Menu Close
Galpika-pagetitle
పంకజాలు -- శ్రీముఖి

విజయవాడ బస్ స్టాండ్. విజయవాడ నుండి విస్సన్నపేట బస్ ని చూసి, క్రిందపెట్టిన బాగ్ తీసుకుంటూ మా పిల్లలిద్దరినీ "పదండి, పదండి" అంటూ తొందరపెట్టాను. తోసుకుంటూ ముందు ఎక్కిన వారికి సీట్లు దొరికాయి. చివర ఖాళీగా ఉన్న సీటు చూసి ఎనిమిది, పదేళ్ల మా పిల్లలిద్దరినీ వెళ్లి అక్కడ సర్దుకోమని చెప్పాను. నేను నిలబడ్డాను. చేతి వాచీ చూసుకున్నాను. సాయంత్రం నాలుగున్నర..

విస్సన్నపేట దిగి, అక్కడ నుండి చనుబండ వెళ్ళాలి. అక్కడ నుండి నాలుగు కి.మీ. దూరం లో ఉన్న కొర్లమండ వెళ్ళాలి...చనుబండ నించి రిక్షా, లేదా నడక..ఆటోలు..ఉండవు.

ఆ ఊరి స్కూల్లో టీచర్ ని. మర్నాడు సోమవారం స్కూల్ ఉంది... ప్చ్... కాస్త పెందల కడనే బైలు దేరాల్సింది...

బస్ కుదుపులకు అటూ ఇటూ వరుగుతూ, పడిపోకుండా నిలదొక్కుకుంటూ...ఆలోచనల్లో ఉన్ననేను ఎవరో పిల్చినట్లయి తిరిగి చూశాను. అవతల సీట్లో కూర్చున్న భార్యభర్త లిద్దరిలో భర్త

"మీరు ఇక్కడ కూర్చోండి..." అంటూ లేచారు.

"ఫర్వాలేదండీ" అంటున్నా ఆయన లేచి అవతలికి వెళ్లటంతో, వెళ్లి కూర్చున్నాను. బాగ్ దగ్గరకు లాక్కుని, సీట్లో సరిగా కూర్చున్నాక, ప్రక్కనున్న ఆమె వైపు చూశాను.

మనిషి హుందాగా, ఆకర్షణీయంగా ఉంది, నా వయస్సే వుండొచ్చు.

నవ్వాను  పలకరింపుగా. ఆమె నవ్వుతూ అడిగింది

"ఎక్కడ దిగాలి మీరు?"

“విస్సన్నపేట అండీ."

"మాదీ విసన్న పేటే. మీరుండేది ఎక్కడ?"

"మేము అక్కడ దిగి, చనుబండ వెళ్ళాలి, అక్కడినుంచి..కొర్లమండ వెళ్ళాలండీ" చెప్పాను.

"ఓ....మీ పేరు తెలుసుకోవచ్చా? అడిగింది.

"సంయుక్త." చెప్పాను.

"బావుంది. నా పేరు సుధేష్ణా దేవి. వినే ఉంటారు..." అందామె.

నేను మోమాటంగా నవ్వాను......సుధేష్ణాదేవి...ఎక్కడ విన్నాను...ఆ...గుర్తొస్తుంది...భారతం లో..విరాట రాజు భార్య పేరు..ఇదే ననుకుంటా...ఆమె..ఈమయ్యే అవకాశం లేదు...మరి....?

"మీకు వారపత్రికలు చదివే అలవాటుందా?" అడిగిందామె.

"తరచుగా చదవను,"

"అలాగా...మొన్న దీపావళి కథల పోటీలో, నా కథకు పాతికవేల మొదటి బహుమతి వచ్చింది."

"సంతోషమండీ.. అభినందనలు! కథ పేరు ఏమిటీ?" అడిగాను.

"మానవత్వం."

"తప్పకుండా, నేను తెప్పించుకుని చదువుతాను." చెప్పాను.

"విజయవాడలో పని ఉండి వెళ్లాం. కారు ఇబ్బంది పెట్టింది. అదక్కడ ఉంచి, బస్ ఎక్కేశామ్" అందామె.

