Menu Close
manusmrithi page title
మూడవ అధ్యాయము (ఏ)

శ్రాద్ధ కర్మలు

విప్రుడు అమావాస్య రోజున పితృయజ్ఞం చేసి, ఆ తరువాత నెలనెలా చేయాల్సిన ‘పిండాన్వాహార్యకం’ అనే శ్రాద్ధమును చేయాలి. అన్వాహార్య శ్రాద్ధం చేసేటప్పుడు ప్రశస్తమైన ఆమిషమును (మాంసమును) సంపాదించి దానితోనే  చేయాలి.

ఈ శ్లోకం (3- 123) లో మనువు ఒక విప్రుడు (బ్రాహ్మణుడు) అన్వాహార్య శ్రాద్ధం ప్రశస్తమైన మాంసంతో చేయాలని చెప్పిన కారణంగా అప్పటికి యజ్ఞాలలో జంతుబలి కొంత తగ్గుముఖం పట్టినా, శ్రాద్ధ కర్మలలో  విప్రులచే మాంస వినియోగం తగ్గలేదని గ్రహించగలం.

ఈ శ్రాద్ధంలో దేవతాస్థానంలో ఇద్దరు బ్రాహ్మణులను, పితృదేవతా స్థానంలో ముగ్గురు బ్రాహ్మణులను నియమించాలి. అమావాస్య రోజు చేసే ఈ పితృకార్యం వలన సుపుత్రులు కలుగుతారనీ, ధనధాన్యాలు మొదలైన శుభములు కలుగుతాయని ప్రాచీనుల నమ్మకం.  దేవతల కొరకు సమర్పించే హవ్యములను, పితృదేవతల కొరకు సమర్పించే కవ్యములను వేదాధ్యయనం చేసిన శ్రోత్రియునికే సమర్పిస్తే దాతకు ఎక్కువ ఫలం కలుగుతుందని విశ్వాసం.

శ్రాద్ధ కర్మలకు ఎవరు అర్హులు ?

దేవతా కార్యములలోనూ, శ్రాద్ధములు మొదలైన పితృకార్యములలోనూ ఒక్కొక్క విద్వాంసుడైన బ్రాహ్మణుడికైనా భోజనం పెట్టాలి. వేద మంత్రాలు తెలియని పలువురు బ్రాహ్మణులకు భోజనం పెట్టినా ఫలం లేదు. వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణుడినే అతిథి అంటారు. ఒక శ్రాద్ధ కర్మలో వేద మంత్రములు తెలియని పది లక్షల మంది బ్రాహ్మణులు భోజనం చేసినా దక్కని ఫలం వేదవేత్త అయిన ఒక్క బ్రాహ్మణుడు భోజనం చేస్తే కలుగుతుంది. రక్తం అంటిన చేతులు రక్తంతో కడిగితే శుద్ధికావు. నీటితో కడిగితేనే శుద్ధములవుతాయి. అలాగే యోగ్యుడైన ఒక బ్రాహ్మణుడికి ఇచ్చిన హవ్యకవ్యములు మాత్రమే దాతకు పాపవిముక్తిని కలుగజేస్తాయి. వేదము తెలియని ఒక విప్రుడిని హవ్యకవ్యములలో భోక్తగా నియమిస్తే, ఆ భోక్త ఎన్ని కబళములు (ముద్దలు) ఆహారం తిన్నాడో, కర్త మరణించిన తరువాత నరకంలో అన్ని ఎర్రగా కాలిన ‘శూలర్ష్టులు’ అనే ముండ్ల ఇనుపగుండ్లు నమలాల్సి ఉంటుందట.

కొందరు విప్రులకు ఆత్మజ్ఞానం మీద ఆసక్తి ఉంటుంది. కొందరు తపస్సులో నిలకడ కలిగి ఉంటారు. మరికొందరు తపస్సు వేదాధ్యయనము - ఈ రెండింటియందు నిష్ఠ కలిగి ఉంటారు. ఇంకొందరు యాగములు మొదలైన కర్మలు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. పితృదేవతలను ఉద్దేశించి చేసేవైనట్టి  శ్రాద్ద కర్మలలో ప్రయత్నపూర్వకంగా జ్ఞాననిష్ఠులనే నియమించాలి. దేవతోద్దేశముతో చేసే కర్మలలో పై నాలుగు రకములవారినీ నియమించవచ్చు.

