరిశోధనలు చేస్తున్న ఎన్నో రకాల విషక్రిములను మరింత పటిష్టంగా క్రమపద్ధతిలో నియంత్రించేందుకు ఉపయోగపడుతున్నది. ఆ పరికరాన్ని మొట్టమొదటగా రూపకల్పన చేసి తద్వారా సూక్ష్మ క్రిములు (bacteria), ఏకకణజీవుల (protozoa) ఉనికిని మొట్టమొదటగా గుర్తించిన శాస్త్రవేత్త, microscopist, వ్యాపారవేత్త మరియు డచ్ దేశ ప్రతినిధిగా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీ ఆంటోనీ వాన్ లీవెన్హోక్ (Antony van Leeuwenhoek) నేటి ఆదర్శమూర్తి.

ఆంటోని గారు అక్టోబర్ 24, 1632 సంవత్సరంలో నెదర్లాండ్ దేశంలోని డెల్ఫ్ట్ (Delft) లో జన్మించారు. చిన్నతనం నుండే ఆయన మస్తిష్కంలో ఎన్నో శాస్త్రీయ పరమైన ఆలోచనలు ఉదయించడం మొదలుపెట్టాయి. ఆ ఆలోచనల పరంపరలో వెలువడే ఎన్నో సందేహాలను నివృతి చేసుకునే విధానంలో తనకు తానె గురువై ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. యుక్తవయసులో వ్యాపారం మీద దృష్టి నిలిపి బట్టల వ్యాపారం చేసేవారు. దానితో తృప్తి చెందక రాజకీయాలలో కూడా కాలుమోపి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. జీవితం సాఫీగా సాగుతున్ననూ తన మనస్సులో చెలరేగుతున్న శాస్త్రీయ పరమైన సందేహాలు ఆయనను సైన్సు రంగం వైపు అడుగులు వేయించాయి. ఆ తృష్ణ ఆయనను మైక్రోస్కోప్ ను రూపొందించే దిశగా నడిపి, ప్రపంచంలోనే సూక్ష్మ కణాలను, ఏకకణ జీవులను కనుగొన్న  మొట్టమొదటి వ్యక్తిగా నిలిపింది. ఇది ఆనాటి డచ్ దేశ చరిత్రలోనే ఒక గొప్ప అద్భుత ఆవిష్కరణ గా పేరుపొంది తద్వారా శాస్త్ర సాంకేతిక ప్రపంచంలో డచ్ దేశానికి ఒక సుస్థిర స్థానాన్ని కల్పించింది.

ఆంటోని గారు తను రూపకల్పన చేసిన సూక్ష్మదర్శిని ద్వారా సూక్ష్మ క్రిములను, ఏకకణజీవులను కనుగొనడమే కాకుండా మనిషి శరీర కండరాలలో ఏర్పడే పీచు పదార్థాలను (మాంస కేసరము), సూక్ష్మ క్రిములను కనుగొని తద్వారా అవసరమైన ఆరోగ్య విధానాలకు సూచనలు ఇవ్వగలిగే స్థాయిని కల్పించారు. కేశతుల్యనాళికలలో రక్తం ప్రవహించే విధానాన్ని కూడా విశ్లేషించగలిగారు. తన పరిశోధనా వివరాలను, తద్వారా కనుగొన్న ఫలితాలను ఎప్పటికప్పుడు చేతితో పేపర్ మీద వ్రాసుకుంటూ ఒక చిన్నపాటి నోట్ బుక్ తయారుచేసుకోవడం జరిగింది. ఆయన గ్రంధస్తం చేసిన ఆవిష్కరణలను పరిశీలించిన పిమ్మట వాటిని ప్రచురిస్తూ ప్రఖ్యాత రాయల్ సొసైటీ, 1680 లో ఆయనకు “Fellow of Royal Society (FRS)” గా స్థానం కల్పించింది.

ఆయన కనుగొన్న సూక్ష్మకణ జీవుల ధర్మాలతో జీవ శాస్త్రంలోనే ఒక వినూత్న విప్లవం వచ్చిందని చెప్పవచ్చు. జంతుజాలాల జీవన ప్రక్రియల మీద ఆనాటి వరకు ఉన్న సిద్ధాంతాలన్నీ పూర్తిగా లేక పాక్షికంగా సరిదిద్దుకునే విధానం రూపొందించబడింది. చీమలు మొదలు అత్యంత చిన్నవైన జీవుల మీద తన ప్రధాన దృష్టిని మరలించి వాటి పుట్టుక, జీవన పరిణామాలు, ధర్మాల మీద ఎన్నో వాస్తవ విషయాలను ప్రపంచానికి అందించారు.  అందుకనే ఆయనను అందరూ "the Father of Microbiology" అని పిలవడం జరిగింది.

ఆంటోని కాలంనాటికి అల్ఫ్రెడ్ నోబెల్ ఇంకా పుట్టలేదు కనుక ఆయన రూపొందించిన నోబెల్ పురస్కారం (క్రీ.శ 1901) ఆంటోని కి ఇవ్వడం జరగలేదు. కానీ, ఆనాటి సామాజిక స్థితిగతుల స్థాయిలో ఆయనకు మంచి పేరు, ప్రఖ్యాతులు లభించాయి. ఎంతో మంది నాటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఆయనను కలిసి మంచి విలువైన సూచనలు, సలహాలు, శాస్త్రీయ శిక్షణను పొందటం జరిగింది.

దాదాపు నాలుగు వందల ఏళ్ల నాడు విజ్ఞాన శాస్త్రం అంతగా వికసించని తరుణంలో తన మేధస్సుతో ఎన్నో ఆవిష్కరణలకు తెరదీసి, దాదాపు 400 పైచిలుకు పరిశోధనా వ్యాసాలను ప్రపంచానికి అందించిన ఆ మహానుభావుని గురించి అన్ని తరాల వారు తెలుసుకోవాలి. ఆయన ఆగష్టు 26, 1723 న కాలధర్మం చెందారు. కానీ నేడు మనం వాడుతున్న అత్యాధునిక సూక్ష్మదర్శినులను చూసినప్పుడల్లా వాటి బీజాలను సృష్టించిన ఆయన గుర్తుకు వస్తూనే వుండాలి, అలా ఆయనను మనం కలకాలం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా నేటి కరోనా కాలంలో మన శాస్త్రవేత్తలకు అతి ముఖ్యమైన సమాచార దర్శిని ఈ సూక్ష్మదర్శిని మాత్రమె. ఎన్నో విలువైన విషయాలు ఆ విష క్రిముల జీవ ధర్మాల గురించి తెలిసికొని తద్వారా వాటిని నియంత్రించే మందులు మనం తయారుచేసుకోవడం జరుగుతున్నది.

Posted in December 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!