ఆమె రచయిత్రి అని తెలిసీ, తన కలుపుగోలు తనానికి, నాకు చాలా అబ్బురమనిపించింది. ఆమె ఏమేం వ్రాశారో చెప్తున్నారు, నేను ఆసక్తి గా  వింటున్నాను...

కిటికీ లో నుండి బైటకి చూశాను. శీతాకాలం..పైగా మబ్బులు పట్టి, చీకటి పడి పోయినట్లుంది.

విస్సన్నపేట వచ్చేశామ్, కానీ బస్ ఊరి బైట ఆపేసి ఉంది. మాటల్లో పడి గమనించలేదు.. బస్ ముందు చాలా లారీలు, ఆగి రోడ్డంతా.. ఆగిపోయిన వాహనాలతో, వెళ్లే దారిలేకుండా పోయింది.

ఓ రాజకీయ నాయకుడు ఉన్న కారుకి, ఎంతకీ లారీడ్రైవర్..సైడ్ ఇవ్వలేదని.. ఓవర్ టేక్ చేసి, తిట్టటమో.. చెంప మీద కొట్టటమో.. చేశారట..

ఎవరు చూసినా 'ట, ట..' అని చెప్పేవాళ్లే... అరుపులు, కేకలు,..కనుచీకటి పడిపోయింది.

"ఇవన్నీ క్లియర్ అయ్యేసరికి చాలా సమయం  పట్టేలా ఉంది...ఈ ఊరి వాళ్లయితే దిగి వెళ్లొచ్చు. దూరపు వాళ్ళుండండి.." కండక్టర్ చెప్పేసి, డ్రైవర్తో దిగి వెళ్లిపోయాడు.

నా గుండెలో బండ పడింది. పై పెచ్చు 'దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన' అన్నట్లు.. 'వచ్చేస్తున్నా..వచ్చేస్తున్నా'

అన్నట్లుంది వర్షం.

అందరితో పాటు, పిల్లల్ని తీసుకుని నేనూ దిగి పోయాను. దిగక  చేసేదేముంది? సరాసరి  గమ్యం చేర్చే బస్ కాదు. మరొకటి ఎక్కి, దిగాక, ఇంకొకటి చూసుకోవాలిసిన పరిస్థితి!

అపుడే ఎనిమిది గంటలు కావొస్తోంది...ప్చ్...అయోమయంగా ఉంది... మాతో పాటు దిగిన సుధేష్ణాదేవి

"ఇప్పుడెలా వెళ్తారు? ఈ ఊర్లో తెలిసినవాళ్ళు గాని, బంధువులు గాని ఉన్నారా?" అడిగారు.

"ఎవరూ లేరండీ" దిగులుగా చెప్పాను.

అంతలో ఆమె భర్త హెచ్చరించారు "అమ్మా, పిల్లలు జాగ్రత్త, రాళ్లు విసురు కుంటున్నారు...రోడ్డంతా జామై పోయింది..బస్టాండ్ లోకి ఇదుగో ఈ సందు లోనించి వెళ్ళండి...మేము ఆ సందులోంచి వెళ్ళాలి.." అంటూనే ఆయన అటు నడవ సాగారు.

"జాగ్రత్త గా వెళ్ళండి" అంటున్న ఆమెతో.."పోనీ..ఈ రాత్రికి..మీ ఇంటికి..రమ్మంటారా?" అడుగుదామనుకున్నాను. స్వాభిమానంతో, స్వరం పెగల్లేదు.

సుధేష్ణా దేవి భర్త తో పాటు వెళ్లారు. నేను పిల్లలు సందుల్లో నించి బస్టాండ్ లోకి చేరుకున్నాము.

బస్టాండ్..అంటే..ఎటువంటి ఆశ్రయం లేదు అక్కడ మధ్యలో సమతల ప్రదేశం, ఒక ప్రక్క పెద్ద చెరువు..మిగతా చుట్టూ చిన్న చిన్న బడ్డీ కొట్లు..ఉన్నాయి.