అశ్రోత్రియ : పితా యస్య పుత్ర : స్యాద్వేదపారగః |
అశ్రోత్రియో వా పుత్రస్స్యా త్పితా స్యా ద్వేదపారగః || ( 3 - 136)

తండ్రి వేదం చదవనివాడైతే, కుమారుడు వేదాధ్యయనపరుడై ఉంటాడు. తండ్రి వేదాధ్యయనపరుడై ఉంటే కుమారుడు వేదం చదవనివాడై ఉంటాడు. వేదము చదివిన పుత్రుడినే హవ్యకవ్యములలో గౌరవించాలి.

ఎవ్వరూ తన మిత్రుడిని శ్రాద్ధ కర్మలకు ఎంచుకోకూడదు. తనకు ప్రత్యేకించి మిత్రుడు లేక శత్రువు రెండూ కాని ఒక వ్యక్తిని శ్రాద్ధమునకు నియమించాలి. ఎవరు శ్రాద్ధ క్రియలకు తన మిత్రుడిని ఎంచుకుంటాడో, అతడు స్వర్గలోకాన్నుంచి భ్రష్టుడై కిందికి పడతాడట. చవిటి నేలలో విత్తనాలు చల్లితే శ్రమపడడమే కానీ ఫలితం దక్కదు. అలాగే మూఢుడిని శ్రాద్ధ క్రియలకు నియమిస్తే ఫలం దక్కదు. సమర్ధుడైన వానినే శ్రాద్ధక్రియలకు నియమించాలి. మిత్రుడు కదా అని ఎవరిని పడితే వారిని అందుకు నియమిస్తే ప్రయోజనముండదు. యోగ్యులను ఎంచుకుని వారిని పూజించి దక్షిణలు ఇస్తే దాతకు, ప్రతిగ్రహీతకూ ఇహపరలోకముల ఫలము కలుగుతుంది. జ్ఞానవంతులు దొరకని పక్షంలో గుణవంతుడైన మిత్రుడిని శ్రాద్ధానికి నియమించాలి. గుణవంతుడే అయినా సరే శత్రువును ఎట్టి పరిస్థితులలోనూ ఇందుకు ఎంచుకోరాదు. శత్రువుని నియమించి చేసిన శ్రాద్ధము పరలోకంలో  నిష్ఫలమౌతుందట. శ్రాద్ధములో మంత్ర, బ్రాహ్మణ రూపమగు ఋగ్వేదాన్ని అధ్యయనం చేసినవానినిగానీ,  యజుర్వేద శాఖను సాంతంగా అధ్యయనం చేసినవానినిగానీ, సామవేదాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసినవానినిగానీ ఎంచుకుని అతడికి సంతృప్తిగా భోజనం పెట్టాలి. హవ్యకవ్యములలో జ్ఞానులు మొదలైనవారు దొరకనప్పుడు మాతామహుని (తల్లి తండ్రిని), మాతులుని (మేనమామను), స్వస్రీని (మేనల్లుడిని), శ్వశురుని (పిల్లను ఇచ్చిన మామగారిని), గురువును, దౌహిత్రుడిని (కూతురి కొడుకును), అల్లుడిని, పినతల్లి కొడుకులను, యజ్ఞములు చేయించిన ఋత్విజుడిని, శిష్యుడిని ఎంచుకోవాలి.

శ్రాద్ధ భోజనం ఎవరికి పెట్టరాదు  ?   

