Menu Close
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
పళ్ళూడ గొట్టుకోను ఏరాయైతేనేం

విశ్వ వ్యాప్తంగా పేరు గాంచిన ఒక పెద్ద సాఫ్ట్ వేర్ [సాఫ్ట్ నెస్ లేని] కంపెనీలో విశ్వం ఒక ‘గజోద్యోగి’. పెళ్ళి విషయం వచ్చేసరికి తీరిక లేదంటాడు. రోజంతా ‘ల్యాప్ ట్యాప్, మొబైల్ ఫోన్తో’ సరి. తిండీ, నిద్రా, నీళ్ళూ, నిప్పులూ సర్వస్వం అవే!

"ఒరే విశ్వం! బెండకాయ ముదిరితే ‘ఆల్కూచట్నీ’ [ఆల్ కూరగాయముక్కల చట్నీ] ఐనా చేసుకోవచ్చు, బ్రహ్మచారి ముదిరితే ఎందుకూ పనికి రాడురా!" అని విశ్వం అమ్మ, నాన్న, బామ్మ కాపేసి, చెవి నిల్లు గట్టుకుని [ఉన్నింట్లో విశ్వం దొరకనందున] పోరగా పోరగా, చివరకు శలవిచ్చాడు, శలవంటే ల్యాప్ ట్యాప్ కూ, మొబైల్ కూ కాదండోయ్, వాళ్ళ వాళ్ళకు సమాధానం ప్రవచించాడన్న మాట.

"సరే చూసుకోండి, నన్ను మాత్రం విసిగించకండి"అన్నాడు. వారు ఇహ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, పెళ్ళిళ్ళ పేరయ్యకూ, వివాహాల వీరయ్యకూ, మ్యారేజీల మల్లయ్య కూ మొబైల్స్ లో కాల్స్ చేయగా, వారంతా తమ ఐ ఫోన్స్, ఐప్యాడ్సూ చంకనేసుకుని ఆఘ మేఘాలమీద, రెక్కలు కట్టుకోడం రానందున మోపెడ్స్ లో రన్స్ చేసుకుంటూ వందా, నూటాభై మైళ్ళ స్పీడ్ లో, వాలారు. ముగ్గురి ఐప్యాడ్సూ శల్య పరీక్ష చేసి అమ్మాయిల ఫోటోల వేటలో పడి, కొందర్ని పట్టుకున్నారు.

“నేను వచ్చి అందర్నీ చూసే తీరిక, ఓపిక లేవు, ఆ ఫోటోలు, వారి రెజ్యూంస్ అన్నీ నా మైల్ కు పంపండి, చూస్తాను." అన్నాడు తండ్రితో విశ్వం. ఆయన తాము సెలెక్ట్ చేసిన కొందరమ్మాయిల ఫోటోలూ, వారి వివరాలూ అన్నీ విశ్వం మైల్ కు, పీ.డీ.ఎఫ్ ఫైల్లో పంపాడు. ఎన్నాళ్ళు గడిచినా సమాధానంలేదు.

ఒకే ఇంట్లో ఉంటున్నా అమ్మానాన్నలకు విశ్వం కనిపించేది ఎప్పుడో!

"ఏరా! ఎవర్ని సెలెక్ట్ చేశావు?" అని తండ్రి ఒక రోజున కాపేసి పట్టుకుని నిలదీయగా, "ఏదీ నాకు తీరితేగా! ఈ రోజు ఎలాగైనా చూస్తాన్లే!" అన్నాడు. ఇలా కాదని తండ్రి, మొబైల్కు మెసేజేస్ మీద మెసేజీలు పెట్టగా, ముగ్గురి ఛాయా చిత్రాలు మార్క్ చేసి వెనక్కు పంపి, “వీరిలో ఎవరైనా ఓ.కే!" అనేశాడు మెసేజీలోనే!

ఒక రోజున "ఏరా! ఎప్పుడెళదాం పిల్లల్ని చూడను? ఆ ముగ్గుర్నీ చూసి ఒకర్ని ఎంపిక చేసుకో!" అన్న తండ్రితో, "నేను అందర్నీ చూడను, సంతలో కూరగాయల్లా, మీరే ఎంపిక చేయండి ఒకర్ని” అన్నాడు.