మేము వెళ్లి ఓ కొట్టు ముందు ఉన్న చిన్న బల్ల మీద పిల్లలు ఇద్దరినీ కూర్చోమని చెప్పి,..దిక్కు తోచనట్టు, దిక్కులు చూస్తూ నిలబడ్డాను.

"ఎక్కడికెళ్లాలమ్మా.." అడిగాడు కొట్టతను. చెప్పాను.

"ఇప్పుడప్పుడే ఏమీ కదిలేట్టు లేవమ్మా..." అంటున్నాడు. అంతలోనే...

"సోడా కాయలు ఇసురు కుంటున్నారు..కొట్లు కట్టేయండి రో." అరుస్తూ మిగతా కొట్ల వాళ్ళు గబగబా బడ్డీలు మూసేయసాగారు..

ఆ అరుపులు వినగానే నాతో మాట్లాడే కొట్టతను చటుక్కున లేచి గాభరాగా సర్దేసుకుంటున్నాడు.

"అమ్మా, మీరు కూడా ఎక్కడికన్నావెళ్ళండి. ఇక్కడ ఉండటం మంచిది కాదు. పిల్లలకు ఎటునుంచి వచ్చి ఏం తగుల్తాయో..." అంటూనే  పిల్లలు కూర్చున్న బల్ల కోసం వచ్చాడు.

నాకు చుట్టూ కమ్మిన చీకట్ల కంటే నా కళ్లముందూ, మనస్సు లోను మరింత దట్టం గా కమ్మాయి.

మేమున్నది అడవి లో కాదు, ఏ క్రూర మృగాలు దాడి చేస్తాయో, ఏ విషపురుగులు కాటేస్తాయో అని భయపడటానికి....ఊరు మధ్య లో.......ఉన్నాం. చుట్టూ వున్న వాళ్లంతా నా తోటి మనుష్యులే... వాళ్లే ప్రమాద హేతువనుకుంటే...ఎంతటి అభద్రతా భావంతో...ఎంత ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్నామో..అనిపించింది.

ఏం చేయాలో తోచటం లేదు...ఏ ఇంటికయినా వెళ్లి తలుపు తట్టటానికైనా...ఇదంతా బజారు, కొట్లు... పైగా..ఒకటే జనం...నా కళ్లనుండి రాలే నీటిచుక్కల్ని పట్టించు కోకుండా, పై నుంచి రాలే వాన చినుకులకు తడవకుండా, పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని పైటకొంగు కప్పాను.

చుట్టుపక్కల నుండి అరుపులు, కేకలు..ఉరుకులు పరుగులు. ఇదే అదనుగా అల్లరి మూకలు తెగబడి, కొట్లలో జొరబడి గలాభా చేస్తున్నారట.... ఏమి జరుగుతుందో..చెప్పేవాళ్ళు లేరు..కొట్టతను చిన్న వైరుబుట్టలో ఏవో బాక్స్ లు, తాళాలు వేసుకుని వెళ్లబోతూ ఆగి చూశాడు.

"అమ్మా, మీరేం అనుకోక పోతే...మా ఇంటికొత్తారా?" అడిగాడు సందిగ్ధంగా.

అక్కడే నిలబడిన మరొకాయన నన్నూ, పిల్లలను చూస్తూ అన్నాడు

"అమ్మా, మీరు ఇక్కడుండటం..అంత మంచిదికాదు కాసేపటికి ఈ గొడవ సద్దుమణిగినా, ఈ నెరాబు మీదికి తాగుబోతు గాళ్లందరూ జేరతారు"

ఏమనాలి? వెళ్ళాలా...వద్దా? వేరే దారి కనిపించటం లేదు.

మళ్లీ అతనే అన్నాడు

"నా పేరు 'సూరి' 'అమ్మా..ఇంటికాడ మా ఆడది ఉంది.."

"రాక తప్పటం లేదయ్యా" అంటూ అతని వెనుక నడిచాం.

సందుల్లో గొందుల్లో నించి తీసుకెళుతున్నాడు, తెలుస్తూనే ఉంది...అదో మురికి వాడ అని.

