Menu Close
Page Title

కాకతీయ యుగం - తిక్కన సోమయాజి

ద్రౌపది: తిక్కన తీర్చిదిద్దిన ద్రౌపది తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకొన్నది. ద్రౌపది అభిమాన వంతురాలు, భర్తల పట్ల గౌరవాభిమానాలు గల సాధ్వి. ధర్మరాజు ఒక చోట “మన వంశంబును, దృత్తంబును బెంపును గావజాల పుణ్యవతివి...” అని దుర్మార్గుల పట్ల జాగ్రత్తగా ఉండమన్నప్పుడు ద్రౌపది “అనిన విని యాజ్ఞ సేని యనాదర మందస్మిత సుందర వదనారవిందయైన” దని తిక్కన వ్రాశాడు. ఇక్కడ అనాదరం అభిమానం వల్ల వచ్చిందేనని గుర్తుచేసిన ఆరుద్ర, ద్రౌపదికి ధర్మరాజు పట్ల గల గౌరవాభిమానాలకు నిదర్శనమైన పద్యాన్ని తెల్పారు. ఇది ప్రసిద్ధమైన పద్యం. “ఎవ్వని వాకిట నిభమద పంకంబు రాజభూషణ – రజోరాజి నడగు ....”ఇలా ధర్మరాజు యొక్క గుణ కీర్తనతో సాగుతుంది ఈ పద్యం. దీనిని గూర్చి ఆరుద్ర మాటలు “ద్రౌపదికి అంతరాంతరాలలో భార్తలందరి మీదా అంతటి గౌరవం, ప్రేమ ఉన్నాయి కాబట్టే పాండవులు అన్నీ నెట్టుకొచ్చారు.” నిజమే అటువంటి కష్టకాలంలో భర్తకు భార్య ఆదరణ, ఆప్యాయతలే పాయసాది మధుర పదార్థాలు.

కాని ద్రౌపది దెబ్బతిన్న ఆడపులి.

అందుకే రాయబార సమయంలో అయిదు ఊళ్లిమ్మను చాలునని ధర్మరాజు కృష్ణునితో పల్కినప్పుడు ద్రౌపది కృష్ణుని అడిగిన ప్రశ్న – “అరయమి జేసి కోడలనకప్పుడు దాసిగ జేసి నమ్మహా పురుషుని పాలికిం బతులు దోవగ...” నేను ఆ ధృతరాష్ట్రుని కోడలిగానా, లేక దాసిగానా అక్కడికి వెళ్ళాలి? అంటూ అడుగుతుంది. ఇక్కడ ‘అమ్మహాపురుషునికి’ అనడం ద్రౌపది యొక్క ఎత్తిపొడుపు కనపడుతుంది. ఇది ప్రసిద్ధమైన పద్యం. ఇక్కడ ద్రౌపది తిక్కనలో పరకాయ ప్రవేశం చేసిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ద్రౌపది యొక్క హావభావాలను తిక్కన అద్భుతమైన పద్యాలలో స్ఫురింప చేశాడు.

“ద్రౌపది బంధురంబయిన క్రొమ్ముడి గ్రమ్మున విడ్చి వెంట్రుకల్...” గోవిందుని ముందర బెట్టి ఇవి దుశ్శాసనుని వేళ్ళు తగిలి సగము తెగిపోయాయి... కావున ముందుగా ఆ దుశ్శాసను తను వింతలింతలు దునియలై... పోయినప్పుడు నేను చూడాలి అంటుంది. ఈ రాయబార సందర్భంగా తిక్కన ద్రౌపది నోట పలికించిన పద్యాలు నిజానికి అవి పద్యాలు కావు. ద్రౌపది లో దాగివున్న ఎన్నో భావాలకు ప్రతిబింబాలు. ఈ సందర్భంగా తిక్కన గారి నాటకీయత, వర్ణనా పటిమ, మనో విశ్లేషణా చాతుర్యం, బహుముఖంగా ప్రకాశించిందని చెప్పక తప్పదు.

తన వెంట్రుకలు గోవిందు ముందరబెట్టి ‘ఈ వెంట్రుకలు పట్టి ఈడ్చిన ఆ దుశ్శాసనుని శరీరం ఇంత ఇంత ముక్కలవ్వాల’ని చెప్పినపుడు తన అరచేతిలో బొటన వ్రేలు పెట్టి క్రమేపీ కొన గోళ్ళ దాకా వెళ్ళడం పాఠకుల కళ్ళకు కట్టినట్లు వర్ణించిన దృశ్యం. ఇది మనం కొన్ని సందర్భాల్లో చేసి చూపించే ప్రక్రియ. “ఇన్ని మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు” అన్నప్పుడు మనం ఇలానే చూపిస్తాం.