దైవ కార్యాలకు బ్రాహ్మణుడిని ఎంపిక చేసుకునేటప్పుడు యోగ్యతను పరీక్షించవలసిన పని లేదు. అయితే శ్రాద్ధ కర్మలకు, భోజనానికి  బ్రాహ్మణుడిని ఎంచుకునేటప్పుడు మాత్రం యోగ్యతాంశాలను తప్పక పరిశీలించాలి. స్తేనులు (దొంగలు, దోపిడీదారులు), పతితులు (నైతికంగా పతనమైనవారు), క్లీబులు (నపుంసకులు), నాస్తికులు - వీరంతా హవ్యకవ్యములు (దైవ, పితృ కార్యములు) చేసేందుకు అనర్హులు. జటిలుడిని (శిరోజాలు జడలు కట్టినవానిని), శిరోముండనం చేయించుకున్నవానిని (తల గుండు కొట్టించుకున్నవానిని), వేదాధ్యయనము చేయనివానిని, దుర్బలుడిని, కితవుడిని (జూదరి లేక మోసగాడిని), పెక్కు మంది చేత యాజనము చేయించినవానిని శ్రాద్ధ భోజనము చేయనీయ కూడదు. చికిత్సకులు (వైద్యులు), కూలికై గుడిపూజ చేసేవారిని, మాంసం విక్రయించేవారిని, వర్తకముచే జీవించేవారిని హవ్యకవ్యములలో విసర్జించాలి.

ప్రేష్యుడిని (కూలికై ఊరివారి పనులు చేస్తూ రాజాజ్ఞ పాటించే సేవకుడిని), కునఖీ (పుప్పిగోళ్ళు కలవాడినీ), శ్యావదంతకుడినీ (నల్లని దంతములు కలవానిని), గురువుకు విరుద్ధంగా నడిచేవానిని, త్యక్తాగ్నిని (నిత్యాగ్నిహోత్రాన్ని పాటించడం మానినవానిని), వార్దుషికుడిని  లేక కుసీదుడిని అంటే డబ్బు వడ్డీకి ఇచ్చి ఆ ఆదాయంతో జీవించేవాడిని శ్రాద్ధ కర్మలకు  పిలిచి భోజనం పెట్టరాదు. యక్ష్మీ (యక్ష్మ వ్యాధి అంటే క్షయవ్యాధి పీడితుడు), పశుపాలుడిని (గొర్రెలు, మేకల్ని పెంచే వృత్తిలోవున్నవాడిని), పరివేత్తను (అన్నకంటే ముందుగా పెళ్లిచేసుకున్న తమ్ముడిని), నిరాకృతిని (రోజూ చేయాల్సిన పంచ మహా యజ్ఞాలు చేయనివాడిని), బ్రహ్మ ద్విట్ ని (బ్రాహ్మణ ద్వేషిని), పరివిత్తిని (తమ్ముడికి వివాహం అయినా తాను చేసుకోనివాడిని), గణాభ్యంతరుడిని (జనం సొమ్ముతో బతికేవాడిని) శ్రాద్ధ భోజనానికి పిలువరాదు.

కుశీలవుడు (నాట్య వృత్తిపై జీవించేవాడు), అవకీర్ణి (స్త్రీ సంపర్కం కారణంగా బ్రహ్మచర్య వ్రతం తప్పినవాడు), వృషలీపతి (శూద్రస్త్రీని పెళ్లాడినవాడు), పౌనర్భవుడు (రెండవసారి వివాహం చేసుకుంటే పుట్టినవాడు), కాణుడు (ఒక కంటిమీద కాయకాచి మూసుకుపోయిన కారణంగా ఒంటి కంటివాడు), ఉపపతిర్గృహే (తన భార్యయొక్క ఉపపతి స్వగృహంలోనే కలిగినవాడు - భార్యచేత వ్యభిచారం చేయించేవాడు) శ్రాద్ధ భోజనమునకు పిలువఁదగనివారు.