చివరికి...చెరువు కట్ట మీదున్న చిన్న పూరింటి ముందు ఆగాము.

"ఏమేయ్... తలుపు తీయి" పిలిచాడు.

తలుపు తీసింది అతని భార్య

"బజాట్లో గోలగోల గాఉందే...ఈయమ్మ కొర్లమండ ఎల్లాలంట....ఆడ కూతురు..ఆ గడబిడ లో చిన్న బిడ్డల తో ఎందుకని..."

"మంచిపని చేశావులే.. రాళ్ళురప్పలు ఇసురుకుంటున్నారంట గా...

రాండి అమ్మా..." అంటూనే ఆమె గిరుక్కున వెను తిరిగి..నులక మంచం లో, నిద్రపోతున్న అయిదు, మూడేళ్ళ వయసున్న ఇద్దరు పిల్లలిని క్రింద ఒక పాచీర లాంటిది పరచి, లేపి పడుకోబెడుతుంది..

"వాళ్ళనలా ఉంచమ్మా" అని వారించినా..వినకుండా...

ఒక దుప్పటి తెచ్చి మంచం మీద పరచింది.

"అమ్మా, మీకు...పిల్లలికి అది చాలదనుకుంటా...ఇంటో... ఇంకోటి లేదు...." అంది.. ఏంచేయాలో తోచనట్లుగా

"నీ పేరేమిటమ్మా?" అడిగాను.

“సీతాలమ్మా"

"సీతమ్మా...ఈ రోజు మాకు మీ ఇంట్లో చోటివ్వటమే పెద్ద ఉపకారం... మాగూర్చి..ఆలోచించకు." అన్నాను.

అంతలో సూరి నా వైపు చూస్తూ

"అమ్మా...మా ఇంటోది వద్దులే..ఎల్లి.. బుట్టబోజనం తెత్తాను. పిల్లలు, మీరు ఎంగిలి పడుదురు గాని..." అన్నాడు.

"బుట్ట భోజనం"అంటే?" అర్ధం కాక అడిగాను.

"అదేనమ్మా..ఓటలు బోజనం...బజాట్లో దాకా ఎల్లక్కర్లా...దగ్గిరలో బాగ్గెమ్మ మెస్సుంది. చినుకులు కూడా తగ్గినయ్..గబుక్కున ఎల్లి వచ్చేత్తాను." వెళ్లబోతున్నాడు సూరి. వద్దని ఆపేశాను.

"తెత్తానని చెప్పెళతారా.. ఎల్లి తేక " అంటుంది సీతమ్మ

"అమ్మా..నువ్వాగు, ఇప్పుడేమి తినాలని లేదు..బ్యాగు లో చిరుతిళ్ళున్నాయి..అవి  తింటారులే" అంటూ బ్యాగ్ తీశాను. వచ్చేపుడు అమ్మ చేసి ఇచ్చిన కజ్జికాయలు, కారప్పూస, పెరట్లో చెట్టుక్కాసిన జామకాయలు తీసి పిల్లలకు చెరి కాసిని పెట్టి, మిగతావన్నీ  సీతమ్మకిచ్చాను. "మీ పిల్లలకు ఉంచమ్మా" అని.

మా పిల్లలు మంచం మీద పడుకుంటే...నేను వాళ్ళ పక్కనే ఒదిగి కూర్చున్నాను. సూరి, సీతమ్మ వాళ్లకున్నదేదో తిన్నారు. సీతమ్మనడిగి మంచినీళ్లు త్రాగాను. వాళ్లిద్దరూవెళ్లి, మధ్యలో ఉన్న పిల్లల మీద చేతులేసుకుని, చెరో ప్రక్కన పడుకున్నారు. వాళ్ళనలా చూస్తుంటే...నా కెంతో ముచ్చటగా అనిపించింది.

తెల్లారి పోయింది!

"మీరు ఉండండి అమ్మా..నేనెల్లి చూసొత్తాను." అంటూ వెళ్ళాడు సూరి.

సీతమ్మ పళ్లపొడి పొట్లం, నాలుక గీసుకోవటానికి కొత్త తాటాకు ముక్కలు ఇచ్చింది.

