Menu Close
మర్మదేశం (ధారావాహిక)

ఘాలి లలిత ప్రవల్లిక

ఘాలి లలిత ప్రవల్లిక

"శుక్రుడి మీద భయంకరమైన వాతావరణం ఉంది. ఈ వాతావరణం లో వాయువులు సూర్యుడి ఉష్ణాన్ని గ్రహించి తిరిగి విడిచి వెళ్ళవు. అందువల్ల అక్కడ వేడి పెరిగి దుర్భరంగా ఉంటుంది.

శుక్ర గ్రహపు ఉపరితల వేడి 490 సెంటిగ్రేడ్ డిగ్రీలు ఉంటుంది. అందువల్లే ఇక్కడ అగ్నిపర్వతములు పేలుతూ ఉంటాయి." వివరించాడు మేథా.

"ఈ గ్రహం మీద కార్బన్ డయాక్సైడ్ వాయువు ఎక్కువగా ఉంటుంది." పక్కనే ఉన్న కౌషిక్ ని ఉద్దేశించి చెప్పాడు చరణ్.

కౌషిక్ కి చరణ్ మాటలు వినబడడం లేదు అందువల్ల దిక్కులు చూస్తూ ఉన్నాడు. “కౌషిక్” అని గట్టిగా అరిచాడు చరణ్. అయినా వినబడలేదు కౌషిక్ కి. నా పక్కనే ఉన్న ఈ కౌషిక్ గాడికి నా మాటలు వినపడటం లేదా!?! లేక నిర్లక్ష్యమా?

అర్థం కాక తికమక పడుతున్న చరణ్ ని ఉద్దేశించి  "చరణ్ ఒకరి మాటలు ఒకరికి వినపడాలంటే మీ ఎదురుగా ఉన్న హెడ్ ఫోన్స్ పెట్టు కోవాలి. పిల్లలు మీరందరూ కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకోండి అప్పుడే అందరి మాటలు ఒకళ్ళవి ఒకళ్ళకి వినపడతాయి. మీరు మాట్లాడింది వాళ్లకి వినబడాలన్నా, వారి మాటలు మీకు వినబడాలి అన్నా వెంటనే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి.." అంటూ అదృశ్య రూపంలో ఉన్న మేథా వారిని హెచ్చరించాడు. పిల్లలందరూ హెడ్ ఫోన్ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఒకళ్ళ గొంతు ఒకళ్ళకు వినిపిస్తోంది.

"ఈ శుక్రుడు సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 224.7 రోజులు పడుతుంది. దీనినే శుక్ర సంవత్సరం అని అంటారు." చెప్పాడు మేథా.

"మరి ఇక్కడ ఒక రోజుకు ఎన్ని గంటలు అని ప్రశ్నించాడు?" అమాయకంగా దినేష్.

"ఈ శుక్రుడు తన చుట్టూ తాను తిరగడానికి గంటలు కాదు కొన్ని రోజులు పడుతుంది." అన్నాడు మేథా.

"రోజులా?!? ఎన్నిరోజులు?" ఆశ్చర్యంగా అడిగాడు చరణ్.

"ఇక్కడ ఒక రాత్రి ఒక పగలు ఏర్పడటానికి 243 రోజులు పడుతుంది." చెప్పాడు మేథా.

"అంటే ఇక్కడ రాత్రింబవళ్ళ కాలం కన్నా, సంవత్సరకాలం తక్కువ అన్నమాట!" ఆశ్చర్యంగా అన్నాడు చరణ్.

"ఎగ్జాక్ట్లీ" అన్నాడు మేథా.

"లుక్ దేర్? వాటే వండర్?" అంటూ ఆశ్చర్యపోతూ ఓ వేపు వేలు పెట్టి చూపించింది శార్వాణి.

"వావ్ .....బ్యూటిఫుల్" ఆశ్చర్యంగా అన్నాడు చరణ్.

పిల్లలందరూ ఆశ్చర్యంగా అటుచూశారు. నిండు సింధూరపు రంగులో కాంతులీనుతున్న ఇనబింబం చేతికందుతున్నట్లుగా ఉన్నాడు. అంతకన్నా ఆశ్చర్యం తూర్పున అస్తమించడం.

"చూడండి చూడండి బాగా చూడండి."అన్నాడు డింగూ.