భృతకాధ్యాపకుడు (జీతం తీసుకుని వేదం చెప్పేవాడు), భృతకాధ్యాపితుడు (జీతమిచ్చి చదువుకొన్నవాడు), శూద్ర శిష్యులకు చదువు చెప్పే అధ్యాపకుడు, శూద్ర గురువు దగ్గర చదువుకున్నవాడు, వాగ్దుష్టుడు (పరుషంగా మాట్లాడేవాడు), కుండుడు (భర్త ఉన్న స్త్రీకి రంకు మొగుడి వల్ల  పుట్టినవాడు), గోళకుడు (ఒక విధవకు రంకుమొగుడి వల్ల పుట్టినవాడు), తల్లిదండ్రులు, గురువులకు శుశ్రూషలు చేయనివాడు, పతితులకు (నైతికంగా పతనమై వెలివేయబడినవారికి) వేద విద్యలు నేర్పడం, వారితో కలిసి వేదం చదువుకోవడం లేక వారితో వివాహ సంబంధాలు కలుపుకోవడం వంటివి చేసినవారు - వీరెవ్వరూ శ్రాద్ధ భోజనానికి పిలువదగినవారు కారు.

అగారదాహీ (ఇళ్ళు తగులబెట్టేవాడు), ఖైదీ, గరదః (విషమిచ్చేవాడు), కుండాశీ (కుండుడు, గోళకుడు వంటి వారు ఇచ్చిన ఆహారం తినేవాడు), సోమవిక్రయీ (సోమలతనూ, సోమరసాన్నీ అమ్మేవాడు),  సముద్రయాయీ (సముద్రయానం చేసినవాడు), వందీ (ఇతరులను పొగుడుతూ, స్తోత్ర పాఠం చేస్తూ బతికేవాడు), తైలికుడు (గానుగ ఆడించి నూనె తీసే గాండ్లవాడు లేక తెలికలవాడు), కూటకారకుడు (కూటసాక్ష్యం లేక  అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు) వీరు కూడా శ్రాద్ధ భోజనాలకు నిషిద్ధులు.

తండ్రితో వివాదాలు, వ్యాజ్యాలు చేసేవాడు, జూదగృహం నిర్వహించేవాడు, మద్యపానం చేసేవాడు, పాపరోగి  (కుష్ఠు వంటి పాపిష్టి రోగాలు కలవాడు), అభిశస్తుడు (హత్యానేరం మోపబడినవాడు), దాంభికుడు (ధార్మికుడిలా నటించేవాడు), రసవిక్రయీ (బెల్లము మొదలైన రసవస్తువులు అమ్మేవాడు) శ్రాద్ధ కర్మలకు పిలువదగినవారు కాదు.

ధనుశ్శరములు (విల్లంబులు) తయారుచేసేవాడు, వివాహం కాని అక్క ఉండగా చెల్లెలిని వివాహం చేసుకున్నవాడు లేక వితంతువైన వదిన (అన్న భార్య) తో సరసమాడేవాడు, మిత్రద్రోహి, జూదమాడితే వచ్చే సంపాదనతో జీవించేవాడు, పుత్రాచార్యుడు (తన పుత్రుడే ఆచార్యుడుగా అతడి వద్ద విద్య నభ్యసించినవాడు), భ్రామరీ (అపస్మారక లేక మూర్ఛరోగం కలవాడు), గండమాలీ (గ్రంథులు వాచే గండమాల రోగం ఉన్నవాడు), శ్విత్రము (శ్వేత కుష్ఠు) అనబడే బొల్లి అనే చర్మరోగం ఉన్నవాడు, పిశునుడు (చాడీలు చెప్పే కొండెకాడు లేక వేగులవాడు), ఉన్మత్తుడు (పిచ్చివాడు), అంధుడు(గుడ్డివాడు), వేదనిందకుడు (వేదాలను నిందించేవాడు) - వీరందరినీ కూడా శ్రాద్ధ కర్మలకు పిలువరాదు.

ఏనుగులను, ఆవులను, అశ్వములను, ఉష్ట్రములను (ఒంటెలను) పెంచే దమకుడిని (మచ్చిక చేసేవాడిని), నక్షత్రాల వల్ల జీవించేవాడు (జ్యోతిషశాస్త్రవేత్తనంటూ సంపాదన చేసేవాడు), పక్షి పోషకుడు (పక్షులను పెంచేవాడు), విలువిద్య వంటి యుద్ధ తంత్రాలు నేర్పే యుద్ధాచార్యుడు, స్రోతస భేదకుడు (నదుల కరకట్టలను తెంచేవాడు), ప్రవాహాలకు అడ్డుకట్టలు వేసేవాడు, గృహ సంవేశకుడు (వాస్తుశాస్త్రం పై జీవించేవాడు),  దూత లేక వార్తాహరుడుగా పనిచేసే సేవకుడు, వృక్షారోపకుడు(కూలికి చెట్లు నాటి పెంచేవాడు) వీరందరినీ శ్రాద్ధ భోజనానికి పిలవకూడదు.