సూరి వచ్చాడు.

"ఆ గోల నడి జాముకు సద్దు మణిగిందంటమ్మా...ఎవరో నాయకుడి కారుకి, సైడియ్య లేదని లారీ డ్రైవర్ ని కొట్టారట...డ్రైవర్లంతా ఏకమై క్షమాపణలు చెప్పించారంట. ఇప్పుడిపుడే  బైలుదేరుతున్నాయ్ బస్ లు..." చెప్పాడు.

మేము బైలు దేరి...సూరి పిల్లలిద్దరి చేతుల్లో చెరో వంద రూపాయిలు పెట్టాను.

"ఈసారి నేను అట్నుంచి వచ్చేపుడు, మీ ఇద్దరికీ  క్రొత్తబట్టలు తెస్తానేమ్"? అన్నాను పిల్లలతో.

నా మనస్సంతా వాళ్ళమీద కృతజ్ఞతతో నిండిపోయింది. రోజూ మనం ఎంత ఆడంబరం గా, సౌకర్యవంతమైన..జీవితాన్నిగడుపుతున్నా...అలాంటి ఒక్క రాత్రి చాలు బ్రతుకులు తిరగబడటానికి... అలాంటప్పుడు ఆదుకునేదే 'ఆపన్నహస్తం' అంటే!!

పిల్లల చేతుల్లో డబ్బులు తీస్తూ, "ఎందుకమ్మా...వద్దు.." అంటూ తిరిగి ఇవ్వబోతూ మోమాటంగా అంది సీతమ్మ.

"వెళ్ళొస్తాము...సీతమ్మా, మీ ఇద్దరి ఆదరాన్ని మర్చిపోలేను." వారిద్దరికి, మనస్ఫూర్తిగా చేతులు జోడిస్తూ చెప్పాను.

"చూత్తావేంటి? బాగు తీసుకో..అమ్మ గారిని బస్ ఎక్కిచ్చి రా" అంది సీతమ్మ.

సూరి బ్యాగ్ తీసుకుని నడుస్తూ "రాండి , అమ్మా" అన్నాడు.

తెల్లారి వెలుగులో చెరువును చూస్తున్న మా చిన పాప

"భలే భలే....కలువ పూలు!!" అంది.

"కలువ పూలు కాదు చెల్లీ, తామర పూలు!” చెప్పింది పెద్ద పాప.

ఇద్దరూ కలిసి నన్నడిగారు "నువ్ చెప్పమ్మా..ఏమనాలి ?"అని.

నేను ముందు నడుస్తున్న సూరి ని, వీడ్కోలిస్తూ వెనుక నిలబడిన సీతమ్మనూ చూస్తూ చెప్పాను, "పంకజాలు!!" అని.

రెండోగది -- డా.సిహెచ్.సుశీల

హాలులో లైట్ ఆఫ్ చేసి నాగదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొన్నాను. శరీరాన్ని మంచం పైకి చేరవేశాను. ఎదురుగా మాస్టర్ బెడ్రూం తలుపులు క్రిందనుండి వెలుతురు కనిపిస్తోంది. సన్నగా మాటలు నవ్వులు వినిపిస్తున్నాయి.

దీన్దుంపతెగ. ఈ టుబెడ్రూం, త్రీబెడ్రూం పధ్ధతి ఎవడు కనిపెట్టాడో. చిన్నప్పుడు అందరం వసారాలోనో, హాలులోనో పడుకునేవాళ్ళం...కబుర్లు, నవ్వులు, ఆప్యాయతలు, జాగ్రత్తలు, ఓదార్పులు, అన్నీ కలబోసుకుంటూ. ఇప్పుడు ఎవరిగదులు వారివి.