"ఈ లెక్కన సూర్యుడు పడమరన ఉదయిస్తాడేమో!" ఆశ్చర్యంగా అన్నాడు చరణ్.

"అవును ఇక్కడ సూర్యుడు పడమట ఉదయించి తూర్పున అస్తమిస్తున్నట్లుగా కనిపిస్తాడు ." అన్నాడు మేథా.

"ఎందుకలా కనిపిస్తాడు?" కుతూహలంగా అడిగాడు కౌషిక్.

"శుక్రుడు తూర్పు నుంచి పడమరకు తిరగటం వల్ల అలా కనిపిస్తాడు." అన్నాడు మేథా.

దినేష్ కూర్చున్న చైర్ దూరంగా వెళ్ళిపోతుంది.

"దినేష్ అటు వెళ్ళబోకు అటువైపు అగ్నిపర్వతాలు ఉన్నాయి." అంటూ అరిచాడు మేథా.

అయినా దినేష్ చైర్ గాలిలో పైకి తేలిపోతూ ఎటో వెళ్ళి పోతోంది. మొత్తం అందరూ నో ....అటు వెళ్ళకు కంబాక్ ...అంటూ అరుస్తున్నారు.

ఎటువంటి రిప్లై లేదు. ఉండుండి దినేష్ చైర్ గాల్లో పల్టీలు కొడుతోంది పిల్లల ఏడుపు లంఘించారు.

ప్లీజ్ మేథా ... ప్లీజ్ ఏదైనా చేయవా? అందరూ రిక్వెస్ట్ చేసారు మేథాని. మేధా ఆలోచనలో పడ్డాడు ఏం జరుగుతోందాని.

"మేథా దినేష్ చైర్ లోని కంట్రోలింగ్ బటన్స్ పని చేయలేదేమో!" అన్నాడు అనుమానంగా డింగూ.

"మన వేవ్ లైన్స్ కూడా అతనికి రీచ్ కావడం లేదు." అన్నాడు క్రేన్.

మేథా కళ్ళు మూసుకుని దీర్ఘాలోచనలో పడ్డాడు. కళ్ళుతెరచి "ఎస్ డింగూ నీవు చెప్పింది కరెక్ట్." అన్నాడు.

"దినేష్ కంట్రోల్ బటన్స్ పనిచేయడం లేదు. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే మన పరిస్థితీ అంతే కమాన్ ఫాస్ట్ ఫ్లైయింగ్ సాసర్ లో కి వెళ్లి పోదాం పదండి ." తొందర చేస్తూ చెప్పాడు మేథా.

"అందరం కలిసి వచ్చాం అందరం కలిసి వెళ్ళాలి దినేష్ ను అలా ఒంటరిగా వదిలేసి మేం వెళ్ళం". మొండిగా చెప్పారు పిల్లలంతా ఏకకంఠంతో.

"నేను మీ ది నేష్ ను రక్షిస్తాను. నన్ను నమ్మండి. మీరిక్కడే ఉంటే చాలా ప్రమాదం ముందు మీరు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్  లోకి వెళ్లిపోండి." కమాండింగ్ గా చెప్పాడు మేథా.

తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ గ్రీన్ బటన్స్ వత్తి ఫ్లయింగ్ సాసర్ లోకి వెళ్ళిపోయారు .

"మమ్మల్ని మోసం చేసావు మేథా. నువ్వూ ఇందులోకి వచ్చేసావు. పాపం దినేష్...... మేము ఉండం. బయటికి వెళ్లిపోతాము." ఏడుస్తూ గోలచేశారు పిల్లలు మేథా ని ఫ్లైయింగ్ సాసర్ లో చూసి.

వారి మాటలను పట్టించుకోలేదు మేథా. ఫ్లైయింగ్ సాసర్ ను చాలా పైకి లేపాడు.

పిల్లలూ ఏడుస్తూ గగ్గోలు పెడుతున్నారు. మేథా ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక.

"మేథా అంకుల్ మమ్మల్ని కూడా అక్కడ వదిలేసేయ్.

మా స్నేహితుని ఆపదలో వదిలేసి మేం రాము. నువ్వు ఇలా మోసం చేస్తావని అనుకోలేదు." ఏడుస్తూ అన్నాడు చరణ్.

***సశేషం***

Posted in November 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!