అదే చాలని మురిసిపోయి ముగ్గురు పోకూడదని, పక్కింటి పంకజం మామ గార్ని కూడా తీసుకుని, వెళ్ళి ఆ ముగ్గుర్నీ చూసి, వాళ్ళకు అన్ని విధాలా కుటుంబం, సాంప్రదాయం అన్నీ నచ్చిన, ఒకమ్మాయిని నిశ్చయించారు.

"వచ్చేవారం పెళ్ళిచూపులకు పిల్లాడితో వస్తున్నాం" అని పెళ్ళిళ్ళ పే..,వీ.., మ... య్య ల ద్వారా, పిల్ల ఇంటికి కబురు పంపారు కూడా!

"ఏంటి నాన్నగారూ! ఇలా చెప్పాపెట్టకుండా పెళ్ళిచూపులంటే ఎలా?"

"అదేంట్రా! వారం నుంచీ చెప్తూనే ఉన్నాంగా?"

"ఓహో చెప్పారా? మైల్ లో పెట్ట వలసింది, లేదా మొబైల్ లో మెసేజ్  పెట్టా ల్సింది..."విసుక్కుంటున్న విశ్వాన్ని చూసి,

"విడ్డూరంగా మాట్లాడకు విశ్వం! ప్రతిరోజూ చెప్తూనే ఉన్నాం, ఉదయం, సాయం కాలం, ముగ్గురం వంతులవారీగా, నిద్రమానేసి కాచుక్కూర్చుని, దీనికంటే మైల్ పెట్టడం, మెసేజ్ పంపడం ఎక్కువా?" అసహనంగా అరిచాడు తండ్రి ఆనందరావు.

"మైల్ లో ఏదున్నా గుర్తుంటుంది, మొబైల్ మేసేజైతే ఇంకా  గుర్తుంటుంది, సరే రోజంతా శలవు దొరకదు, ఒక గంట సరిపోతుందా?" మొబైల్లో మెసేజెస్ చూసుకుంటూనే అడిగాడు విశ్వం.

"విడ్డూరంగా మాట్లాడకు, జీవిత భాగస్వామిని ఎంచుకునే పెళ్ళిచూపులకు ఒక గంటా?!"

"అసలు మీరెళ్ళి చూస్తే చాలదూ..నేనూ రావాలా? ఫోటోస్ చూశాగా! ఛాట్ చెస్తే సరిపోయే దానికి ఇంత తతంగమూ, రాధ్ధాంతమూ అవసరమా?"

"ఒరే విశ్వం! ఈ రోజుల్లో ఫోటోస్ చూస్తే చాలదురా! మొగపిల్లలకు ఆడగొంతులూ, ఆడపిల్లలకు బొంగురు గొంతులూ, సహజమై పోయాయి. మీ ఉద్యోగాల్లో గంటలు గంటలు మొబైల్స్ లో మాట్లాడుకుంటూ, మీ గొంతే మీకు మారి పోతున్నది కొత్తగా. పైగా మీ అభిరుచులు ఒకరి కొకరు తెల్సుకోకుండా….."

"అదంతా ఛాట్ చేసుకుని చెప్పేసుకుంటాం కదా?"

"మరి పిల్ల తల్లిదండ్రులు నిన్నుచూడవద్దా?"

"ఏంటో మీ మాటే మీది..సరే నన్ను త్వరగా వదిలేయండి..."

"ఆ పిల్లా నీలాగా ఉద్యోగస్తురాలేగా! ఆ పిల్లకూ సెలవు దొరకటం కష్టంట.. "

"సరే కదలండి మరి, నా టైమంతా వృధా అవుతుంది. ప్రాజక్ట్ మేనేజర్ల సెలక్షన్స్ ఈరోజు.." అంటూ, అలా విశ్వం పెళ్ళిచూపులకు కదిలాడు. పెళ్ళిచూపులకు పిల్ల ఇంట్లో అడుగెట్టేలోగానే విశ్వం మొబైల్ పదిమార్లయినా మోగింది. దారిపొడవు నా మాట్లాడుతూనే ఉన్నాడు. పెళ్ళిచూపుల గురించి ఏమైనా చెపుదామని, అమ్మా, నాయనా, బామ్మా ఎంత ప్రయత్నించినా విశ్వం ఖాళీగా దొరక లేదు.

