Menu Close
శేషప్రశ్న
-- వెంపటి హేమ (కలికి) --

పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు “తేనె జాబిలి" (honey moon) పేరున అటు తరలి వెళ్ళగానే, ఇటు పెళ్ళికి వచ్చిన చుట్టాలు కూడా ఒకరొకరూ ఇళ్లకు వెళ్ళిపోడం మొదలుపెట్టారు. సుబ్బారాయుడి కుటుంబం కూడా తిరుగుముఖం పట్టారు. అప్పారావు ఇచ్చిన అడ్రస్ పదిలంగా జేబులో ఉంచుకుని మెదక్ నుండి హైదరాబాదు వెళ్ళీ బస్సు ఎక్కాడు సకుటుంబంగా సుబ్బారాయుడు. హైదరాబాదు బస్సు స్టేషన్లో బస్సుదిగి, వాళ్ళు ఆటోలో అప్పారావు చెప్పిన అడ్రస్ ఉన్న ఇంటికి బయలుదేరారు.

అది విశాలామైన ఆవరణలో కట్టిన రెండంతస్తుల భవనం. గేటుదగ్గర వస్తాదులా ఉన్న మొరటుమనిషి ఒకడు కాపలాగా ఉన్నాడు. గేటులోపల నల్లరంగు కారు ఆగి ఉంది. అడ్రస్ చీటీ కాపలా మనిషికి ఇచ్చి, తమని అప్పారావుగారు పంపారని చెప్పగానే అతడు లోనికి దారి వదిలాడు.

లోపలకు వెళ్ళగానే తాంబూలం సేవిస్తూ సోఫాలో కూర్చుని ఉన్న యజమానురాలు గమ్మున లేచి నిలబడి, అప్పారావు ఫోనులో ముందే చెప్పివుంచడంతో, వాళ్లకు ఎదురుగా వచ్చి, వాళ్ళని లోనికి ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసింది. వాళ్ళు ఉండడానికి ఒక గదిని చూపించింది.

సుబ్బారాయుడు తను వచ్చిన పనిని గురించి ఆమెకు చెప్పాడు. వాళ్ళకు వచ్చిన కష్టానికి చాలా నొచ్చుకుంది ఆమె. నాలుగు సానుభూతి వాక్యాలు కూడా చెప్పింది ఓదార్పుగా.

తన పేరు సావిత్రి - అని చెప్పి, “ఇంటి యజమాని ఊళ్ళో లేరు, రేపు వచ్చేస్తారు. ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి, పని పూర్తిచేసుకుని వెళ్ళొచ్చు” అంది. ఆపై వాళ్ళను విశ్రాంతి తీసుకోమని చెప్పి, వెళ్ళడానికి లేచింది.

అప్పుడు సమయం సాయంకాలం నాలుగయ్యింది. అది వేసవికాలమేమో ఉక్కపోతగా ఉండి, “స్నానం చెయ్యాలి” అని కోరింది ధరణి.

సావిత్రికి చాలా సంతోషమయ్యింది. “అరుణా” అని గట్టిగా పిలిచింది. పాతిక లేదా ముఫ్ఫై వయసున్న ఒక యువతి పరుగున వచ్చింది. ఆమెను తన కోడలిగా పరిచయం చేసింది సావిత్రి.

“చూడు అరుణా! మెట్లపక్కనున్న స్నానాలగది చూపించు, పాప స్నానం చేస్తుందిట. కొత్తసబ్బు, ఇస్త్రీ తువ్వాలు తీసి ఇయ్యి” అని అప్పగించి వెళ్ళిపోయింది సావిత్రి. అరుణకూడా వెళ్లి, సబ్బు, తువ్వాలు తీసుకుని చిటికెలో తిరిగివచ్చింది.

సరిగా అప్పుడే తన నిడుపైన జడను విప్పిoది ధరణి. “పాపా ఇలా రా! నేను నీ తల చిక్కుతీస్తా, నడు” అంటూ మరి మాటాడే అవకాశం ఇవ్వకుండా చెయ్యిపట్టుకుని తన వెంట తీసుకుపోయింది ధరణిని అరుణ.