శ్వక్రీడీ (కుక్కల్ని పెంచి ఆడించేవాడు), శ్యేన జీవీ (డేగలను కొని, పెంచి, అమ్మేవాడు), కన్యాదూషకుడు (కన్యలను చెరిచేవాడు), హింస్ర (జీవులను హింసించి, వినోదించే క్రూర స్వభావం కలవాడు), వృషాల వృత్తిశ్చ (శూద్ర వృత్తులయందు ఆసక్తి కలవాడు), గణానాం చ యాజకః (గణాలకు, గణాధిదేవతలకూ యజ్ఞాలు చేయించే వాడు), ఆచారహీనుడు (సదాచారములు లేనివాడు), క్లీబుడు(నపుంసకుడు), నిత్యం యాచనక (ఎప్పుడూ ఇతరులను యాచించి జీవించేవాడు), కృషిజీవీ (తన జీవనం కోసం వ్యవసాయం చేసేవాడు), శ్లీపదీ (శ్లీపద రోగం లేక బోదకాలు లేక ఏనుగుకాలి వ్యాధిగ్రస్థుడు), సద్భిర్నిందితుఁడు (పెద్దలచే నిందించబడినవాడు) వీరెవ్వరినీ కూడా శ్రాద్ధమునకు పిలువకూడదు. ఔరభ్రికుడు (ఉరభ్రములు అంటే గొర్రెలు అమ్మి జీవించేవాడు), మాహిషికుడు (గేదెల పాడిపై ఆధారపడి జీవించేవాడు), పరపూర్వాపతి (విధవా వివాహం చేసుకున్నవాడు), ప్రేత నిర్యాతకుడు (డబ్బు తీసుకుని శవాలను మోసేవాడు) - వీరెవ్వరినీ హవ్యకవ్యములకు పిలవనే కూడదు.

అంతేకాదు. సజ్జనులచే విగర్హితమైన (నిరసించబడు) ఆచారములు కలిగిన, సహపంక్తి భోజనానికి అనర్హులైన ద్విజాధములను (బ్రాహ్మణాధములను) కూడా విద్వాంసుడైన బ్రాహ్మణోత్తముడు తన ఇంట జరిగే హవ్యకవ్యములకు ఆహ్వానించడు. గడ్డినిప్పు ఎలాగైతే హవిస్సులను మండించలేదో, వేదాధ్యయనము చేయని (గడ్డి నిప్పు వంటి) బ్రాహ్మణునికి ఇవ్వబడిన హవ్యకవ్యములు బూడిదలో పోసినట్లే నిష్ఫలమౌతాయి. అపాంక్తేయునకు (పంక్తి భోజనానికి యోగ్యుడు కాని వాడికి) దైవ కర్మలోనూ, పితృ కర్మలోనూ ఇచ్చే హవ్యకవ్యముల వలన దాతకు ప్రతికూల ఫలితాలుంటాయి.

వేద వ్రతము పాటించని ద్విజులు, పరివేత్త (అన్న కంటే ముందుగా వివాహం చేసుకున్నవాడు) మొదలైన అయోగ్యులు, అపాంక్తేయులు (పంక్తికి అనర్హులు) చేసిన భోజనం రాక్షసులు తింటారు. కాబట్టి అలాంటి హవ్యకవ్యములు నిష్ప్రయోజకం. అన్న కంటే ముందుగా పెండ్లి చేసుకున్నవాడిని పరివేత్త అంటే అతడి అన్నను పరివిత్తి అంటారు. అలాంటి వివాహంలో పరివేత్త, పరివిత్తి, కన్య, కన్యాదాత, ఆ వివాహంలో హోమం చేయించినవాడు - వీరు ఐదుగురూ నరకాన్ని పొందుతారు. చనిపోయిన తన సోదరుడి భార్య పట్ల కామదృష్టి కలవాడిని అగ్రే దిధిషుడు అంటారు.

