Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

కాకతీయ యుగం - తిక్కన సోమయాజి

తిక్కన గారి సామెతలు-జాతీయాలు :

ఏ భాషకైనా సామెతలు, జాతీయాలు భూషణాలు. తిక్కన, నన్నయాదులు వాడిన సామెతలు, జాతీయాలు అప్పటినుండి ఇప్పటి వరకు ప్రజల నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. మచ్చుకు కొన్ని –

     కయ్యమునకు కాలుద్రవ్వకున్న (విరాట, 3-110)
     మొకాలొడ్డిన వారి విధము (ఉద్యోగ పర్వం – 3-398)
     కొంగున నగ్ని దాచినట్లు (స్త్రీ, 2-179)
     పెన్నిధి గన్న డీద చందంబున (4-149)

ఇలాంటివి తిక్కన సంభాషణలలో, వర్ణనలలో మనకు దర్శనమిస్తాయి.

‘కుకవులు’; ఏ కాలంలోనైనా కవుల విభజనలో ఈ రకం వారుంటారు. తిక్కన కాలం నాటి భాషా సంబంధమైన విధానాలను గూర్చిన ఆరుద్ర వివరణ -క్లుప్తంగా:

“తిక్కన కాలంలో ఇష్టం వచ్చినట్లు సంస్కృత ఫక్కీలో తెలుగు రచన చేసేవారు కాబోలు. పండితారాధ్యుడు తన కందాలలో స్మృతి, శృతి పురాణాలలో నుండి సంస్కృతోదాహరణాలను వందలకొద్దీ చొప్పించాడు.”

మణి ప్రవాళశైలి – అంటే వివిధ భాషా పదాలతో కలిపి రచన చెయ్యడం. ఇది కూడా ఆనాడు ఉన్నది. సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగు కవులు సంస్కృత భాషను తెలుగులో ఎలాంటి మార్పు చేయకుండా విభక్తులు మార్చకుండా వాడడం జరిగింది. “ఆలస్యం అమృతం విషం” వంటిది. వీటిని కేతన కూడా తన ఆంధ్ర భాషా భూషణం లో ఖండించాడు. తిక్కన కుకవులను, దుర్విదగ్ధలను ఒకే కోవలో వాళ్ళుగా జమ కట్టాడు. (స.ఆం.సా. పుటలు 324-326).

     ‘తెలుగు కవిత్వము జెప్పం
      దలచిన కవి యర్ధమునకు దగియుండెడుమా
      టలు గొని వళులు ప్రాసం
      బులు నిలుపక యోగిని బులిమి పుచ్చుట చదురే’

యతి ప్రాసల విషయంలో, సంస్కృత భాషను తెలుగు కవులు వాడుకొన్న విషయంలో, దీర్ఘాలు పెట్టి వ్రాసే విషయంలో తిక్కన తన నిరసన తెలియజేశాడు. ఆరుద్ర పరిశీలనా దృష్టిలో తిక్కనను గూర్చి ఆయన రచనా పద్ధతులను గూర్చి విపులంగానే చర్చించారు.

తిక్కన గారి వాల్మీకి – నిర్వచనోత్తర రామాయణము

నిర్వచనము – మొత్తం గ్రంథం అంతా, పద్యాలకు పద్యాలకు మధ్య ఎలాంటి వచనం లేకుండా కేవలం పద్యాలతోనే తిక్కన రామాయణం రచించాడు. అందుకే అది నిర్వచనోత్తర రామాయణమయింది.

“ఒక మహాకవి ఇంకొక మహాకవి పాత్రను తన రచనలో సృష్టించినప్పుడు అతని నోటి వెంట ఏ మాటలు చెప్పిస్తాడో, ఏ భావాలు వివరిస్తాడో, ఏ ఉపదేశం చేయిస్తాడో చూస్తె అది చాలా ఔచిత్యంగా కనపడక మానదు. వాల్మీకి పాత్రను తిక్కన గారు ఎలా చిత్రించారో చూద్దాం!!”. ఆరుద్ర గారు చెప్పిన పై మాటల వలన తిక్కన గారు, రామాయణం లోని రామాది పాత్రలనే గాక వాల్మీకి పాత్రను గూడా చిత్రించారని తెలుస్తున్నది.

తిక్కన గారి నిర్వచనోత్తర రామాయణంలో గాథ రాముడు సీత అరణ్యవాసానంతరం అయోధ్యకు చేరిన తర్వాత సీత గర్భిణిగా ఉన్నప్పుడు రాముడు ఆమెను ఒక పౌరుని మాట ప్రకారం అడవికి పంపించే గాధ – ఉత్తర రామాయణంగా రచింపబడింది. దానిని వచన రహితంగా తిక్కన రచించాడు.