ఆమెనలా ఏకబిగిని దొడ్డివైపుకి తీసుకువెళ్ళి, అక్కడ పెరడులో మొక్కలమధ్యనున్న సిమెంటు బెంచీమీద కూచోబెట్టి జుట్టు చిక్కితియ్యడం మొదలుపెట్టింది అరుణ.

ఆమె చెవికి దగ్గరగా నోరుంచి, “పాపా! నువ్వు బొత్తిగా రాకూడని చోటికి వచ్చావు” అంది అరుణ.

వెంటనే ధరణి, “నాపేరు ధరణి, పాప కాదు. రాకూడని చోటు అంటున్నావేమిటి” అని తనూ నెమ్మదిగానే అడిగింది.

“ఇది ఒక బ్రోతల్ హౌస్, తెలుసా? తిరణాలలో తప్పిపోయి, అమ్మానాన్నలకోసం ఏడుస్తూ వెతుక్కుంటున్న ఏడేళ్ళ నన్ను వీళ్ళు ఎత్తుకొచ్చారు. తొమ్మిదేళ్ళ వయసునుండి నాచేత ఈ పాపపు వృత్తి చేయిస్తూ డబ్బు గణిస్తోంది సావిత్రి!”

నిర్ఘాంతపోయిన ధరణి తేరుకోడానికి కొంత సమయం కావలసివచ్చింది. తేరుకుని, నోరు కూడదీసుకుని అడిగింది లోగొంతుతో, ”మరి ఆమె నిన్ను కోడలంది కదా!”

“కోడలా - పాడా! మాలాంటి వాళ్ళకు వావి వరసలేమిటి! ఎప్పుడు ఏదితోస్తే అది. టైం వృధా చేయక నేను చెప్పీది విను. నాకు HIV సోకింది. అయినా ఆమె నాకు సెలవియ్యడంలేదు. నా మూలంగా ఎన్ని కుటుంబాలు నాశనమౌతున్నాయోనని నాకు దుఃఖంగా ఉంటుంది. నే నెంత పాపం చేస్తున్నానో - అని నాకు దుఃఖంగా ఉంటుంది ఎప్పుడూ. త్వరలోనే నేను ఎయిడ్సుతో చనిపోవడం ఖాయం. పోయీలోగా ఒక్క మంచిపనైనా చేసి మరీ చనిపోవాలని ఉంది. నేను నిన్ను తప్పిస్తా, నువ్వు నాకు సహకరిస్తే.“

ధరణికి కన్నీరుబికింది, “మా అమ్మా నాన్నా మాటేమిటి? మరి నీ సంగతేమిటి? నాకు భయంగా ఉంది అక్కా!”

గమ్మున అరుణ ధరణిని తలపై ముద్దుపెట్టుకుని అంది, “నువ్వు నన్ను “అక్కా” అన్నావు. అదే నాకు గొప్ప బహుమానం. నేను చెప్పీది శ్రద్ధగా విను - మెట్లదగ్గరున్న నీళ్ళగదిలో దొంగచాటుగా CC కెమెరాలు ఉన్నాయి. ఆ గదిలో స్నానం చేసినవాళ్ళను ఫోటోలు తీస్తాయవి. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేసీ, బెదిరించీ వాళ్ళని లొంగదీసుకుని డబ్బు సంపాదిస్తారు వీళ్ళు. నువ్వందులో స్నానం చెయ్యొద్దు. బాత్రూంలో లైట్ వేసుకుని లోపలకు వెళ్లి తలుపు వేసుకో. ఆ సంగతి కెమెరా రికార్డు చేస్తుంది. నేనీలోగా ప్లగ్ హోల్డర్లో నా సిగపిన్ను దూర్చి స్విచ్చి ఆన్ చేస్తా. వెంటనే కరెంటు పోతుంది. అప్పుడు తలుపు తెరిచి బయటికి వచ్చెయ్యి. దొడ్డితలుపు తాళం తెచ్చా. నిన్ను బయటికి పంపేస్తా. ముందుగా కనిపించిన ఖాళీ ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్లి పో. అక్కడ వాళ్లకి విషయం చెప్పి వాళ్ళని తోడుకురా, మీ అమ్మానాన్నల్ని విడిపించుకుందువుగాని. వీలయితే ఆ పనికూడా నేనే చేసి, వాళ్ళనికూడా పోలీసు స్టేషన్కి పంపుతా. అక్కడ వాళ్ళని కలుసుకుందువుగాని, సరా!”