ఒక స్త్రీకి భర్త బ్రతికి ఉండగానే పర పురుషుడి వలన పుట్టినవాడిని కుండుడు అనీ, భర్త మరణించిన తరువాత ఆ స్త్రీకి పుట్టినవాడిని గోళకుడు అనీ అంటారు. అలా అక్రమ సంతానంగా జన్మించిన కుండ గోళకులకు ఇవ్వబడిన హవ్యకవ్యములు నిష్ఫలమౌతాయి. దాతకు ఇహపరములు రెండింటిలో అవి పుణ్యాన్ని నశింపజేస్తాయి.

ఒక అపాంక్తేయుడు (సహపంక్తిలో కూర్చుని భోజనం చేసేందుకు అనర్హుడు) చూస్తూ ఉండగా సజ్జనులు భోజనం చేస్తే ఆ భోజనం వలన దాతకు వచ్చే పుణ్యం అంతటినీ వాడు హరించివేస్తాడు. అందుకని సాధువులు భోజనం చేయడాన్ని అపాంక్తేయులు చూడకుండా ఉండేటట్లు  ఏర్పాట్లు చేయాలి.

పదిమంది వరుసగా కూర్చుని భోజనం చేయడాన్ని పంక్తి భోజనం అంటారు. సంస్కృతంలో పంక్తి అంటే పది అని అర్థం. అందుకే దశరథుడిని పంక్తిరథుడు అనికూడా అంటారు.

ఒక గుడ్డివాడు సహపంక్తిలో ఉంటే తనతో కలిసి భోజనం చేసిన తొంభై మంది సజ్జనుల భోజనం వలన దాతకు కలిగే పుణ్యఫలాన్ని హరించి వేస్తాడట. ఒంటికంటి వాడు సహపంక్తిలో కూర్చుంటే అరవై మంది సజ్జనులు భోజనంచేస్తే వచ్చే పుణ్యఫలాన్ని నిష్ఫలం చేస్తాడట. ఇక పాపరోగుల విషయానికొస్తే శ్వేత కుష్ఠు లేక బొల్లి ఉన్నవాడు సహపంక్తిలో కూర్చుంటే ఆ పంక్తిలోని వందమంది సజ్జనులకు దాత చేసిన అన్నదాన ఫలాన్ని నాశనం చేసేస్తాడట. రాజయక్ష్మ రోగ (క్షయ) పీడితుడు పంక్తిలో భుజిస్తే వెయ్యి మంది సజ్జనులకు దాత చేసిన అన్నదాన ఫలాన్ని అతడు హరించి వేస్తాడట. శూద్రుడికి పౌరోహిత్యం చేసినవాడు శ్రాద్ధ భోజనానికి వస్తే అతడు ఎంతమందిని తన శరీర అవయవాలతో తాకుతాడో వారందరి భోజనం వలన అన్నదాతకు చేకూరే పుణ్యఫలాన్నంతా హరించి వేస్తాడట.

వేదవేత్తయైన విప్రుడు సైతం ఒక శూద్ర యాజకుని నుండి ఆశతో దానం స్వీకరిస్తే ఆ బ్రాహ్మణుడు కాలని మట్టికుండ నీటిలో పడి కరిగిపోయినట్లు నశిస్తాడట.

