Menu Close
ఈ తరం...
-- అన్నపూర్ణ బులుసు --

వాళ్ళు నలుగురు స్నేహితులు. ఆ స్నేహం టెన్త్ మొదలు అమెరికా ఉద్యోగానికి వచ్చేవరకూ కొనసాగింది. వాళ్ళు కుటుంబంలో ఏ సమస్య వచ్చినా చర్చించుకుని పరిష్కరించుకుంటారు. తీరని సమస్యలు ఐతే ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు.

ఇప్పుడు ఆ నలుగురికి ఒకే సమస్య వచ్చింది. అది కోవిడ్. తల్లి తండ్రులు ఇండియాలోఉంటే పిల్లలు విదేశాల్లో ఉండటం వల్ల వచ్చిన సమస్య.

ఇరుగు పొరుగు బంధువులు సహాయం కలుపుగోలుగా ఉండటం, కలసి వినోద విహారాలు పంచుకోడం జరుగుతూ పిల్లలు దూరంగా వున్నారు అనే బాధను మరిచిపోయేవారు.

ఇప్పుడు రోజూ ఫోన్చేయాలన్న విసుగు మనసు సరిగా లేకపోవడం బయటకు వెళ్లలేని పరిస్థితి ఎవరిని కలుసుకోలేని దుస్థితిలో మానసిక ధైర్యాన్ని కోల్పాయారు.

ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల క్రితం వచ్చిన ప్లేగు, కలరా వంటి మహమ్మారి జబ్బులు గురించి విన్నవారు ఇప్పుడు ఈ కోవిడ్ ప్రత్యక్షంగా అనుభవిస్తూ భయంతో తీవ్రమైన ఆందోళనకు గురిఅవుతున్నారు. ధైర్యంగా ఉండేవారు అతి కొద్దిమంది మాత్రమే.

ఇప్పుడు ఏమి చేయాలి? చూస్తూ ఊరుకోలేం. ఆలా అని ఇక్కడికి తీసుకు వస్తే వాళ్లతో కుటుంబ కలహాలు పెరుగుతాయేమో ......ఏది దారి?

''ఆరునెలలు వుండటమే వాళ్ళకి కష్టం అనిపించి మూడునెల్లకి వెళ్ళిపోతున్నవారు ఇప్పుడు సంవత్సరం దాటి ఉండమంటే వుండగలరా? ఉంటే ఇల్లు సరిపోదు. వాళ్ళ అలవాట్లు వేరుగా ఉంటాయి. ఈ వయసులో వాళ్ళకి అన్ని మనమే చూడాలి.'' అన్నాడు శరన్.

''అవును. మనమే నిన్న మొన్న సిటిజన్స్ అయ్యాం. వీళ్ళకి గ్రీన్ కార్డ్ తీసుకోడం సమస్య. అయిదేళ్లవరకు రాదు.'' అన్నాడు వైభవ్.

''మా వాళ్ళు రారు. నాకు ఆ సమస్య లేదు. కానీ మాకు రోజూ టెన్షన్. అక్కడనుంచి ఏ బాడ్ న్యూస్ వస్తుందో అని.'' అన్నాడు శాంతారామ్.

''మావాళ్లు వస్తారు వాళ్ళు ఇక్కడ బాగా అలవాటు పడ్డారు. వాళ్ళు ముందు జాగ్రత్తగా గ్రీన్ కార్డు తీసుకున్నారు. వాళ్ల డబ్బుతో ఇక్కడే ఫ్లాట్ కొనుక్కుని ఉండగలరు. మాకు సమస్యలేదు.''అన్నాడు గౌతమ్.

ఇలా మాట్లాడుకుంటూ ఏమి చేయాలో తెలీక తికమక పడుతున్నారు.