ఈలోగా వారిల్లు రానే వచ్చింది. "రండి రండి!" అని పిల్ల నాయన ఎదురొచ్చాడు. విశ్వం ఎత్తు, బరువు, రంగు తూకమేసుకుని తల ఊస్తూ.

అంతా కూర్చున్నాక, కాఫీలవుతుండగానే విశ్వం మొబైల్ లో వచ్చిన మెసేజెస్ చెక్ చేసుకుంటూనే, తండ్రికి సైగ చేశాడు. ఆయన భార్యకు సైగ చేశాడు. ఆమె పిల్ల తల్లికి సైగ చేసింది. పిల్ల తల్లి లోపలున్న తన కుమార్తె కు, కాబోయే పెళ్ళికూతురికి సైగ చేసింది. ఆ అమ్మాయి బురదలో నడుస్తున్నట్లు, అలవాటు లేని చీరను పైకెత్తి పట్టుకుంటూ నాలుగడుగులు హాల్లోకి రాగానే ఒక్కమారుగా, ఇటు విశ్వం ఫోనూ, అటు ధరణి ఫోనూ..[అన్నట్లు పిల్లపేరు ‘ధరణి’ అని చెప్పటం మరచినట్లున్నాను. అన్నీనీ మొబైల్ లో మెసేజ్ చేసుకుంటేనే గానీ గుర్తుండి చావదు ఒక పట్టాన. వెధవ రోగమైపోయిందికదా!] ఒకే మారు మోగాయి ఇద్దరి పోన్లూనూ.

ఇద్దరి కిద్దరూ పక్కకు తిరిగి మాట్లాడ సాగారు. పావు గంటయ్యాక ధరణి,

"సారీ!" అంటూ వచ్చింది. బామ్మ పిల్లను - తెల్సినా పేరూ అదీ అడిగాక [గొంతు ఎలాఉంటుందో వినను],

"మీరేమైనా మాట్లాడుకుంటారా?"అన్నాడు ధరణి తండ్రి.

"వైనాట్? ష్యూర్" అని విశ్వం అనగానే, ధరణి లేచి లోపలికి నడిచింది, చీరేత్తి పట్టుకునే! ఆ వెనకే విశ్వమూ లేచి నడిచాడు. అలా ఇద్దరూ నడుస్తుండగా వెనుక నుంచి పెద్దలు ఐదుగురూ, ఇద్దరినీ చూసుకుని మురిసి పోసాగారు. [మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని!]. {ని ఝ్ఝంగానే మేడ్ఫర్ ఈ ఛ్ఛధ ర్ర్!!} లోపలికి వెళుతుండగానే మళ్ళా ఇద్దరి ఫోన్లూ మోగాయి.

లోపలికెళ్ళి గదిలో వెనక్కుతిరిగి, ఇద్దరూ చెరోమూలకూ చేరగిలబడి మాట్లాడసాగారు. అర్ధ గంటైనా బయటికి ఇద్దరూ రాక పోడంతో, పెద్దలు ఐదుగురూ కల్సి ‘లోపలేం జరుగుతున్నదో, ఏదైనా జరగరానిది జరుగుతున్నదేమో!’ అనే భయంతో వచ్చారు గది ముందుకు. బయటినుంచే లోపలిదృశ్యం చూసి ముక్కున ఎవరి వేళ్ళు వారే వేసుకుని నిల్చిపోయారు.