ఒక శ్రాద్ధ కర్మలో దాత సోమవిక్రేతకు (సోమలతలనూ, సోమరసాన్నీ అమ్మేవాడికి) ఇవ్వబడిన దానం జన్మాంతరంలో మలం (ordure or excrement) గా మారిపోతుంది. అందుకే అప్పుడా దాత మలం తినే పందిగా జన్మిస్తాడట. ఒక భిషక్కుకు (వైద్యునికి) దాత చేసే దానం మరుజన్మలో చీము, నెత్తురుగా మారిపోయే కారణంగా ఆ దాత చీము, నెత్తురు తినే పురుగై పుడతాడట. దానము దేవలకుడికి (పూజారికి) ఇస్తే ఎలాంటి ఫలమూ ఉండదు. అలాగే వడ్డీ వ్యాపారంచేసి, ఆ వడ్డీతో జీవించే వాడికి (వార్దుషుడికి ) దానమిస్తే ఆ దాతకు ఎలాంటి కీర్తి ఉండబోదు. అందుకే ఒక సోమవిక్రేతనూ, వైద్యుడిని, అర్చకుడిని, వడ్డీ వ్యాపారిని శ్రాద్ధమునకు ఆహ్వానించరాదు.

ఒక స్త్రీ రెండవసారి పెళ్లి చేసుకుంటే పుట్టిన కుమారుడికి, ఒక వర్తకుడికి ఒక దాత శ్రాద్ధములో చేసే అన్న దానము ఇహలోకంలోగానీ, పరలోకంలోగానీ ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వదు. అది భస్మాహుతి లాగే నిష్ఫలమౌతుంది.

ఈ ధర్మశాస్త్రములో మనువు బ్రాహ్మణులకు షట్కర్మలను నిర్దేశించాడు. అవికాక మరే ఇతర పనులు, వృత్తులు, వ్యాపకాల జోలికి పోకుండా బ్రాహ్మణులు కేవలం వేద విద్యలకు మాత్రమే పరిమితం కావాలని మనువు అభిమతం. అయితే మనువు కాలం నాటికి బ్రాహ్మణులు షట్కర్మలు వదిలేసి లాభదాయకమైన పలు వృత్తులు, వ్యాపారాలు చేపట్టారు. వారిని కేవలం షట్కర్మలకే పరిమితం చేసే ఉద్దేశంతో మనువు శ్రాద్ధ భోజనాలకు బ్రాహ్మణులే అయినా ఎవరెవరు అర్హులో, ఎవరెవరు అనర్హులో చాలా వివరంగా చెప్పడం జరిగింది. సమాజంలో జోస్యులు, హస్త సాముద్రికులు, వాస్తుశాస్త్రజ్ఞుల పేరిట పలు వైదికేతర వృత్తులు అవలంబించిన కొందరు బ్రాహ్మణులు అప్పటికే మోసగాళ్లుగా గుర్తింపు పొందారు. ఈ ధర్మశాస్త్రములో మనువు పలు ఇతరచోట్ల రాత్రులు ఇళ్లకు కన్నం వేసి దోచుకునే వారు ప్రఛ్చన్న వంచకులనీ, సంపదలు, సంతానము మొదలైనవి కలుగుతాయని గృహస్థులకు అబద్ధాలు చెప్పి వారిని నమ్మించి వారి నుంచి సొమ్ము దండుకునే  జోస్యులు ప్రకాశ వంచకులు (పగటి దొంగలు) అనీ విమర్శించాడు.( ఆధ్యా 9 - శ్లో 258- 260) మనువు కాలంనాటికే జోస్యులు, హస్తసాముద్రికులు, వైద్యులు, వ్యాపారులు, పూజారులు, జూదగృహాలు నిర్వహించేవారు, మాంసవిక్రేతలు, మద్య విక్రేతలు, సోమవిక్రేతలు, జటిలులు ( జడలు కట్టిన సన్యాసులు), శిరోముండనం చేయించుకున్నవారు అధికసంఖ్యలో మోసాలకు పాల్పడుతూ ఉన్న కారణంగానేనేమో మనువు సామాజిక కార్యకలాపాలకు వారిని దూరంగా ఉంచమనడం, వేగులద్వారా అలాంటివారిపై ఒక కన్నేసి ఉంచమని పాలకులకు సూచించడం చేశాడు. తైలికులు (నూనె గానుగలో నువ్వులు ఆడించి తైలం తీసేవారు) కూడా బహుశా అప్పట్లోనే కల్తీలవంటి వాటికి పాల్పడేవారేమో! అందుకే మనువు వారి పట్లకూడా తన నిరసనను వ్యక్తపరచాడు. విల్లంబులు తయారుచేసి విక్రయించే వారిని కూడా శ్రాద్ధ భోజనానికి దూరంగా పెట్టమన్నాడు. ఇల్లు తగలబెట్టేవాళ్లూ, నది కరకట్టలు తెగగొట్టేవారినీ కూడా శ్రాద్ధభోజనాలకు దూరం పెట్టమనడం ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలపట్ల నాటి సమాజపు నిరసనభావాన్నితెలుపుతున్నది. తీవ్రమైన అంటువ్యాధులతో, పాపిష్టి వ్యాధులతో బాధపడేవారిపట్ల నాటి సమాజానికి జాలి లేకపోగా వారు వారి గత జన్మలలో చేసిన ఘోరపాపాల కారణంగానే వారు ఆ పాపిష్టి రోగాలపాలయ్యారని నమ్మడం దారుణం. అయితే సూక్ష్మక్రిముల కారణంగా వ్యాపించే ఆ భయానక అంటువ్యాధుల నివారణ గురించి అప్పట్లో వైద్యవిజ్ఞానం అభివృద్ధికాని కారణంగా ఆ వ్యాధిగ్రస్థులను కూడా వ్యాధుల వ్యాప్తికి భయపడి నాటి సమాజం పతితులపేరిట అస్పృశ్యులుగానే దూరం పెట్టింది. ఇక సముద్రయానం బ్రాహ్మణులకు నిషిద్ధమని పరాశర స్మృతి కూడా పేర్కొంది.