తిక్కన వర్ణనా చాతుర్యాన్ని ఆరుద్ర చక్కగా మన కన్నుల ముందరుంచారు. సి నా రె అన్నట్లు, కప్పి చెప్పేవాడు కవి, ఇప్పి చెప్పేవాడు విమర్శకుడు. రాయబార సమయంలో ద్రౌపదిని గూర్చిన పద్యాలు తిక్కన నాటకీయతకు, మనో విశ్లేషణకు నిలువుటద్దాలు.

కృష్ణుని పాత్రను మలచడంలో తిక్కన రచనలో కొంత లోపమున్నదని దేశిరాజు భారతీదేవి గారి అభిప్రాయం. దానికి ఆరుద్ర స్పందించారు. ...తన ఇంటికి విందుకు రమ్మని దుర్యోధనుడు కృష్ణుని ఆహ్వానించినప్పుడు, కృష్ణుడు ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తాడు. దీనిని గూర్చి చెప్తూ భారతి గారు ....కృష్ణుడు కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్లు మాట్లాడెను.. అని అది రాజకీయ చతురత కాదేమోనని తోచుచున్నది...” అంటూ అభిప్రాయపడ్డారు. ఆరుద్ర భారతి గారికి సమాధానంగా ఇలా వివరించారు. దుర్యోధనుడు కృష్ణుడు తన ఇంట విందారగించకుండా ఉండడానికి కారణం చెప్పమని పట్టుబట్టాడు. అప్పుడు కృష్ణుడు “తేటపరుప వలయునేమి విను” మని తాను పాండవుల దూతనని, దూత నూటికి నూరుపాళ్ళు, తన తరపు వాళ్ళ మనిషిగా ఉండాలి అని కృష్ణుడు ఖచ్చితంగా చెప్తాడు.  ఇక్కడ ఆరుద్ర వివరణ “తాను పాండవుల పక్షాన వచ్చాడు. వాళ్లకు ఏ విధమైన అన్యాయం జరిగినా సంధి పొసగదని ముందే చెప్తున్నాడు. తాను మొహమాట పడేది లేదని కూడా హెచ్చరిక చేశాడు. దుర్యోధనుడు వేసిన ఎత్తుకు ఇది పైఎత్తు...” అన్నారు ఆరుద్ర.

యుద్ధ వర్ణనలు

తిక్కన చమూపతి. దండాధీశుడు. యుద్ధ భీభత్సాన్ని చూచి భీతి చెందే భీరువు కాడు తిక్కన. యుద్ధ వర్ణన విరాట పర్వంలోనే మొదలుపెట్టాడు (విరాట-5-60). యుద్ధాలను సైతం రమణీయమగు ప్రకృతి దృశ్యాలతో పోల్చి వర్ణించాడు.

“తొట్టి తొట్టి యెడనిడ మడువులు గట్టు శోణితంబు
నీళ్ళు నందు బడి తేలాడు వెలిగొడుగులు ,
పుండరీకంబులును, వింజామరలు మరాళ పుంజంబునునై
----సంగ్రామం బభిరాముబయ్యును, ఘోర ప్రకారం బయ్యె” నని

విరాట పర్వం లోనే తిక్కన యుద్ధ వర్ణన ప్రత్యేక రీతిలో నడిచింది. ఇక యుద్ధ పంచకంలోని వర్ణనలు ఇంకా అభిరామాలు.

యుద్ధం చేసి అలసిపోయిన వీరులు ఏనుగుల కుంభస్థలాల పైనే నిదురించడాన్ని తిక్కన

తరుణుల కుచముల పైరతి
పరవశులై యొరగు పతుల పగిరి....

అంటూ శృంగార రసమయంగా వర్ణించాడు. దీనిని గూర్చి చెప్తూ “యుద్ధ వర్ణనలలో ఇటువంటి చెమకులు చూపిస్తే గాని కథ రక్తి కట్టి ముందుకు సాగదు” అన్నారు ఆరుద్ర. స్త్రీల వక్షోజాలను, ఏనుగుల కుంభస్థలాలతో పోల్చడం కవి సమయం. కవిత్వంలో కవి సమయాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.

‘రాక్షసావేశంలో యుద్ధం చేసిన వారిలో భీముడు ప్రథముడు.’ అని అన్నారు ఆరుద్ర. ఆ ఆవేశం గూర్చిన వర్ణనలు “వికృతపు చావు సంపమది వేడుక పుట్టిన... భీముడు, కీచకుణ్ణి చక్కని ముద్దగ జేసి దుష్టుడై...” ఇక దుశ్శాసనుణ్ణి చంపిన విధాన్ని మరింత దారుణంగా వర్ణించి చెప్పారు తిక్కన.