పెళ్ళయ్యాక ఎన్ని బాధ్యతలు, త్యాగాలు. హడావుడిగా రోజులు గడిచిపోయాయి. ఈ మగ పురుషుడికి మొదట్నుంచి మగాణ్ణి, మొగుణ్ణి అనే ధోరణి. తాను పట్టించుకోలేదు పిల్లల పెంపకం ధ్యాసలోపడి. ఈయన ప్రతి ఒక్కరితో గొడవపెట్టుకోవడం, అందరికంటే తానే తెలివి గలవాడినని, తనవాదనే కరెక్ట్ అని భావించడం నాకే కాదు ఎదుగుతున్న బాబు, పాపకు కూడ ఇబ్బందిగా ఉండేది. మేం ముగ్గురం మౌనాన్నిఆశ్రయించేవాళ్ళం. అప్పుడప్పుడు పిల్లలు నావైపు చూసే చూపులో ‘ఎలా భరిస్తున్నావమ్మా ఈయన్ని’ అనే భావం కనబడేది. నేను గమనించనట్టు ముఖం తిప్పుకునేదాన్ని.

ఈ అహంకారంతోనే చేస్తున్న ఉద్యోగంలో గొడవలు, బిపి తెచ్చుకొని మాటపట్టింపులు ..చివరికి వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అవడం, విదేశాలకు స్వేచ్ఛగా ఎగిరిపోవడం...అంతా ఆయన యిష్ట ప్రకారం జరిగిపోయింది.

కానీ ఎవరూ ఊహించని, నేనూ ఊహించని కష్టం నామనసుకు గట్టిగా తగిలింది. రిటైరయ్యాక కాలక్షేపానికి నేర్చుకున్న వాస్తు, జాతకాలు క్రమంగా సాధన చేసారు. ఇరుగుపొరుగు, బంధువులు ఎవరు అడిగినా అడగకపోయినా చెప్పడంమొదలెట్టారు. ఒక చిన్నసైజు స్వామీజీగా అయ్యారు. జనాల తాకిడి పెరిగింది. ముఖ్యంగా స్త్రీలు. భక్తురాళ్ళు. ప్రతిదీ చెడుగా ఆలోచించే కుసంస్కారిని కాదు. కాని అవసరం ఉన్నా లేకున్నా చేతులు పట్టుకోవడం, భుజాలచుట్టూ చేయివేయడం, తలనిమరడం, చివరకు చేతిపై నుదుటిపై ముద్దులుపెట్టడం వంటి వికారాలు ఎక్కువయ్యాయి. భరించలేకపోయాను. నిలదీసాను. “నాయిష్టం. నా గాళ్ ఫ్రెండ్స్. అయితే ఏమంటావ్" హేళనగా అన్నాడు. మనసేకాదు శరీరమూ మంచుగడ్డలా మారిపోయింది. ఎవరెవరినో తాకిన ఆ చేయి నా మీదపడితే జెర్రులు పాకిన భావన. నాకళ్ళలో నిరసన చూసి నాపై ఇంకా ద్వేషం పెంచుకొన్నాడు.

క్రమంగా నేను తాబేలులా నాలో నేను కుంచించుకుపోతున్నా, చిల్డ్రన్ బెడ్రూం అనే షెల్లోకి దూరిపోయా. “మొగుడు తెచ్చే నగలు, చీరలు కావాలి, మొగుడు అక్కర్లేదు” అన్న మాట విన్న క్షణం ఎంత విరక్తి కలిగిందో! రెండేళ్ళ పైన అయింది ఈ నాలుగు చీరలతో రోజులు, ఈ నాలుగు గోడల మధ్య జీవితం వెళ్ళదీయడం. ఈగదిలో కాదు, నామదిలోనే ఒంటరితనం.

ఎవరైనా ముఖ్యంగా స్త్రీలు సమస్య చెప్తే వారి వెంటవెళ్ళి పని చేసిపెట్టి రావడం, రాత్రి ఎన్నిగంటలైనా మృదువుగా మంద్రస్వరంతో గాళ్ ఫ్రెండ్స్ తో మట్లాడటం. ఇంట్లో పనులు, సరుకులు, సమస్యలు అన్నీ నేనే చేసుకొంటున్నా. ఫరవాలేదు. ఈ శరీరం ఎంతైనా శ్రమ చేయగలదు, కష్టాన్ని భరించగలదు. కాని మదిలో మెదిలే ఆవేదనా తరంగాలు ఆపడం నాతరమా! మొన్నెవరో రచయిత్రి అన్నారు “ఏకాంతశూన్యగోళం” అని. ఎంత నిజం!