''ధైర్యంగా ఉంటే ఫర్వాలేదు. కానీ మా అమ్మ ఒకటే గొడవ. నిన్ను చివరిసారి చూడకుండా పోతామేమో... అంటుంది. పోనీ నన్ను రమ్మంటావా అంటే 'వద్దు' నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలి. మేము పోయినా పర్వాలేదు అంటుంది. ఫోను చేస్తే ఒక గొడవ. చేయకపోతే ఇంకో గొడవ.'' అన్నాడు వైభవ్.

''మా చండికి వాళ్ళని ఎక్కడ తీసుకువస్తానో అని భయం. రోజూ ఫోనుచేసి వాళ్ళకి ధైర్యం చెబుతోంది. ఎన్ని చెప్పినా...నాకు ఏమిటో ఒకటే బెంగగా వుంది'' అన్నాడు శరన్ తాను ప్రేమించి మరీ పెళ్లిచేసుకున్న భార్యను చూపిస్తూ.

''అక్కడ మన పేరెంట్స్ కి సాయం చేసే ఒక బాచ్ ఉందిట. వాళ్ళకి నెలకి లక్ష కడితే జాగ్రత్తగా సదుపాయాలు చూస్తారట. హాస్పటల్లో చేరాల్సివస్తే మరో లక్ష ఇవ్వాలిట. వాళ్ళని నమ్మవచ్చో లేదో డబ్బుకోసం ఇదో టెక్నిక్కేమో.... అంతకంటే ఇక్కడికి తీసుకువచ్చి ఒక టూ బెడ్ రూము ఫ్లాటులో ఉంచితే ఎలావుంటుంది?" అన్నాడు శాంతారాం.

''అవును ఇది బాగుంది. డబ్బు ఖర్చే ఐనా మనకు మనశ్శాంతి ఉంటుంది. దగ్గిర్లో ఫర్నిష్డ్ ఫ్లాట్ చూద్దాం.'' అన్నాడు వైభవ్.

అందరికి ఈ ఆలోచన నచ్చింది. ఫ్లాట్ వన్ ఇయర్ లీజుకి తీసుకున్నారు. ఇక అమ్మ నాన్నలను తీసుకురావడం, వాళ్ళు భార్యలతో చెప్పడం మిగిలింది.

మొదట శాంతారాం అన్నాడు.....తన భార్య వసంతతో....మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ పేరెంట్స్ ని  తీసుకువస్తున్నారు. మీ అమ్మ నాన్నలను కూడా రమ్మని చెప్పు.''

''అబ్బా నువ్వు ఎంత మంచివాడివో....అంటూ మెచ్చుకుని వెంటనే ఫోన్ చేసింది వాళ్ళ నాన్నకి. నాన్న నువ్వు అమ్మ రెడీగా వుండండి ప్రయాణానికి. టిక్కెట్టు పంపిస్తాడు మీ అల్లుడు.''

''అయ్యో ఎందుకమ్మా ఎన్నో కోట్లమంది వుంటారు. వాళ్ళకి లేని భయం మాకు ఎందుకు? వద్దు అది న్యాయం కూడా కాదు. మీ అత్తా మామలు రానప్పుడు మేము రావడం బాగుండదు''అన్నాడు...వసంత నాన్న ఆయన నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించే పాతకాలం మనిషి. ఈ మాట శాంతా తో చెప్పింది వసంత దిగులుగా.

''ఏమి చేస్తాం? మన తప్పులేదు. అక్కడ నా స్నేహితులకి కనిపెట్టి ఉండమని చెబుతా! అన్నాడు భార్యకు ధైర్యం చెబుతూ. మిగిలిన శరన్ వైభవ్ గౌతంల అమ్మ నాన్నలు రావడానికి ఒప్పుకున్నారు. కానీ శరన్ వైభవ్ గౌతం అర్థాంగులు మాత్రం 'వాళ్ళు వస్తే ఎంత ఖర్చు ఆలోచించారా? ఇంకా మనకి పిల్లల బాధ్యత వుంది.' అంటూ గొడవ చేసారు.