“ఏనురము వ్రచ్చి నెత్తురు తేనియ ఇది ద్రావెదం గదిసి ....నరసింహుండసురేంద్రు వ్రచ్చు కరణిన్ రౌద్రం బుదగ్రంబుగా...దుశ్శాసనుని చంపి నెత్తురు బంటినిండా పూసుకొని...” దారుణ భంగి బ్రతిజ్ఞా కరణ పూరంణం బాచరించిన భీముడు, స్త్రీ పర్వంలో గాంధారి అడిగిన మాటలకు తలదించుకొని సిగ్గుపడ్డాడు. ఆవేశం అనర్ధాలకు మూలకారణం గదా. ఈనాడు జరుగుతున్న హత్యలు, దురాగతాలు అత్యంత ఆవేశపూరితమైనవే గదా!

కాని భీముడు ఇలా గాంధారికి నీతులు చెప్పాడు. తిక్కన భీముని ఒక చోట చెడుగా చిత్రించినా ఇక్కడ అలా చెయ్యకుండా ప్రతిజ్ఞ కోసం అతని రక్తాన్ని పెదవి వద్ద చేర్చానన్నాడు. ముఖానికి పూసుకొన్నానన్నాడు. దీన్ని గూర్చి చెప్తూ “భీముడు చెప్పిన సమాధానానికి గాంధారి తృప్తి పడిందో లేదో గాని తెలుగు పండితులు మాత్రం ఒప్పుకొన్నారు” అంటూ భూపతి లక్ష్మీనారాయణ గారు భీముని సమర్థిస్తూ, అశ్వత్థామను విమర్శిస్తూ తెల్పిన అభిప్రాయాలను ఇక్కడ పొందుపరిచారు. (స.ఆం.సా పేజీ 322)

అశ్వత్థామ – ఇతడు దుష్ట చతుష్టయంలో ద్రోణుని పుత్రుడు. ఇతడు చేసిన ఘోర మారణహోమాన్ని గూర్చి చెప్తూ ఆరుద్ర “తిక్కన గారి కాలంలోని వీరశైవ మతాన్ని పరోక్షంగా ప్రతిబింబిస్తుంది.” అన్నారు. దానికి నిదర్శనంగా చూపిన పద్యాలు –

  • “నేనీయాపన గడిచిన నానా భూలోపహార నీ, శానుని భ్రీతుం జేసెద....” నవ్యార్చన

అని మనసులో అనుకోగానే అతని ముందు ఒక వేడి తోచి అందులో జ్వాల వెలిగింది. అశ్వత్థామ ఈశ్వరుణ్ణి గూర్చి ఇలా అన్నాడు.

  • “తిరిగేట్టిది యో నామది -నెరుగ మదాత్మోహార మిచ్చెద....శక్తి గలుగుటకు చుమీ! (స.ఆం.సా. పేజీ 322) (సౌప్తిక. 1-121)

అలా పుట్టిన జ్వాలలో అశ్వత్థామ ఉరికాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ రెండు పద్యాల మధ్యలో ఒక సుదీర్ఘమైన వచనం ఉంది. అందులో గణాడంబరం కనపడుతుంది.

“వాళ్ళు....మాంస రుధిరంబుల బూర్లంబులను కపాలంబుల... వినోదించుటకు వచ్చారు” (సౌప్తిక. 1-110). ఇవన్నీ వీరశైవ లక్షణాలని ఆరుద్రగారి అభిప్రాయం.

సౌప్తిక పర్వంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏ పర్వంలోనూ తిక్కన గారు మహాస్రగ్ధరలు చెప్పలేదు. సౌప్తిక పర్వంలో మాత్రం 14 మహాస్రగ్ధరలు చెప్పారు. (సౌప్తిక. 1-181, 183, 185, 187, 189). ఆరుద్ర మాటల్లో “అప్పటిదాకా విలక్షణ ఛందస్సుల మీద అట్టే దృష్టి పోనివ్వని తిక్కన గారు ఈ పర్వం నుంచి విశేష వృత్తాలను వాడడం మొదలుపెట్టారు. స్త్రీ పర్వంలో అరుదైన విశేష వృత్తాలను వాడడమే కాక, ఎప్పుడూ వాడే ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్ధూలం వంటివి వాడకపోవడం గమనించతగ్గది. మహాస్రగ్ధర, స్రగ్ధర కూడా స్త్రీ పర్వంలో వాడలేదు. వ్రాసిన మొత్తం గద్యపద్యాలలో కందాలు ఎక్కువ. తిక్కన గారు నన్నయ లాగా గునుగు సీసాలు వ్రాశారు. నన్నెచోడుని లాగా విరుగుల సీసాలూ వ్రాసారు. తిక్కన గారు బంధ, గర్భ కవిత్వాలు మాత్రం చెప్పలేదు.”

**** సశేషం ****

Posted in November 2021, సమీక్షలు

1 Comment

  1. మాధురి ఇంగువ

    గునుగు సీసపద్యాలు – విరుగు సీస పద్యాలు అంటే ఏమో వివరించగలరు 🙏

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!