ఎదురెదురు గదుల్లో వున్నా ఎన్నిమైళ్ళదూరం! ఎవరూ పూడ్చలేని అగాధం. స్త్రీకెందుకిన్నిమమకారాలు! సున్నితభావాలు! ఈ ఇంట్లో నేనొక మూగదాన్ని. నాదో మూగ భాష. గుండెఘోష.

ఆరాటంగా గుండెపై రాసుకొన్నాను ఆరాటంగా అరచేతితో. నవ్వొచ్చింది. ఈ మంట పైన కాదు. లోన. లోలోన. ఈ మంట తగ్గదు. ఈ మూసిన తలుపులు తెరుచుకోవు.

ఇప్పుడర్ధమౌతోంది రెండుగదుల వాస్తవం.

వంటిం(తి) కథ 3 -- కాసాల గౌరి

"అక్కా నేను వచ్చేసానోచ్ భర్తను సాగనంపి వంటింట్లోకి రాబోతున్న కమల ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారి ఆగిపోయింది.

వంటింటి గుమ్మం పక్కన నల్ల రాయి బల్ల మీద చక్కగా పేర్చిన ఎర్రని  టమాటాలు. .. త్యాగానికి సిద్ధంగా ఉన్న నవ యువ సైన్యంలా.... నవనవలాడుతూ ఉన్నాయి. ఆకుపచ్చరంగులో తొడిమలు... నలుపు ఎరుపు ఆకుపచ్చ రంగులతో రమణీయమైన దృశ్యం కనిపించింది.

"అబ్బ ఎంత బావున్నాయో.... ఎవరు తెచ్చారు అక్కా"

"టమాటాల కాలం కదా మామగారు రైతులకి పురమాయించి మరీ తాజాగా తెప్పించారు ఇవాళే పచ్చడి పెట్టేయాలి.."

"వాటిని రసం చిందకుండా ఒడుపుగా కొయ్యాలి ఆ పని నేను చేస్తాను గాని, నువ్వు ఒక గిద్దెడు మెంతులు వేయించమ్మా" అంది జయంతి కత్తిపీట తీసుకుంటూ..

మూకుడు స్టవ్ మీద పెట్టి మెంతులు పోసింది. చాల్చాలు మాడిపోతున్నయ్ ఆపేయ్....జయంతి కేకకి....  హడలిపోయిన కమల మెంతులు ప్లేట్లో పోస్తూ  చేయి... బాగానే కాల్చుకుంది...

"కొంచెం చల్లారాక మిక్సీ లో వెయ్యనా" కాదు రోట్లో వేసి దంచుదాం. అయినా ఒకసారి చూస్తాను ఉండు.

తరిగిన టమాటా ముక్కల్ని వెడల్పు జాడిలో వేసీ...వచ్చింది.

అయ్యో కమల ఒక్క వేపు తగ్గి ఉంటే బాగుండేది. మళ్లీ వేరే వేరే వేయిస్తాను అంటూ అ పనికి ఉపక్రమించింది.

"అబ్బా నీది మరీ చాదస్తం అక్కా"

"చాదస్తం కాదు కమల పచ్చడి పాడైపోతుంది. అందులోనూ నీకు మామగారి సంగతి తెలుసు కదా.

“ఆహా...బా....గా... తెలుసు అయినా ఇంత తిండి యావ నేను ఎక్కడా చూడలేదు.” కాలిన వేళ్ళని ఊదుకుంటూ కసిగా అంది కమల.

"తప్పు కమల, తినే పదార్ధాలని తినే వ్యక్తుల్నిఅలా అనకూడదు. నాలుగు రోజులు తినాల్సిన పచ్చడి కమ్మగా చేసుకోవాలి. అయినా దీనిని తిండి యావ అనరు. తినేది ఏదయినా నోటికి నచ్చినట్టుగా కమ్మగా తినాలి.”