ఫోన్ కాల్స్ కు అటెండయ్యాక "మీకేం అభ్యంతరం లేకపోతే మనం మిగిలిన విషయాలు స్కైప్ లో మాట్లాడుకుందాం, నాకు అర్జంట్ మీటింగ్ ఉంది.." అని నసుగుతున్న విశ్వంతో,

"యూ సేవ్డ్ మీ! నాకూనూ ...అర్జంట్ మీటింగ్ కు అటెండవ్వాలి. రాత్రికి స్కైప్ లో కొస్తాను.” అంటూ ధరణి గబుక్కున నడవబోయి, అలవాటు లేని పాడుచీర కాళ్ళకు అడ్డురాగా ముందుకు పడ బోగా విశ్వం పట్టుకున్నాడు. "థాంక్స్" అని చెప్పింది.

"అలవాటు లేని చీర!" అని చిన్నగా అంటూనూ. . పెద్దలు ఐదుగురూ సిగ్గుపడ్డారు!, పిల్లలు కాదుస్మీ!!

{వాళ్ళకు వంటి స్పృహ ఏదీ! వృత్తి స్పృహతప్ప.}

"ఓ .కే” -అంటే “-ఓ.కే"--అనుకుని అంతా బయల్దేరారు. ఆ రాత్రి చాలా పొద్దుపోయాక ఇంటి కొచ్చిన విశ్వం మొబైల్లో టెక్ట్స్ చూశాడు. "ఐ యాం స్టిల్ ఇన్ కాన్ ఫరెన్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం టూ మ్యారీయూ." అనే మేసేజ్ చూసుకుని, "ఐ టూ.." అని పెట్టాడు బదులు మేసేజ్.

అలా ఆ ఇద్దరికీ పెళ్ళి కుదిరింది. పెళ్ళి కుదిరినందుకు సంతోషించిన పెద్దలు మాత్రమే నిశ్చయ తాంబూలాలు పుచ్చేసుకుని [తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు ఛావండి అని కాక, తాంబూలాలు పుచ్చేసుకున్నాం, చేసుకు తీరండి అనుకున్నారు మనస్సుల్లో.]

ఆ సంతోషంలో పెద్దలంతా కలసి, నిశ్చితార్ధం పెట్టుకున్నారు. ఆ రోజున బంధువులంతా వచ్చారు. వధువు, వరుడు తప్ప. అంతా "అసలు పిల్లలేరీ!" అనగా, "వస్తారు వస్తారు." అని అందరికీ నచ్చ చెప్పి, ఎదురుచూస్తుండగా, విశ్వం ఫోన్ చేసి తండ్రితో "స్కైప్ లో కనిపిస్తే చాలదా!" అన్నాడు. ఎక్కడో మండిన ఆయన "నోర్మూసుకురా! అంతా అడుగుతున్నారు." అన్నాక ఎలాగో బయల్దేరాడు. ఈలోగా భోజనాలు కూడా అయ్యాక, ఇహ అంతా వెళ్ళబోతున్నసమయంలో ఇద్దరూ వారి వారి కార్లలో దిగారు.

"అందర్కీ సో సారీ!” — “అర్జంట్ మీటింగ్స్." అని చెప్పి డ్రెస్ మార్చుకోకుండానే, దండలు, ఉంగరాలూ మార్చుకున్నారు. అందరి ముందూ పెళ్ళి కుదిరినట్లు నిశ్చయమయ్యాక, పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు, గండం గడిచినందుకు సంతోషిస్తూ.. పెళ్ళి శుభలేఖలు వేయించడం, పంచుకోడం అంతా పెద్దలే చేసేసుకున్నారు.

విశ్వం, ధరణీ ఒకే ఒక గ్రూప్ మైల్ తో వారి, వారి స్నేహితులందరినీ ఇన్వైట్ చేసేసుకున్నారు. వెళ్ళి అందరికీ కార్డులు పంచే తీరిక వారి కేదీ! పెద్దలందరికీ అనుమానమే! "వీళ్ళసలు పెళ్ళి పీటల మీద కూర్చుంటారాండీ! లేక స్కైప్ లోనే తాళి కట్టుకుంటామంటారా!" అని.

