Menu Close
శర్మిష్ట
-- పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు --

పోయిన నెల కాలిఫోర్నియా, మిల్పిటాస్ లోని సత్యనారాయణ స్వామి గుడిలో ఒక యువ దంపతులతో కలవడం తటస్థించింది. ఆ అమ్మాయి గర్భవతి అని తెలుస్తూనే ఉన్నది. వాళ్ళు నాతో మాట్లాడుతూ, పుట్టబోయేది అమ్మాయనీ, తగిన పేరు కోసం వెతుకుతున్నామనీ చెప్పారు. పేరు 'శ' తో మొదలవాలని, 3 అక్షరాల పేరు కోసం వెతుకుతున్నామని అన్నారు. అనుకోకుండా 'శర్మిష్ట' అన్నాను. అదేం పేరండీ, లలితా సహస్రనామాల్లో ఉన్నదా? పైగా వత్తులుంటే ఈ దేశంలో పలకరండీ! అన్నారు. సరే వాళ్ళతో వాదించకుండా వచ్చేసాను. అనుకోకుండా అదేరోజు మిత్రులు శ్రీ నిత్యానంద మిశ్ర (श्री नित्यानन्द मिश्र) రాసిన ఒక వ్యాసం కనబడింది. దాంట్లో ఆయన శర్మిష్ట నామం వ్యుత్పత్తి గురించి, ఆ పేరు విశిష్టత గురించి చర్చించారు. అయ్యా, 'మీ అనుమతితో ఈ వ్యాసాన్ని వాడుకుంటానండి', అని ఆయన్నడిగి, అనుమతి సంపాదించి రాస్తున్నాను.

శర్మిష్టా / శర్మిష్ట అనేది చాలా అందమైన పేరు. చాలా మంచి అర్థమున్న పేరు. మన పిల్లలకి పెట్టుకోవలసిన పేరు. ముఖ్యంగా ఈ పేరు మనకి మహాభారతంలో కనిపిస్తుంది. ఈమె ఒక రాజకుమారి. తండ్రి వృషపర్వుడు అనే రాజు. ఆయనకి శుక్రాచార్యుడు గురువు. ఆమె గొప్ప అందకత్తె. ఆమె కథంతా రాయను గానీ, కొన్ని పరిస్థితులవల్ల ఆమె తన గురువుగారి కూతురు దేవయానికి సవతిగా యయాతి మహారాజు భార్య అయింది. ముగ్గురు పిల్లల తల్లి అయింది. వృషపర్వుడి కూతురు కాబట్టి 'వార్షపర్వణీ ' అనే పేరు కూడా ఆమెకి ఉన్నది. ఆమె కొడుకు పురూరవుడు గొప్ప రాజై, పురు వంశానికి అధిపతైనాడు.

ఈ శర్మిష్ట నామానికి వ్యుత్పత్తికి వస్తే, 'శర్మన్' అనే ప్రాతిపదికకి సంతోషం,, [శౄ+మనిన్, శృణాతి అశుభమ్] అశుభమును పోగొట్టువాడు. బ్రాహ్మణుడు; ప్రసన్నత; ఆనందము అనే అర్థాలున్నాయి (శ్రీ ముదిగంటి గోపాలరెడ్డి గారి సంస్కృతాంధ్ర నిఘంటువు). దీనికి 'వత్' ప్రత్యయం తోడైతే 'శర్మవత్' అనే పుల్లింగ శబ్దం వస్తుంది. దానికి స్త్రీలింగ శబ్దం 'శర్మవతి'. ఈ 'శర్మవతి' కి అర్థాలు - ప్రసన్నముగా ఉండునది, ఆనందముగా ఉండునది, శుభము చేకూర్చునది, శాంతి చేకూర్చునది అని ఉన్నాయి.  మేధాతిథి తన మనుస్మృతి భాష్యంలో ఈ పేరు చాలా శుభకరమైనదనీ, అమ్మాయిలకి మంచి పేరనీ పేర్కొన్నాడు.

ఈ శర్మవతి నామానికి సంస్కృతంలో 'తర, తమ ప్రత్యయార్థకాలు' - శర్మవతి, శర్మీయసి, శర్మిష్టా. ఈ 'వత్' ప్రత్యయాంత శబ్దానికి 'ఇష్టన్'  అనే ప్రత్యయం పరమైతే అష్టాధ్యాయి 5. 6. 55 ప్రకారం ' విన్మతోర్లుక్ ' అనే సూత్రం ప్రకారం 'శర్మిష్టా' అనే స్త్రీలింగ పదం వస్తుంది. అదే పదం తెలుగులో 'శర్మిష్ట' అయింది. సంస్కృతంలో చెపితే "సర్వా ఇమాః  శర్మవత్యః ఇయంఆశామాతిశయేన శర్మవతీ శర్మిష్టా ఉభే ఇమే శర్మవత్యౌ, ఇయమతిశయేన  శర్మీయసి, ఇయమస్యాః  శర్మీయసి".  కాబట్టి శర్మిష్టా/శర్మిష్ట అంటే 'ఉత్కృష్టమైన శుభము కలది, ఉత్కృష్టమైన ఆనందము కలది, ఉత్కృష్టమైన ప్రసన్నత కలది' అని చెప్పవచ్చు. ఇంత మంచి పేరు పెట్టుకోవడంలో కష్టం ఏమున్నది? పిలిస్తే శుభం చేకూరుస్తుంది.

మేధాతిథి ఆడ పిల్లల పేర్లు సులభంగా పలికేటట్లు ఉండాలని, శర్మిష్ట అనే పదం కొంత కష్టంతో పలికేదని అభిప్రాయపడ్డాడు కానీ, ఈ పదం ఏమాత్రం కష్టంతో కూడుకున్న పేరు కాదని నా అభిప్రాయం. ఉచ్చారణలో 'స', 'శ ', 'ష ' లని సరిగ్గా పలికేటట్లు నేర్పుతుంది. పలకంగానే చక్కటి భావం ప్రకటితమౌతుంది. కుటుంబంలో అందరికీ మంచి శుభమును కలిగించేది ఈ పేరు. పైగా అతి గొప్ప పురాణంలో ప్రసిద్ధమైన పేరు. మీ పిల్లలకి పెట్టుకోదగ్గ పేరు.

Posted in November 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!