“సరే అక్కా! మరి నీ సంగతి?”

“నాకు తప్పించుకుపోడం తెలుసు. నువ్వేం బెంగపడకు. అదంతా నేను చూసుకుంటా. జడల్లడం ఐపోయింది ఇక లే!”

####

హటాత్తుగా కరెంటు పోయింది. ఫేను ఆగిపోడంతో ఉక్కపోత భరించలేక తువ్వాలుతో విసురుకుంటూ, ఆపసోపాలు పడుతున్నారు సుబ్బారాయుడు దంపతులు.

అంతలో అక్కడకు సుడిగాలిలా దూసుకు వచ్చింది అరుణ. “అంకుల్! మీరిక్కడనుండి శీఘ్రం వెళ్ళిపొండి. ఇది మీకు తగినచోటు కాదు. మీకీ అడ్రస్ ఇచ్చినవాడు అమ్మాయిల వ్యాపారి. ఇది ఒక ఖరీదైన వ్యభిచారగృహం. ఇక్కడ జరగని అకార్యం లేదు” అంది కంగారు పడుతూ..

తెల్లబోయారు, సుబ్బారాయుడు దంపతులు. “అయ్యో!” ఇద్దరూ ఒకేసారి ఆక్రోశించారు.

“ఐతే మా ధరణి ఎక్కడ” అని అడిగాడు సుబ్బారాయుడు.

“నాతల్లి కేమీ కాలేదుకదా” అంటూ ఘోల్లుమంది తాయారు.

“నేనామెను దొడ్డిగుమ్మం ద్వారా ఇక్కడినుండి దాటించాను. వెంటనే ఆటో దొరికింది. ఆమె పోలీసు స్టేషన్ కి వెడుతోంది ఆటోలో. మీరు కూడా గమ్మున వెళ్ళండి. ఇదే సరైన అదును. వీధి గుమ్మం కాపలా కాసేవాడు “జనరేటర్” ఆన్ చెయ్యడానికి వెళ్ళాడు. సాయంకాలం అవ్వడంతో తక్కినవాళ్ళు మందు కొట్టడానికి వెళ్ళిపోయారు. ఇక్కడున్న ఆడవాళ్ళు ఇంకా నిద్రలు లేవలేదు. ఇక మీరు వేగం లేవండి, పోలీసు స్టేషనుకి వెళ్లి అక్కడ మీ అమ్మాయిని కలుసుకోండి” అని తొందరపెట్టింది అరుణ.

తెల్లబోయి ఆమె వైపు వింతగా చూశారు వాళ్ళు. అరుణ తలపై చెయ్యి ఉంచుకుని ప్రమాణం చేసింది. “నన్ను నమ్మండి. దైవ సాక్షిగా, మా అమ్మానాన్నల సాక్షిగా నేను మీ మంచి కోరి చెపుతున్నాను"అని, "లేవండి” అంది తీక్షణంగా.

ఇక వాళ్ళు ఆలస్యం చెయ్యలేదు. వేగంగా తమ బేగ్గులు తీసుకుని ఆ ఇంటి గేటుదాటి వెళ్ళిపోయారు. అరుణ తెరిపినపడి, ఆ గది తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది.

####

ఆటోపై పోలీసు స్టేషన్ కు చేరుకున్న సుబ్బారాయుడు, తాయారమ్మలకు, అప్పుడే అక్కడకు చేరుకున్న ధరణి కనిపించింది. ధరణి తల్లిని కౌగలించుకుని గుండెల్లోని గుబులు తీరా భోరున ఏడ్చింది.

అంతలో సుబ్బారాయుడు తనకు తెలిసి ఉన్నదంతా ఎస్సై ఎదుట ఏకరువు పెట్టాడు. తక్కిన విషయం ధరణి చెప్పింది.

అంతా విని, “ఆ ఇంటి అడ్రస్ ఇయ్యండి, యాక్షన్ తీసుకుంటాము” అన్నాడు ఎస్సై సుబ్బారాయుడితో.

తెల్లమొహం వేశాడు సుబ్బారాయుడు. “గుమ్మం దగ్గర ఉన్న కాపలావాడు ఆ చీటీ తీసుకుని నలిపేసి పారేశాడు“ అని నసికాడు. ధరణి తనకు గుర్తుందనీ, తను చెప్పగలననీ ముందుకు వచ్చింది.