“...ఆ...తినాలి...బొజ్జ పెంచుకోవాలి. అసలు నిన్ననాలి మామగారిని మంచి చేసుకోవడానికి...బాగా అలవాటు చేశావ్.” వేళ్ళు మండి పోతుంటే ఇంకా కసిగా అంది కమల.

జయంతి మొహం చిన్నపోయింది.

“నేను నీ అంత తెలివైన దానివి కాదు కమల. పెద్ద చదువులు కూడా చదువుకోలేదు పట్టణంలో పెరగలేదు.

కానీ నేను చేస్తున్న పని గురించి కొంత వరకు తెలుసనే అనుకుంటున్నాను. పెళ్లికి ముందు మీ బావగారు మా అమ్మని హెచ్చరించారు. మీ అమ్మాయికి వంట బాగా నేర్పించండి అని.

ఆ వంట నేర్చుకునే క్రమంలో చేతులు కాల్చుకుంటూ నేను ఒకసారి బాగా విసుక్కున్నాను. ఏదో ఇంత తిని కడుపు నింపుకోడానికి ఇంత అవస్థ ఎందుకు...  ఒళ్ళు పెంచుకోవటానికి కాకపోతే..

మా అమ్మ ఏమీ మాట్లాడ లేదు. ఆ రోజు సాయంత్రం అమ్మ మళ్ళీ వంటకి  ఉపక్రమించడానికి వంటింట్లోకి వెళ్తున్నప్పుడు...

అమ్మా...ఈ వెధవ వంట నేను నేర్చుకోను. నా వల్ల కాదు అనేసాను కోపంగా.

ఆ ... ఆ..తప్పమ్మా...అంటూ పక్క వసార లోంచి తాతగారు గట్టిగ మందలించారు. ఎప్పుడూ ఆప్యాయంగా మాట్లాడే తాతగారు కసిరే సరికి ఉక్రోషంతో నాకు కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసేయ్. ఆయన నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి కూచుని తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నం గురించి చెప్పారు.

ఆ మాటలు నాకు యధాతధంగా జ్ఞాపకం ఉన్నాయి.

"అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ విషయాన్ని ఉపనిషత్తులు అన్నీ చెప్పాయి. కానీ తల్లి నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే....

మనిషి ఎంత ఆకాశానికి ఎగిరినా, సముద్రాలు సముద్రపు లోతులు కనిపెట్టినా, కోటీశ్వరుడైనా,

చెమటోడ్చి పని చేసే కూలీ అయినా.....అందరికీ సమానమైనది ఆకలి. ఆ ఆకలి తీర్చేది అన్నం. అన్నం అంటే తెల్లగా కనిపించే వరి అన్నం కాదు. ఆకలి తీర్చుకోవడానికి తినే షడ్రసోపేతమైన భోజనం అయినా

అంబలి లో పచ్చి మిరపకాయ ఉల్లిపాయ నంచుకుని తిన్నా, వాటి పరమార్ధం  ఒకటే కడుపు నింపడం.

ఆకలి తీరగానే "అమ్మయ్య ఆత్మారాముడు" సంతోషించాడు అనడం వినలేదా తల్లీ నువ్వు. అదే చక్కగా రుచిగా పెట్టే మనుకో తిన్న వారికి ఎంత తృప్తి!!! అసలు పెట్టగలిగిన చెయ్యి చాలా గొప్పది... అన్నారు.

కొత్తలో అసలు నా మొహం చూడని మామగారు ఇప్పుడు తండ్రికన్నా ఆప్యాయంగా ఉంటున్నారు.

ప్రేమ ప్రేమను  ప్రేమిస్తుంది. ప్రేమించేవాడు ఆ పరబ్రహ్మఅందుకే

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారేమో’.... ఇది నా సొంత తెలివి అనుకో..”

ఈ మాటలు చెబుతూనే వంటింటి గూట్లో ఉన్న బర్నాల్ మృదువుగా కమల చేతులకి రాసింది. చేతులే కాదు మనసుకు కూడా చల్లగా అనిపించింది కమలకి.

Posted in December 2021, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!