''వాళ్ళు పిల్లలను చూస్తారు. మనకే మంచిది. పిల్లలను చూసుకుంటూ ఇంటినుంచి వర్క్ చేయడం చాల కష్టం. మేము తెలివిలేక ఈ ప్లాన్ చేశామనుకుంటున్నారా?" అన్నాడు గౌతమ్.

''అంతా అరవైలు దాటినవాళ్ళే వాళ్లకి ఇన్సూరెన్స్ కట్టాలి. వాళ్ళు ఇండియన్ ఫుడ్డు తింటారు. మాకు తోచడంలేదు అంటారు. శనివారం టెంపుల్కి, లాంగ్ వీకెండ్స్ ఎటో ట్రిప్ వెళ్ళాలంటారు. ఈ తలనొప్పి మేము పడలేము.'' అన్నారు.

''నిన్ను ఏమీ అడగను సరేనా? అన్నీ నేను, మా ఫ్రెండ్స్ చూసుకుంటాం.'' అన్నాడు వైభవ్ మాతల్లి మా బంగారు అని బతిమాలి.

''అయితే ఒక పనిచేయాలి. మా అమ్మ నాన్నలను కూడా తీసుకురండి.'' అన్నారు వాళ్ళు ముందుగానే ఆలోచించి ప్లాన్ వేసుకుని. గతుక్కుమన్నారు ముగ్గురూ.

''ఏం? మీకేనా అమ్మ నాన్నలు వున్నది? మా వాళ్ళ సంగతో?'' అన్నారు లేడీస్. ఊహించని సమస్య ఇది! వాళ్ళకి కొడుకులు లేరు. వున్నది ఒక్కతే కూతురు. 'అల్లుడు కొడుకు మాకు సమానమే' అంటారు గడుసుగా.

వైభవ్ మామ ''మా అమ్మయిని అమెరికా సంబంధం ఇచ్చింది నేను కూడా రావాలనే ...అన్నాడు నిర్మోహ మాటంగా.

''లేకపోతె వంద ఎకరాల భూస్వామి నీ మామ.. మా అమ్మయికి పెళ్లి కాదని ఇంతోటి నీకు ఇస్తాను....అంది అత్తగారు స్టైల్గా. ఆవిడ అమెరికా రావడానికి అన్ని సిద్ధం చేసుకునే వుంది. వేష భాషలు సైతం మార్చుకుంది కూడా.

గౌతమ్ అమ్మ నాన్న సైలెంటుగా వున్నారు. అవసరం ఐతే అప్పుడే మాటాడుదాం అని.

ఓరి దేవుడా ''సమస్య మరీ జటిలంగా ఉందే......ఒక్కకూతురు ఆస్తి మనకే అని చేసుకున్నందుకు అత్తా మామలను కూడా పోషించాల్సి వస్తుందని అనుకోలేదు. మన బుద్ధి పనిచేయలేదు అప్పుడు ఇప్పుడూ కూడా!

మన అమ్మ నాన్నలు వస్తే అత్తామామలుకూడా వస్తారు....అనే ఇంగితం లేకుండా పోయినది. అందరిలోకి శాంతారాం పనిబాగుంది. వాళ్ళ అమ్మ నాన్న విలేజిలో వుంటారు. వాళ్ళకి చదువులేదు. వాళ్ళు రారు. మనం ఇన్నాళ్లు ఆ విషయమే ఆలోచించలేదు. అనుకుని అమ్మ నాన్నలను అమెరికా తీసుకురావాలన్న ఆలోచన మానుకున్నారు.

''అన్నిటినీ ఆ ఏడుకొండలవాడే చూసుకుంటాడు. ఎంతమంది లేరు? వాళ్లలో మా అమ్మ నాన్నలు ఒకరు. ''మా దేశాన్ని నువ్వేకాపాడు'' అని దేవుడిమీద భారం వేసేసి నిశ్శబ్దంగా ఉండిపోయేరు.

''మన ప్లాన్ సక్సస్'' అనుకున్నారు నేటితరం కోడళ్ళు.

(సమాప్తం)

Posted in December 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!