“ఏదైతే అది కానీండి ఏంచేస్తాం కార్డులు కూడా పంచుకున్నామాయె! ఇప్పుడు వెనక్కు తగ్గలేంకదా?" అనుకుని ఊరుకున్నారు. పెళ్ళిరోజురానే వచ్చింది. పెద్దలందరికీ భయం భయంగానే ఉంది. ఎలాగోలా బ్రతిమాలి, బామాలి, భయపెట్టి వారిద్దరిచేతా ఒక్కరోజు శలవు పెట్టించే సరికి దేవుడు దిగివచ్చాడు [ఆయనా ఈ సాఫ్ట్ వేర్ పెళ్ళిళ్ళు ఎప్పుడూ చూడలేదల్లే ఉంది, అందుకే తిష్ట వేసుక్కూర్చున్నాడు.] పెళ్ళిరోజున ఇద్దర్నీ వేర్వేరు గదుల్లో పెట్టి కాపలా ఉన్నారు పెద్దలు.

"తతంగ మంతా ఒక్కగంటలోపే ముగించేయాలి" అని ముందే పిల్లలిద్దరూ చెప్పినందున, గబుక్కిన ఆఫీసుల కెళ్ళిపోతారేమోనని, వారి ల్యాప్ ట్యాప్స్, మొబైల్స్ మాత్రం వారితోనే ఉంచుకోనిచ్చారు.

తలంట్లు జరుగుతుండగానే ఇద్దరి కిద్దరూ మొబైల్ లో మాట్లాడుతూనే ఉన్నారు. కంచిపట్టు చీర, బ్యూటీపార్లర్ వారిని ఇంటికి పిలిపించి ఎలాగో కట్టించి ధరణిని, పట్టు పంచ నానాతంటాలూపడి కట్టి విశ్వాన్నీ పీటల మీదకు చేర్చారు.

విఘ్నేశ్వర పూజ అవుతుండగా, ఇద్దరిఫోన్లూ మోగాయి, ఒక చేత్తో మొబైల్ చెవి వద్ద పెట్టుకునే పూజ ఐందనిపించారు. తలమీద జీలకర్రా బెల్లం పెట్టే సమయంలో మళ్ళా ఫోన్లు మోగాయి. ఒకరి తలపై ఒకరు మొబైల్స్ పెట్టుకున్నారు అలవాటులో పొరపాటున [నిరంతరం నిద్రపోతున్నా మొబైల్ చేతులో ఉండటం అలవాటైతే, ఒకరి నెత్తిన ఒకరు పెట్టుకోడం పొరపాటన్న మాట!] ఆహూతులంతా “ఓహో హో.. ..ఆహాహా" అని నవ్వారు.

ఎదురుగా కూర్చున్నదేవుడూ 'చిత్రం! చిత్రం! భళారే విచిత్రం!' అనుకుంటూ వెళ్ళిపోయాడు. [దేవుడు పుట్టే సమయంలో పావుగంట, చనిపోయే సమయంలో పావుగంట, పెళ్ళిసమయంలో అర్ధగంట తాను పుట్టించిన మానవు లందరి వద్ద ఉంటాట్ట!]

పురోహితుడు కూడానూ మ్యాచ్ ఫర్ దెం. "కానివ్వండి కానివ్వండి నా ఐప్యాడ్ లోచార్జ్ ఐపోయేలా ఉంది, మంత్రాలు చదవడం కుదర్దు" అని అందరినీ తొందర చేసి, పెళ్ళి తతంగం ముగించేశాడు. ఎలాగో ఒకలా పెళ్ళైందనిపించి, ఆర్భాటన్నాలు, అదే ప్లేట్లెత్తుకెళ్ళీ ‘ఇది కావాలి, అదికావాలి' అని అడుక్కు తెచ్చుకునే భోజనాలు పెద్దెత్తున, అందరికీ ఐనా యనిపించి, గుండెల మీద బరువు దింపుకుని ఊపిరి పీల్చుకున్నారు, ఇరువైపుల అమ్మానాన్నలు నలుగురూ బామ్మగారూనూ.

పిల్ల తల్లి "వదినా! వీళ్ళు మరి చిక్కరు, ఆ కాస్తా అడ్డంకీ తీర్చేశామంటే ఇహ మన ప్రమేయమేమీ ఉండదు. ఆ తర్వాత వాళ్ళిష్టం. ఏమంటారు?" అంది రహస్యంగా.