సముద్రయాన గమనం బ్రాహ్మణస్య న శాస్యతే |
సంభవేద్యది మోహేన పునస్సంస్కార మర్హతి || ( ప. స్మృ)

శతాబ్దాలుగా విదేశాలలో విద్యా ఉద్యోగాలకు వెళ్లినవారు ఎవరెవరు ఏ మేరకు పునస్సంస్కారులయ్యారో మనకు ఎరుకే. ఏ కారణం చేత నౌకాయానం బ్రాహ్మణులకు నిషిద్ధం అయిందనేది చెప్పకున్నా మనువు ఈ అధ్యాయంలో సముద్రయానాన్ని కూడా సమాజానికి దూరం పెట్టమన్నాడు.

పంక్తి పావనుడంటే ?

అపాంక్తేయుల వలన అపరిశుద్ధమైన బ్రాహ్మణుల పంక్తిని పరిశుద్ధ పరిచే బ్రాహ్మణోత్తముడిని పంక్తి పావనుడు అంటారు. వేదాలన్నీ చక్కగా చదివి, షడంగములపై కూడా  పూర్తి  పట్టు కలిగి, గొప్ప శ్రోత్రియ కుటుంబంలో జన్మించినవాడినే పంక్తిపావనుడు అంటారు. అథర్వవేద భాగమగు త్రిణాచికేతమును చదివినవాడు(ఆ వ్రతమును ఎరిగినవాడు), ఐదు అగ్నిహోత్రాలు చేసేవాడు, ఋగ్వేద భాగమగు త్రిసుపర్ణమనే వ్రతమును బాగా ఎరిగినవాడు, శిక్షా, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అనే ఆరు వేదాంగముల మర్మములు క్షుణ్ణంగా తెలిసినవాడు, బ్రాహ్మ వివాహం చేసుకున్న స్త్రీకి పుట్టిన కుమారుడు, జ్యేష్ఠ సామమును గానం చేసేవాడు - వీరు ఆరుగురూ పంక్తిపావనులు. వేదార్థవేత్త, వేద ప్రవచనం చేసే ప్రవక్త, బ్రహ్మచర్యాన్ని ఒక వ్రతంగా అనుష్ఠించేవాడు, వేయిగోవులను ఇచ్చేవాడు (విస్తారమైన దానగుణం కలిగినవాడు), శతాయుష్కుడు, శ్రోత్రియుడు అయిన బ్రాహ్మణుడు పంక్తి పావనుడు.

***సశేషం***

Posted in November 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!