ధరణి చెప్పిన అడ్రస్ రాసుకుని, ఆమెవైపు చూసి అన్నాడు ఎస్సై, “చూడమ్మా! కేసు జరిగినప్పుడు నువ్వు కోర్టుకి వచ్చి, సాక్ష్యం చెప్పవలసి ఉంటుంది, చెపుతావా?”

ఎస్సై మాట ఇంకా పూర్తిచెయ్యకముందే తాయారమ్మ అందుకుని, “అదెట్టా కుదురుతుంది సారూ! పెళ్ళికావలసిన పిల్ల! ఇంతవరకూ జరిగింది బయటపడితే, ఇక పిల్లకి పెళ్ళి చెయ్యడం ఎలాగా అని నేను బేజారౌతూవుంటే, కోర్టుకొచ్చి బోనెక్కి సాక్ష్యం చెప్పడం కూడానా” అంది కంఠశోషగా.

“సరేనమ్మా, ఒద్దులే. అందుకే, మీరేమంటారోనని ముందుగానే అడిగా. మీ పిల్లపేరేకాదు, మీపేరుకూడా పైకి రానీకుండానే ఆ ఇంటిపై "రైడ్"కి వెడతాములే. ఈ రాత్రి బయలుదేరే గౌతమీ ఎక్సుప్రెస్ లో మీకు సీట్లు రిజర్వు చేయిస్తా. విజయవాడ స్టేషన్ లో దిగి, తెల్లవారాక బస్సెక్కి మీ ఊరు వెళ్ళిపోదురుగాని” అన్నాడు ఎస్సై .

ఎస్సై చేస్తున్న సాయానికి సుబ్బారాయుడు, కుటుంబం సంతోషించారు. పెద్ద కష్టం వచ్చి చిన్న కష్టాన్ని మరిపించింది తాత్కాలికంగా.

రైలు కదిలి ప్లాటుఫారాన్ని వదిలి వెళ్లే వరకూ వాళ్ళెవరూ ఒకరితో ఒకరు మాటాడుకోలేదు. ఆ రైలు యాక్సిలరేతై వేగాన్ని పుంజుకున్నాక నెమ్మదిగా అంది తాయారమ్మ, "సాధ్యమైనంత తొందరగా మనం ధరణి పెళ్లి జరిపించడం మంచిదేమో..." అని.

ఉసూరుమని నిట్టూర్చి అన్నాడు సుబ్బారాయుడు, "నీ సలహా బాగానే ఉంది. కానీ, ఇప్పుడు మనకున్న స్టేటస్కి మంచిసంబంధం కావాలంటే వస్తుందా? చూసి చూసి వార హీనం పెళ్లి చెయ్యలేముకదా! "

ధరణి లోగొంతుతో అంది, తల్లితండ్రులకు మాత్రమే వినిపించేలా. "నాన్నా! నాపెళ్ళి గురించి ఆలోచించవద్దు. ముందుగా అమరావతికి పట్టిన గ్రహణం వదలాలి, ఆ తరవాతే నాపెళ్ళి.  అంతవరకూ నేను ఉద్యోగం  చేస్తూ, అమరావతి ఉద్యమానికి సహకరిస్తూ ఉంటా. బలవంతపెట్టి నన్ను బాధపెట్టవద్దు" అని ఖండితంగా చెప్పేసి, కిటికీవైపు తిరిగి, బయటి ప్రపంచాన్ని చూడడంలో నిమగ్నమై పోయింది ఆమె.

సుబ్బారాయుడు, తాయారమ్మ అవాక్కై చేష్టలుదక్కి ఉండిపోయారు. అవేమీ పట్టని రైలుబండి ఒగర్చుకుంటూ తనదారిని తానూ గమ్యం వైపుగా పరుగు పెడుతూ ముందుకి సాగిపోతోంది.

ఆంధ్రుల ఆడబిడ్డ ధరణి పెళ్లి "శేషప్రశ్న" కాకూడదనీ, త్వరలోనే ఆమె పెళ్లి జరగాలనీ మనమందరమూ కోరుకుందాము.

**సమాప్తం**

Posted in December 2021, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!