ఇందలి కథా విధానం:   ఏటి ఒడ్డున కూర్చొని సీతమ్మ ఏకధారగా ఏడుస్తుండడం ముని బాలకులు చూచి వాల్మీకికి విన్నవించారు. వాల్మీకి దివ్య దృష్టితో చూచి విషయం గ్రహించి వెంటనే ధర్మవిధిని మహితార్ఘ్యపాత్రను చేతబట్టి అక్కడకు చేరగా సీత తన అశ్రుధారలతో ఆ మునికి పాద్యం సమర్పించింది. అప్పుడు వాల్మీకి,

     “లోకముల నెద్దియేనియు నాకు నెరుగ
      రాణి యట్టిది లేదు నిర్మలత నొప్పు
      నీదు చరితంబు తెల్లంబుగాదె రాము
      నేరమియె చూచె యింతయు నిక్క మరయ!”

‘నాకన్నీ తెలుసు’ అన్న మాట ఇక్కడ అవసరం. ఆమె (సీత) వాల్మీకి మాటలను విశ్వసించడానికి ఈ ధిషణాహంకారం ఇక్కడ కావాలి అంటాడు ఆరుద్ర. అంతా నాకు తెలుసు అనడం వల్ల సీత వృత్తాంతమంతా వాల్మీకికి తెలుసునన్న ఒక్క భావం సీతమ్మలో భయాన్ని, బాధను పోగొట్టగలదు.

“ఇది మనయాశ్రమం బిచట ....(ఇ)రిది నీ గృహంబునకు జేరితి...అన్న పద్యంలో ఈ ఆశ్రమం నీ పుట్టింటి వంటిది అన్న ఆత్మీయత కనిపిస్తుంది.

తిక్కన ఈ క్రింది పద్యంలో వాల్మీకి చేత రాముని గూర్చి ఎలా పలికించాడో చూడండి.

     “జనకుని కూతురార్య, గుణశాలిని, రామునిదేవి, సీతయా
      తని కొరగామినియ్యెడకు దాపసవృత్తి జరింపవచ్చె”

ఈ పద్యాన్ని గూర్చి చెప్తూ ఆరుద్ర తిక్కనను, వాల్మీకిని ఇద్దరినీ మనసులో పెట్టుకుని ఇలా అన్నారు.

“ఎంత మితభాషి. ఎంత తూచి వాడిన మాటలు. జనకుని కూతురు, ఆర్య గుణశాలిని. రాముని దేవి. సీత అతని చేతకానితనం వల్ల ఇక్కడికి తాపస వృత్తి చరించడానికి వచ్చింది అనడంలో ఎంతో కథ ఒక మహాకవి ఇంకొక మహాకవి చేత చెప్పించాడు.”

తిక్కన గారు వాల్మీకి మహర్షి చేత తిరిగి మాట్లాడించిన ఘట్టం -శ్రీరాముడు అశ్వమేథ యాగం చేసినప్పటి ఘట్టం. రాముడు దేవుడే కావచ్చు. తిక్కనగారి వాల్మీకి భయపడలేదు. ఆశ్వమేథ యాగానికి కుశ-లవులను తీసుకొని వెళ్ళిన వాల్మీకి వారి చేత తాను రచించిన రామాయణాన్ని అక్కడ గానం చేయించాడు. అది విన్న రాముడు ఎంతో సంతసించి ‘ఈ పిల్లలు ఎవరో వినాలని ఉంది. ఇందులో ఏమీ రహస్యం లేకపోతే చెప్ప’మని వాల్మీకిని అడిగినప్పుడు, తిక్కన వాల్మీకి నోట పలికించిన పలుకులు-

1) “వినయము బెంపు నేర్పును వివేకమునుం గల నీవు మేదినీ
     తనయ దొరంగు టెట్లు .....”

2) నా డగ్నిలోనీ ద్రోచిన
    వాడవకట యంత లోక వల్లభ నిమ్మై,
    నీ డడవి ద్రోచి తెదెగడు
    బాడిగదే నీకు రాఘవకుల ప్రవరా!

    ఎన్నో సుగుణాలు కలిగి ఉన్న నీవు చేసిన ఈ పనికి నేను

    “అంతనుండియు నీతోడ నలిగియున్న
     వారమేమది, యట్లుండె వారిజాక్షి
     తెరగు వినుమని యిట్లను మరియు మున్తివీ
     నీతజాతోయ్యకుండగు నృపవరునకు!

దీన్ని గూర్చి చెప్తూ ఆరుద్ర “ఆనాటి నుండి నువ్వంటే నాకు కోపం” అని రామునితో తిక్కనగారి వాల్మీకి అనగలడు” అని తిక్కన వ్యక్తిత్వాన్ని గుర్తుచేశారు.