"నేనూ అదే ఆలోచిస్తున్నాను వదినా! అలాగే కానిచ్చేద్దాం" అనుకుని ఇద్దరూ వారి వారి మగ వాళ్ళతో అన్నారు.

"కానిచ్చేయవలసింది వారిద్దరూ, మీరిద్దరూకాదు." అన్నారు అనుమానంగా ఆమగవాళ్ళు. అదే వారిద్దరి మగళ్ళూ.

"మీరుండండి, మీమగవారికన్నీ శంకలే. మీ ఘనత గురించీ నాకు తెలీదా ఏం? అమ్మపుట్టిల్లు మేనమామ వద్దా నీ..." అని నవ్వుకుంటూ, ఆ ఏర్పాట్లేవో చేసేశారు.

గంట పది దాటుతుండగా పిల్లతల్లి, "అమ్మా! ధరణీ! ఈరోజుకు ఈ గదిలో పడుకో ..." అంది.

"అదేంటమ్మా! ఉదయం నుంచీ ఒక్క కాన్ ఫరెన్స్ కాల్ కూ ఎటెండవలేదు. ఈ రోజు పడుకున్నట్లేలే!." అంది నైటీలో హాయిగా ఊపిరి పోసుకుంటూ.

"విశ్వం! ఈరోజు ఈ గదిలో పడుకోమంటున్నదిరా మీ అమ్మా!" అన్న తండ్రితో, “నాకే గదైనా ఫరవా లేదు. కానీ నా ల్యాప్ టాప్, మొబైల్లో నన్ను పని చేసుకోనిస్తే చాలు, ఉదయం నుంచీ వచ్చిన నా కాల్సన్నీ ఎటెండవాలి." అంటూ ఆ గదిలో కెళ్ళి టేబుల్ పై కూర్చుని సిస్టం ఓపెన్ చేసుకున్నాడు విశ్వం, నిక్కరూ బనీన్లో.

"అమ్మా! ధరణీ ఈ రోజుకు నామాట విని ఈ గదిలో పడుకో." అంటూ చేతిలో పాల గ్లాసుకు బదులు ల్యాప్ ట్యాప్ పెట్టి లోపలికి తోసేసి, బయటినుంచి తలుపేసేసిందావిడ.

ఇద్దరూ చెరో కూర్చీలో కూర్చుని తమ తమ సిస్టంస్ లో పని చేసుకోసాగారు. [పళ్ళూడ గొట్టుకోను ఏరాయైతేనేం -అన్నట్లు , పనిచేసుకోను ఏ గదైతేనేం అనుకున్నారు ఇద్దరికిద్దరూనూ.]

అదండీ గూగుల్ గృహిణి---సాఫ్ట్ వేర్ సహచరుడు..- అనే -ఇంటర్నెట్ ఇల్లాలూ- మొబైల్ మొగుడూ [ఐన  ధరణి --విశ్వం ల పెళ్ళీ, ఏకాంతసేవల కధా కమామీషూనూ!.

విశ్వం, ధరణి కాపురం చేసి పిల్లల్ని కంటారో లేదో తర్వాతిమాట, పెళ్ళెందుకు చేసుకున్నారో కనీసం గుర్తు చేసుకుంటారో లేదో వారికే తెలియాలి. వృత్తిలో పడి తిండి, నీళ్ళు, నిద్ర మరచి; పని, ప్రెమోషన్స్, పరుగులు, సంపాదనే జీవితంగా, ప్రేమ, అభిమానం, మానవ సబంధాలు, తల్లి దండ్రులు, బంధువులు, కుటుంబ బాధ్యత సరేసరి కనీసం తమ జీవిత సుఖం మరచి [సాఫ్ట్ నెస్ మరచిపోయేంతగా] వృత్తికి తమ జీవితాలు అంకితం చేసిన వేలాదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులందరికీ కధ అంకితం.

Posted in November 2021, బాల్యం

1 Comment

  1. సత్యవతి దినవహి

    చాలా బాగా వ్రాసారు వాస్తవానికి దర్పణంగా ఉంది మీ కథ. సరదాగా కూడా అనిపించింది చదువుతుంటే.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!