     “ఎంతకాలంబు వోయిన నెరవగాదె
      యొరుల సొమ్మని దలచి యాగోత్సవమున
      కిదియ కానుకగా వీరినిట్లు తెచ్చి
      నిన్ను జేర్చితి రఘుకుల నృపవరేణ్య”

తిక్కన గారు వ్యాస, వాల్మీకుల సృష్టిని తన సొంతం చేసుకొన్న కవివరేణ్యుడు, కవికి నిర్భయంగా సత్యాన్ని చెప్పే ధైర్యం ఉండాలి. అందుకే రాముని సుగుణాలను తెల్పిన తిక్కన ‘అతని చేతగానితనం వల్ల అని గూడా అనగలిగాడు. ఇక్కడ రాముడు చేసిన పని మాత్రం ఎంత రాజధర్మం అని చెప్పుకున్నా, నిండు చూలాలని నిర్దయగా వదిలివేయడం మానవత్వానికి మాయని మచ్చ.

తిక్కన గారి ఆశయం ఆనందం. ఆంధ్రావళి మోదం బొరయునట్లుగా మహా కవిత్వ దీక్షావిధి తో భారత, రామాయణాలను రెంటినీ రసపూర్ణంగా రచించారు. భారత పర్వంత పద్యాలలో ఆనంద మనే పదం ఎలా ఉన్నదో ఆరుద్ర ఒక పట్టికగా ఇచ్చాడు. తిక్కన రచనలో ఈ ఆనంద ముద్రను గూర్చి మొట్ట మొదట గుర్తించింది రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారని ఆరుద్ర తెల్పారు. (స.ఆం.సా. పేజి 347)

తిక్కన ఉత్తర రామాయణం ముందు రచించారు. అప్పటికి ఆయన యజ్ఞం చేసి సోమయాజి కాలేదు. ఈ విషయం నిర్వచనోత్తర రామాయణం లో తెలుస్తున్నది. “ఇది శ్రీ మదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధనా విధేయ తిక్కన నామధేయ ప్రగీతంబు” అని ఉంది. కేతన, తిక్కనను పదకొండు సార్లు యజ్ఞయాగాదులు చేసినట్లు వర్ణించాడు. కాని సోమయజ్ఞం గురించి చెప్పలేదు కాబట్టి తర్వాత సోమయజ్ఞం చేసి సోమయాజియై అటుపైన భారత రచన చేసినట్లు ఈ వాక్యాలు తెలుపుతున్నాయి.  భారతంలో “ఇది శ్రీ మదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధనా విధేయ తిక్కన సోమయాజి ప్రగీతంబు” అన్న దానివల్ల సోమయాజి అయిన తర్వాత భారత రచన చేశాడు తిక్కన అని తెలుస్తున్నది. నిర్వచనోత్తర రామాయణం గూర్చి ఆరుద్ర వివరణ. నిర్వచనోత్తర రామాయణం పది ఆశ్వాసాల గ్రంథం. వాస్తవానికి ఈ రామాయణం లో పది ఆశ్వాసాలలో ఏడు ఆశ్వాసాల వరకు రావణుని కథే ఉంది. ఈ రావణ చరిత్రకు రాముడు కేవలం శ్రోత. ఎనిమిదవ ఆశ్వాసం నుండి రామకథ మొదలవుతుంది. తిక్కన గారు వర్ణించిన సీతారాముల జల, ఉద్యాన, తీరా విహారాలకు నన్నెచోడుని కుమార సంభవం లోని వర్ణనలు తిక్కనకు దర్శనమిచ్చి ఉండవచ్చు.

రాముడు సీతను అడవిలో వదిలిపెట్టినప్పటికీ ఆమెకు రక్షణ కవచంగా ఉంటే ప్రాంతాన్ని చెప్పడంలో రాముని యొక్క విజ్ఞత తెలుస్తున్నది. వాల్మీకి ఆశ్రమం వద్ద వదిలిపెట్టమని లక్ష్మణునితో చెప్పడం ఎంతో ఆలోచించి చెప్పిన మాట.

అలాగే సీతమ్మ మాటలు చూడండి. “అతడు తన భర్తగా తనను పంపలేదు. జనపతిగా, రాజుగా పంపాడు. అందుకే నేను భార్యగా కాకుండా ఒక స్త్రీ గా ఆయన మాటలను శిరసావహించాలి.” అంటుంది. ఎడబాటు సమయంలో కూడా ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ గౌరవం! అందుకే ఇది నిర్వచించలేని ప్రేమాయణం అని చెప్పవచ్చు.

**** సశేషం ****

Posted in December 2021, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!